‘మెగాలోమానియాక్’ సోకి బాబు ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడు

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

యజమాని చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌ పరిపూర్ణ పాత్ర పోషిస్తున్నాడు

చట్టం, రాజ్యాంగం, నైతిక సూత్రాలు వర్తించవన్నట్టుగా బాబు, పవన్‌లా ప్రవర్తన

క్వశ్చన్‌ చేస్తే అరాచకం సృష్టిస్తాం.. ఇల్లు ఎక్కి అరుస్తాం, ఢిల్లీకి వెళ్తాం అనే ధోరణి

పవన్‌ మాటల్లో పూనకం, అరుపులు, కేకలు, తిట్లు తప్ప ఏమీ ఉండదు 

చంద్రబాబు, పవన్‌కు జనం అంటే లెక్కలేనితనం ఏంటీ..?

అంగళ్లు, పుంగనూరులో బాబు ఆశించింది జరక్కపోవడంతో బాధపడ్డాడు

టీడీపీ మార్గదర్శకులు రామోజీరావు, రాధాకృష్ణ పత్రికల్లోని కల్పిత కథనాలను అంటించి రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాశాడు

సీబీఐని రాష్ట్రంలో అడుగుపెట్టనీకుండా జీవో తెచ్చిన బాబే.. సీబీఐ ఎంక్వైరీ కోరుతున్నాడు

చంద్రబాబుకు మాట్లాడేందుకు ఏమీ లేకే విధ్వంసం సృష్టించాలని ప్రయత్నిస్తున్నాడు 

సీఎం వైయస్‌ జగన్‌పై ప్రజలకున్న విశ్వాసాన్ని తుంచలేక ప్లాన్‌ ప్రకారం విషప్రచారం

తాడేపల్లి: పద్ధతి ప్రకారం తండ్రీకొడుకులు, దత్తపుత్రుడు, దివాళా తీసిన కొన్ని పార్టీల నాయకులు ఫుల్‌ సైజ్‌ ఆర్కెస్ట్రాలా చేస్తే శబ్ద కాలుష్యం రాష్ట్రం భరించలేని పరిస్థితికి వచ్చిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. యజమాని చంద్రబాబు డైరెక్షన్‌లో సినిమాల్లో నటుడిగా ఉన్న అనుభవాన్ని రాజకీయ మీటింగ్‌ల వేదికల మీద పవన్‌ కల్యాణ్‌ పోషిస్తున్నాడన్నారు. పవన్‌ మాట్లాడే మాటల్లో పూనకం, అరుపులు, కేకలు, తిట్లు తప్ప ఏమీ ఉండదన్నారు. పవన్‌ యజమాని వేషాలు మరీ అన్యాయంగా ఉన్నాయని, చంద్రబాబుకు మెగాలోమానియాక్ (అధికారం నా హక్కు, నా సొంతం అనుకోవడం) జబ్బు సోకి ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే..
ప్రజలకు, రాష్ట్రానికి సంబంధం లేని అంశాలు, ఎన్నికలకు సంబంధించిన అజెండా లేకుండా వ్యక్తిత్వ హననం, రెచ్చగొట్టే బూతు ప్రసంగాలు, పచ్చి అబద్ధాలు, రెచ్చగొట్టడాన్ని మించి ఫిజికల్‌గా తోసుకుంటూ టీవీ స్క్రీన్లలో కనపడటం, ఎక్కడైనా పోలీసులు ఆపితే చొక్కాలు చింపేసుకొని గొడవ చేయడం, మాకు ఏ చట్టం, ఏ రాజ్యాంగం, ఏ నైతిక సూత్రాలు, పార్లమెంటరీ భాష అవసరం లేదు.. క్వశ్చన్‌ చేస్తే అరాచకం సృష్టించి.. దాని కోసం ఇల్లు ఎక్కి అరుస్తాం, ఢిల్లీకి వెళ్తాం, ఇంకా అవకాశం ఇస్తే ఐక్యరాజ్యసమితికైనా వెళ్తామనే ధోరణితో ప్రవర్తిస్తున్నారు. 

ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో సహజంగానే అధికారంలో ఉన్న వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం పరిపాలనలో చేసిన మంచి ప్రజలకు చెప్పి మళ్లీ ప్రజల ఆశీస్సులు పొందడానికి ప్రయత్నం చేస్తోంది. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ఫలానా మంచి ఆరోజుల్లో చేశాం.. అని పాతవి గుర్తుచేస్తూ, ఏరకంగా ప్రజలకు సంబంధించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు, పరిపాలనకు సంబంధించి ఉదాహరణలతో చెప్పడానికి చంద్రబాబుకు అవకాశం ఉంది. దత్తపుత్రుడికి ఆ అవకాశం లేదు.. అధికారంలోకి వచ్చే ప్రయత్నం కూడా చేయాలనే ఆలోచన ఆయనలో లేనట్టుంది. 

