అది చంద్రబాబు కోల్డ్‌ బ్లడెడ్‌ ప్రీ ప్లాన్డ్‌ ఎటాక్‌

శాంతిభద్రతలను బ్రేక్‌ చేయాలని చూస్తే సహించేది లేదు

ఘ‌ట‌న కళ్ల‌ ముందు కనిపిస్తుంటే.. సీబీఐ, ఎఫ్‌బీఐల విచారణ అవసరం లేదు

చంద్రబాబు డైరెక్షన్‌ మేరకే పుంగనూరు కుట్ర

అడ్డంగా దొరికి దబాయిస్తానంటే కుదరదు

టీడీపీ ఆరాచక మూకల దాష్టీకాన్ని రాష్ట్రమంతా చూసింది

పోలీసులను బట్టలూడదీయ్‌ అన్నాక నువ్వు నాయకుడివి ఎలా అవుతావ్‌..?

చంద్రబాబుపై 307 కేసు కాకుండా ఇంకేం పెట్టాలి..?

రాష్ట్రమంతా తగులబడాలనేదే చంద్రబాబు ప్లాన్‌

వైయ‌స్ జగన్‌ని ప్రజాక్షేత్రంలో ఎదుర్కొలేకనే ఇలాంటి కుయుక్తులు

చిరంజీవి తన మాటల ద్వారా ఎవరికి ప్రయోజనం చేకూర్చాలనుకున్నారో..?

వైయ‌స్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి 

తాడేప‌ల్లి: చంద్రబాబు డైరెక్షన్‌ మేరకే పుంగనూరు కుట్ర జ‌రిగింద‌ని, అల్లర్లు సృష్టించి అరాచకాలకు పాల్పడింది చంద్రబాబు, ఆయన గ్యాంగేన‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. నాయకుడంటే అల్ల‌ర్లు ఆపడానికి ప్రయత్నిస్తాడు కానీ.. చంద్రబాబు మాత్రం రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించాడ‌ని మండిప‌డ్డారు. చంద్రబాబు హయాంలో ఉన్న పోలీసులే ఇప్పుడు కూడా ఉన్నారు క‌దా.. పోలీసులంటే చంద్రబాబుకు ఎందుకంత చులకనభావం అని ప్ర‌శ్నించారు. 14 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన‌ చంద్ర‌బాబు ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రం తగులబడాలనే పుంగనూరు నుంచి చంద్రబాబు ప్లాన్‌ చేశారు. కుట్ర కోణం లేకుండా ఈ ఘటనలు జరుగుతాయా? అని ప్ర‌శ్నించారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడమ‌ని, చంద్రబాబు లాంటి గుంటనక్కల ఆటలు సాగనీయం అని వార్నింగ్‌ ఇచ్చారు. 

స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..
అంగల్లు, పుంగనూరు వద్ద జరిగిన సంఘటనలపై.. తాను ప్రజల ముందు నిర్ధోషిగా నిలబడటానికి, సీబీఐకి ఇస్తే.. కేసు ఇప్పట్లో తేలదని అనుకున్నాడో ఏమో కానీ బాబు చాలెంజ్‌ విసిరాడు. ఆ రోజు ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలంతా చూశారు. అదేదో ఆదర్శప్రాయమైన సంఘటన అన్నట్లు వారి మీడియా మొత్తం లైవ్‌లు కూడా ఇచ్చారు. చంద్రబాబు తరమండిరా.. నా... అంటూ ఆదేశాలు ఇవ్వడంతో వారి అరాచక మూకలు ఎలా రెచ్చిపోయాయో రాష్ట్రమంతా చూసింది. అవతల వైపు శిబిరంలో వైయ‌స్సార్సీపీ వారు నల్లకండువాలతో నిరసన తెలుపుతున్నారు. ఈయన రెచ్చగొట్టి వారిపైకి పంపాడు. నిజంగా ఆయన మీద అటాక్‌ చేయాలని చూస్తే శిబిరం వేసుకుని పక్కన కూర్చుంటారా..? కానీ వాళ్లందరినీ ప్రేరేపించి చంద్రబాబే అవాంఛనీయ సంఘటనలకు పురిగొల్పాడు. ఆ తర్వాత తన ప్రసంగంలోనూ రెచ్చగొట్టేవిధంగా మాట్లాడాడు. 

