తాడేపల్లి: ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకొని, సకాలంలో స్పందించి, సుదీర్ఘ చర్చలు జరిపి, ఉద్యోగ సంఘాల నాయకులు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని స్వచ్ఛందంగా సమ్మెను విరమించుకోవడం చాలా అరుదుగా జరుగుతుందని, సమ్మె వరకు వెళ్లకుండానే సమస్యను ప్రభుత్వం పరిష్కరించిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ఉద్యోగులకు న్యాయం చేశామన్నారు. పీఆర్సీ సాధన కమిటీలో భాగస్వాములై.. చర్చల్లో పాల్గొని, మంత్రుల కమిటీ ప్రతిపాదనలకు సరేనన్న ఉపాధ్యాయ సంఘాలు.. బయటకు వెళ్లి దశలవారీగా సమ్మె చేస్తామని మాట్లాడటం దురదృష్టకరమన్నారు. చర్చలకు హాజరైనట్టు సంతకాలు కూడా పెట్టి.. సమ్మె స్వచ్ఛందంగా విరమిస్తున్నామని ఒప్పుకున్న తరువాత కూడా మళ్లీ ఆందోళన చేస్తామని వామపక్షాలతో అసోసియేట్ అయిన ఉద్యోగులు మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు జేఏసీలుగా ఏర్పడి నోటీసులు ఇచ్చి సమ్మె తలపెట్టడం, సమ్మె వల్ల ప్రజలు, ఉద్యోగులు, ప్రభుత్వం ఇబ్బందులు పడటం గతంలో చూశామన్నారు. కానీ, వైయస్ జగన్ ప్రభుత్వం ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండానే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించిందన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కొంచెం కష్టంగానే ఉన్నా.. వీలైనంత వరకు ఉద్యోగులను సంతృప్తి పరచాలనే దృక్పథంతో సీఎం వైయస్ జగన్ ఉన్నారన్నారు. కోవిడ్ కారణంగా రెండున్నరేళ్లుగా ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందని, ఉన్నంతలో మంచి పీఆర్సీ ఇచ్చారని ఉద్యోగులూ అంగీకరించారని చెప్పారు. చిన్న సవరణలు చేయడానికి ప్రభుత్వం ఒప్పుకుందనే భావనతో ఉద్యోగులు ముందుకు రావడం, ఉద్యోగులకు మంచి చేయాలని ప్రభుత్వం సంకల్పించడంతో ఇది సాధ్యమైందని చెప్పారు. ప్రభుత్వం, ఉద్యోగులు ఒకే టీమ్ లాంటిది కాబట్టి.. కష్టాలు ఉద్యోగులకూ తెలుసు కాబట్టి.. ఇది సాధ్యమైందన్నారు. ఇది ఎవరి విజయం కాదు..ఓటమి కాదు. మధ్యలో వచ్చినవి అన్నీ చిన్నపాటివే అని ప్రభుత్వం భావించిందని చెప్పారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఉద్యోగ సంఘాలకు రాష్ట్ర పరిస్థితులను వివరించారని సజ్జల చెప్పారు. ఎలాంటి ఢాంబికాలకు పోకుండా ఉన్న పరిస్థితులను వివరించి.. ఇంకా చేసి ఉండాల్సింది. కరోనా లాంటి పరిస్థితి లేకపోతే మంచి చేయాలనే ఆలోచనతోనే ఉన్నానని సీఎం చెప్పారన్నారు. రెండున్నరేళ్లుగా రూ. 62, 60 వేల కోట్ల వద్దనే రాష్ట్ర ఆదాయం ఆగిపోయిందని, జీతాలు 60 వేల కోట్ల రూపాయలు ఉన్నది రూ.70 వేల కోట్లు దాటిపోయిందన్నారు. రాష్ట్ర ఆదాయం కంటే ఉద్యోగుల జీతాలు, బిల్లుల చెల్లింపులు దాటిపోయిందని, ఇదీ వాస్తవమైన పరిస్థితి అని సీఎం వైయస్ జగన్ ఉద్యోగులకు వివరించారన్నారు. సంక్షేమ పథకాలు ఒక్క రూపాయి కూడా వృథా కాకుండా డీబీటీ ద్వారా లబ్ధిదారులకు అందించే సిస్టమ్ ఏర్పాటు చేశాం. దీన్ని అర్థం చేసుకోండి. నిజంగానే ఆదాయం రూ.85 వేల కోట్ల పరిస్థితి ఉంటే మీరు అడగాల్సిన పరిస్థితి ఉండేది కాదని, అడక్కముందే ఇచ్చేవాడినని సీఎం వివరించారన్నారు. ఐఆర్ రికవరీలు అన్నీ కరెక్ట్ చేసుకుంటూ వచ్చాం. హెచ్ఆర్ఏకు సంబంధించి స్లాబ్లు పెంచామని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.
