జర్నలిజం కూడా వ్యవస్థీకృత నేరమా ?

ఏ తప్పు చేయలేదు, కాబట్టి భయం లేదు

వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి 

గుంటూరు వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి, పార్టీ ప్రధాన కార్యదర్శి (లీగల్) పొన్నవోలు సుధాకర్ రెడ్డి, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్ రెడ్డి, లీగల్ సెల్ ప్రతినిధి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి

రాజ్యాంగ వ్యతిరేక శక్తుల ఆటలకు కోర్టుల్లో చెక్

ఒక నేరానికి రెండుసార్లు అరెస్టు చేస్తారా ?

వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి (లీగల్) పొన్నవోలు సుధాకర్ రెడ్డి సూటి ప్రశ్న

రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కూటమి సర్కార్

హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్

వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్ రెడ్డి ఆక్షేపణ

పాలకుల పిచ్చి పరాకాష్టకు చేరింది

పూడి శ్రీహరి అరెస్టు దుర్మార్గపు చర్య

వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ ప్రతినిధి సుదర్శన్ రెడ్డి

పూడి శ్రీహరిపై కేసు జర్నలిజంపై పెట్టిన కేసే

ఆయనది 26 ఏళ్ల మచ్చలేని కెరీర్

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టీకరణ

గుంటూరు:     జర్నలిజాన్ని సైతం కూటమి సర్కార్ వ్యవస్థీకృత నేరంగా చూడటం, కోర్టుల్లో ఆ విధంగా వాదనలు వినిపించడం ఆవేదన కలిగిస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి(మీడియా) పూడి శ్రీహరి వ్యాఖ్యానించారు. పాతికేళ్లకు పైగా ఎలాంటి మచ్చ లేకుండా జర్నలిస్టుగా కొనసాగుతున్న తనపై ప్రభుత్వం మోపుతున్న అభియోగాలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. పూడి శ్రీహరి కేసులో రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు కోర్టుల్లో చెక్ పడిందని, హామీలు అమలు చేయలేక ప్రభుత్వం ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ కు దిగుతోందని పార్టీ ప్రధాన కార్యదర్శి (లీగల్ ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, లీగల్ సెల్ ప్రతినిధి సుదర్శన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆక్షేపించారు. 

26 ఏళ్ల జర్నలిజంలో ఏనాడూ గీత దాటలేదు:
పూడి శ్రీహరి, వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా)

వాస్తవంగా రాజకీయ అంశాల గురించి కోపంగా, ఆగ్రహంగా మాట్లాడాలని నేను ఎప్పుడూ అనుకోను. కానీ ఏప్రిల్ 15 న మొదలైన అరెస్టుల పరంపర ఇవాళ్టి వరకూ అంటే రెండు వారాల పాటు కొనసాగింది. నా 48 ఏళ్ల జీవితంలో, మా కుటుంబ జీవితంలో ఎప్పుడూ పోలీసు స్టేషన్లు, కోర్టుల గడప తొక్కలేదు. ఈ  15 రోజుల పరిణామాలు చూసిన తర్వాత నాకు ఎవరి మీదా ద్వేషం, కోపం లేదు కానీ ఆవేదన కలుగుతోంది. ఆ బాధ నేను ఇబ్బంది పడ్డాను అనే దాని కన్నా సమాజంలో పరిస్ధితులు ఇలా దాపురించాయన్న దాని మీదే ఉంది. ప్రభుత్వం మోపుతున్న అభియోగాలు తీవ్ర ఆందోళన కలిగించాయి. అసలు జర్నలిజం చేయడం కూడా వ్యవస్థీకృత నేరమా ? ఈ రకంగా కూడా జర్నలిజాన్ని చూడొచ్చా అన్న భావన ఈ వాదనలు విన్న తర్వాత కలుగుతోంది. వివిధ మీడియా సంస్థల్లో ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టుల విధులు ఎలా ఉంటాయో రాజకీయ పార్టీల్లో  మీడియాను సమన్వయం చేసే వాళ్ల బాధ్యతలు కూడా అలాగే ఉంటాయి. రాజ్యాంగం ప్రకారం మీడియాకు ఏ విధంగా పనిచేయడానికి అవకాశం వచ్చిందో, రాజకీయాల్లో ఉండే మీడియా కోఆర్డినేటర్లకూ అలాంటి హక్కులే ఉంటాయి. మేం ఎప్పుడూ ఈ గీత దాటి పని చేయలేదు. అలా చేయమని ఎవరూ ప్రోత్సహించరు. గత 26 ఏళ్ల జర్నలిజంలో మేం ఎప్పుడూ ఆ గీత దాటి పనిచేయాల్సిన అవసరం రాలేదు. కానీ కోర్టులో వాదనలు చూస్తే సిండికేట్, మాఫియా, వ్యవస్థీకృత నేరం అని చెప్పడం ఆవేదన కలిగించింది. ప్రభుత్వాలు ఇలాంటి చర్యలకు పాల్పడితే భవిష్యత్తులో ఏ మీడియా సంస్దా, పత్రిక, టీవీ కూడా పనిచేయలేవు. 
    
