హామీల అమలుపై కూటమి నేతల చొక్కా పట్టుకునేందుకు జనం సిద్దం

వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి

 ఏడాది పాలనలో ఒక్క హామీనీ పూర్తిగా అమలు చేయలేదు

 నిత్యం వైయస్ జగన్‌పై కుట్రారాజకీయాలకే పాలన పరిమితం

 బనకచర్ల అంటూ కమీషన్ల కోసం కొత్త డ్రామాలు

 రాయలసీమ కోసం ఏనాడు చంద్రబాబు ఆలోచించలేదు

 వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి ఆగ్రహం

 తాడేపల్లి: హామీల అములపై ప్రజలు కూటమి నేతల చొక్కాలు పట్టుకుని ప్రశ్నించేందుకు సిద్దంగా ఉన్నారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తాము చెప్పినవన్నీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామని, లేకపోతే చొక్కా పట్టుకుని నిలదీయాలన్న లోకేష్ మాటలను ఇప్పుడు ఆచరణలో చూపించేందుకు ప్రజలు సన్నద్దంగా ఉన్నారని అన్నారు. వారికి సమాధానం చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. నిత్యం ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌పై కుట్రారాజకీయాలు చేయడం తప్ప ఈ ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన ఒక్క మంచిపని కూడా లేదని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే...

చంద్ర‌బాబు ఎన్నిక‌ల్లో ఎన్నో హామీలిచ్చారు. ప్ర‌జ‌ల‌ను న‌మ్మించేందుకు బాండ్లు త‌యారు చేసి, వాటిపై చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంత‌కాలు చేసి మరీ ప్రజలకు అందించారు. సంప‌ద సృష్టించి సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తామ‌ని చెప్పారు. ఈ హామీలు ఎలా చేయాలో తమ వ‌ద్ద ప్ర‌ణాళిక ఉంద‌ని, సూప‌ర్ సిక్స్ అమ‌లు చేయ‌క‌లేక‌పోతే త‌న కాల‌ర్ ప‌ట్టుకోవాల‌ని యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో నారా లోకేష్ స‌వాల్ విసిరాడు. కానీ సూప‌ర్ సిక్స్ హామీలు అమ‌లు చేయ‌లేక ఏడాదిలోనే ఈ ముగ్గురూ చేతులెత్తేశారు. ఈ చేత‌కాని చంద్ర‌బాబు పాల‌న కార‌ణంగా ఆంధ్రప్ర‌దేశ్ ఆర్ధిక ప‌రిస్థితి దేశంలోనే అధ్వాన్నంగా త‌యారైంది. ప్ర‌తినెలా జీఎస్టీ వ‌సూళ్లు చూస్తే నెగిటివ్ గ్రోత్ రేట్ క‌నిపిస్తుంది. వాటి నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించేందుకు డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన మొద‌టి నెల నుంచి మ‌ద‌న‌ప‌ల్లె ఫైల్స్, తిరుమ‌ల ల‌డ్డూలో కొవ్వు క‌లిసింద‌ని, ప్ర‌కాశం బ్యారేజ్‌కి బోట్లు అడ్డం పెట్టార‌ని, కాకినాడ నుంచి రేష‌న్ బియ్యం అక్ర‌మ స‌ర‌ఫ‌రా అని.. డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌తోనే స‌రిపోయింది. కూట‌మి నాయ‌కుల దుష్ప్ర‌చారాలు, డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ గురించి ప్ర‌జ‌ల్లో స్ప‌ష్ట‌మైన అవగాహ‌న వ‌చ్చేసింది. వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల‌కు వ‌చ్చే ప్ర‌జాస్పంద‌నే దీనికి నిద‌ర్శ‌నం. 

రాజ‌కీయాల కోసం ఎంత‌కైనా దిగ‌జారే త‌త్వం చంద్ర‌బాబుది 

రాజ‌కీయ మ‌నుగ‌డ కోసం ఎంత‌కైనా దిగజారే మ‌నిషి చంద్ర‌బాబు త‌ప్ప ఇంకెవ‌రూ ఉండ‌రు. వైయ‌స్ జ‌గ‌న్ స‌త్తెన‌ప‌ల్లి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆయ‌న కారు కింద ప‌డి సింగ‌య్య అనే వ్య‌క్తి మృతిచెందాడ‌ని ఆరోపిస్తూ పోలీసులు కేసులు నమోదు చేశారు. వారు చెబుతున్నదే నిజమైతే, నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌తిప‌క్ష నేత‌, మాజీ ముఖ్య‌మంత్రికి క‌ల్పించాల్సిన జెడ్ ప్ల‌స్ కేట‌గిరి సెక్యూరిటీ ఇచ్చి ఉంటే, రోప్ పార్టీ ఉంటే ఇటువంటి ప్రమాదం జరుగుతుందా? వైయ‌స్ జ‌గ‌న్ ఏ ప‌ర్య‌ట‌న వీడియోలు చూసినా పోలీసు భ‌ద్ర‌తా వైఫ‌ల్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడికి భ‌ద్రత క‌ల్పించాల్సిందిపోయి ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ల‌కు ప్ర‌జ‌లు రాకుండా అడ్డుకోవ‌డానికి  వైయ‌స్సార్సీపీ నాయ‌కుల ఇళ్లకు పోలీసుల‌ను పంపిస్తున్నారు. సత్తెనపల్లిలో జరిగిన ప్రమాదాన్ని అడ్డం పెట్టుకుని వైయ‌స్ జ‌గ‌న్ వ్య‌క్తిత్వాన్ని హ‌న‌నం చేయాల‌ని చంద్ర‌బాబు కుట్ర‌లు చేయ‌డం ఆయ‌న దిగ‌జారుడుతనానికి ప‌రాకాష్ట‌. దివంగ‌త మ‌హానేత వైయ‌స్సార్ సీఎంగా ఉండ‌గా బాల‌కృష్ణ ఇంట్లో నిర్మాత బెల్ల‌కొండ సురేష్ పై కాల్పులు జ‌రిగిన విష‌యాన్ని చంద్ర‌బాబు గుర్తు తెచ్చుకోవాలి. నంద‌మూరి కుటుంబం ప‌ట్ల ఆరోజు సీఎంగా ఉన్న వైయ‌స్సార్ హుందాగా వ్య‌వ‌హ‌రించారే కానీ అవ‌కాశాన్ని చౌక‌బారు రాజ‌కీయాల‌కు వాడుకోవాల‌ని చూడ‌లేదు. కానీ చంద్ర‌బాబు మాత్రం స‌త్తెన‌ప‌ల్లిలో జ‌రిగిన ప్ర‌మాదాన్ని కూడా నేరంగా చిత్రీక‌రించాల‌ని చూడ‌టం దుర్మార్గం. 

