రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం వైయ‌స్ జగన్ ఢిల్లీ పర్యటన 

 వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి  

 ఢిల్లీ పర్యటనల్లో చీకటి ఒప్పందాలు చేసుకోవడం చంద్రబాబుకే అలవాటు 

 బాబు హయాంలో బీజేపీ-టీడీపీ రాసుకుపూసుకున్నా రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు 

 సీఎం వైయ‌స్ జగన్ ఢిల్లీ పర్యటనకు, రాజకీయాలకు సంబంధం లేదు, అది పూర్తిగా అఫీషియల్ 

 చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి.. ప్యాకేజీ పేరుతో సంబరాలు చేసుకున్నారు 

  సీఎం వైయ‌స్ జగన్ ఢిల్లీ వెళితే.. టీడీపీకి ఎందుకు కడుపు మంట..? 

 వైయ‌స్ జగన్ మీద కాంగ్రెస్, టీడీపీ పెట్టిన కేసులు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవి 

  ప్రజాన్యాయస్థానంలో వైయ‌స్ జగన్ రాజకీయ ప్రస్థానం జైత్రయాత్రలా సాగుతోంది 

 టీడీపీ హయాంలో పోలవరం ఓ భ్రమ.. నేడు రియాల్టీ. 

 ఢిల్లీకి, కేసుల మాఫీకి అసలు సంబంధం ఏమిటి..? 

 చంద్రబాబుది అడ్డదారి.. సీఎం వైయ‌స్‌ జగన్ది రహదారి 

 టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా.. పరిపాలన వికేంద్రీకరణ జరగడం ఖాయం 

 సీఎం వైయ‌స్‌ జగన్ పై కుట్రలు చేసిన కాంగ్రెస్ గల్లంతు అయ్యింది.. టీడీపీ పుట్టి మునిగింది 

తాడేప‌ల్లి:  రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న సాగింద‌ని  వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్ప‌ష్టం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో అరగంట కూడా తీరిక లేకుండా ఐదుగురు కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ ను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించార‌ని తెలిపారు. చివరిగా జనవరి రెండో వారంలో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళార‌ని చెప్పారు. ఈ మధ్యకాలంలో కేంద్రం, రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలు, రాష్ట్రానికి అందాల్సిన సహాయం, వివిధ దశల్లో ఉన్న అనుమతులు, కోవిడ్ పరిస్థితులు, విభజన తర్వాత బాగా నష్టపోయిన రాష్ట్రానికి అదనంగా కేంద్రం చేయాల్సిన సాయం గురించి కేంద్ర పెద్దలతో చర్చించి, వాటికి సంబంధించిన విజ్ఞాపన పత్రాలను అందించార‌ని తెలిపారు. శుక్ర‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌పై మీడియాతో మాట్లాడారు. 

 ముఖ్యమంత్రి గారు అఫీషియల్ విజిట్ మీద  ఢిల్లీ వెళ్ళి, కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత ఆయన ఏం కోరారో, వాటిని మీడియాకు షేర్ చేశాం. ఒక ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఢిల్లీలో జగన్ గారు ఎవర్ని కలిశారో, ఏం మాట్లాడారో అన్నది అంతా అఫీషియల్. ఇందులో ఎటువంటి దాపరికం లేదు. 

 ముఖ్యమంత్రి జగన్ గారి ఢిల్లీ పర్యటనకు, రాజకీయాలకు సంబంధం లేదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలోని బీజేపీతో వారి అనుబంధం కొంత భిన్నంగానే ఉండేది. ఎందుకంటే కేంద్రంలో టీడీపీ ఎంపీలు మంత్రులుగా ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీ వారు మంత్రులుగా ఉన్నారు. అప్పట్లో వాళ్ళ అనుబంధం ఏ స్థాయిలో ఉన్నా, రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల విషయంలో ఫలితం మాత్రం ఆచరణలో తక్కువగా కనిపించేది. దాంతో చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినా, కేంద్రంలోని బీజేపీ పెద్దలను కలిసినా, ఆయన తన సొంత ప్రయోజనాల గురించి మాట్లాడుకుని వచ్చారేమో.. అనే అనుమానాలు వచ్చేవిధంగా వారి ప్రవర్తన ఉండేది. ఓటుకు నోటే అందుకు ఉదాహరణ. 

