కాలం చెల్లిన వృద్ధ మాంత్రికుడు చంద్ర‌బాబు 

వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి 

సంక్షోభ సమయంలోనూ రాజకీయాలు

అందరినీ రెచ్చగొడుతున్నారు.. ఉద్యోగులనూ వదలడం లేదు
 
విష ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా

తాడేప‌ల్లి:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు కుంగిపోయిన, కాలం చెల్లిన వృద్ధ మాంత్రికుడిలా ఉన్నాడ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి విమ‌ర్శించారు.  తన ప్రపంచంలో తాను మాట్లాడుతున్నాడు. అందుకే విష ప్రచారాలు కొనసాగుతున్నాయ‌ని మండిప‌డ్డారు.  రాష్ట్రానికి చీడ‌లా మారార‌ని ఆయ‌న‌ విమ‌ర్శించారు. సంక్షోభ స‌మ‌యంలోనూ రాజ‌కీయాలు చేయ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. ఆన్‌లైన్‌ వ్యవస్థ ఏర్పాటు చేశానని చంద్రబాబు చెబుతున్నాడు..అసలు ఆన్‌లైన్‌లో ఏం జరుగుతాయి?. వ్యవసాయం ఆన్‌లైన్‌లో చేయొచ్చా?. పంటలు ఆన్‌లైన్‌లో పండించవచ్చా? ఇంట్లో వంటను ఆన్‌లైన్‌లో చేసుకుని తినగలమా? అని మండిప‌డ్డారు. ఇప్పటికైనా విమర్శలు వీడాల‌ని, రాష్ట్రానికి వచ్చి ప్రజలను కలవాల‌ని సూచించారు. శ‌నివారం సాయంత్రం స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.  

మిగ‌తా సీఎంల‌కు వైయ‌స్ జ‌గ‌న్ ఆద‌ర్శంగా నిలిచారు
23 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన పార్టీ. ప్రజల సమస్యలు, వారి ఆకాంక్షలు తెలిసిన వ్యక్తి సీఎం శ్రీ వైయస్‌ జగన్‌. ఆయన బాధ్యతలు చేపట్టి ఈనెలాఖరుకు రెండేళ్లు పూర్తవుతుంది. ప్రజల కోసం ఎంత ఖర్చుకు అయినా ఆయన వెనుకాడడు. నిబ్బరంగా అడుగులు ముందుకు వేస్తారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే, అంటే గత ఏడాది మార్చిలో కోవిడ్‌ సమస్య వచ్చినా, ప్రభుత్వాదాయం పడిపోయినా, పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. దేశంలోనే మిగతా సీఎంలకు ఆదర్శప్రాయంగా నిల్చారు. నిబ్బరంతో అడుగులు ముందుకు వేశారు. తక్కువ నష్టంతో పరిస్థితి నుంచి బయటపడ్డారు’.

ప్రజలూ గుర్తించారు:
పూర్తి మెజారిటీతో ఎన్నుకున్న ప్రజల తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా అండగా నిల్చారు. తమకు పూర్తి భరోసా ఇస్తారని ప్రజలు నమ్మడం వల్లనే తక్కువ నష్టంతో గండం నుంచి బయటపడ్డాం. అందుకే అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు మా పార్టీని గెలిపించారు. రేపు తిరుపతిలో కూడా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలవబోతుంది. సీఎం ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్టుగా ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారు. తమ బాగోగుల కోసమే సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ పని చేస్తున్నారని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు’.

