తాడేపల్లి : కుటమి ప్రభుత్వ వైఫల్యాలు, వైయస్ జగన్ కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి భయంతోనే చంద్రబాబు, లోకేష్ లు నిత్యం కుట్రలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. వైయస్ జగన్ గారిని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసుకుని ఏడు నెలలుగా ప్రతిరోజూ పచ్చి అబద్దాలతో అద్భుతమైన కథలను అల్లి తమ అనుకూల ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ తప్పుడు కథనాలను అడ్డం పెట్టుకుని వైయస్ఆర్ సీపీ ముఖ్యులపై అడ్డగోలుగా కేసులు నమోదు చేయిస్తున్నారని అన్నారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు సోమవారం మీడియాతో మాట్లాడారు. తాజాగా ఇబ్రహీంపట్నంలో పనిచేసిన ఒక సబ్ రిజిస్ట్రార్ వైయస్ఆర్‌సీపీ నేతలపై ఆరోపణలు చేస్తూ లేఖ రాశారంటూ కొన్ని యూట్యూబ్ చానెల్స్ లో పెద్ద ఎత్తున వైరల్ చేయించారు. తరువాత మెయిన్ స్ట్రీంలోని తెలుగుదేశంకు చెందిన పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యతిలను తెరమీదకు తీసుకువచ్చి పతాక శీర్షికలతో కథనాలను వండి వార్చేలా కుట్ర పన్నారు. ఈ వ్యవహారంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ చాలా అన్యాయాలు, అక్రమాలు చేశాడని, భూదందాలకు పాల్పడినట్లు, రాజమండ్రి, విశాఖపట్నం భూములను కూడా రిజిస్ట్రర్ చేశాడని ఎల్లో మీడియా తన కథనాల్లో రాసింది. దీని వెనుక ఉన్న చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి ఉన్నాడని అతను సజ్జల రామకృష్ణారెడ్డి, వైయస్ జగన్, వైయస్ భారతమ్మకు బినామీ అంటూ అభూతకల్పనలను అల్లి పచ్చి అబద్దాలతో కూడిన కథనాలను ప్రచురించారు. ఏకంగా రూ. వేల కోట్లు ఈ దందాలో చేతులు మారాయంటూ రాశారు. ధర్మసింగ్ పై వైయస్ఆర్ సీపీ హయాంలోనే ఏసీబీ దాడులు అసలు ఈ సబ్ రిజిస్ట్రార్ ఎవరూ అని చూస్తే... ధర్మసింగ్ అనే ఈ అధికారి 2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవాడ పరిధిలోనే పనిచేశాడు. ఆయన పై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో 2023 నవంబర్ 15వ తేదీన అంటే వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో ఈయన ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. ఆ సమయంలో సదరు అధికారి ఇంట్లో నుంచి గోడదూకి పారిపోయాడు. తాజాగా ఈ నెల 3వ తేదీన ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు ధర్మసింగ్ ను అరెస్ట్ చేసి, కోర్ట్ ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు. ఈ అధికారి రిమాండ్ లో ఉండి చంద్రబాబు, నారా లోకేష్ లకు లేఖ రాశాడు అంటూ కొన్ని కథనాలు బయటకు వచ్చాయి. తాను చేసిన అన్ని తప్పుడు పనులు చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి చెబితేనే చేశాను అంటూ ఆ లేఖలో ధర్మసింగ్ అంగీకరించినట్లు మొదట ప్రచారం ప్రారంభించారు. తరువాత ఈ ప్రచారంను మరికాస్త రసవత్తరంగా మార్చి, చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి, వైయస్ జగన్, ఆయన సతీమణికి సన్నిహితుడు అంటూ కొత్త కథను బయటకు తీసుకువచ్చారు. ఈ కథను ఎల్లో మీడియా ద్వారా కథనాలుగా రాయించి ఈ వ్యవహారాన్ని వైయస్ఆర్ సీపీకి అంటగట్టేందుకు కుట్ర పన్నారు. రిమాండ్ ఖైదీ సీఎంకు లేఖ రాశాడా? ఈ కుట్రను ఒకసారి గమనిస్తే... అసలు జైలులో రిమాండ్ లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లకు ఎలా లేఖ రాస్తాడు? ఆ లేఖలో చీమకుర్తి శ్రీకాంత్, సజ్జల