తీర్పు స్పష్టం.. మళ్లీ వైయస్‌ఆర్‌ సీపీకే పట్టం

తొలిదశ పోలింగ్‌లో 2,637 మంది వైయస్‌ఆర్‌ సీపీ మద్దతుదారుల విజయం

పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఎల్లోమీడియా వక్ర భాష్యం

ఒంటిమీదున్న గోచీ తీసి తలకు చుట్టుకున్నట్లుగా టీడీపీ నేతల తీరు

ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు రాతలు

ఊహించినట్లుగానే పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు

ప్రతిపక్షం కుట్రలు, ఎస్‌ఈసీ దౌర్జన్యం చేసినా ప్రజాతీర్పు సుస్పష్టం

విజేతల ఫొటోలను వెబ్‌సైట్‌లో పెట్టి వాస్తవాలను మీడియాకు చూపిస్తాం

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అందజేస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైయస్‌ఆర్‌ సీపీకి ప్రజలు మరోసారి పట్టం కట్టారని, ఊహించినట్లుగానే పంచాయతీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీకి మంచి ఫలితాలు వచ్చాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌లో 2,637 మంది వైయస్‌ఆర్‌ సీపీ మద్దతుదారులు విజయం సాధించారన్నారు. తీర్పు సుస్పష్టంగా ఉంటే.. పచ్చమీడియా మాత్రం వక్రభాష్యం చెప్తోందన్నారు. వెనకటికి ఒకాయన ఒంటి మీదున్న గోచీ తీసి తలకుచుట్టుకున్న చందంగా చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతల వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న వినూత్న సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందటం, వ్యవస్థల్లో మార్పులు, వైద్య పరంగా, విద్య, వ్యవసాయం పరంగా పూర్తిగా సంతృప్తకర పద్ధతిలో పారదర్శకతతో ప్రజలకు అందుతున్నాయి. కోవిడ్‌ను ధైర్యంగా ఎదుర్కొని సీఎం వైయస్‌ జగన్‌ ముందుచూపు చర్యలతో ప్రజల విలువైన ప్రాణాలు కాపాడుకోగలిగాం.  

ఆశించినట్లుగానే ఫలితాలు వచ్చాయి. ఇందులో ఆశ్చర్యం కూడా ఏమీ లేదు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఎల్లో మీడియా ఓటమిలో కూడా ఒకరకమైన ఆనందాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తోంది. ఇది కొంత వింతగా అందరికీ అనిపిస్తోంది. వెంటిలేటర్‌పై ఉన్న ప్రతిపక్ష కుట్రలు, తన పరిధి దాటి అడ్డగోలుగా వ్యవహరిస్తూ వచ్చిన ఎస్‌ఈసీ గురించి అంతా చూశారు. 

81 శాతానికి పైగా పంచాయతీల్లో సర్పంచ్‌లుగా వైయస్‌ఆర్‌ సీపీ మద్దతుదారులు గెలిచారు. మొత్తం 3248 పంచాయతీలకు గానూ ఏకగ్రీవాలు, పోలింగ్‌ జరిగిన పంచాయతీల్లో 2637 పంచాయతీలు వైయస్‌ఆర్‌ సీపీ గెలుచుకుంది. 508 టీడీపీ గెలుచుకుంది. ఇతరులు 98 గెలుపొందారు. ఇంకా రెండు మూడు పంచాయతీల ఫలితాలు రావాల్సి ఉంది. న్యూస్‌ ఛానల్స్‌లో చూస్తే ఇంకా లెక్కలు కొంచెం వేరుగా ఉన్నాయి. మా పార్టీ పరంగా వచ్చిన లెక్కల ప్రకారం 2637 గెలుచుకున్నాం. కొంచెం హెచ్చుతగ్గులు ఉండొచ్చేమో. సాయంత్రం వరకు అధికారిక ప్రకటన వస్తుంది. 

ఈనాడు పత్రిక.. రిజల్ట్‌ వస్తున్న తరుణంలో పోటెత్తిన ఓటర్లు అని బ్యానర్‌ వార్త ప్రచురించింది. బ్యానర్‌ వార్త కింద టీడీపీ నేత దేవినేని ఉమా స్టేట్‌మెంట్‌ పెట్టారు. ‘ప్రాణాలొడ్డి గెలిచాం.. వైకాపా పతనం ప్రారంభమైంది. విజయోత్సవాలు చేసుకున్న తెదేపా నాయకులు’ అని పెట్టి 1269 పంచాయతీలు వైయస్‌ఆర్‌ సీపీకి, 918 తెలుగుదేశం పార్టీకి కేటాయించి ఒక వార్త ప్రచురించారు. చాలా పెద్ద పేరు ఉన్న ఈనాడు పత్రిక కొంచెం కూడా సిగ్గులేకుండా.. ప్రజలను తప్పుదోవ పట్టించే వార్తలు ప్రచురిస్తారా..? ఈ వార్త వేయడానికి కూడా ఈనాడు కూడా సిగ్గుపడ్డారని భావిస్తున్నాను. పోటెత్తిన ఓటర్లు అని, ప్రాణాలొడ్డి గెలిచాం అని ప్రజలను ఇంత తప్పుదోవ పట్టించే అవసరం ఉందా..? మామూలుగా ఎవరైనా పేపర్‌ చదివితే.. సామాన్యుడు టీడీపీ గురించి గొప్పగా మాట్లాడుకోవాలని, ఫలితాలు బాగా వచ్చాయని ప్రజలు నమ్మేందుకు ప్రయత్నించింది. ఇదేమి ఆనందమో తెలియడం లేదు..