లాక్‌డౌన్‌ లేకుండా:
    ‘కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చింది. దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. చాలా మంది చెబుతున్నారు లాక్‌డౌన్‌ విధించాలని కోరుతున్నారు. మనలో కొందరికి ఈ అభిప్రాయం సరైనదే అనిపిస్తుంది. ఉపద్రవం వచ్చినప్పుడు తట్టుకోవడం కోసం పక్కకు తప్పుకోవడం లేదా వైద్య పరంగా ఎదుర్కోవడం చేయాలి. అన్నీ ఆలోచించే సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ మాట్లాడుతున్నారు. కొన్నాళ్లు కరోనాతో కలిసి సాగక తప్పదని ఆయన అంటున్నారు. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బ తింటుందని, రోజువారీ కష్టం మీద ఆధారపడిన కూలీలు, వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్‌లోకి రాకపోవడం, వెయ్యి రూపాయలు పెట్టినా తినడానికి బియ్యం దొరక్కపోవడం, విద్యుత్‌ ఉత్పత్తి.. వంటివన్నీ ప్రభావం చూపితే పరిస్థితి దారుణంగా ఉంటుంది’.
    ‘అందుకే కోవిడ్‌ను ప్రస్తుతం ఎదుర్కోవడానికి వాక్సిన్‌ ఒక్కటే మార్గం. అందుకే ప్రభుత్వం అవసరం మేరకు సేకరించే ప్రయత్నం చేస్తోంది. అయితే అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. అయినా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది’.
    ‘రోజువారీ కార్యకలాపాలు ఆగిపోతే ఏం జరుగుతుందన్నది, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయన్నది ఇప్పటికే అర్ధం అవుతుంది. అందుకే వీలైనంత వరకు భద్రతా చర్యలు పాటిస్తూ, ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించేలా ప్రభుత్వం పని చేస్తోంది. అందులో భాగంగానే పిల్లల పరీక్షలు. అన్ని జాగ్రత్తలతో పరీక్షల నిర్వహణ’.

ఎల్లో మీడియా విషపు రాతలు:
    ‘ఇక్కడ ఇవన్నీ ఇలా ఉంటే హైదరాబాద్‌లో కూర్చున్న చంద్రబాబు జూమ్‌ కాన్ఫరెన్స్‌లో రోజుకో మెసేజ్‌ ఇస్తున్నాడు. రాష్ట్రానికి ఒక చీడ మాదిరిగా మారాడు. వాటిని తీసుకుని రసగుళికలుగా తయారు చేస్తున్న ఒక సెక్షన్‌ ఆఫ్‌ మీడియా జనం మీదకు తోస్తుంటే అసహ్యం వేస్తోంది. నిజానికి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, సంక్షోభాలు తలెత్తినప్పుడు రాజకీయాలు పక్కకు పోతాయి. ఎవరి చేతనైన సహాయం చేయడానికి సామాజిక సంస్థలు ముందుకు వస్తాయి’.
    ‘సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఏనాడూ.. నాడు టీడీపీ విఫలమైందని చెప్పలేదు. ఎవ్వరినీ విమర్శించడం లేదు. కానీ చంద్రబాబు మాత్రం పొద్దున లేచింది మొదలు అందరినీ రెచ్చగొట్టడుతున్నారు. ఇక ఎల్లో మీడియా దాన్ని ప్రజల మీద రుద్దడం. ఒక్క రోజు కూడా ఖాళీగా లేకుండా ప్రభుత్వం మీద బురద చల్లడం, బండలు వేయడం. అందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఎవరూ పని చేయొద్దని చెప్పడం. దానికి ఎల్లో మీడియా విషపు రాతలు’.

భుజం తట్టాలి:
    ‘అసలు ఉద్యోగులు, అధికారులు లేకుండా పనులు జరుగుతాయా? కాబట్టి వారిని మోటివేట్‌ చేయలి. భయం లేకుండా వారు పని చేసేలా ప్రోత్సహించాలి. రాష్ట్రమంతా సంభవించిన ఈ ఉపద్రవంలో ధైర్యంగా పని చేశారని భుజం తట్టి అభినందించాలి. ఇంకా బాగా పని చేయాలని ప్రోత్సహించాలి. అలా అందరూ కలిసి పని చేస్తే, మొత్తం ప్రభుత్వానికి, తద్వారా రాష్ట్రానికి పేరు వస్తుంది’.

రాష్ట్రానికి రావొచ్చు:
    ‘ఇక్కడికి రావడానికి కూడా భయపడి హైదరాబాద్‌లో కూర్చుని మాట్లాడుతున్నారు.  ఇక్కడికి రావొచ్చు. ప్రజలకు అండగా ఉన్నానని చెప్పి, భరోసా ఇస్తే బాగుంటుంది. లేదా ఆయన అక్కడే ఉండి తన కొడుకును అయినా ప్రజల వద్దకు పంపించవచ్చు’.