రామకృష్ణారెడ్డి, వైయస్ జగన్, ఆయన సతీమణి పేర్లను రాశారంటూ ఒక పథకం ప్రకారం కుట్రను రచించారు. అంతేకాదు ఆ లేఖలో ధర్మసింగ్ తనను వైయస్ఆర్ సీపీ నేతలు బెదరించారని, 'కరోనా సమయంలో మాస్క్ లు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ కు ఏ గతి పట్టిందో నీకు అదే గతి పడుతుందని' తనను హెచ్చరించడం వల్ల భయంతోనే తాను అక్రమ భూదందాకు సహకరించినట్లు సదరు లేఖలో చంద్రబాబుకు మొరపెట్టుకున్నట్లుగా ఎల్లో మీడియా అద్భుతైన కల్పనతో కథనాలను వండి వార్చింది. ఇంత పకడ్భందీగా కథను అల్లడం, దానిలో వైయస్ఆర్ సీపీని ఇరికించడం, అవినీతి బుదరను పూయడం చూస్తుంటే ఎటువంటి కుట్రలకు వీరు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. వైయస్ జగన్ ఆదరణను చూసి భయంతోనే ఈ కుట్రలు మొదటి నుంచి తనతో అంటకాగుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను అడ్డం పెట్టుకుని వైయస్ఆర్ సీపీపై ఇష్టారాజ్యంగా తప్పుడు ఆరోపణలతో కూడిన కథనాలను రాయించడం చంద్రబాబుకు అలావాటే. ఇటీవలే ఆంధ్రజ్యోతిలో రాసిన కొత్త పలుకు కథనంలో వైయస్ జగన్ ఈ రాష్ట్రంలో బలమైన రాజకీయ నేతగా మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ఆయనను తక్షణం ఏదో ఒక కేసులో లోనికి పంపాలి, అణిచివేయపోతే చంద్రబాబుకు, ఆయన కుమారుడు లోకేష్ కు రాజకీయ భవిష్యత్తు ఉండదూ అంటూ నిస్సిగ్గుగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఇటువంటి భావజాలం ఉన్న పత్రికలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు వారి ఆలోచనల మేరకు వైయస్ఆర్ సీపీపై బుదరచల్లే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. ఎక్కడ జగన్ గారు 40 శాతం ఓటుబ్యాంక్ నుంచి మరింత పుంజుకుంటారో... మళ్ళీ అధికారంలోకి వస్తారేమో... నా కుమారుడు లోకేష్ కు ఆదరణ నానాటికీ తగ్గిపోతోంది... ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోందనే భయంతోనే చంద్రబాబు ఇటువంటి కుట్రలకు తెగబడ్డాడు. దానిలో భాగంగానే సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ ను ముందు పెట్టి, ఓ భూదందా జరిగిందని, దానిలో సజ్జల రామకృష్ణారెడ్డి, వైయస్ జగన్, ఆయన సతీమణి ఇలా వైయస్ఆర్ సీపీ ముఖ్యుల పేర్లతో సదరు అధికారిని బెదిరించి ఒక లెటర్ రాయించారు. ఇదంతా లోకేష్, చంద్రబాబులు ఆడిస్తున్న డ్రామా కాదా? బెదిరించి తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారు రెండు రోజుల కిందట చీమకుర్తి శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ ధర్మసింగ్ నాకు రూ.45 లక్షలు ఇవ్వాలి, అతనితో నాకు చాలా లావాదేవీలు ఉన్నాయని చెప్పాడు. అతడిపై వత్తిడి తీసుకురావడంతో ఇప్పుడు భయంతో ఆయన మాట మార్చి జగన్ గారి మీద చెప్పిస్తున్నారు. కేసుల్లో ముద్దాయిగా ఉన్న వారిపై వత్తిడి తెచ్చి, బెదిరించి, ప్రలోభపెట్టి వైయస్ జగన్ గారి పేర్లు చెప్పమని కుట్రలు చేస్తున్నారు. ఈ ఏడు నెలల్లో ప్రతి వ్యవహారంలోనూ ఇలాగే చేస్తున్నారు. చీమకుర్తి శ్రీకాంత్, ధర్మసింగ్ తో వైయస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదు. వేల కోట్ల భూదందా అంటున్నారు, చాలామంది ఆస్తులను అక్రమంగా రాయించేసుకున్నారు అని ఆరోపిస్తున్నారు. మరి మా భూములు పోయాయి అంటూ బాధితులు ఎవరూ ఎందుకు బయటకు రాలేదు? ఇన్ని కోట్ల విలువైన భూములు గల్లంతైతే ఎందుకు కోర్ట్ కు ఎవరైనా వెళ్ళారా? బాధితులకు బదులు చంద్రబాబు, లోకేష్, ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రమే మాట్లాడుతున్నారు. తెలుగుదేశం నాయకులు చెబుతున్న కథలను చూసి ప్రజలు ఛీకొడుతున్నారు. కూటమి పార్టీలు 164 సీట్లు గెలిచినా కూడా వైయస్ జగన్ ను చూసి ఎందుకు భయపడతున్నారు? ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? నిత్యం వైయస్ జగన్ పై బుదరచల్లే కార్యక్రమాలను నిర్ణయించుకుని మీరు చేస్తున్న వ్యవహారం చేసి లోకేష్ ను చూసి ప్రజలు ఏహ్యభావం పెరుగుతోంది. వైయస్ భారతమ్మ ఏనాడు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నది లేదు. అటువంటి ఆమెపై ఇటువంటి బుదరచల్లే ఆరోపణలు చేయడం దారుణం. కాలం ఎప్పుడూ ఇలాగే ఉంటుందని భావించవద్దు. జగన్ గారికి చాలా సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉంది. మళ్ళీ అధికారం వైయస్ఆర్ సీపీకి దక్కుతుంది. అప్పుడు మీలాగే చేస్తే మీకు ఎలా ఉంటుంది? మీలా చేసే అలవాటు మాకు ఎప్పుడూ లేదు. దీనిపై చంద్రబాబు, లోకేష్, ఈనాడు, ఆంధ్రజ్యోతిలు ఆలోచించాలి. మీ పిచ్చిరాతలను చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి. అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశారు సెకీ ఒప్పందంపై మీరు రాసిన అబద్దపు రాతలపై ఇప్పటికే సుప్రీంకోర్ట్ లో పరువు నష్టం దావా వేసినా ఎల్లో మీడియాకు బుద్దిరాలేదు. ఆధారాలు లేకపోవడంవల్లే ఆదానీపై, అప్పటి ఒప్పందాలపై చర్యలు తీసుకోలేము అంటున్న చంద్రబాబు మరి ఏ ఆధారాలు ఉన్నాయని వైయస్ జగన్ గారిపై బుదరచల్లుతున్నారు? చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం వ్యక్తిగత కార్యదర్శి ఎదుట ఒక కలెక్టర్, ఒక ఎస్పీ చేతులు కట్టుకున్న ఫోటోలను చూస్తే, కూటమి ప్రభుత్వంలో అధికారుల పరిస్థితి ఏమిటో అందరికీ అర్థమవుతోంది. అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. దీనికి మూల్యం చెల్లించుకోక తప్పుదు. పుష్ప-2 ఘటనలో ఒకలా స్పందన గేమ్ ఛేంజర్ ఘటనలో మరోలా స్పందనా? గేమ్ ఛేంజర్ సినిమా ప్రీఈవెంట్ ఫంక్షన్ తూర్పుగోదావరిజిల్లా వేమగిరిలో జరిగింది. దానికి సినీ హీరో రామ్ చరణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరై తిరిగి వెడుతూ ఇద్దరు యువకులు మణికంఠ, చరణ్ లు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. రెండురోజులైనా ఎవరూ వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళలేదు. పుష్ప-2 సినిమా ప్రదర్శించిన సంథ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి ప్రమాదం లాంటిదే ఇది కూడా. కానీ పుష్ప హీరో అరెస్ట్ అయిన 27 రోజుల తరువాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గోటితో పోయేదానిని గొడ్డలి వరకు తెచ్చుకున్నారు. జరిగిన సంఘటనలో బాధిత కుటుంబాన్ని యూనిట్ ముఖ్యులు పరామర్శించక పోవడం తప్పుకదా? ఎందుకు పరామర్శింలేదు అంటూ ప్రశ్నించారు. మరి ఇదే అంశం గేమ్ ఛేంజర్ ఫంక్షన్ కు హాజరై ప్రమాదవశాత్తు చనిపోయిన కుటుంబాలకు వర్తించదా పవన్? ఈ చిత్ర యూనిట్ ముఖ్యులు బాధిత కుటుంబాలను పరామర్శించాల్సిన అవసరం లేదా? పోనీ కనీసం పవన్ కళ్యాణ్ అయినా ఎందుకు వెళ్ళలేదు? సాక్షాత్తూ ఆయన సోదరుడి కుమారుడే ఈ సినిమా హీరో కదా? దీనికి సమాధానం చెప్పాలి. పుష్ప సినిమా ఘటనలో బాధిత కుటుంబానికి రూ.2 కోట్లు పరిహారం ఇచ్చారు. మేం డిమాండ్ చేస్తున్నాం ఈ ఘటనలో కూడా చనిపోయిన మణికంఠ, రామ్ చరణ్ కుటుంబాలకు రెండు కోట్ల చొప్పున సహాయం చేయాలని. రామ్ చరణ్ తండ్రి చిరంజీవి ఫ్యాన్. ఆయన కుమారుడి పేరునే తన