ఉద్యోగుల్లో కొంతమంది రాజకీయ పార్టీలతో సంబంధం పెట్టుకున్న పరిస్థితులు, వామపక్షాలతో జతకట్టిన సంఘాలు ఆందోళన బాటపడతామని అనడం దురదృష్టకరమన్నారు. పీఆర్సీ సాధన కమిటీలో భాగస్వాములుగా ఉన్నవారు మంత్రుల కమిటీతో చర్చలకు హాజరై.. చీఫ్ సెక్రటరీ చదివేంత వరకు, చివరి నిముషం వరకు ఉండి, మీటింగ్కు హాజరయ్యామని సంతకాలు చేసి, మినిట్స్ చదివినప్పుడూ కూడా చర్చల్లో ఉండి.. సమ్మెను ఉద్యోగులు స్వచ్ఛందంగా విరమిస్తున్నారని చెప్పినప్పుడూ వినీ, మీడియాను పిలిచిన తరువాత మధ్యలో మాయమై.. బయటకు వెళ్లి మేము ఒప్పుకోమని మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. కొంతమంది అమ్ముడుబోయారని మాట్లాడుతున్నారని, కొనగలిగే వారు ఎవరూ.. కొనేవారు ఎవరు ఉన్నారు. ఆ అవసరం, ఆలోచన వైయస్ జగన్ ప్రభుత్వానికి ఉందా..? అని ఆలోచించుకోవాలన్నారు.
ఉపాధ్యాయులు చేస్తున్న ఆందోళనకు ముడిపెడుతూ ఎల్లోమీడియా (ఈనాడు, ఈటీవీ, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5) ఎక్కడెక్కడో జరిగినవి తీసుకువచ్చేసి చూపిస్తుందని, సమ్మె విరమించడం, ఉద్యోగులు సంతోషంగా ఉండటం కొందరికి నచ్చనట్టుగా అర్థం అవుతుందన్నారు. సమ్మె జరిగితే దాంట్లో నుంచి నాలుగు పేలాలు ఏరుకోవాలనే ఆలోచనతో కొందరు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుందన్నారు.
సమ్మెను విరమించుకున్న తరువాత నల్ల బ్యాడ్జీలు పెట్టుకుంటాం. 27 శాతం ఫిట్మెంట్, 12 శాతం మినిమం హెచ్ఆర్ఏ కావాలి.. దశలవారీగా ఆందోళన చేస్తామంటే.. దానికి ఏమైనా అర్థం ఉందా..? అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఎవరైనా ఆందోళన చేయొచ్చు కాదనడం లేదు కానీ, వామపక్ష పార్టీలతో అసోసియేట్ అయిన ఉద్యోగులు చర్చలకు హాజరై, సంతకాలు చేసిన తరువాత ఇలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. పీఆర్సీ సాధన సమితిలో ఉపాధ్యాయ సంఘాలు భాగమేనని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.