 చంద్రబాబు అధికారంలో ఉండగా, రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి, 2016లో కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ సాధించానని ఒకరినొకరు పొగుడుకుని అర్థరాత్రి సంబరాలు చేసుకున్నారు. దాంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో చంద్రబాబు పార్టనర్ గా ఉండి చీకటి ఒప్పందాలు చేసుకున్నారన్నది అర్థమైంది. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మూడేళ్ళపాటు సైలంట్ గా ఉండి, పోలవరం ప్రాజెక్టును అసలు పట్టించుకోలేదు. విభజన చట్టం ప్రకారం కేంద్రం చేయాల్సిన దాన్ని, రాష్ట్ర పరిధిలోకి తెప్పించుకుని, పోలవరం కాంట్రాక్టు దక్కించుకోవాలనే తన కోరిక నెరవేరిన తర్వాత ఏం జరిగిందో చూశాం. ప్రధాని మోడీగారే పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని అన్నారు. ఇవన్నీ చూశాక 2019 ఎన్నికల్లో టీడీపీని, చంద్రబాబును ప్రజలు ఛీ కొట్టి ఇంటికి పంపారు. 

 ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. కేంద్రంలోని బీజేపీకి మెజార్టీ ఉంది కాబట్టి, బహుశా వారికి ఎవరి మద్దతు అవసరం లేదు. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కోవిడ్ వల్ల ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతున్న పరిస్థితుల్లో.. ఒకవైపు సంక్షేమం మీద మేం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ, ఆర్థికంగా కుంగిపోయినా, పంటి బిగువన ఆర్థిక వ్యవస్థను లాక్కొస్తూ.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన చిన్న వనరులు ఉన్నా వాటిని ఎలా తీసుకురావాలి, మనకు రావాల్సిన నిధులను కేంద్రం నుంచి ఎలా రాబట్టుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వ పర్ఫార్మెన్స్ బాగుందని చూపించి, కేంద్రాన్ని ఇంప్రెస్ చేసి, ఎలా సాధించాలో ఆ విధంగా సాధిస్తున్నాం. 

 నాడు టీడీపీ.. కేంద్రంలో పార్టనర్ గా ఉన్నప్పటికీ రాష్ట్రానికి తీసుకురావాల్సినవి తీసుకురాకపోయినా.. ఈ ప్రభుత్వం తమ పర్ఫార్మెన్స్ ద్వారా సక్సెస్ ఫుల్ గా తీసుకువస్తున్నాం. దీన్ని అభినందించే సంస్కారం టీడీపీకి ఎటూ లేదు. కానీ, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళితే రెండు రోజులుగా అవాకులు, చవాకులు మాట్లాడుతూ, వారికి వత్తాసు పలికే మీడియాలో ఇష్టానుసారం చర్చలు పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. 

 ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళినా, చంద్రబాబు మాదిరిగా ఏదీ సాధించకపోయినా, అది సాధించాం, ఇది సాధించేశాం అని ఎక్కడా గొప్పలు చెప్పుకోవడంలేదు. ముఖ్యమంత్రిగారు ఢిల్లీ వెళితే.. అసలు టీడీపీ కడుపు మంట ఏమిటి..? టీడీపీ అనుకూల మీడియా ఎంతగా బరితెగించిందంటే.. అమిత్ షా ను కలిస్తే ఒక ఏడుపు.. కలవకపోతే మరో ఆనందం.. మీ ఆత్మ తృప్తి కోసం మీరు పడుతున్న తిప్పలు చూస్తుంటే.. మీ బాధ ఏంటో అర్థంకావడం లేదు. ముఖ్యమంత్రి గారు మరి కొద్దిసేపట్లో హోం మంత్రి అమిత్ షాను కలుస్తుంటే... అత్యంత విశ్వసనీయంగా తెలిసింది అపాయింట్ మెంటు లేదట.. అంటూ ఓ టీడీపీ అనుకూల టీవీ ఛానల్ లో అత్యంత నీచంగా దుష్ప్రచారం చేశారు. 

 ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కేంద్ర హోం మంత్రి అపాయింట్ మెంటు ఇవ్వడం అన్నది పెద్ద విషయమా..? కేంద్ర, రాష్ట్రాల సంబంధాలలో భాగంగా ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులను కలవటం, అపాయింట్ మెంటు కోరడం సహజాతి సహజం. ఇదే పెద్ద విషయంగా బూతద్దంలో చూపిస్తూ, టీడీపీ అనుకూల మీడియా పొందిన పైశాచిక ఆనందం చూస్తే జాలేస్తుంది. 
- రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి, సొంత ప్రయోజనాల కోసం టీడీపీ వాళ్ళు అర్రులు చాచడం వారికి అలవాటు కాబట్టి, గతంలో వారు అదే పని చేశారు కనుక, అందరూ అదే చేస్తారని అనుకుంటారేమో.

 ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు ఒక వార్డు మెంబరు స్థాయి నాయకుడిలా.. రూ. 43 వేల కోట్లు కట్టు సరిపోతుంది. కేసులు కొట్టి వేయించుకోవడానికి వెళ్ళారు... అంటూ దిగజారి నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నారు.  ఢిల్లీ వెళితే కేసులు కొట్టేసేటట్లే అయితే.. ఇప్పటివరకు ఎందుకు కొట్టివేయలేదు...? జగన్ మోహన్ రెడ్డిగారి మీద పెట్టినవి తప్పుడు కేసులని, అవి రాజకీయ ప్రేరేపిత కేసులని, గతంలో కాంగ్రెస్, టీడీపీ కలిసి పెట్టిన కేసులని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ కేసులకు సంబంధించి   సీబీఐ సాకుగా చూపించిన మొత్తం చూసినా రూ. 1300 కోట్లు. అదీ చట్టపరంగా, రాజమార్గంగా వచ్చిన పెట్టుబడి. ఈ విషయం లీగల్ గా తేలుతుంది. ఇదే విషయమై టీడీపీ లక్ష కోట్లు అని పదే పదే ప్రచారం చేసినా.. వందలసార్లు జనం ఈ ఆరోపణలను తిప్పికొట్టారు. తన తండ్రి ఆకస్మిక మరణం తర్వాత మొదలు పెట్టిన జగన్ మోహన్ రెడ్డిగారి రాజకీయ ప్రస్థానం ప్రజాన్యాయస్థానంలో ఒక జైత్ర యాత్రగా సాగుతోంది. గత పదేళ్ళుగా జగన్ మోహన్ రెడ్డిగారు నిరంతరం ప్రజలలో ఉంటూ ప్రజలతో మమేకమవడం ద్వారా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ను గల్లంతు చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ పుట్టి ముంచారు. టీడీపీని ఆరు అడుగుల లోతులో పాతేసి, భూస్థాపింతం చేశారు. 
 2014 ఎన్నికల తర్వాత నుంచి, స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు.. ఇటీవల జరిగిన తిరుపతి ఉప ఎన్నిక వరకు అన్ని ఎన్నికల్లో ప్రజలు వైయస్ఆర్సీపీకే పట్టం కట్టారు. 

 రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరి దేనికీ జగన్ గారు ప్రాధాన్యత ఇవ్వరు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా నిరంతర యజ్ఞంలా జగన్ మోహన్ రెడ్డిగారు పనిచేస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర సమస్యలను, రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టడానికి ఢిల్లీకి వెళ్ళారు. అయినా, జగన్ మోహన్ రెడ్డిగారు ఎక్కడా బీరాలు పలకడం, డాంబికాలు ప్రదర్శించడం చేయరు. ఏమిలేని ఆకు ఎగిరెగిరి పడుతుందనేలా.. టీడీపీలా ఉన్నవీ, లేనివీ చెప్పి ప్రజలను మోసం చేసే అలవాటు మాకు లేదు. 

