నిమ్మ‌గ‌డ్డ‌ ఏకపక్ష నిర్ణయమే ఈ దుస్థితికి కారణం

సీఎస్‌ కుదరదంటుంటే.. రమేష్‌కుమార్‌కు తొందరెందుకు

గిల్లి ఘర్షణ పెట్టుకోవాలన్నట్లుగా నిమ్మగడ్డ వ్యవహారశైలి

ఒక రాజకీయ పార్టీగా ఎన్నికలకు మేము సిద్ధమే

ప్రభుత్వంగా ప్రజలందరి బాధ్యత మాపై ఉంది కాబట్టే ఇప్పుడు వద్దంటున్నాం

ఎన్నికలు ఎప్పుడు జరిగినా 90 శాతం సీట్లు మావే

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని మా పార్టీ భావిస్తుందని వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఒక రాజకీయ పార్టీని ఫ్యాక్షనిస్టు పార్టీ అన్న వ్యక్తి నిస్పక్షపాతంగా ఉంటాడని మా పార్టీ భావించడం లేదన్నారు. రాష్ట్రంలో ఒకట్రెండు కోవిడ్‌ కేసులు ఉన్నప్పుడు వాయిదా వేసిన స్థానిక సంస్థల ఎన్నికలు.. ఇవాళ రోజుకు వేలలో వస్తుంటే ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఒక రాజకీయ పార్టీగా ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము సిద్ధమేనని, ఒక ప్రభుత్వంగా ప్రజలందరి బాధ్యత తమపై ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు వద్దంటున్నామన్నారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎవరితో చర్చించకుండా ఆనాడు ఏకపక్షంగా ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయం ఈ దుస్థితికి కారణమైందన్నారు.  ఎంత ఏకపక్షం అంటే ముఖ్యమంత్రి, సీఎస్, వైద్య, ఆరోగ్య శాఖ వారు కూడా ఎన్నికల వాయిదాను టీవీల్లో చూసుకోవాల్సి వచ్చిందన్నారు. ఆ తరువాత జరిగిన పరిణామాలు ప్రజలంతా చూశారన్నారు. ఒక రాజ్యాంగ పదవిలో ఉండి అనకూడని మాటలు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని అన్నారని గుర్తుచేశారు. ఎన్నికల కమిషన్‌ కంటే పెద్ద రాజ్యాంగ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం అని, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. గతంలో హడావిడిగా వాయిదా నిర్ణయం తీసుకొని దాన్ని సమర్థించుకోవడానికి వివిధ చర్యలకు పాల్పడి.. కోర్టుకు వెళ్లాడన్నారు. ఆ అంశం కోర్టులో ఉండగా మళ్లీ నిన్న హడావిడిగా ప్రోసీడింగ్స్‌ రిలీజ్‌ చేశాడని తెలిపారు. 

తాను గిల్లి ఘర్షణ పెట్టుకోవాలన్నట్లుగా నిమ్మగడ్డ వ్యవహారశైలి ఉందని సజ్జల అన్నారు. పరిస్థితి కుదుటపడితే.. చంద్రబాబు ఎన్నికల కమిషనర్‌ అయినా ఎన్నికలకు తాము సిద్ధమన్నారు. ఎన్నికలు నిర్వహించలేమని సీఎస్‌ అంటుంటే.. ఎస్‌ఈసీ రమేష్‌కుమార్‌కు తొందరెందుకని ప్రశ్నించారు. కరోనా తీవ్రత తగ్గాకే ఎన్నికలు జరగాలని ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు. ఒక ప్రభుత్వంగా ప్రజలు, ఉద్యోగుల బాధ్యత మాపై ఉందన్నారు. ఒక రాజకీయ పార్టీగా ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైయస్‌ఆర్‌ సీపీ సిద్ధమని, 90 శాతానికి పైగా సీట్లు గెలుచుకుంటామన్నారు. కొన్ని పత్రికలు, మీడియా ఛానళ్లను అడ్డంపెట్టుకొని ప్రభుత్వంపై బురదజల్లగలరు కానీ, ప్రజాక్షేత్రంలో చంద్రబాబు చేయగలిగింది ఏమీ లేదని, జనాభిమానం వైయస్‌ఆర్‌కే అధికమన్నారు.  
 

తాజా వీడియోలు

Back to Top