బాబూ హయాంలోనూ ఇదే పోలీసులు..
ఒక నాయకుడనేవాడు ఆపడానికి ప్రయత్నం చేస్తాడా..? తరమండిరా.. కొట్టండిరా అంటారా.? వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నప్పుడు వందలసార్లు నల్ల జెండాలు చూపుతూనే ఉన్నారు. ఆయన నడిచిన ప్రాంతంలో పసుపు నీళ్లతో కడిగిన సందర్భాలూ ఉన్నాయి. వైయ‌స్ జగన్‌ వచ్చే ముందు నిరసనగా డోర్లు వేసుకున్న సంఘటనలు జరిగాయి. ఇప్పుడు కూడా అమరావతి ప్రాంతం వెళితే ఎక్కడో ఒక చోట నిరసన తెలుపుతూనే ఉన్నారు. దాన్ని ఆసరాగా తీసుకుని మా నాయకుడు, మా పార్టీ వాళ్లు అలా సీన్‌ క్రియేట్‌ చేయాలని ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. కానీ చంద్రబాబు ఎందుకు చేశాడు..? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పోలీసు వ్యవస్థ ఉంది. మరి ఆరోజు పోలీసులు ఆయనకు ఊడిగం చేశారా..? ఏబీ వెంకటేశ్వరరావు లాంటి వారిని పెట్టుకుని పోలీసులతో నాడు ఊడిగం చేయించే ప్రయత్నం చేశారు. అందుకే 2019 ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చి బుద్ధి చెప్పారు. కానీ ఉద్రిక్తతలకు అవకాశం ఉన్నప్పుడు ఒక పరిణితి చెందిన లీడర్‌ అయితే, మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇలా బిహేవ్‌ చేయవచ్చా..? బరితెగించి ఆయన వ్యవహార శైలిని ప్రజలే గమనించాలని కోరుతున్నా. 

నువ్వు నాయకుడివి ఎలా అవుతావ్‌..?
అల్ల‌ర్ల‌కు నాయకత్వం వహించిన చంద్రబాబుపై 307 కేసు కాకుండా ఇంకేం పెట్టాలి..? ఏ వ్యవస్థలోనైనా ఇలాంటి అంశాలను సహించడానికి కుదురుతుందా..? పోలీసులను బట్టలు ఊడదీయ్‌ అన్నాక నువ్వు నాయకుడు ఎలా అవుతావ్‌..? మీడియా ఇలాంటి సంఘటనల్లో సంయమనం పాటిస్తాయి. కానీ వాళ్లు లైవ్‌లో అంతా చూపించారు. వారి ఆలోచన చూసి వైయ‌స్సార్సీపీ కార్యకర్తలు రెచ్చిపోవాలి..రాష్ట్రం తగులబడాలి అనేది వారి ఆలోచన. అది పుంగనూరుతో మొదలు కావాలనేదే ప్లాన్‌.. ఆ కుట్ర కోణం కూడా బయటకు వచ్చింది. అంగళ్లు వద్ద వివాదానికి ముందే పుంగనూరులో ఇలాంటివి అల్లర్లు చేయాలని ప్లాన్‌ చేసుకున్నారనేది తెలుస్తోంది. కోల్డ్‌ బ్లడెడ్‌గా ప్రీ ప్లాన్డ్‌గా రాళ్లు ఇతర సామగ్రితో ఎలా అటాక్‌ చేశారు అనేది రాష్ట్ర ప్రజలంతా గమనించాలి. ఒక ఉగ్రవాద, ఉన్మాద ముఠా అటాక్‌ చేసినట్లు ఉందా..లేదా..? పోలీసులు సరైన సమయంలో గట్టిగా నిలబడ్డారు కాబట్టే వాళ్ల ప్లాన్‌ పూర్తిగా ఇంప్లిమెంట్‌ కాలేదు. 