    సాధారణంగా ఓ మీడియా సంస్ధలో పనిచేసే జర్నలిస్టు ఆ రోజు వార్తా కథనాలు, వాటి ప్రాధాన్యం, ఆధారాలు చూసుకుని ప్రసారం చేస్తుంటారు. అలాగే రాజకీయ పార్టీలో ఉంటే మీడియా విభాగాల బాధ్యులు కూడా ఇవాళ సమాజంలో ఏం జరుగుతోంది, రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఏం ఉన్నాయి, వాటికి తగిన ఆధారాలు ఉన్నాయా లేవా, సరైన సమాచార సేకరణ జరిగిందా లేదా, ఎంపీలు, ఎమ్మెల్యేలకు అవసరమైన సమాచారం సేకరించి ఇవ్వడమే మా బాధ్యత. కానీ మా బాధ్యతను వ్యవస్ధీకత నేరంగా చూపించడం ఆవేదన కలిగిస్తోంది. రాజకీయ పార్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, తమ కార్యకలాపాలు స్వేచ్ఛగా నిర్వహించేందుకు ఉన్న హక్కుల్ని హరిస్తున్నారనేది ఓ జర్నలిస్టుగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా నా ఆవేదన. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఓ జర్నలిస్టు ఈ స్థాయికి రావడం అరుదు. సాక్షిలో నేను చేసిన తర్వాత సంస్థ మా అంకిత భావం చూసో, మా లాంటి వారిని ప్రోత్సహించాలనే ఉద్ధేశమో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మీయత, అభిమానంతో మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. మా పని మేం రాజ్యాంగ బద్దంగానే చేస్తాం. ఏదైనా క్లారిటీ కావాలంటే ఇచ్చేందుకు ఎప్పుడూ సిద్దంగానే ఉంటాం. దయచేసి వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వీలైతే ప్రోత్సహించండి కానీ ఇలా ఇబ్బంది పెట్టకండి. ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి నాకు ఎలాంటి భయం లేదు. 

ఒక నేరానికి రెండుసార్లు అరెస్టు ఇదే తొలిసారి:
పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి (లీగల్)

అన్యాయానికీ-అక్రమానికీ, ప్రజా స్వామ్యానికీ మధ్య జరుగుతున్న పోరాటం ఇది. పాలకులు వ్యవస్ధల్ని అడ్డుపెట్టుకుని రెండున్నరేళ్లుగా సృష్టిస్తున్న అరాచకాలు ఇవాళ పరాకాష్టకు చేరాయి. 2024 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకుల మీద, ప్రజల మీద సుమారు వెయ్యి కేసులు పెట్టారు. ఈ మూడు నెలల్లో రోజుకు 10 కేసుల చొప్పున పెట్టారు. ఎవరూ అడగలేని పరిస్ధితి తీసుకొస్తున్నారు. అధికారం ఇచ్చింది పాలన చేయడానికి అన్న విషయం మర్చిపోయి గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేయించి, ఇళ్లు ఖాళీ చేయించి అరాచకం సృష్టించారు. పాతికేళ్లుగా ఎలాంటి కేసులు, చెడ్డపేరు లేని జర్నలిస్టు, మితభాషి, ఏ రోజూ గీత దాటకుండా పాత్రికేయం చేసిన పూడి శ్రీహరిని గత నెల 14వ తేదీ నుంచి నరకయాతన చూపిస్తున్నారు. మఫ్టీలో వచ్చి తాడేపల్లి నుంచి పూడి శ్రీహరిని 14 గంటలు ప్రయాణించి తీసుకెళ్లారు. రాత్రి నిద్రలేకుండా చేశారు. చిన్న గదిలో బంధించి గాలి ఆడని పరిస్ధితుల్లో ఉంచారు. ఆ విధంగా మానసిక క్షోభ కలిగించారు. అక్కడకు మేం వెళ్లడానికి ప్రయత్నిస్తే అర్ధరాత్రి ఒంటి గంట వరకూ ఆయన్ను కలవనీయకుండా అడ్డుకున్నారు. వందల సంఖ్యలో పోలీసులు, కార్లతో మిలిటరీ సిబ్బంది మోహరించారు. ఆపరేషన్ కగార్ జరుగుతున్నట్లుగా కాన్వాయ్ తో కవాతు చేశారు. చంద్రబాబు, లోకేష్ మిమ్మల్ని రాత్రీ పగలూ నల్ల కోటు వేసుకునే పరిస్ధితి తెచ్చారు. అయినా మేం 24 గంటలూ వారితో పోరాడేందుకు సిద్దంగా ఉన్నాం. 

