దేశ చరిత్రలో ఇది చరిత్రాత్మక మార్పు

నామినేటెడ్‌ పదవుల్లో 57 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే..

135లో 68 మంది మహిళలు, 67 మంది పురుషులు

మహిళ సాధికారతకు పెద్దపీట వేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దే

పార్టీని నడిపించిన నాయకులు, కార్యకర్తలకు పదవుల్లో సముచిత స్థానం

ఎన్నికలు వచ్చే నాటికి మరికొంత మందికి పార్టీలో కీలక బాధ్యతలు

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

విజయవాడ: దేశ చరిత్రలోనే చరిత్రాత్మక మార్పునకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి కార్పొరేషన్లు, వివిధ సంస్థలు, కోఆపరేటీవ్‌ బాడీస్‌ వీటన్నింటి చైర్మన్ల పదవులు 135 ఉంటే.. వీటిలో 77 పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైయస్‌ జగన్‌ కట్టబెడుతున్నారన్నారు. 57 శాతం వెనకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పదవులు ఇస్తున్నామన్నారు. 135లో 68 మంది మహిళలకు, 67 మంది పురుషులకు అవకాశం కల్పించారని, మహిళా పక్షపాత ప్రభుత్వం అని మాటల్లోనే కాకుండా.. చేతల్లో చూపుతూ పదవుల్లో 50.3 శాతం మహిళలకు పెద్దపీట వేశారన్నారు. ఇది చరిత్రాత్మక మార్పు అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ నామినేటెడ్‌ పోస్టుల ప్రకటనకు ముందు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘2019 మే 30న వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర చరిత్రలో 2019 మే 30 తరువాత అంతకు ముందు అన్నరకంగా ఉంది. తొలిరోజు నుంచి నేటి వ‌ర‌కు సామాజికంగా, ఆర్థికంగా, మహిళా సాధికారత, సంక్షేమం, అభివృద్ధి పరంగా పెనుమార్పులు  చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా పాలన సాగుతోంది. 

ప్రత్యేకంగా వెనకబడిన తరగతులు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీల జీవితాలు మెరుగుపడుతున్నాయి. దానికి తగినట్టే సాధికారత పెంచే దిశగా, ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్, మేనిఫెస్టో చెప్పిన దానికంటే మించి సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నిక చేసే, ఎంపిక చేసే పదవుల్లో ఎలా సామాజిక న్యాయం పాటిస్తున్నారనేది రెండేళ్లలో కనిపించింది. ఆఖరికి పరిపాలన వికేంద్రీకరణ దిశగా గ్రామ, వార్డు సచివాలయాలు నెలకొల్పి 1.30 లక్షల ఉద్యోగాల్లో దాదాపు 80 శాతం బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీల యువతకు ఇచ్చారు. చట్టపరంగా కూడా 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అగ్రికల్చర్‌ మార్కెట్‌ కమిటీలో కూడా 50 శాతం రిజర్వేషన్‌ పాటిస్తున్నాం. మండల ఎన్నికల్లో రిజర్వేషన్లు దాటి జెడ్పీటీసీ, ఎంపీపీ ఓపెన్‌ కేటగిరి ఉంటే ఒక్కటైనా వెనకబడిన వర్గాలకు ఇచ్చే ప్రయత్నం చేశాం. ఫలితాలు వచ్చాక అది కనిపిస్తుంది. అదే ధోరణి ఈ రోజు ప్రకటించే పదవుల్లో కనిపిస్తాయి. 

ఈ పదవులు అలంకారప్రాయం కాదు. సీఎం వైయస్‌ జగన్‌ తలపెట్టిన మహాయజ్ఞంలో ప్రభుత్వం, కేబినెట్, ప్రభుత్వ యంత్రాంగం ఎలా పాల్గొంటుందో.. పార్టీ కూడా అలాగే పనిచేస్తోంది. ఇప్పుడు ప్రకటించే పదవుల్లో ఉన్నవారి పాత్ర ప్రజల జీవితాల్లో మెరుగులుదిద్దడంలో కీలకంగా ఉంటుంది. వీలైనంత వరకు అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నం చేశాం. 

పార్టీ పెట్టినప్పటి నుంచి వైయస్‌ జగన్‌ చేస్తూ వచ్చిన పోరాటం. ఈ పోరాటంలో ప్రజల్లో మమేకం కావడంలో కీలక పాత్ర పోషించిన నాయకులు, కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. అభిమాన నాయకుడితో కలిపి నడిచి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకులు, కార్యకర్తలు వేరే పార్టీల్లో అరుదుగా కనిపిస్తుంటారు. పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తల్లో కొద్ది మందికి ఈరూపంలో బాధ్యత అప్పగిస్తుండగా.. మిగిలినవారికి వచ్చేరోజుల్లో పార్టీ పరంగా కీలక బాధ్యతలు అప్పగిస్తాం. ఎన్నికలు వచ్చే సమయానికి 15 ఏళ్లలో జరగాల్సిన ప్రజల జీవితాలు మెరుగుపర్చడం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం.. ఇవన్నీ తీసుకువచ్చే కార్యక్రమంలో మొత్తం పార్టీ పాల్గొంటుంది’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top