 ఢిల్లీలో ఏం చేశారు అని  టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు, నిధులు గురించి మాట్లాడారు. 2014 నుంచి 2017 వరకు పోలవరం ప్రాజెక్టును పట్టించుకోకుండా, చంద్రబాబు ఎక్కడ గాడిదలు కాశారు..? పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలో జరిగిన పనులు ఒక లెక్క. ఇప్పుడు జరుగుతున్న పనులు మరో లెక్క. టెక్నికల్ గా టఫ్ వర్క్ ఇప్పుడు నడుస్తుంది. టైం బౌండ్ గా నడుస్తుంది. కోవిడ్ లో కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి జగన్ మోహన్ రెడ్డిగారు ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేస్తారు. ఆరోజు టీడీపీ హయాంలో ఏం జరిగిందో, మా హయాంలో ఏం జరిగిందో కచ్చితంగా మేం చెబుతాం. టీడీపీ హయాంలో క్యాబినెట్ మీటింగ్ లన్నీ పోలవరం కాంట్రాక్టులు, బదలాయింపులు.. వీటిమీదే జరిగాయి. 
 పోలవరం అన్నది ఆరోజు భ్రమ.. ఈరోజు రియాల్టీ. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా నుంచి ఉపాధి హామీ నిధులు, మహాయజ్ఞంలా జరుగుతున్న31 లక్షల పక్కా ఇళ్ళ నిర్మాణానికి మౌలిక సదుపాయాలకు అవసరమైన నిధులు కోరాం. అలానే పెండింగ్ బకాయిల గురించి అడిగాం. ప్రత్యేక హోదాను టీడీపీ హయాంలో తాకట్టు పెడితే... కేంద్రం మీద మేం ఒత్తిడి తెస్తూనే ఉన్నాం. ప్రత్యేక హోదా డిమాండ్ ను సజీవంగా ఉంచుతున్నాం. 

 న్యాయస్థానాలను అడ్డు పెట్టుకుని టీడీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా, ఏం చేసినా పరిపాలన వికేంద్రీకరణ జరగటం అన్నది ఖాయం. పరిపాలన రాజధాని విశాఖకు, న్యాయ రాజధాని కర్నూలుకు, అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది. అది రియాల్టీ. ఈ నిర్ణయం పట్టుదలకు, పంతానికి పోయి జగన్ మోహన్ రెడ్డిగారు చేసింది కాదు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా, దూరదృష్టితో తీసుకున్న నిర్ణయం. కచ్చితంగా పరిపాలన రాజధాని విశాఖకు వెళుతుంది. వికేంద్రీకరణకు అవసరమైన అనుమతులు కూడా కేంద్రాన్ని కోరాం. 
 అలానే మెడికల్ కాలేజీల గురించి అడిగాం. కేంద్రం 3 కాలేజీలు ఇచ్చారు. మిగతా కాలేజీలకు కూడా సహాయం చేయమని అడిగాం. 

 ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్రాన్ని మేం కోరిన డిమాండ్లకు సంబంధించి రిజల్ట్ కనిపిస్తుంది, తొందరెందుకు.? వినతిపత్రం ఇచ్చి అడిగిన వెంటనే, అప్పటికప్పుడు తీసుకుని వెళ్ళండి అనే పరిస్థితి ఎప్పుడైనా ఉంటుందా..?  14 ఏళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబుకు ఆ విషయం తెలియదా..? పదే పదే చంద్రబాబు, టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేయడం చూస్తుంటే.. జూమ్ యాప్ దొరికిన తర్వాత, తిన్నది అరగక తిట్టడం.. వారి తిట్లకు ప్రాధాన్యత కల్పిస్తూ వారి అనుకూల మీడియాలో లైవ్ కవరేజ్ లు ఇస్తున్నారనిపిస్తుంది. 

 సీఎం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వాన్ని చూస్తుంటే.. టీడీపీ వాళ్ళకు కడుపు మంట కంటే..  భయం వీళ్ళను వెంటాడుతుంది అనిపిస్తోంది. ఎందుకంటే టీడీపీ పుట్టి మునిగిందన్న భయంతో, ఆ నిస్పృహలో, సంయమనం కోల్పోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. రోజూ పిల్లి శాపాలు పెడుతూనే ఉంటారు. టీడీపీలో పెరిగిన టెంపరేచర్ చూస్తుంటే... ఇక వారికి భవిష్యత్తు లేదనేది వారి మాటల్లోనే అర్థమవుతుంది. 

