రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌ సీపీ ఆవిర్భావ వేడుకలు

ఊరూరా  జెండా  ఆవిష్కరణ

 విశాఖపట్నం:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. విశాఖలో నిర్వహించిన వేడుకల్లో వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొని పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాభినందనలు తెలిపారు. టీడీపీ కుట్రలను ఎదుర్కొని సీఎం వైయస్‌ జగన్ ప్రజల మన్ననలు పొందారని చెప్పారు. కార్యకర్తల కృషి వల్లే విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. పాదయాత్ర ద్వారా వైయస్ జగన్ ప్రజల సమస్యలను తెలుసుకుని..  ప్రజల మన్ననలు పొంది అధికారంలోకి వచ్చామని తెలిపారు. 

పేదల ప్రయోజనాలు కాపాడుతున్నాం..
ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పేదల ప్రయోజనాలు కాపాడుతున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు. వైఎస్సార్‌ ఆశయాలకు అనుగుణంగా సీఎం వైఎస్‌ జగన్ ముందుకెళ్తున్నారన్నారు. 9 నెలల పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుత పథకాలు ప్రవేశపెట్టామన్నారు. అమ్మఒడి, పేదలకు ఇళ్ల పట్టాలు వంటి సంక్షేమ పథకాలు చేపట్టామని పేర్కొన్నారు. బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచామన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. అన్ని వర్గాలను విజయపథం వైపు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతోనే సీఎం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని.. ప్రజల ఆమోదంతో తీసుకున్న నిర్ణయాన్ని ఏ శక్తి ఆపలేదని ఆయన స్పష్టం చేశారు. 

వైయస్‌ఆర్‌సీపీ అత్యంత శక్తివంతంగా అవతరించింది..
151 సీట్లలో గెలిచి వైఎస్సార్‌సీపీ అత్యంత శక్తివంతమైన పార్టీగా అవతరించిందని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రతి విషయాన్ని రెఫరెండం అనడం సరికాదన్నారు. ‘‘విశాఖ సిటీలోనే పేదలకు లక్షా 52వేల ఇళ్ల స్థలాలు కేటాయించాం. గతంలో ఏ సర్కార్ చేయని పనులు మా ప్రభుత్వం చేస్తోంది. వైఎస్సార్‌సీపీ నైతిక విలువలను పాటిస్తుంది. మా పార్టీలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేయాలని’ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

టీడీపీ అరాచకం సృష్టిస్తోంది..
అవినీతికి, అనైతికతకు మారు పేరుగా చంద్రబాబును అభివర్ణించారు. టీడీపీ నేతలు రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు దురుద్దేశంతోనే మాచర్ల వెళ్లారని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. బుద్దా వెంకన్న, బోండా ఉమ గొడవలు సృష్టించడానికే వెళ్లారని ఆరోపించారు. జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 

ప్రజలు ఆనందంగా ఉండాలన్నదే లక్ష్యం: అవంతి
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలన్నదే వైయస్‌ఆర్‌సీపీ లక్ష్యమని మంత్రి అవంతి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ వైఎస్సార్‌సీపీ పార్టీ పెట్టి ఉండకపోతే రాష్ట్రంలో బడుగు వర్గాలు అనాథలయ్యేవారన్నారు. రాజ్యసభకు బడుగు వర్గాలకు చెందిన ఇద్దరిని పంపించారని తెలిపారు. చంద్రబాబు.. వర్ల రామయ్యకి గెలిచేటప్పుడు టిక్కెట్‌ ఇవ్వకుండా ఓడిపోయేటప్పుడు టిక్కెట్‌ ఇచ్చారని అవంతి శ్రీనివాస్‌ ఎద్దేవా చేశారు. .  ఈ వేడుకల్లో  పార్టీ సీనియర్‌ నేత దాడి వీరభద్రరావు, నగర అధ్యక్షులు వంశీకృష్ణ, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి,  మాజీ ఎమ్మెల్యే లు ఎస్ ఏ రెహ్మాన్, చింతలపూడి వెంకటరామయ్య, తైనాల విజయ్ కుమార్, వెస్ట్  కన్వీనర్ మళ్ల విజయ ప్రసాద్, ప్రేమ్ బాబు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top