పార్టీ బలోపేతం, ప్రభుత్వ పాలన రెండూ మాకు కీలకం

మాపార్టీ కార్యకర్తల డీఎన్‌ఏ వేరు.. మా వాళ్లను లాక్కోవాలనుకోవడం వారి భ్రమ 

త్వరలోనే కేబినెట్‌ విస్తరణకు అవ‌కాశం

టీడీపీని కాపాడుకునేందుకే చంద్రబాబు ముందస్తు రాగం

తెలుగుదేశం పార్టీ కేడర్‌లో బాబు, లోకేష్‌లపై నమ్మకం పోయింది

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను చూశాక తెలుగుదేశం పార్టీలో ఆశలు గల్లంతయ్యాయని, ఖాళీ అవుతున్న టీడీపీ గూడును కాపాడుకునేందుకు చంద్రబాబు ముందస్తురాగం తీస్తున్నారని వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకేంటీ..? అని ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల డీఎన్‌ఏ వేరు అని, వైయస్‌ఆర్‌ కుటుంబంతో ముడిపడిన అనుబంధం వారిదన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ వాళ్లను వేరే పార్టీలోకి తీసుకోవాలనుకోవడం వారి భ్రమే అవుతుందన్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకల అనంతరం మీడియాతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. 

అడుగంటిన తెలుగుదేశం పార్టీని కాపాడుకునేందుకే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడని, ఉన్న 23 మంది ఎమ్మెల్యేలలో కూడా చాలా మంది వైయస్‌ఆర్‌ సీపీలోకి రావాలని చూస్తున్నారని చెప్పారు. చంద్రబాబు మీద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నమ్మకం పోయిందని, ఆయన కొడుకు లోకేష్‌కు ఫ్యూచర్‌ లేదని తేలిందన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ను చూశాక టీడీపీ కేడర్‌లో చట్టారిన ఆశలను రేకెత్తించడానికి వారికున్న మీడియా బలంలో ప్రయత్నం చేస్తున్నాడన్నారు. అందుకే వారికి వారు బీరాలు పలుకుతూ ముందస్తు ఎన్నికలని చెప్పి కేడర్‌ను నిలబెట్టుకోవాలనే తాపత్రయపడుతున్నారన్నారు. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలు తనకిచ్చిన ఐదేళ్ల పూర్తి అధికారంలో ఉంటారని, వాగ్దానాలను పూర్తిచేస్తారు.. మరింత మెరుగ్గా చేసి ప్రజల ఆశీస్సులు కోరడానికి వెళ్తారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. త్వరలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ, సభ్యత్వ నమోదు ఉంటుందని చెప్పారు. పార్టీ సంస్థాగత నిర్మాణ పరంగా కిందస్థాయి వరకు పదవులు నియామకం ఉంటుందని వివరించారు. 

త్వరలోనే కేబినెట్‌ విస్తరణ ఉండే అవకాశం ఉందని, రెండున్నరేళ్లకు కేబినెట్‌ విస్తరణ ఉంటుందని సీఎం వైయస్‌ జగన్‌ ముందే చెప్పారని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పాలన రెండూ మాకు కీలకమన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top