ఉన్మాదంతో చేసిన వాళ్లు కార్యకర్తలా..? ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు అని చెప్పుకోడానికి వారికన్నా సిగ్గుండాలి..వారికి నాయకుడిని అని చెప్పుకోడానికి చంద్రబాబుకైనా సిగ్గుండాలి. పోలీసులు గాయపడినా ఎక్కడా నిగ్రహం కోల్పోకుండా వ్యవహరించారు. ఒక మహిళా పోలీసు అధికారితో పాటు చాలామంది గాయపడ్డారు ..మరో పోలీసుకు కళ్లు పోయాయి. చాలా మంది గాయపడ్డారు. ఎవరన్నా రెచ్చగొట్టి మతకలహాలు జరిగాయనడానికి కూడా లేదు. వీళ్లకు వీళ్లే రెచ్చగొట్టుకుని, ఎటువంటి ఎదురుదాడి లేకపోయినా ఇష్టారీతిన దాడి చేశారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఉన్మాది ట్రైనింగులో తయారైన ఉన్మాదుల ముఠా అది. 

తాను లాభపడాలనేదే బాబు సిద్ధాంతం
చంద్రబాబు తొడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకంలో చెప్పినట్లుగానే ఇక్కడ వ్యవహరించారు. శాంతిభద్రతల సమస్య రావాలి...అలాంటి సంక్షోభం నుంచి కూడా ఎన్ని ప్రాణాలు పోయినా తాను లాభపడాలనేదే చంద్రబాబు సిద్ధాంతం. ఆ లక్షణం ముదిరి ఈ వార్ధక్యంలో పూర్తిగా తలలో కరుడుగట్టి పైశాచిక ఆనందం పొందుతున్నాడు. పోలీసు విచారణలో కూడా కుట్ర కోణం కూడా స్పష్టంగా బయటపడుతోంది. రెండు రోజుల ముందే పోలీసుల మీద ఎటాక్‌ చేసి టౌన్‌లోకి తోసుకురావాలని ప్లాన్‌ చేసుకున్నారు. ఈ సమయంలో పోలీసులు కాల్పులు జరిపి, నలుగురైదుగురు కార్యకర్తలు చనిపోతే.. దాని నుంచి సానుభూతి పొందాలని ప్రయత్నం చేశాడు. ఒక వేళ తోసుకుని పోగలిగితే పుంగనూరును తగలబెట్టాలని వారు ప్లాన్‌ చేశారు. ఇంతటి దిక్కుమాలిన ఆలోచన, కుట్ర, కుతంత్రం చరిత్రలో కూడా ఉండి ఉండదు. వైయ‌స్ జగన్‌ని ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకనే ఇదంతా చేస్తున్నాడు. అసలు ఆయన యాత్ర ప్రారంభించింది దేనికీ...? చేస్తుంది ఏమిటీ..? మేం కూడా ప్రతిపక్షంలో ప్రాజెక్టులకు వెళ్లాం..ప్రశ్నించాం..లోపాలను ఎత్తిచూపాం. కానీ తూతూమంత్రంగా ప్రాజెక్టుల వద్ద సెల్ఫీలు దిగి ఇలాంటివన్నీ చేస్తున్నాడు. తాను పులివెందుల, పుంగనూరుల్లో ఏదో ఒకచోట అల్లర్లు చేయాలనే వెళ్లాడు. ఆయన సక్సెస్‌ఫుల్‌గా చేశాను అనుకుంటున్నాడు. కానీ ఆయన అడ్డంగా దొరికాడు. 

చంద్రబాబు కుట్రను తిప్పికొట్టిన పోలీసుల తీరు భేష్‌..
పోలీసులు చాలా సంయమనంతో వ్యవహరించారు. ఫైరింగ్‌ ఆర్డర్‌ ఇవ్వకుండా అక్కడి ఎస్పీ వెనక్కితగ్గారు. పోలీసులు ప్రతిష్టకు పోయి ఉంటే చంద్రబాబు ఆశించిందే జరిగేది. అందుకే పోలీసులు రావడం లేదని మీకు రోషం లేదా...చొక్కాలు విప్పండి అంటూ తిట్టారు. నాలుగైదు ప్రాణాలు పోయినా పర్లేదు...ఆయనకు తన కార్యకర్తలపైన కూడా ప్రేమ లేదు. అడ్డంగా ఎదో ఒక విధంగా పవర్‌లోకి రావాలి. ప్రజా క్షేత్రంలో ఏమీ చేయలేడు కాబట్టి కార్యకర్తల ప్రాణాలను కూడా ఫణంగా పెడుతున్నాడు. 

