వైయస్‌ జగన్‌ను చూస్తే చంద్రబాబుకు వణుకు

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి

రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేటీఆర్, వైయస్‌ జగన్‌ను కలిశారు

కల్లు తాగిన కోతుల్లా టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు

కేసీఆర్‌తో పొత్తుకు తహతహలాడింది చంద్రబాబు కాదా

ఓటుకు కోట్లు కేసులో పట్టుబడిన దొంగ చంద్రబాబు

కేసీఆర్‌ చంఢీయాగంలో చంద్రబాబు పాల్గొనలేదా?

వైయస్‌ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోనలేక కాంగ్రెస్‌ పంచ చేరారు 

 

తిరుపతి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని చూస్తే చంద్రబాబు వణికిపోతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబువి అవకాశవాద రాజకీయాలని ఆయన విమర్శించారు. ప్రజా ప్రయోజనాలు చంద్రబాబుకు పట్టవని దుయ్యబట్టారు. వైయస్‌ఆర్‌సీపీకి ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని, అందుకోసమే వైయస్‌ జగన్‌ కేటీఆర్‌తో చర్చలు జరిపారని వివరించారు. శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూతగా రాష్ట్రాల ప్రయోజనాల కోసమని, కేంద్రంపై ఒత్తిడి చేసేందుకు ఓ సమాలోచన చేస్తే దానిపై ఈయన గారి వీరంగం అంతా ఇంతా కాదన్నారు. కల్లు తాగిన కోతుల్లాగా వైయస్‌ జగన్‌తో కేటీఆర్‌ సమావేశం అయిన మరుక్షణం నుంచి టీడీపీ నేతలు ఇష్టం వచ్చిన రీతిలో దేనికైనా మేం దిగజారగలమని వైయస్‌ జగన్‌పై దాడి చేశారన్నారు. నిన్న చంద్రబాబు వైయస్‌ జగన్‌ గద్దలాగా ఈ రాష్ట్ర ప్రయోజనాలపై వాలిన గద్ద అని విమర్శించారన్నారు. మేం కేసీఆర్‌తో పొత్తు కుదుర్చుకున్నట్లుగా, రేపు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్లుగా ఈయనగారు గాలిలో మాయజాలం సృష్టించి, తన అనుకూల మీడియా ద్వారా విష ప్రచారాన్ని విషపూరితంగా చేశారన్నారు. పొత్తు అంటే ఇరు పార్టీలు కలిసి పోటీ చేయడం అని అర్థమన్నారు. కేసీఆర్‌కు ఏపీలో పోటీ చేసే అవకాశమే లేదన్నారు. మేం వారితో పొత్తు కుదుర్చుకున్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన చేస్తే సల్లాపం, మేం చేస్తే అపవిత్రమన్నట్లుగా చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

 అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు కేసీఆర్‌ను అనరాని మాటలు అన్నారని, ఆ తరువాత ఆయన్ను పొగిడారన్నారు. అమరావతి శంకుస్థాపనకు నేరుగా వెళ్లి కేసీఆర్‌ను ఆహ్వానించారని, శిలాపలకంలో కేసీఆర్‌ పేరు వేయించారని, సభలో చప్పట్లు కొట్టించి, జేజేలు పలికారు చంద్రబాబు అని గుర్తు చేశారన్నారు. ఆ తరువాత కేసీఆర్‌ నిర్వహించిన చండియాగంలో చంద్రబాబు పాల్గొని శాలువాలు కప్పింది వాస్తవం కాదా అన్నారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిన దొంగ చంద్రబాబు అన్నారు. కేసీఆర్‌ ఎక్కడ తనను కేసులో ఇరికించి జైలుకు పంపుతారో అన్న భయంతో పదేళ్ల ఉమ్మడి రాజధాని వదిలి అమరావతికి పారిపోయారన్నారు. ఉద్యోగులను హడావుడిగా తరలించారన్నారు. మీ మంత్రి సునిత కుమారుడి పెళ్లి జరిగితే కేసీఆర్‌కు అనంతపురంలో అపూర్వ స్వాగతం పలికింది వాస్తవం కాదా అన్నారు.

