రేపు ట్రంప్‌తో పోటీ అంటారేమో?

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

హరికృష్ణ మృతదేహం వద్ద చంద్రబాబు పొత్తు ప్రయత్నం చేశారు

వైయస్‌ జగన్‌–కేటీఆర్‌ భేటీపై టీడీపీ నేతలు యాగీ చేస్తున్నారు

రాష్ట్రాల ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి

ప్రత్యేక హోదాకు కేసీఆర్‌ మద్దతు తెలపటం హర్షణీయం

చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారు

పింఛన్‌ రూ.2 వేలకు పెంచుతామని వైయస్‌ జగన్‌ 15 నెలల కిందే చెప్పారు

చంద్రబాబుకు ఎన్నికల ముందే ప్రజలు గుర్తుకొస్తారు

పార్టీలను కొనే స్థాయిలో చంద్రబాబు

హైదరాబాద్‌: చంద్రబాబు వ్యవహార శైలిని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తూర్పారబట్టారు. గతంలో రాష్ట్ర స్థాయిలో ఉన్న చంద్రబాబు..ఇటీవల జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని, రేపు పొద్దున అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పోటీ అంటారేమో అని ఎద్దేవా చేశారు.  చంద్రబాబు ఇన్నాళ్లు ఓటర్లను కొన్నారని, ఇప్పుడు పార్టీలను కొసే స్థాయికి వచ్చారని ఎద్దేవా చేశారు.కల్‌కత్తాకు చంద్రబాబును పిలిచింది ఎవరో అర్థం కావడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఏపీకి మోసం చేశాయని విమర్శించారు. ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదని వైయస్‌ జగన్‌ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వైయస్‌ జగన్‌ ఏ రోజు కూడా తాను జాతీయస్థాయిలో ప్రత్యామ్నయం నిర్మిస్తామని చెప్పలేదన్నారు. ఏపీకి కోసమే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు అయ్యిందని వెల్లడించారు. శనివారం సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 

ఎన్టీ రామారావు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నాడు టీడీపీని ఏర్పాటు చేశారని సజ్జల తెలిపారు. ఢిల్లీ అణచివేత దోరణికి వ్యతిరేకంగా పార్టీని స్థాపించి, అనతికాలంలో అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. ఆయన వర్ధంతి నిన్న నిర్వహించారన్నారు. ఎన్టీఆర్‌ మరణానికి చంద్రబాబే కారణమని చరిత్ర చెబుతుందన్నారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, ఆయన పదవిని లాక్కున్న చంద్రబాబు నిన్న ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నిలబడి తెలుగు జాతిని అడ్డుకోలేరని ప్రకటనలు ఇవ్వడం, దాన్ని  ఈనాడు పత్రికలో వార్త రాయడం ఎన్‌టీఆర్‌ అభిమానులను దిగ్భాంతికి గురి చేస్తోందన్నారు. ఎన్టీఆర్‌ విగ్రహం ముందు చంద్రబాబు వినమ్రంగా నిలబడి ఫోజులు ఇవ్వడం బాధాకరమన్నారు.

గత మూడు నాలుగు నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణమాలు, ఆ  తరువాత జాతీయ ప్రత్యామ్నయ నిర్మాణాలు అంటూ చంద్రబాబు, కేసీఆర్‌ ముందుకు వచ్చారన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు వైఖరీలు తీసుకున్నారన్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పాటు కేంద్రంలో భాగస్వామిగా ఉండి రాష్ట్రానికి రావాల్సిన చిన్న కోరికను కూడా సాఫల్యం చేయలేకపోయారన్నారు. కంటి తుడుపుకు కూడా పనికి రాని ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించి అసెంబ్లీలో తీర్మానాలు చేశారన్నారు. అసెంబ్లీలోనే మంద బలంతో ప్రతిపక్ష నేతను ఎగతాళి చేశారన్నారు. ప్రత్యేక హోదా అంటే సంజీవినా అన్నట్లు ఎదురుదాడి చేశారని గుర్తు చేశారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని గ్రహించి, మోడీతో వెళ్తే రిస్క్‌ ఉంటుందని భావించిన చంద్రబాబు దిక్కు తెలియని స్థితిలో ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చారన్నారు. ఏ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్‌టీఆర్‌ టీడీపీ స్థాపించారో..అ పార్టీని కాంగ్రెస్‌తో పొత్తుకు చంద్రబాబు సిద్ధమయ్యారన్నారు. ఇంట ఏమి చేయలేదు కాబట్టి..జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నయం చేస్తున్నట్లు ప్రజలకు చూపించి లబ్ధి పొందాలని చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారన్నారు. ఇటీవల దుబాయిలో రాహుల్‌ గాంధీ చేత ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చంద్రబాబు చెప్పించారు. దింపుడుకళ్ల ఆశతో ఇవాళ ప్రత్యామ్నయ కూటమి అంటూ కొత్త పల్లవి అందుకున్నారన్నారు. 
ఆ రోజు ఎన్‌టీఆర్‌ చేపట్టిన పోరాటం, ఆరాటం కేసీఆర్‌ ఇవాళ నిజంగా చేపట్టారన్నారు. కేంద్రంలో ఒక సొంత ఎజెండా ఉన్న పార్టీలతో అంటకాగకుండా, రాష్ట్రాలకు అవసరమైన వాటిని సాధించేందుకు, రాష్ట్ర ప్రయోజనాల కోసం  ఉమ్మడిగా పోరాటం చేయాలనే ప్రయత్నం ఈ రోజు మొదలైందన్నారు. రెండోసారి ఎన్నికల్లో తిరుగులేని తీర్పుతో కేసీఆర్‌ అధికారంలోకి వచ్చారన్నారు. 2014 రాష్ట్ర విభజన తరువాత ప్రత్యేక హోదా నినాదానికి కేసీఆర్‌ మద్దతు ఇవ్వడం, అవసరమైతే ప్రధానికి లేఖ రాస్తానని చెప్పడంతో వైయస్‌ఆర్‌సీపీ హర్షం వ్యక్తం చేసిందన్నారు. వైయస్‌ జగన్‌–కేటీఆర్‌ భేటీపై టీడీపీ నేతలు మితిమీరి ఇష్టారాజ్యంగా..ఉన్మాదుల మాదిరిగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తన బావమరిది హరికృష్ణ శవం వద్ద కేసీఆర్‌తో పొత్తు కోసం వెంపర్లాడారని తెలిపారు. ఈ రోజు వైయస్‌ఆర్‌సీపీ ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఫెడరల్‌ ఫ్రంట్‌కు మద్దతిస్తున్నామని చెప్పారు. 