ఆన్‌లైన్‌లో అన్నీ జరుగుతాయా?
    ‘తాను ఒక ఆన్‌లైన్‌ వ్యవస్థ ఏర్పాటు చేశానని చంద్రబాబు చెబుతున్నాడు. అసలు ఆన్‌లైన్‌లో ఏం జరుగుతాయి. వ్యవసాయం ఆన్‌లైన్‌లో చేయొచ్చా?. పండించిన పంటలను రవాణా చేయొచ్చా? మార్కెట్‌లోని సరుకులు ఆన్‌లైన్‌లో వస్తాయా? ఇంట్లో వంట కూడా ఆన్‌లైన్‌లో చేయొచ్చా?. అందుకే చంద్రబాబు మాటలను ఖండిస్తున్నాం. రాష్ట్రానికి చంద్రబాబు ఒక విలన్‌ మాదిరిగా తయారయ్యాడు’.

చిత్తశుద్ధితో..:
    ‘కోవిడ్‌ నియంత్రణ, నివారణ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. ఆస్పత్రులు, బెడ్లు పెంచుతున్నాం. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్‌.. ఇవీ గతంలో చెప్పాము. అయితే ఇప్పుడు ట్రేసింగ్‌ అవసరం లేకుండా పోయింది. పరీక్షల కోసం ప్రజలే ముందుకు వస్తున్నారు. దీంతో ఆస్పత్రులపై భారం పడుతోంది. కోవిడ్‌ పాజిటివ్‌ కాగానే ఆస్పత్రులలో చేరడానికి వస్తున్నారు. ఆ ఒత్తిడి ఆస్పత్రులు, వైద్యులు, సిబ్బందిపై తీవ్రంగా పడుతోంది’.

వ్యక్తిగత జాగ్రత్తలు:
    ‘ఈ మొత్తం వ్యవహారం గమనిస్తే, ఒక వ్యక్తి సరిగ్గా జాగ్రత్తలు తీసుకుంటే కనీసం 70 శాతం వరకు నివారించవచ్చు. ఇది సైంటిస్టులు, వైద్యులు చెబుతున్న మాట. కాబట్టి, ముందు జాగ్రత్త పడకుండా కోవిడ్‌ వచ్చాక పరుగెత్తుతున్నారు. ఏం కాదులే అనుకోకుండా, జాగ్రత్త పడాలి. కాబట్టి ఎవరికి వారు నియంత్రించుకోవాలి. మాస్కులు ధరించడం, గుంపులుగా చేరొద్దు, కోవిడ్‌ నిబంధనలు పాటించాలి’. 

అందరి ప్రమేయంతో..:
    ‘ఇవాళ సీఎం గారు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో మాట్లాడారు. ఎక్కడికక్కడ వారు తగిన చొరవ చూపుతారు. అలా అందరూ ముందుకు వస్తున్నారు. ఆ విధంగా ఒక ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు కావాలన్నది ఆలోచన. అంబులెన్సులు ఏర్పాటు చేయడం, ఆక్సీజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉంచడం, ప్రజలకు సేవ అందించడం, రోగులను ఆస్పత్రులకు తరలించడం. ఇలా ఎవరికి వారు వీలైనంత వరకు కార్యకలాపాలలో నిమగ్నం కావడం. ప్రజలు దీన్ని బాగా అర్ధం చేసుకుంటున్నారు. ఒక వర్గం తప్ప. ఎందుకంటే వారి ఉద్దేశాలు పూర్తిగా వేరు’.

మే డే జరపలేదు. ఎందుకంటే?:
    ‘ఇవాళ మే డే. కార్మికుల దినోత్సవం. అయినా అందరూ ఒక చోట  సమూహంగా ఏర్పడవద్దన్న ఆలోచనతో ఇక్కడ పార్టీ ఆఫీసులో ఆ కార్యక్రమం నిర్వహించలేదు’.

దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు:
    ‘1999–2004 మ«ధ్య దేశమంతా 104 సంస్థలను ప్రైవేటీకరిస్తే, చంద్రబాబు ఇక్కడ ఏకంగా 54 సంస్థలను అమ్మివేశారు. ఆల్విన్, రిపబ్లిక్‌ ఫోర్జ్, స్పిన్నింగ్‌ మిల్లులు, చక్కెర ఫ్యాక్టరీలు, సహకార డైయిరీలు మూతబడేలా చేశాడు. అలాంటి ఆయన ఇవాళ కార్మికుల గురించి మాట్లాడుతున్నాడు. అవకాశం ఉంటే ఆయన ఆర్టీసీని కూడా అమ్మేసేవాడు. ఇవాళ చంద్రబాబు వాటన్నింటినీ మర్చిపోయి, కార్మికుల గురించి మాట్లాడితే ఒక జోక్‌లా ఉంద‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు’.

Back to Top