 నాడు, బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి రాష్ట్రం గొంతు కోసే విధంగా విభజన నిర్ణయం జరిగిందో.. దానివల్లే ఈ పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఏరోజుకైనా ప్రత్యేక హోదా, తద్వారా వచ్చే ప్రయోజనాలు లేకుండా రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందలేదు అన్నది నిజం. ప్రత్యేక హోదా అన్నది రాజకీయపరమైన నిర్ణయం. కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయం. ఇది కచ్చితంగా జరుగుతుంది. రాష్ట్రం యొక్క బలం మీద కేంద్రం ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించవచ్చు. అప్పటివరకు దీన్ని సజీవంగా ఉంచాలి. ప్రజల్లో కూడా ఉండాలి, మేం బాధ్యత నుంచి తప్పించుకోం, ప్రతిసారి అడుగుతూనే ఉన్నాం. అలాఅని బీరాలు పలకాల్సిన పనిలేదు. చేయాల్సని పని చేసుకుంటూ నిబ్బరంగా జగన్ గారు ముందుకు వెళుతున్నారు.

  కేసులకు, ఢిల్లీకి ఏం సంబంధం...?  ఢిల్లీ వెళితే ఏరకంగా కేసులు మాఫీ అవుతాయి..? ఇదే పద్ధతిన గతంలో కాంగ్రెస్, టీడీపీ కలిసి జగన్ గారిపై కేసులు పెట్టించారు గనుక, ఆ విధంగానే మాఫీ జరుగుతుందని అనుకుంటున్నారా... ? వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు, ఆయనది అడ్డదారి. మేనేజ్ మెంటులో మేం చాలా పూర్. వ్యవస్థలను మేం మేనేజే చేసినట్లయితే.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ చరిత్ర ఇలా ఉండేది కాదు. జగన్ మోహన్ రెడ్డిగారికి కష్టాల బాట ఉండేది కాదు. ఆరోజే సోనియాను ధిక్కరించి బయటకు వచ్చారు. దేనికోసమో.. ఎవరి పంచనైనా జగన్ గారు నిలబడాతారన్నది అసంబద్ధం.

 చంద్రబాబు క్యారెక్టర్.. జగన్ మోహన్ రెడ్డిగారి క్యారెక్టర్ చూస్తే.. ఈ విషయం బోధపడుతుంది. స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారే పనులు చంద్రబాబు చేస్తారు. కష్టాల బాట అయినా, సుదీర్ఘ బాట అయినా, ప్రజల్లో ఉండటమే జగన్ గారికి తెలుసు. చంద్రబాబు ఎటూ జూమ్ కు అలవాటు పడ్డారు. ఆయన కొడుకు కూడా జూమ్ కు అలవాటు పడి శరీరాన్ని తగ్గించుకుంటున్నారు. దానికంటే.. జనంలో తిరిగి శరీరం తగ్గించుకుంటే బాగుండేది. అందుకే టీడీపీ జూమ్ పార్టీగా మారింది. జగన్ మోహన్ రెడ్డిగారు ఎవరి దగ్గరకో వెళ్ళి ప్రాధేయపడతారని టీడీపీ కొన్ని వందల సార్లు చెప్పినా.. జనం నమ్మరు. ఎందుకంటే అదీ జగన్ మోహన్ రెడ్డిగారి వ్యక్తిత్వం. 

 ఆస్తులకు సంబంధించి అసెంబ్లీలోనే జగన్ గారు ఛాలెంజ్ చేశారు. సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ కూడా టీవీ ఛానళ్ళలో వాస్తవంగా ఆరోపణలు ఉన్న మొత్తం ఎంతో చెప్పారు. యనమల, ఇతర టీడీపీ నేతలు మాట్లాడుతున్నట్టు.. అసలు ఎక్కడుంది రూ. 43 వేల కోట్లు అని మీడియా కూడా ప్రశ్నించాలి. 

 వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచి, నిత్యం ప్రభుత్వంపైన విషం చిమ్ముతున్న రఘురామకృష్ణరాజు బిహేవియర్ భిన్నంగా ఉంది కాబట్టే ఆయన్ను డిస్ క్వాలిఫై చేయమని లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశాం. ఆయన మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయో అందరం చూస్తున్నాం. ఒక ఎంపీ గురించి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ లో కూర్చుని మాట్లాడే పరిస్థితి రాదు, రాబోదు.  అలాంటి తప్పుడు కథనాలు ప్రచారం చేసుకుని టీడీపీ, వారి అనుకూల మీడియా శునకానందం పొందుతుంది.  రఘురామకృష్ణరాజును డిస్ క్వాలిఫై చేయకపోతే అది కచ్చితంగా వారి తప్పు అవుతుంది. దాన్ని ఎక్కడ ప్రశ్నించాలో అక్కడే ప్రశ్నిస్తామ‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top