ఆంధ్రజ్యోతి మరీ దారుణంగా.. దీటుగా పోటీ అని బ్యానర్‌ వార్త ప్రచురించింది. ఎవరికి ఎన్ని అని 2692 ఒక లెక్క వేసి.. టీడీపీ చాలా సీట్లు కైవసం చేసుకుందని ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించారు. లోపలి పేజీలో 80 శాతం వైయస్‌ఆర్‌ సీపీ మద్దతుదారులు గెలిచారని చిన్న ముక్క ప్రచురించింది. గుంటూరులో పోటా పోటీ అని ప్రచురించారు.. ఆ లెక్క చూస్తే 140 వైయస్‌ఆర్‌సీపీ, 60 టీడీపీ అంటే పోటాపోటీనా..? 

38.74 శాతం పంచాయతీల్లో తెలుగుదేశం విజయం అని చంద్రబాబు ప్రకటించుకున్నాడు. 55 శాతం అని పెట్టుకుంటే ప్రజలు నమ్మరని బాబుకే అనుమానం వచ్చినట్లుంది. 2723 స్థానాల్లో వెయ్యికి పైగా పంచాయతీల్లో టీడీపీ, 32 మంది టీడీపీ కూటమి అభ్యర్థులు అని, 1055 పంచాయతీల్లో టీడీపీ జోరు అని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నాడు. రాష్ట్రం మొత్తం చంద్రబాబును ఛీ కొడితే.. తానేదో ఘనత సాధించినట్లుగా పూట గడపడం కోసం ప్రచారం చేసుకుంటున్నాడు. 

టెక్కలిలో 130 పంచాయతీలకు గానూ.. 112 పంచాయతీల్లో వైయస్‌ఆర్‌ సీపీ విజయం, టీడీపీ 23 స్థానాల్లో విజయం సాధించింది. మేధావి యనమల రామకృష్ణుడు ఉండే తుని ప్రాంతంలో 58 పంచాయతీలకు గానూ వైయస్‌ఆర్‌ సీపీ 54, తెలుగుదేశం 3, ఇండిపెండెంట్‌ 1, ప్రాణాలొడ్డి పోరాడానని చెప్పుకునే దేవినేని ఉమా నియోజకవర్గం మైలవరంలో 48 పంచాయతీలకు గానూ వైయస్‌ఆర్‌ సీపీ 44, తెలుగుదేశం పార్టీ 3, ఇండిపెండెంట్‌ 1 విజయం సాధించారు. ∙

చంద్రబాబు ప్రెస్‌మీట్, టీడీపీ నేతల స్టేట్‌మెంట్‌ చూసిన ఒక సామెత గుర్తుకు వస్తుంది. ‘వెనకటికి ఒకాయన బడాయికి పోయి.. ఒంటిమీదున్న గోచీ తీసి తలకు చుట్టుకున్నాడంట’. తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తుంది. మీసం మెలేసి.. గోచీ తీసి తలకుచుట్టుకుంటే ప్రజల ముందు ఎంత వికారంగా ఉంటుందో అలా ఉంది తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేసిందని ప్రజలకు తెలుసు.. రాష్ట్రానికి తెలుసు. ఈ రోజు సాయంత్రం వరకు మొత్తం ఫొటోలతో సహా.. సర్పంచ్‌లు బయటకు వచ్చి వారు వేసుకున్న కండువాలతో ఫొటోలతో సహా వెబ్‌సైట్‌లో పెట్టి మీడియా ముందు చూపిస్తాం. వాస్తవాలను ప్రజలకు చూపిస్తాం. ఇంకా రెండు, మూడు, నాలుగు ఫేజ్‌ల వారీగా ఎన్నికలు ఉన్నాయి. ఈ మూడు ఫేజ్‌లకు ఒక సందేశం ప్రజలకు వెళ్లాలి. వైయస్‌ఆర్‌ సీపీ చెప్పేవన్నీ వాస్తవాలని ప్రజలకు తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీవన్నీ నికార్సయిన అబద్ధాలని చెబుతాం. 

పార్టీ రహిత ఎన్నికల్లో 80 శాతానికి పైగా వైయస్‌ఆర్‌ సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా పనిచేసినా.. అధికారులపై బెదిరింపులకు దిగినా.. ప్రజా తీర్పు మాత్రం సుస్పష్టంగా తేలింది. అధికారులపై రిమార్కుల చూపడం, కోర్టులో వాదనలు, ఏకగ్రీవాలను రద్దు చేస్తానని ప్రకటించడం ఇంత కుట్రపూరితంగా ఎస్‌ఈసీ దౌర్జన్యం చేసినా.. గందరగోళం సృష్టించాలని చూసినా.. ప్రజలు మాత్రం వైయస్‌ఆర్‌ సీపీ మద్దతుదారులకు పట్టం కట్టారు.. ప్రజలు ముందే నిర్ణయించుకొని తీర్పు ఇచ్చారు. 

కోవిడ్‌ వ్యాప్తి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నేపథ్యంలో ఎన్నికలు కొద్ది రోజులు వద్దని చెబితే.. ప్రభుత్వం భయపడుతుందని చంద్రబాబు తొడలు కొట్టారు.. బాబు తొడలను నిమ్మగడ్డ కొట్టీ కొట్టీ చంద్రబాబు తొడలు వాపువచ్చినట్లున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం సిద్ధం అయితే.. తెలుగుదేశం పార్టీ భయపడిపోయింది’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top