ఏమీ లేకే ఇలాంటి కుయుక్తులు..
పరిపాలనలో పోల్చుకుందామన్నా 2014–19లో చేసిందేమీ లేదు. మరో వైపు సీఎం వైయ‌స్‌ జగన్‌ని వేలెత్తి చూపాలన్నా ఏమీ లేదు. రూ. 2.30 లక్షల కోట్ల డీబీటీ ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళ్లాయి..87 శాతం రాష్ట్రంలోని పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఇక చంద్రబాబు ఓట్లేయించుకోవాలంటే యూఎస్‌ఏ వెళ్లాల్సిందే. ఎన్నికలు దగ్గరకొస్తున్నాయ్‌...ఏమీ చేయలేక ఆ పవన్‌ కల్యాణ్‌ లాంటి వారికి ప్యాకేజీ ఇచ్చి తిప్పుకుంటున్నాడు. ఎన్ని నరబలులు జరిగితే ఆయనకు అంత మేలు అనుకుంటున్నాడు. తన వాళ్లు చనిపోయినా అది తనకు ఉపయోగపడితే చాలు అనేలా వ్యవహరిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తిని ఇంకా సహించడం అనేది కూడా తప్పే. ఆయన కొడుకు కూడా అదే రీతిలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఇది చూసి వారి వెనుక తిరిగే నాయకులు కూడా అదే కోణంలో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అయినా సరే మేం సంయమనంతో ఉన్నాం. ఈ సారి తీర్పు ఎలా ఉంటుంది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. 

ఇలాంటివి సహించేదే లేదు..
సీఎం వైయ‌స్ జగన్‌ పాలనలో ఇలాంటి వాటికి అవకాశం లేదు..శాంతిభద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అవి అలాగే ఉంటాయి. చంద్రబాబు లాంటి గుంటనక్కలు దాన్ని బ్రేక్‌ చేయాలని చూస్తే సహించేది లేదనేది స్పష్టంగా చెప్పదలిచాం. సీబీఐ, ఎఫ్‌బీఐల విచారణ కాదు.. అక్కడ స్పష్టంగా ఆధారాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు డైరెక్షన్‌ మేరకు కుట్ర చేసిన వారు దొరికారు. చంద్రబాబుతో సహా దే విల్‌ ఫేస్‌ ద మ్యూజిక్‌. ఇంకా మా బాబు వెనుక ఉన్నాడులే..మేమేం చేసినా చెల్లుతుంది అనుకునే వారికి ఇక బుద్ధి వస్తుందని మేం ఆశిస్తున్నాం. తన మామ చావుకే కారణం అయిన వాడు వాళ్లని కూడా బలిఇవ్వడానికి వెనుకాడడు. ఈ వాస్తవాన్ని గ్రహించమని ఆయన వెనుక ఉన్న మూకలకు చెప్తున్నాం. కాదంటే వాళ్ల ఖర్మ..ప్రభుత్వం మాత్రం ఇలాంటివి జరిగితే సహించేది లేదు. రాజకీయ పార్టీగా సంయమనం పాటిస్తాం..అతను మమ్మల్ని రెచ్చగొట్టలేడు. అదే సమయంలో వారి ఆగడాలు మితిమీరి పోతే ఎక్కడ ఎలా దెబ్బకొట్టాలో కూడా ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ చూసుకుంటుంది. అంగళ్లు, పుంగనూరుల్లో పోలీసులు వ్యవహరించిన తీరు చాలా ఆదర్శప్రాయమైనది. వాళ్లు సంయమనంతో ఉండబట్టే చంద్రబాబు పాచిక పారలేదు. అతనూ తప్పించుకోలేదు..అతని వెనుకున్న అల్లరి మూకా తప్పించుకోలేదు. దబాయిస్తే సింపతీ వస్తుంది, భయపడతారు అనుకుంటే ఆయన భ్రమ. దీన్ని గట్టిగా డీల్‌ చేయకపోతే ఇలాంటి కుక్కమూతిపిందెలు పుడుతూనే ఉంటాయి. 

