తాడేపల్లి: వైయస్ జగన్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే ఏ కార్యక్రమం చేపట్టినా చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌కు మింగుడు పడదని, పవన్ కల్యాణ్ చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టునే చదువుతాడనేది అందరికీ అర్థమైపోయిందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైయస్‌ఆర్ సీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చేయడమే తన పవిత్ర కర్తవ్యమని, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం కోసమే తాను పనిచేస్తున్నానని పవన్ కల్యాణ్ పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చినప్పుడే పవన్ దివాళాకోరుతనం, ఆయన పొలిటీషియన్ కాదు పెయిడ్ ఆర్టిస్టు అనేది అర్థమైపోయిందన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, కమ్యూనిస్టులు, ఈమధ్య చంద్రబాబు సహకారంతో పార్టీ పెట్టిన జడా శ్రవణ్‌కుమార్ అనే వ్యక్తితో సహా వీరందరికీ అజెండా అంతా ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల నుంచే తయారవుతుందని స్పష్టంగా అర్థం అవుతుంది. ఎక్కడో పల్లెల్లో మారుమూల ప్రాంతాల్లో ఏది జరిగినా సింగిల్ కాలమ్ వార్త బ్యానర్ స్టోరీ అవుతుంది. దానిపై పెయిడ్ ఉద్యమాలు జరుగుతాయి. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ అదే అంశంపై ట్వీట్ వేస్తారు. దాన్నే గవర్నర్ దగ్గరకు తీసుకువెళ్లి వినతిపత్రం ఇస్తారు. ఇదంతా చేసిన తరువాత రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగ్గాలేవని ఆర్టికల్ రాస్తారు ఇదంతా ఒక స్కీమ్ ప్రకారం మీడియా సంస్థలు నడుపుతున్నట్టుగా అనిపిస్తోంది. గతంలో చంద్రబాబు ఒక ఘటన జరిగితే ప్రతి వ్యక్తి దగ్గర పోలీస్‌ను పెట్టలేను కదా అన్నాడు.. పుష్కరాల్లో 29 మంది చనిపోతే.. కుంభమేళాలో చనిపోలేదా అని బుకాయించాడు. అలా మా ప్రభుత్వం అనడం లేదు. పోలీస్ వ్యవస్థను సీఎం వైయస్ జగన్ పటిష్టపరిచారు. మహిళా రక్షణ కోసం దిశా యాప్, దిశా పోలీస్ స్టేషన్లు, నేరస్తులకు వెంటనే శిక్షపడేలా చేశారు. గంజాయిని పూర్తిగా నిర్మూలించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయిని దగ్ధం చేయించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను సీఎం వైయస్ జగన్ పటిష్టపరిచారు. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి ఏమీ లేక లేనిది క్రియేట్ చేసి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలను ప్రతిపక్షాలు, కొన్ని టీడీపీ అనుకూల మీడియా సంస్థలు చేస్తున్నాయి. ‘విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఏమన్నారు.. నేను రాజకీయాల్లోనూ, బిజినెస్‌లో ఉన్నాను.. నేను ఏ బిజినెస్ చేసినా నాపై కొందరు బురదజల్లుతున్నారు. రాజకీయాల్లో ఇక్కడ ఉంటున్నాను కాబట్టి బిజినెస్ వేరే స్టేట్‌లో చేయాలనుకుంటున్నా’నని చెప్పాడు. ఈనాడుకు విశాఖ మీద ఉండే కడుపు మంట. ఆంధ్రప్రదేశ్ మీద ఉండే కడుపుమంట కేవలం ముఖ్యమంత్రిగా సీఎం వైయస్ జగన్ ఉన్నారు కాబట్టి. విశాఖ ఎంపీ ఇంట్లో జరిగిన దురదృష్టకరమైన సంఘటన విని ఎవరైనా షాక్ తినాల్సిందే. దానిపై