పవన్‌ కల్యాణ్‌ విశాఖలో మాట్లాడిన కారుకూతలు మామూలు మాటలు కాదు. దేనికి పూనకం, ఎందుకంత ఊగిపోవడం..? ఆవేశంగా డైలాగ్‌ కొడితే ఫ్యాన్స్‌ నుంచి కేకలు రావడంతో సీఎం వైయస్‌ జగన్‌ను సింహాసనం నుంచి దించేస్తానని మాట్లాడుతాడు. స్క్రీన్‌ మీద సినిమా చూసి ప్రేక్షకులుగా ఎలా రెస్పాండ్‌ అవుతారో సేమ్‌ టు సేమ్‌ పవన్‌ మీటింగ్‌లోనూ అభిమానులు అదే పాత్ర పోషిస్తున్నారు. అంతకుముందు చిరంజీవికి, తమిళనాడులో రజనీకాంత్‌కు ఎవరికైనా అభిమానుల నుంచి కేకలు రావడం సహజం.  

పవన్‌కు అభిమానులు కొడుతున్న చప్పట్లు, కేరింతలు రేపు జరగబోయే ఎన్నికలకు, రాష్ట్ర పరిస్థితులకు, పరిస్థితులను చక్కదిద్దడానికి ఏరకమైన ఉపయోగం ఉండదు. అలాంటి పరిస్థితి కూడా ఎక్కడా కనిపించదు. పవన్‌ మాట్లాడే మాటల్లో పూనకం, అరుపులు, కేకలు, తిట్లు తప్ప ఏమీ ఉండదు. రుషికొండ బద్దలు కొట్టాలంట.. సీఎం లోపల కలిసిపోవాలంట. ఎందుకంత కక్ష.. మళ్లీ నాకు వ్యక్తిగత కక్షలేదని అంటాడు. దీనికి ఏదైనా సమాధానం ఇస్తే దాన్ని వక్రీకరించి మాట్లాడుతారు. 

పవన్‌ యజమాని చంద్రబాబు వేషాలు మరీ అన్యాయంగా ఉన్నాయి. అంగళ్లు, పుంగనూరు వద్ద ఏం జరిగిందో ప్రజలంతా చూశారు. కందుకూరులో ఇరుకు సందుల్లో తోపులాట పెట్టి 8 మందిని చంపేశాడు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం నిబంధనలు తెస్తే దాన్ని అన్యాయం, అరాచకమంటూ బిల్డప్‌ ఇచ్చాడు. అంగళ్లు, పుంగనూరు ప్రాంతాల్లో రెచ్చగొట్టి టీడీపీ కార్యకర్తలతో అరాచకం సృష్టించి పోలీసులతో దాడి చేయించాడు. చంద్రబాబు తమ్ముళ్లు సృష్టించిన విధ్వంసంలో 50 మంది పోలీసులు గాయాలు, ఒక కానిస్టేబుల్‌కు కళ్లు పోయాయి. 

పోలీసులంతా సంయమనం పాటించారు. కానీ, చంద్రబాబు ఉద్దేశం మాత్రం అక్కడ ఘోరం జరగాలి.. కాల్పుల్లో టీడీపీ కార్యకర్తలు పోయినా పర్వాలేదు, రాష్ట్రంలో శాంతిభద్రత సమస్య సృష్టించి ప్రజలను గందగోళంలో పడేయాలని ఆశించాడు. అది జరగకపోవడంతో తనపై హత్యాయత్నం జరిగిందని, సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని రాష్ట్రపతి, ప్రధానమంత్రికి ఏకంగా 9, 10 పేజీల లేఖ రాశాడు. ఆ లేఖలో చంద్రబాబు గురువులు, టీడీపీ మార్గదర్శకులు రామోజీరావు, రాధాకృష్ణ పత్రికల్లో వచ్చిన బ్యానర్‌ స్టోరీలు, వార్తలు, కల్పిత కథనాలు అంటించాడు. లాస్ట్‌లో ముక్తాయింపుగా హత్యాయత్నం జరిగినట్టుగా ఆరోపణ చేస్తూ సీబీఐ ఎంక్వైరీ కోరాడు.  

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు వీల్లేదని జీవో విడుదల చేశాడు. చంద్రబాబు గురువు రామోజీరావు సీబీఐ అనే కుక్క తోక కత్తిరించిన హీరో చంద్రబాబు అని కార్టూన్‌ కూడా వేశాడు. 