రాయలసీమపై చంద్రబాబుకు ప్రేమలేదు
  
బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును క‌డ‌తామంటే రాయ‌ల‌సీమ వాసులుగా మేమంతా స‌మ‌ర్థిస్తాం. కానీ చంద్రబాబు ముఖ్య‌మంత్రి అయిన ఈ ఏడాది కాలంలో రాయ‌ల‌సీమ ప్రాజెక్టుల‌కు ఒక్క రూపాయైనా ఖ‌ర్చు చేశారా? ఒక్క పిడికెడు మ‌ట్టయినా తీసుంటే చూపించాలి. చంద్ర‌బాబుకి నిజంగా రాయ‌ల‌సీమ అభివృద్ధి మీద బాధ్య‌త ఉంటే జీఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ లింకప్ ప్రాజెక్టుకి రూ. వెయ్యి కోట్లు ఖ‌ర్చు చేస్తే పూర్త‌వుతుంది. కానీ ఒక్క రూపాయి కూడా ఖ‌ర్చు చేయ‌లేదు. దాదాపు రూ. రెండున్న‌ర ల‌క్ష‌ల కోట్ల బ‌డ్జెట్‌లో రాయ‌ల‌సీమ ప్రాంతంలో వ్య‌వ‌సాయం కోసం రూ. వెయ్యి కోట్లు కేటాయించ‌లేక‌పోయారు. రూ.వెయ్యి కోట్లతో అయిపోయే ప్రాజెక్టులను పూర్తి చేయ‌కుండా రూ.40 వేల కోట్ల‌తో కొత్త ప్రాజెక్టుల‌ను చేప‌డ‌తానని చెబితే గుడ్డిగా న‌మ్మ‌డానికి రాయలసీమ వాసులు  సిద్ధంగా లేరు. పూర్త‌య్యే స్థితిలో ఉన్న ప్రాజెక్టుల్లో భారీగా క‌మీషన్లు రావు క‌నుక‌, కొత్త ప్రాజెక్టులైతే దోచుకోవ‌చ్చ‌నేది చంద్ర‌బాబు ఉద్దేశం. చంద్ర‌బాబు సీఎం అయ్యాక‌ కూట‌మి పాల‌న‌లో అన్ని వ్య‌వ‌స్థ‌ల్లో అవినీతిని వ్య‌వ‌స్థీకృతం చేశారు. పోలీస్ వ్య‌వ‌స్థను పూర్తిగా నిర్వీర్యం చేసి అవినీతిమ‌యం చేశారు కాబ‌ట్టే, రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు పూర్తిగా గాడిత‌ప్పిపోయాయి. అన్ని వ్య‌వ‌స్థ‌ల్లో వేళ్లూనుకునిపోయిన అవినీతి కార‌ణంగా, క‌మీష‌న్లు ఇచ్చుకోలేక  రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి పారిశ్రామికవేత్త‌లెవ‌రూ ముందుకు రావ‌డం లేదు. కూట‌మి పాల‌న‌లో క‌ట్ట‌బెట్టిన టెండ‌ర్ల‌న్నీ స‌మీక్ష చేస్తే భారీగా అవినీతి బ‌య‌ట‌ప‌డుతుంది. ఆయ‌న పిలిచిన టెండ‌ర్ల‌ను 20 శాతం త‌క్కువ‌కి ఇస్తే ఆ ప‌నులు చేసేదానికి ఎంతో మంది సిద్దంగా ఉన్నారు. ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నుంచి పార్టీ కార్య‌క‌ర్త వ‌రకు అవినీతి అజెండా పాల‌న సాగుతోంది. విజ‌య‌వాడ‌కి వ‌ర‌ద‌లొస్తే ఆ సంద‌ర్భాన్ని కూడా అవినీతికి వాడుకున్న నీచ చ‌రిత్ర చంద్ర‌బాబుది. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెల‌కు రూ. 30 కోట్లు కేటాయించారంటే ఎంత అవినీతి జ‌రిగిందో అర్థం చేసుకోవ‌చ్చు. న‌రేంద్ర‌మోడీని మెప్పించ‌డం కోసం ఒక పూట చేసిన యోగాంధ్ర కార్య‌క్ర‌మం నిర్వ‌హించి రూ. 300 కోట్లు ప్ర‌జాధ‌నం వృథా చేశాడు.

Back to Top