కొడుకుకూ పెట్టుకున్నాడు. చాలా పేద కుటుంబాలు వారివి. పుష్ప సినిమాకు సంబంధించి రేవతి కుటుంబానికి ఎలా ఇచ్చారో, ఈ ఘటనలోనూ బాధిత కుటుంబాలకు అలాగే ఇచ్చి మీ చిత్తశుద్దిని నిరూపించుకోవాలి. లేకపోతే మీరు ద్రోహులుగా మిగిలిపోతారు. ఎదుటి వారికి చెప్పేందుకే నీతులు కాదు, మనం కూడా వాటిని ఆచరించాలని పవన్ కల్యాణ్ గుర్తించాలి. మీ అభిమానులుగా మీ కోసం వచ్చి, వెడుతూ ప్రమాదానికి గురై చనిపోయారు. పవన్ కల్యాణ్ కు డబ్బు ముఖ్యమా? మానవత్వం ముఖ్యమా? తేల్చాలి. అంతేకాదు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏడీపీ రోడ్డు బాగోలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైయస్ఆర్ సీపీ హయాంలో రోడ్డు దెబ్బతినడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కూడా ప్రచారం చేసేందుకు సిద్దంగా ఉన్నారు. ఇందులో వాస్తవాలు ఏమిటని విచారిస్తే, అక్కడ రోడ్డు బ్రహ్మాండంగా ఉంది. నెపాన్ని రోడ్డు మీదికి నెట్టేసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెడీ అయిపోయారు. ఇదేనా మీ అభిమానుల పట్ల మీకు ఉన్న చిత్తశుద్ది? వారి ప్రాణాల పట్ల మీకు ఉన్న విలువ? పండుగ సమయానికి ఏ నియోజకవర్గంలో అయినా రోడ్లు గుంటలుగా ఉంటే దానికి బాధ్యత ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వహించాలని సాక్షాత్తు చంద్రబాబే అన్నారు. ఇప్పుడు అక్కడ రోడ్డు బాగోలేదని, దానికి కూడా వైయస్ఆర్ సీపీ ప్రభుత్వమే కారణమని సిగ్గు లేకుండా మాట్లాడతారా? ఈ దుర్ఘటనకు బాధ్యత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలి. కోర్ట్ కు వెళ్ళడంతోనే నా ఫిర్యాదులపై పోలీసులు స్పందించారు నాపై సోషల్ మీడియా ద్వారా పలువురు చేసిన అసత్య, అభ్యంతరకర ఆరోపణలపై అయిదు ఫిర్యాదులను నవంబర్ 19న పోలీసులకు ఇచ్చాను. 25న గుంటూరు జిల్లా ఎస్పీకి కూడా ఇదే ఫిర్యాదు కాపీలను అందించాను. అయితే స్పీకర్ అయ్యన్నపాత్రుడు, సీఎం కుమారుడు నారా లోకేష్ తదితరులపై ఫిర్యాదులు ఉండటంతో పోలీసులు వాటిని పరిశీలించేందుకే భయపడ్డారు. కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడంతో న్యాయం చేయాలని హైకోర్ట్ లో రిట్ ఆఫ్ మాండమస్ దాఖలు చేశాను. రిట్ పిటీషన్ జనవరి 3వ తేదీన నెంబర్ అయి, ఆరో తేదీన విచారణకు బెంచ్ కు వస్తుందని తెలియగానే పోలీసులు కళ్ళు తెరిచారు. దాదాపు 50 రోజుల వరకు వారికి చట్టం గుర్తుకు రాలేదు. హైకోర్ట్ కు వెళ్ళిన తరువాతే వారు నాలుగు కేసులు నమోదు చేశారు. ఒక ఎఫ్ఐఆర్ లో గుర్తు తెలియని వ్యక్తి అని రాశారు. మేము ఇచ్చిన ఫిర్యాదులో చాలా స్పష్టంగా ఎవరైతే నాపైన అసభ్యంగా ట్వీట్ చేశారో సదరు వ్యక్తి అయ్యన్నపాత్రుడిగా ఫోటోతో సహా, ఆయన పేరుతో ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచిత్రంగా వ్యవహరించారు. అయ్యన్నపాత్రుడిని గుర్తు పట్టలేమంటూ, గుర్తు తెలియని వ్యక్తిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. అయిదు ఫిర్యాదులపై ఒక దానిపై అసలు కేసు నమోదు చేయలేదు. ఇది నారా లోకేష్ పైన ఇచ్చిన ఫిర్యాదు. నారా లోకేష్ ఫోటోతో సహా నాపైన చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే, దానిపై భయంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఎందుకంటే నారా లోకేష్ మంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రి కుమారుడుగా ఉన్నాడు కాబట్టి. చట్టం ముందు ఎవరైనా సమానమే. దీనిపై కోర్ట్ ద్వారానే న్యాయం జరిగేలా పోరాడతాను.