చంద్రబాబు రాసిన లేఖలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చిన కల్పిత వార్తలనే పొందుపరిచాడు. చంద్రబాబుకు మెగాలోమానియాక్ (అధికారం నా హక్కు, సొంతం అనుకోవడం) జబ్బు ఉంది. అధికారం చేపట్టేందుకు తనకు మించిన అర్హులు లేరనుకోవడం, అధికారం లేకపోతే అహంకారం పెంచుకోవడం, ఉన్మాదంగా మారడం ఈ జబ్బు లక్షణాలు. 

మామ కట్టుకున్న కోట గుడారంలో తోడేలుగా చంద్రబాబు దూరాడు. కూతురుని ఇవ్వడం ద్వారా అల్లుడ్ని చేసుకోవడం ద్వారా గుడారంలో దూరిన తోడేలు రాష్ట్రానికి శనిలా, సులభంగా వదిలించుకోని జాడ్యంలా అల్లుడి రూపంలో ఇచ్చానని, పెద్ద  తప్పు చేశానని ఎన్టీఆర్‌ బతికుంటే అనుకొని ఉండేవారేమో అనిపిస్తోంది. చంద్రబాబు కాంగ్రెస్‌లోనే కంటిన్యూ అయ్యి ఉండి మ్యానిపులేషన్స్‌ తెలుసుకాబట్టి ఒక్కసారి సీఎం అయ్యి ఉండేవాడేమో.. కానీ ఎన్టీఆర్‌ బతికి ఉండి ఉంటే నేను దెబ్బతిని మోసపోవడం కాదు, బాబును అల్లుడ్ని చేసుకొని రాష్ట్రానికే నష్టం కలిగించాను అనుకువాడని అనిపిస్తోంది. 

చంద్రబాబు ప్రజల నుంచి ఎన్నిక కాకపోగా.. అధికారం అనేది సులభంగా దక్కించుకోవచ్చు అనే రుచి మరిగినాక, అధికారం పోతే సహించక ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడు. మెగాలోమానియాక్ వ్యాధి ఉండేవారు ఎలా ప్రవర్తిస్తారో చంద్రబాబులో అవి పూర్తిస్థాయిలో కనిపిస్తోంది. రామోజీరావు, రాధాకృష్ణ రాసినవన్నీ తీసుకొచ్చి అతికించి కేంద్రానికి లేఖ రాశాడు. వెంటనే కేంద్రం రియాక్ట్‌ అయ్యి సీబీఐని పంపించి ఏదో చేయాలని ఆలోచిస్తున్నాడు. తనకు పిచ్చి, ఉన్మాదం ఎక్కి 5 కోట్ల జనం పిచ్చోళ్లు అనే స్టేజీకి చంద్రబాబు వెళ్లాడు. 

ప్రాజెక్టులు చూడాలనుకునే వ్యక్తి అక్కడకు వెళ్లి సందర్శించి తప్పిదం ఉంటే ప్రభుత్వాన్ని క్వశ్చన్‌ చేయకుండా దారివెంట అలజడులు సృష్టించి ఇల్లు ఎక్కి అరుస్తున్నాడు. మద్దతుగా ఆర్కెస్ట్రా వాయించడం, దానిపై వార్తలు రాయడం, ఇవన్నీ తీసుకొని ఢిల్లీకి లెటర్లు రాయడం ఇదంతా పద్ధతి ప్రకారం జరుగుతుంది. 

గాజువాక, భీమవరంలో అడ్రస్‌ లేకుండా ఓడిపోయాడో.. ఎందుకు ఓడిపోయాడనేది పరిశీలన చేసుకోకుండా.. ప్రజలు రిజక్ట్‌ చేసినా పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నాడు. పవన్‌కు గెలవాలనే కోరిక లేదు.. చంద్రబాబును గెలిపించాలనే తాపత్రయమే ఉంది. ప్రజలకు మంచి చేసే బాధ్యత ఎత్తుకునే ఆలోచన, సామర్థ్యం పవన్‌కు ఉందని అనిపించడం లేదు. అందరూ అరేంజ్‌ చేస్తే దానికి అలవాటు పడిన నటుడు ఎలా ఉంటాడో ఆ రకంగానే పవన్‌ ప్రవర్తిస్తున్నాడు. అలాంటి సౌకర్యాలన్నీ చంద్రబాబు పవన్‌కు సమకూరుస్తున్నాడు. చంద్రబాబు పంచన సుఖమైన జీవితానికి పవన్‌ అలవాటు పడ్డాడు. 

