ఓట్ల దొంగలొస్తున్నారు..జాగ్రత్త

ఆధునిక టెక్నాలజీ ఉపయోగించుకుని టీడీపీ అక్రమాలు

వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుల ఓట్లే లక్ష్యంగా తొలగింపు

ఓట్ల జాబితా అక్రమాలపై సీఈసీకి వివరించాం

ట్యాబ్‌లతో వచ్చేవాళ్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

టీడీపీ చర్యలతో ఓటు అనేదానికి విలువ లేకుండా పోయింది

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

హైదరాబాద్‌:  ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని టీడీపీ అక్రమాలకు పాల్పడుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ట్యాబ్‌ల పేరుతో వచ్చే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. టీడీపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉన్న ఓట్లు ఉంచి..మిగతావాళ్లవి డిలీట్‌ చేస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నకిలీ ఓట్లు, డబుల్‌ ఎంట్రీలపై ఇటీవల ఢిల్లీ  వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైయస్‌ జగన్‌ నేతృత్వంలో ఫిర్యాదు చేశామన్నారు. అలాగే రాష్ట్ర గవర్నర్‌ను కలిసి బోగస్‌ ఓట్లపై ఫిర్యాదు చేశామన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా చంద్రబాబు అడ్డదారులు తొక్కడమే కాకుండా ఓటర్లనే గల్లంతు చేసి గెలవాలని చూస్తున్నారన్నారు.

వైయస్‌ఆర్‌సీపీకి చెందిన ఓట్లను తొలగించడమే లక్ష్యంగా టీడీపీ గత కొన్ని రోజులుగా పని చేస్తుందన్నారు. 59 లక్షల ఓట్లు తొలగించారని తెలిపారు. ఒకే వార్డులో కొందరికి రెండు ఓట్లు ఉండటం, పేర్లు మార్చి వేరే విధిలో నమోదు చేశారన్నారు. ఒకే బూత్‌లో రెండుచోట్ల ఓట్లు చేర్పించారని చెప్పారు. ఇవన్నీ కూడా సీఈసీకి వివరించామన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తున్నారని చెప్పారు. దొంగ ఓట్లు తొలగిస్తే..మళ్లీ చేర్చుతున్నారని  తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించి టీడీపీ నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. సెల్‌ఫోన్లకు ఫోన్‌ చేసి చంద్రబాబు పాలన ఎలా ఉందని అభిప్రాయాలు తెలుసుకొని ..వ్యతిరేకంగా చెప్పిన వారి ఓట్లు తొలగిస్తున్నారని చెప్పారు. ఓటు అన్నదానికి విలువ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అడ్డదారుల్లో ఓట్లు తప్పిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు, విజయనగరం, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు వెలుగు చూశాయని చెప్పారు. ట్యాబ్‌లో డేటా ఎక్కించుకొని ఓటర్ల వివరాలు సేకరించి వ్యతిరేకంగా చెప్పిన వారివి తొలగిస్తున్నారని తెలిపారు. ఓ వ్యక్తి ఏ పార్టీకి ఓటు వేస్తున్నారని అభిప్రాయం తెలుసుకొని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోగస్‌ ఓట్లు, తొలగింపుపై సీఈసీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసిందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండు చేశారు. 

 

Back to Top