సర్వేల పేరుతో సానుభూతిపరుల ఓట్లు తొలగింపు 

ఓటర్ల జాబితాను ట్యాబ్‌ల్లో నిక్షిప్తం చేయాల్సిన అవసరం ఏముంది?

మనుషులతో పాటు ట్యాబ్‌లను పోలీసులకు అప్పగించాం

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ

విజయవాడ: సర్వేల పేరుతో వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.  టీడీపీ అరాచకాలపై ఈసీ, డీజీపీలకు వైయస్‌ఆర్‌సీపీ నేతలు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. సర్వేకు ఉపయోగించిన ట్యాబ్‌ల్లో 5 డీజీపీకి అప్పగించామన్నారు. అక్రమంగా ఓట్లు తొలగిస్తున్న విధానాలను ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. అలాగే డీజీపీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ట్యాబ్‌ల్లో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలని కోరామన్నారు.

రాబోయే కాలంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా చూడాలని కోరినట్లు చెప్పారు. నెల్లిమర్లలో సర్వే పేరుతో వచ్చింది టీడీపీ నేతలే అన్నారు. సర్వేల పేరుతో ట్యాబ్‌లో కొందరు వ్యక్తులు వచ్చి మేం ప్రభుత్వ అధికారులమని, ఓటు ఉందో లేదో తెలుసుకునేందుకు వచ్చామని, ఏ పార్టీకి సానుభూతిపరులని వివరాలు సేకరించారన్నారు. మాటల్లో పెట్టి వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరులై ఉంటే అలాంటి వారి ఓట్లను జాబితాలో నుంచి తొలగించేలా ఆన్‌లైన్‌లో వివరాలు పంపించారన్నారు. పూసపాటిరేగ మండలంలో ఇలాంటి కార్యక్రమాలు జరిగాయన్నారు. జాతీయ ఓటర్‌ దినోత్సవం రోజు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు అడ్డుకున్న వైయస్‌ఆర్‌సీపీ నేతలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌లో పెట్టడం ప్రభుత్వ విధానానికి పరాకాష్ట అని మండిపడ్డారు. టీడీపీకి నూకలు చెల్లాయనడానికి ఇదో ఉదాహరణ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 
 

Back to Top