వెంటనే పోలీసులు రియాక్ట్ అయ్యారు. నిందితులను పట్టుకున్నారు చట్టపరంగా అన్నీ జరుగుతున్నాయి. ఎంపీ మాట్లాడిన మాటలు ఏ సందర్భంలో అన్నాడనే అంశాన్ని వదిలేసి దాన్ని రాజకీయ కోణంలో మలిచి మీ ఎంపీనే ఇక్కడ వ్యాపారం చేయలేకపోతున్నాడు.. అంత అన్యాయంగా ఉందనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే.. పొలిటికల్ అజెండాతో నడిచే మీడియాగా ఉండే అర్హత కూడా రామోజీరావు కోల్పోయాడనేది అర్థం అవుతుంది. మరో పత్రికలో కూడా అదే రాశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా చేయొచ్చు.. వారు చేస్తే దేనికైనా చలామణి అవుతుంది. అధికారం కోల్పోయినా కూడా మీడియా సంస్థలను అడ్డం పెట్టుకొని వేరే వ్యక్తులు ఎవరైనా చేస్తే కోడిగుడ్డు మీద ఈకలు పీకుతారు కాబట్టి మీతో తలనొప్పి ఎందుకు మీ దుష్ప్రచారాలను తట్టుకోలేమని పక్క రాష్ట్రంలో వ్యాపారం చేద్దామనే అభిప్రాయాన్ని చెప్పాడు. అది కూడా మీరే రాసి మళ్లీ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారంటే మీ విషప్రచారం ఎంత వరకు పోతుందో ఈ అంశంలోనే అర్థం అవుతుంది. ఈ మధ్య చంద్రబాబు మినీ మ్యానిఫెస్టో అని విడుదల చేసి ఎంత నవ్వులపాలయ్యాడో అందరూ చూశారు. మ్యానిఫెస్టో అనే మాట చంద్రబాబు నోటి నుంచి రావడం వింటేనే నవ్వొస్తుంది. సీఎం వైయస్ జగన్ వచ్చాక మేనిఫెస్టోకు నిర్వచనం వచ్చింది. మేనిఫెస్టో, పాలిటిక్స్ ఎంత సీరియస్ సబ్జెక్ట్ అనేది చూపించారు. ప్రజల బాగు కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని తన నాలుగేళ్ల పాలనలో సీఎం వైయస్ జగన్ చూపించారు. చంద్రబాబు, పవన్ ఏ యాత్రలు పెట్టుకున్నా.. జోకర్లుగా బస్సులు ఎక్కి తిరుగుతున్నట్టుగా ఉంది తప్ప అంతకు మించి దానికి ఓ విలువ ఉంటుందని అనుకోవడం లేదు. కులాల మధ్య చిచ్చుపెట్టడం, కులాన్ని వాడుకోవాలనే ప్రయత్నం చేయడం అది ఎప్పుడూ బూమ్‌రాంగ్ అవుతుందని చరిత్ర చూపిస్తుంది. కులం ఒక్కటే గట్టు ఎక్కిస్తుంది, ఎవరినైనా చెడగొట్టే ప్రయత్నానికి దోహదం చేస్తుందనే ఆశ పవన్‌కు ఉండొచ్చు కానీ, ప్రజలు మాత్రం ఉన్నతంగా ఆలోచించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారని చరిత్ర చూపిస్తూనే ఉంది. పవన్ కల్యాణ్ కులం బేసిస్ మీద వెళ్తున్నాడని ప్రజలందరికీ తెలిసింది. ఆ ప్రయత్నంలో ముద్రగడ పద్మనాభం పేరు తీసుకువచ్చి ఆయన మీద నిందలు వేయడం ద్వారా ఏదో లబ్ధిపొందాలనుకోవడం పొరపాటు. ముద్రగడ నిజాయితీ పరుడైన వ్యక్తి, అనుభవజ్ఞుడు, కాపుల కోసం గట్టిగా నిలబడి పోరాటం చేశాడని అందరికీ తెలుసు. మా నాయకుడు సీఎం వైయస్ జగన్ చేయగలిగింది మాత్రమే చెబుతాడు.. చేయలేనిది భ్రమలో పెట్టడు అని అందరికీ తెలుసు. కులం కోసం నిలబడిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం మాత్రమే. అంతకుమించి ఆ కులాన్ని రాజకీయాలకు ఆయన వాడుకోవడం లేదు. పవన్ కల్యాణ్‌లా ఎక్కడో తాకట్టుపెట్టే ప్రయత్నం చేయలేదు. కులానికి మంచి చేయాలనుకుంటున్న ముద్రగడపై రాయి వేసే ప్రయత్నంలో పవన్ దగ్గర ఏ స్టార్టజీ ఉందో అర్థం కావడం లేదు. ముద్రగడను ఒక పార్టీ కంట్రోల్ చేయగలదు అంటే ఎవరైనా నమ్ముతారా..? అలా అంటే వారు నాయకులే కాదు.