చిరంజీవి ఎవరికి ప్రయోజనం చేకూర్చాలనుకున్నారో..?
ఆయన ఏ సందర్భంలో ఏమన్నారో..? చంద్రబాబు హయాంలో బాలకృష్ణకు ఒక న్యాయం.. మిగిలిన వారికి ఒక న్యాయం అన్నట్లు చేయలేదు. ముఖ్యమంత్రి ఏ విషయంలో అయినా వివిక్ష లేకుండా వెళుతున్నారు. సినిమాల్లో కూడా బడ్జెట్‌ లింక్‌డ్‌ టికెటింగ్‌ పెట్టారు. ఇంత పారదర్శక వ్యవస్థ పెట్టిన ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ని ఇదే చిరంజీవి బాగా చేశారన్నట్లు గుర్తు. అన్నీ పద్దతి ప్రకారం వెళ్లాల్సినప్పుడు ఆయన మాట్లాడటంలో అంతర్యం ఏమిటో నాకు అర్ధం కావడం లేదు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడటం అంటారు ఇలాంటి వ్యాఖ్యలు అంటారు. అలా మాట్లాడటం ద్వారా ఎవరి ప్రయోజనాలు కాపాడాలనుకున్నాడో ఆయనకే తెలియాలి. 

ఎవరి తరఫున మాట్లాడాడో కూడా మాకు అర్ధం కావడం లేదు. రాజకీయాల గురించి మాట్లాడాలనుకుంటే క్లియర్‌గా మాట్లాడాల్సింది.  ఆయన సెంట్రల్‌ మినిస్టర్‌గా చేశాడు..ప్రభుత్వానికి ఒక పాలసీ ఉంటుందని ఆయనకీ తెలుసు. ఒక అన్యాయమైన కామెంట్‌ చేయడం, దానికి సంబంధం లేని అంశం మాట్లాడంలో భావమేంటో అర్ధం కావడం లేదు. ప్రత్యేక హోదా గురించి అనుకుంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడి ఉండాల్సింది. మొన్నీమధ్య ఎన్డీయే మీటింగుకు వెళ్లినప్పుడు ఆయన తమ్ముడు కూడా మాట్లాడే అవకాశం ఉంది. మా ప్రయత్నాలు మేం చేస్తున్నాం. వాళ్లు కూడా వారి ప్రయత్నాలు చేయవచ్చు. 

తమ్ముడు, మోడీతో ఉన్నాడు కాబట్టి వారికి అవకాశం కూడా ఉంది. సీఎం వైయ‌స్ జగన్‌ స్పష్టంగానే చెప్తున్నారు మీరే ప్రతిష్ట తెచ్చుకోండి మాకు రాష్ట్రానికి కావాల్సింది ఇవ్వండి చాలు అంటున్నారు. నేనే సాధించాను అని చంద్రబాబులా డబ్బాలు కొట్టుకోవాలని జగన్‌ ఏనాడూ ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు ఆనాడు ప్యాకేజీ తెచ్చి రాష్ట్రానికి నష్టం చేసినందుకే స్వీట్లు పంచి సెలబ్రేట్‌ చేసుకున్నాడు.  సీఎం వైయ‌స్ జగన్‌ నిజంగా తీసుకొచ్చిన దానికి కూడా క్లెయిమ్‌ చేసుకోవడం లేదు. పవన్‌ కల్యాణ్‌ తనకున్న పలుకుబడితో రాష్ట్రంలోని సమస్యలు తీర్చగలిగితే ఆహ్వానిస్తాం. అంతేకానీ మోకాలికి బట్టతలకు ముడేస్తే పొలిటికల్‌ రియాక్షన్స్‌ మావైపు నుంచి కూడా వస్తాయి.

Back to Top