చంద్రబాబు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని రామకృష్ణారెడ్డి విమర్శించారు. పిల్లల కడుపు నింపే పథకాన్ని కూడా నీరుగార్చారన్నారు. నాలుగేళ్లు నిద్రలో ఉండి ఇప్పుడు సంక్షేమం అంటున్నారని మండిపడ్డారు. ప్రజలపై మమకారం లేక, ఓట్లు అడిగే దమ్ము లేక, ఆఖరి నిమిషంలో చిరుజల్లులు చిలికించి లబ్ధి పొందాలని చూస్తున్నారని తెలిపారు. చంద్రబాబు కురిపిస్తున్న వరాలను బట్టి చూస్తే..ప్రజలపై ఆ పార్టీ నేతల చులకనభావం గుర్తుకు వస్తుందన్నారు. వైయస్‌ జగన్‌ పింఛన్‌ రూ.2 వేలు పెంచుతున్నట్లు 2017లో నిర్వహించిన ప్లీనరీలో ప్రకటించారని తెలిపారు. ఇన్నాళ్లు పింఛన్‌ పెంచకుండా ఎన్నికలకు రెండు నెలల ముందు పెంచి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. 
మరోవైపు పక్క రాష్ట్రంలో కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికలకు వెళ్లి బొక్కబోర్ల పడ్డారన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌ విడుదల చేసిన లేఖలో తెలంగాణలో ప్రాజెక్టులు కడుతుంటే ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తుందని మమ్మల్ని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిదానికి ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తున్న టీడీపీకి అధికారంలో ఎవరున్నారో తెలియదా అని నిలదీశారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యూనల్‌ వద్ద టీడీపీ ఘోరంగా విఫలమైందన్నారు. కోర్టులో సకాలంలో పిటిషన్లు వేయలేకపోయారన్నారు. ఎంతసేపు కేబినెట్‌ మీటింగ్‌ల్లో భూ సేకరణ, ప్రాజెక్టుల అంచనాలు పెంచడం..ఎలా దోచుకోవాలన్నదే ఆలోచించారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ వంద శాతం అధికారంలోకి వస్తుందని భావించిన కేసీఆర్‌ వైయస్‌ జగన్‌తో చర్చించేందుకు ముందుకు వచ్చారన్నారు. ఫెడరల్‌ స్ఫూర్తితో జాతీయ స్థాయిలో కేసీఆర్‌ చేపట్టిన నిర్మాణంలో భాగంగానే వైయస్‌ జగన్‌తో చర్చించారన్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారని చెప్పారు. 

2014లోనే బీజేపీ నుంచి వైయస్‌ఆర్‌సీపీకి ఆహ్వానం ఉన్నా వైయస్‌ జగన్‌ వెళ్లలేదన్నారు. బీజేపీ రాష్ట్రానికి మేలు చేయలేదని, చంద్రబాబును మాత్రం నాలుగేళ్లు కాపాడుతూ వచ్చిందన్నారు. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌ ఏపీకి అన్యాయం చేశాయన్నారు. కాబట్టి జాతీయ పార్టీలో కలిసి ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని వైయస్‌ జగన్‌ ఇదివరకే ప్రకటించారన్నారు. టీడీపీ వైఖరి ఏంటో చెప్పాలన్నారు. గతంలో నలుగురు మోడీలు అంటూ మోడీ, జగన్, కేసీఆర్, పవన్‌ అన్నారని, ఇప్పుడు ముగ్గురు మోడీలు అంటూ పవన్‌ను పక్కన పెట్టుకున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారని, చంద్రబాబును మూటకట్టి పక్కన పెట్టాలని నిర్ణయించారని, వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని తీర్మానించుకున్నారన్నారు. ఏదీ ఎమైనా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమైందన్నారు. ఇన్నాళ్లు జాతీయ రాజకీయాల గురించి మాట్లాడిన చంద్రబాబు రేపు ట్రంప్‌ మీద పోటీ అంటారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. రాజధాని భూములు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందాలని చూస్తుందన్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి చంద్రబాబును నిలదీయాలని, కే సీఆర్‌ ఈ రాష్ట్రానికి ఎలా వస్తారో సమాధానం చెప్పాలని ప్రశ్నించాలని సజ్జల పిలుపునిచ్చారు. 
 

తాజా వీడియోలు

Back to Top