    పూడి శ్రీహరి గారిని అరెస్టు చేసి కుప్పానికి తీసుకెళ్లిన తర్వాత స్థానిక కోర్టు తప్పుడు రిమాండ్ అని, చెల్లదని తోసిపుచ్చింది. మరుసటి రోజే కోర్టు ఉత్తర్వులతో అదే క్రైమ్ లో కోర్టుకు తీసుకెళ్లారు. ఒకే నేరానికి రెండు సార్లు అరెస్టు చేయడం శ్రీహరి గారి విషయంలోనే చూస్తున్నాం. అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చాక మరోసారి న్యాయమూర్తి ఆయన రిమాండ్ ను తిరస్కరించారు. కుప్పం కోర్టు ఆదేశాలు ఇచ్చే లోపే గుంటూరు పోలీసులు తిరిగి శ్రీహరి గారిని అరెస్టు చేసి తీసుకెళ్లేందుకు వచ్చారు. అక్కడ అరెస్టు చేసి గుంటూరుకు తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపర్చాక తిరిగి రిమాండ్ చెల్లదని చెప్పేశాక మళ్లీ అరెస్టు చేసేందుకు నల్లపాడు పోలీసులు అక్కడికి వచ్చారు. ఇలా రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఆడిన ఆటలకు కోర్టులు చెక్ పెట్టాయి. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో ఐదేళ్ల పాటు ఇలాంటి పనులు చేయాలని ప్రయత్నించి ఉంటే మీరు ఎక్కడ ఉండేవారో ఓసారి ఊహించుకోండి.

హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్:
మనోహర్ రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి గతంలో ఎన్నడూ చూడని పాలన చూపిస్తున్నారు. వచ్చినప్పటి నుంచీ విపక్ష పార్టీల్ని లక్ష్యంగా చేసుకున్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేమని భావించి, ప్రశ్నించే గొంతుల్ని నొక్కే ప్రయత్నం ప్రారంభించారు. ఒక్కొక్కరిపైనా 20-30 కేసులు పెట్టి రాష్ట్రవ్యాప్తంగా తిప్పుడూ అనాగరికంగా వ్యవహరిస్తున్నారు. సుపారీ హంతకులకు, డెకాయిట్ గ్యాంగ్ లకు, మహిళల్ని అపహరించే వాళ్లు, గూండాలపై పెట్టే బీఎన్ఎస్ 111 సెక్షన్లను అకారణంగా సోషల్ మీడియా కార్యకర్తలపై పెట్టి వేధిస్తున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు దీనిపై మొట్టికాయలు వేయడంతో కాస్త వెనక్కి తగ్గారు. తిరిగి పూడి శ్రీహరి గారి మీద ఈ 111 సెక్షన్ పెట్టారు. పాతికేళ్లుగా జర్నలిజం వృత్తిలో ఎక్కడా మచ్చ లేకుండా, పవిత్ర వృత్తి ధర్మాన్ని పాటిస్తున్న వ్యక్తి ఆయన. వైయ‌స్ఆర్‌సీపీ మీడియా విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారనే కారణంతో ఆయన మీద వేధింపులు ప్రారంభించారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారిక హ్యాండిల్ ఉంది, అయినా దానికీ శ్రీహరి గారికీ సంబంధం లేదు. ఐ-టీడీపీ పేరుతో టీడీపీ సోషల్ హ్యాండిల్స్ ఉన్నాయి. వాటి మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారెతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల మీద ఎన్నో అరాచక పోస్టులు పెట్టారు. చంద్రబాబు స్వయంగా గొడ్డలి పోటు అంటూ అందులో పోస్టులు పెట్టారు.  గతంలో కర్నూల్లో బస్సు ప్రమాదం జరిగినప్పుడు బెల్ట్ షాపులు నడుస్తున్నాయని సోషల్ మీడియాలో పోస్టు పెడితే కేసులతో వేధించారు. ఇప్పుడు కుప్పం, నల్లపాడు, గుంటూరు కొత్తపేట పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టారు. దాదాపు 600 కిలోమీటర్ల దూరంలోఉన్న కుప్పానికి తీసుకెళ్లడం, అక్కడ బెయిల్ రాగానే తిరిగి గుంటూరు పోలీసులతో అరెస్టు చేయించారు. శ్రీహరి ఏమైనా గూండానా, టెర్రరిస్టా ? సమాజానికి ఏమైనా నష్ఠం కలిగిస్తున్నారా ? ఇలా కేసులు పెడుతున్న వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల్ని అణగదొక్కాలని చూస్తోంది. హామీల్ని అమలుపర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. 