కేసీఆర్‌ బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వస్తే మీ మంత్రి దేవినేని ఉమా దగ్గరుండి సపర్యాలు చేశారన్నారు. హరికృష్ణ చనిపోతే ఆ శవం వద్ద ఎడ్వకుండా..మనిద్దరం కలిసి పోటీ చేద్దామని చంద్రబాబు అనడం తప్పుకాదా అన్నారు. కేసీఆర్‌ స్వయంగా ఫోన్‌ చేసి రాష్ట్ర ప్రయోజనాల  కోసం ఫెడరల్‌ ప్రంట్‌ ఏర్పాటు చేస్తున్నామని, తన కొడుకును పంపిస్తామని కేటీఆర్‌ను పంపిస్తే..దాన్ని మేం పొత్తు పెట్టుకున్నట్లు చంద్రబాబు పేర్కొనడం సిగ్గు చేటు అన్నారు. చంద్రబాబు శవాలు పీక్కుతినే రాబంధు కాదని, బతికి ఉన్న వారినికి పీక్కుతినే రాబందు అని అభివర్ణించారు. 41 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవమంతా అవినీతి దుర్ఘందం భరించరానిదన్నారు. మోసం..దగా, వంచన, దుర్మార్గం, అవినీతి, విశృంకులత, సమాజంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలను ఆకలింపు చేసుకొని ఓ పరిపూర్ణమైన చంద్రబాబు..నీవు అధికారంలో లేని వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడుతావా అని ప్రశ్నించారు. సోనియాను ధిక్కరించిన వైయస్‌ జగన్‌పై కాంగ్రెస్‌తో చేతులు కలిపి రాజకీయంగా నిలువరించాలని సోనియాతో మిలాకత్‌ అయి అర్ధరాత్రి సీబీఐని ఉసిగొలిపారన్నారు.

వైయస్‌ జగన్‌ను 16 నెలలు జైలుకు పంపించిన నీచమైన చరిత్ర చంద్రబాబుది అన్నారు. నీ దుర్మార్గపు రాజకీయానికి వైయస్‌ జగన్‌ ఏడాదిన్నర పాటు జైలులో ఉన్నారన్నారు. వైయస్‌ జగన్‌కు ఉన్నది ఒక్కటి..అది ధైర్యమన్నారు. ఒళ్లంతా నిబద్ధత మాత్రమే అన్నారు. ప్రజల పట్ల బాధ్యతతో ప్రజా ప్రయోజనాలు నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులను ఉద్యమ బాట పట్టించారన్నారు. చంద్రబాబు జీవితమంతా అవినీతే అని, ఇతరులపై బురదజల్లి, ఇతరుల జీవితాల మీద హననం చేసే కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ఏ ఒక్క రోజు కూడా చంద్రబాబు సొంతంగా గెలిచిన దాఖలాలు లేవన్నారు. అధికారం కోసం ఏ పార్టీతోనైనా కలుస్తావని చెబుతారని, విడిపోయిన తరువాత అదే పార్టీని విమర్శించడం చంద్రబాబు నైజమన్నారు. ప్రత్యేక హోదా అన్నది రాష్ట్రానికి అవసరమే లేదని చెప్పిన చంద్రబాబు మళ్లీ యూటర్న్‌ తీసుకున్నారన్నారు. హోదా కోసం ఎవరైనా మాట్లాడితే జైలులో పెడతానని బెదిరించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ప్యాకేజీ ఇచ్చిన బీజేపీని అభినందించారని, వెంకయ్యనాయుడిని ఊరూరా సన్మానించారన్నారు.

హోదా కోసం వైయస్‌ జగన్‌ ఢిల్లీలో ధర్నా చేయించారన్నారు. ప్రత్యేక హోదాకు హీరోగా వైయస్‌ జగన్‌ మారిపోతున్నారన్న భయంతో అప్పుడు యూటర్న్‌ తీసుకున్నారన్నారు. మాయమాటలతో కాలయాపన చేస్తూ..మాధ్యమాల ద్వారా విష ప్రచారం చేస్తూ అందరిని భ్రమింపజేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తన స్వార్థం కోసమే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంటే వైయస్‌ జగన్‌ అడ్డుపడుతున్నారని పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని విమర్శించారు. ప్రజల జీవన ప్రమాణాలను పూర్తిగా పాతాళానికి దిగజార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. 90 శాతం మంది ప్రజలు  ఆనందంగా ఉన్నారని చంద్రబాబు ప్రకటనలు ఇచ్చుకోవడం దుర్మార్గమన్నారు. జాతీయ ప్రసారమాధ్యమాలు చంద్రబాబు గురించి, ఆయన అవినీతి గురించి కోడై కూస్తోందన్నారు.

వైయస్‌ జగన్‌ను చూసి చంద్రబాబుకు నిద్ర రావడం లేదని, వణికి పోతున్నారని పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ అంటే చంద్రబాబుకు తెలుగు, గుబులు పుట్టుకుందన్నారు. భయమన్నదే లేదు కాబట్టే వైయస్‌ జగన్‌ ఎవరినైనా ఎదురించగలిగిన మొనగాడు అని పేర్కొన్నారు. నీ మాయమాటలు ఇక చాలు, చెల్లు అని సూచించారు. నీ మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలోనే వైయస్‌ జగన్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చలు జరిపారని వివరించారు. కాంగ్రెస్‌తో వైయస్‌ జగన్‌ కలిసే ప్రసక్తే లేదన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పే పార్టీతోనే వైయస్‌ఆర్‌సీపీ కలుస్తుందన్నారు. చంద్రబాబు ఇంతగా ఎందుకు భయపడుతున్నారో అని ప్రశ్నించారు. పొత్తుల పేరుతో మాపై ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. ఏపీ ప్రజల ప్రయోజనాల కోసమే వైయస్‌ఆర్‌సీపీ పని చేస్తుందని స్పష్టం చేశారు. 
 

Back to Top