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనే పద్ధతిలో పోటీచేసి గెలవాలి కానీ, సేవ చేస్తా అని అంటున్నాడు. పవన్‌ కంటే ఎన్జీవోస్‌ బెటర్, వలంటరీ ఆర్గనైజేషన్‌ చేసే సేవ ఎక్కువ. ప్రజల తలరాతలు మార్చాలంటే పవన్‌ విధానాలేంటో చెప్పాలి.. పోటీ చేసి ప్రజల ఆశీస్సులు పొందాలి. ఇంత పెద్ద మాటలు కూడా పవన్‌కు చెప్పడం అనవసరం. కేవలం స్క్రీన్‌ మీద తను కనబడినందు వల్ల వచ్చిన పాపులార్టీని దుర్వినియోగం చేస్తూ అభిమానుల చప్పట్లను చూసి ప్రజలంతా తనవైపున ఉన్నారనుకోవడం అహంకారం స్టేజీ దాటిపోయి చంద్రబాబు దారిలో ఉన్నట్టు అనిపిస్తోంది. జనం అంటే లెక్కలేనితనం ఏంటీ..? జనమంతా సీఎం వైయస్‌ జగన్‌ వెంటే ఉన్నారు. ఎన్నికలు ఎక్కడ జరిగినా ఇదే రుజువు అవుతుంది. 2024లో సీఎం వైయస్‌ జగన్‌ను ఎందుకు ఆదరించవద్దో అది చెప్పకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన దాన్ని తీసుకొని నీకు నువ్వు తీర్మానం చేసుకుంటే ఎలా..? 

చంద్రబాబుకు మాట్లాడేందుకు ఏమీ లేకే విధ్వంసం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నాడు. నాలుగేళ్లలో సీఎం వైయస్‌ జగన్‌ ఏం చేశారో ప్రజలందరి అనుభవంలోకి వచ్చింది. 90 శాతం మంది ప్రజలు ఏదో ఒక రూపంలో నేరుగా ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందడం, పరిపాలనలో పారదర్శకత, అవినీతి రహితం, పనులు ఫాస్ట్‌గా జరగడం కూడా మిగిలిన 10 శాతం మంది కూడా సంతృప్తిగా ఉన్నారు. ఎవరూ నా బతుకు డిసైడ్‌ చేయలేరనే ధీమా రాష్ట్రం మొత్తానికి సీఎం వైయస్‌ జగన్‌ ఇచ్చారు. అందుకే 151 ఎమ్మెల్యేలు, మిగిలిన ఇన్‌చార్జ్‌లు నిత్యం ప్రజల్లో ఉండగలుగుతున్నారు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ అమలు చేసి చూపించారు. పవన్‌ కల్యాణ్‌లా స్వర్గం ఎందుకు దించలేరంటే సమాధానం ఎవ్వరి దగ్గర ఉండదు. పేదలకు ప్రభుత్వం అండగా నిలిచింది, బడుగు, బలహీనవర్గాలకు తోడుగా నిలిచింది, మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది. పరిపాలనలో పారదర్శకత వైయస్‌ జగన్‌ ప్రభుత్వం తెచ్చింది. దీనిపై క్వశ్చన్‌ చేయడానికి చంద్రబాబు దగ్గర ఏమీ లేదు. 

సీఎం వైయస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన పథకాలపై చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కతున్నాడు వలంటీర్‌ వ్యవస్థతో సహా. వలంటీర్ల వ్యవస్థ మంచిదే అంటూనే ఒక తెగలా క్రియేట్‌ చేసి చెడ్డపేరు తెచ్చేలా విషప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మధ్యలో గుర్తొస్తే.. వలంటీర్లకు మేము వ్యతిరేకం కాదని సన్నాయి నొక్కులు నొక్కుతాడు. వలంటీర్ల వల్ల డెలివరీ సిస్టమ్‌ ప్రతి గడపకూ చేరిందని చంద్రబాబుకు కడుపుమంట. ఈ వ్యవస్థను తెచ్చిన సీఎం వైయస్‌ జగన్‌పై ప్రజల విశ్వాసాన్ని తెంచలేక, ఏమి చేయాలో అర్థం కాక వలంటీర్లపై చెడ్డవారని ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నాడు. మరో రోజు పోలీసులు, మరో రోజు వేరే వ్యవస్థపై, పొరపాటున కోర్టు ఏమైనా అంటే వారికి కూడా తాటాకులు కడుతున్నారు. ఉగ్రవాదం కంటే మించి చంద్రబాబు ప్రవర్తన ఉంది. 

Back to Top