ప్రశ్నించే గొంతుల్ని నులిమేయాలనే ప్రయత్నం:
సుదర్శన్ రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ ప్రతినిధి

వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి(మీడియా) శ్రీహరి గారి అరెస్టు దుర్మార్గం. ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు కూటమి ప్రభుత్వం ఒడిగడుతోంది. సమాజంలో ప్రశ్నించే వారి గొంతు నులిమేయాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. శ్హీహరి గారి అరెస్టే ఇందుకు నిదర్శనం. శ్రీహరి గారిని అరెస్టు చేసిన కేసులు చూస్తే సిల్లీగా అనిపిస్తున్నాయి. చంద్రబాబు ఫొటోలో కత్తి పట్టుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే శ్రీహరే పోస్టు చేసినట్లు వివిధ స్టేషన్లలో కేసులు పెట్టారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలకు ఇదే నిదర్శనం. ఈ కేసులో పోరాటం చేసే అవకాశం కూడా శ్రీహరి గారెకి ఇవ్వకపోవడం, ఆయన వివరణ తీసుకోకుండానే అరెస్టులు చేయడం, ఆఫీసు నుంచి ఇంటికెళ్లే క్రమంలో ఎత్తుకెళ్లడం దారుణంగా ఉన్నాయి. చట్టపరమైన నిబంధనలు పాటించకుండా కోర్టుల్లో ప్రవేశపెట్టారు. కోర్టు బెయిల్ ఇస్తే దాన్ని కూడా 24 గంటలు గడవకముందే మరో కోర్టులో సవాల్ చేయడం ప్రభుత్వం ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోంది. ఒకే కేసులో రెండుసార్లు అరెస్టు చేయడం మరో దుర్మార్గం. కోర్టు తప్పని మందలించిన తర్వాత కూడా మరో కేసు పెట్టి టార్గెట్ చేశారు. రాష్ట్రంలో పాలకుల పిచ్చి పరాకాష్టకు చేరిందని దీన్ని బట్టి అర్థమవుతోంది. 

పూడి శ్రీహరి చేసిన తప్పేంటి ?
:లేళ్ల అప్పిరెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ

వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, మీడియా ఇన్ ఛార్జ్ గా ఉన్న పూడి శ్రీహరి గారిని రెండు వారాల క్రితం తాడేపల్లిలో అరెస్టు చేసినప్పటి నుంచి ఇవాళ కోర్టు విడుదల చేసే వరకూ కూడా పార్టీ పక్షాన న్యాయ సహాయం అందించిన లీగల్ సెల్ కు అభినందనలు. వైయ‌స్ఆర్‌సీపీలో ప్రధాన కార్యదర్శి, మీడియా ఇన్ ఛార్జ్ గా పనిచేయకముందే సుమారు మూడు దశాబ్దాలు జర్నలిజంలో పని చేసిన వ్యక్తి. ఎలాంటి మచ్చ లేకుండా తన వృత్తిని కొనసాగించిన వ్యక్తి. పెద్ద పెద్ద పత్రికలు, ఛానళ్లకు ఎడిటర్లుగా ఉన్న వారు డబ్బులు, స్వలాభం కోసం ఎలా పనిచేస్తున్నారో చూస్తున్నాం. ఇలాంటి పరిస్ధితుల్లో శ్రీహరి గారు ఏ తప్పు చేశారని ప్రశ్నిస్తున్నాం. వైయ‌స్ఆర్‌సీపీకి మీడియా ఇన్ ఛార్జ్ గా పనిచేయడమే ఆయన తప్పా ? తాడేపల్లికి వచ్చిన వాళ్లు కనీసం పోలీసు డ్రెస్ కూడా వేసుకోకుండా మఫ్టీలో వచ్చి కుప్పానికి తీసుకెళ్లారు. ఓ కేసు నుంచి ఊరట లభిస్తే మరో కేసు పెడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై వరుసగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. చివరికి శ్రీహరి గారి మీద కూడా కేసు పెట్టారు. శ్రీహరి గారి మీద కేసు అంటే అక్షరం మీద కేసు, జర్నలిజం మీద కేసు పెట్టినట్లే.

Back to Top