తాడేపల్లి: సంక్షేమ పాలనలో, సామాజిక న్యాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని వైయస్ఆర్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చింది గతంలో మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి, నేడు ఆయన తనయుడు సీఎం వైయస్ జగన్ అని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ జీవించి ఉన్నంతకాలం మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరువలేరని చెప్పారు. టీడీపీ హయాంలో బడుగు, బలహీనవర్గాలకు చంద్రబాబు చేసింది శూన్యమని చెప్పారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో డొక్కా మాణిక్యవరప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోకేశ్ యువగళం యాత్ర రెండ్రోజులగా గుంటూరు జిల్లాలో జరుగుతుంది. ఆ యాత్రకు ప్రజల ఆదరణ లేకపోవడంతో మీడియాలో హైలెట్ కావాలని ఆయన పెద్ద పెద్ద విషయాల్ని మాట్లాడుతున్నాడు. గత రెండ్రోజులుగా ఆయన చేసిన ఆరోపణల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆధారాల్లేని అసత్యాలను లోకేశ్ పదేపదే చెబుతున్నాడు. ఈ సందర్భంగా ఆయనకో సలహా చెబుతున్నాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గురించి దయచేసి మీరు మాట్లాడకుండా ఉండాలని మనవి చేస్తున్నాను. ఆ వర్గాల కోసం గత టీడీపీ ప్రభుత్వ కాలంలో ఏం చేసింది..? అంటే, సున్నా అని చెప్పుకోవాలి. 14 ఏళ్ల ముఖ్యమంత్రి హయాంలో మీ తండ్రి చంద్రబాబు ఆయా వర్గాల్ని పట్టించుకోకపోతేనే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా టీడీపీని దూరం పెట్టాయనే సంగతిని లోకేశ్ గుర్తెరగాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల దైవంగా.. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ జీవించి ఉన్నంతకాలం మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరువలేరు. ఎందుకంటే, తండ్రి హయాం నుంచి ఈనాటి వరకు ఆయా వర్గాలు పొందుతున్న మేలు చరిత్రలో నిలిచిపోతుంది. ఆనాడు వైయస్‌ఆర్ దళిత, బడుగు, బలహీన మైనార్టీవర్గాల్ని అక్కునజేర్చుకుంటే.. ఈనాడు సీఎం వైయస్ జగన్ అదే పంథాలో నడుస్తూ వారిని సోదరులుగా, మేనల్లుళ్ళుగా ఒక అనుబంధాన్ని ఏర్పరుచుకుని అనేక సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నారు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జీవనశైలిలో వచ్చిన అనూహ్య మార్పులను చూస్తే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో తెలుస్తోంది. విద్యారంగాన్నే ఉదాహరణగా తీసుకుంటే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ పాలనలో ఏమేరకు మేలు జరుగుతుంది. వారి అభివృద్ధికి బాటలు ఏవిధంగా సమకూర్చారనే విషయంలో విద్యారంగాన్నే ఒక ఉదాహరణగా తీసుకుంటే.. నాడు –నేడు కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల దగ్గర్నుంచి పిల్లలకు ఇంగ్లీషు మీడియం బోధన తదితర అంశాలు అనూహ్య మార్పులకు దారితీశాయి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లలు ఎదుగుతారనే ఒక లక్ష్యం పెట్టుకుని..వారి అభివృద్ధి గురించి మంచిపనులు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలోనే ఒక్క వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అని గర్వంగా చెప్పుకోవాలి. ఇలాంటి ఆలోచన గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చేశారా..? అనేది లోకేశ్ తన తండ్రిని అడిగి తెలుసుకోవాలి. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించి.. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించి.. వారికి విద్య, ఉద్యోగ ఉపాధిరంగాల్లో ప్రోత్సహించి వారిని వైద్యులుగా, ఇంజినీర్లుగా తయారు చేసిన ఘనత మహానేత వైయస్‌ఆర్‌కే దక్కుతుంది. ఒకప్పుడు కూలిపనులు, మెకానిక్‌లుగానూ, కత్తి-సుత్తి పనిచేసుకునే మైనార్టీ వర్గాల పిల్లలను విద్యారంగంలో ముందుంచి పెద్ద పెద్ద ఆఫీసర్లుగా తయారవడానికి సహకరించింది మహానేత వైయస్‌ఆర్, వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కాదా..? అని ప్రశ్నిస్తున్నాను. గతంలో చంద్రబాబు ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకోకపోగా.. మైనార్టీల్ని పట్టించుకోకుండా దూరంగా పెట్టిన పరిస్థితుల్ని లోకేశ్ తెలుసుకుని మాట్లాడితే బాగుండేది. ఎస్సీ, ఎస్టీలంతా వైయస్‌ఆర్‌సీపీ వెంటే.. ఇక, ఎస్టీల గురించి లోకేశ్ మాట్లాడేటప్పుడు తమపార్టీలో ఎస్టీల భాగస్వామ్యమేంటనేది కనీసం తెలుసుకోలేదు. ఏదో నోటికొచ్చింది మాట్లాడితే ప్రజలు అమాయకంగా వింటారని లేనిపోని కబుర్లు చెప్పుకుంటూ పోయాడు. ఎస్టీలకు సంబంధించిన నియోజకవర్గ స్థానాల్లో 2014లో, 2019లోనూ టీడీపీ అభ్యర్థులెవరూ గెలవలేదు కదా..? మరి, అదే ఎస్టీ వర్గాలకు మా నాయకుడు సీఎం వైయస్ జగన్ మీద ఎంత నమ్మకం ఉంటే.. 2014, 2019 ఎన్నికల్లో ఎస్టీలు ఓట్లేసి వైయస్‌ఆర్‌సీపీని బలపరిచారు..? టీడీపీ గతంలో ఎస్టీలకు మేలు చేసి ఉంటే.. వాళ్లంతా ఆ పార్టీని వదిలి వైయస్‌ఆర్‌సీపీ వైపు వచ్చేవాళ్లా..? అదేవిధంగా 29 ఎస్సీ సీట్లుంటే.. 28 చోట్లా వైయస్‌ఆర్‌సీపీనే ఎస్సీలు గెలిపించారు కదా..? కేవలం టీడీపీకి ఒకే ఒక సీటును ఎందుకివ్వాల్సి వచ్చింది..? ఇందుకు లోకేశ్ సమాధానం చెప్పాలి. ప్రేమ చూపిస్తే దూరం జరిగే సంస్కృతి ఎస్సీ, ఎస్టీల్లో ఉండదు. ఆదరిస్తే ఆ వర్గాలు చచ్చేవరకు మరిచిపోలేవు. కనుకనే, వైయస్ జగన్‌ని మా నాయకుడు అంటూ ఆదరిస్తూ ఎస్సీ, ఎస్టీలంతా వైయస్‌ఆర్‌సీపీ వెంటే ఉన్నారు. సీఎం వైయస్ జగన్‌కి ఎస్సీ, ఎస్టీలకు మధ్యనున్న బంధాన్ని ఎవరూ విడదీయలేరు. బీసీలకు వెన్నుపోటు పొడిచింది బాబు-టీడీపీనే.. బీసీల గురించి లోకేశ్ ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడాడు. స్వర్గీయ ఎన్టీ రామారావు హయాంలో టీడీపీకి వెన్నెముకగా ఉన్న బీసీలు... ఆ తర్వాత చంద్రబాబు వచ్చాక, బీసీలంతా ఎందుకు దూరమయ్యారు..? వాళ్ల కష్టంతో పార్టీ ఎదుగుదల జరిగిన తర్వాత వారిని అన్నివిధాలుగా వంచనకు గురిచేసి పదవులు, పనుల్లో చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు. తనతో మాట్లాడేందుకు వచ్చిన బీసీల్ని పట్టుకుని తోకలు కత్తిరిస్తానని వారి ఆత్మాభిమానం దెబ్బతీశాడు. అందుకే, ఆరోజు నుంచి బీసీలంతా టీడీపీని, చంద్రబాబును పూర్తిగా దూరం పెట్టేశారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో సామాజిక న్యాయం.. రాష్ట్రంలోని బీసీ కులాలన్నీ ఏకతాటి మీదకొచ్చి మా మంచి కోరే నాయకుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అని వెలుగెత్తి చాటే కీలక నిర్ణయం తీసుకున్నారు. అందుకు నిదర్శనమే, వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన జయహో బీసీ మహాసభ అని చెప్పాలి. బీసీలను ఆదరించి వారిని వైయస్‌ఆర్‌సీపీ వెన్నెముకగా చేసుకోవడంలో మా నాయకుడు వైయస్ జగన్ చేసిన కృషిని బీసీ వర్గాలన్నీ కొనియాడుతున్నాయి. బీసీలకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. అనేక కులాలకు చెందిన వారిని గుర్తించి చైర్మన్ పదవులిచ్చారు. 17 మంత్రిత్వశాఖలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే.. కేబినెట్‌లో 25 మంది మంత్రులుంటే.. అందులో 17 మంత్రిత్వశాఖలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే ఇవ్వాలని సంకల్పించిన ధైర్యవంతుడు సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి. 12 మంది బీసీలకు, 5గురు ఎస్సీ, ఎస్టీలకు మంత్రి పదవులిచ్చారు. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాల్ని తీసుకునేది ఆయనొక్కరేనని గర్వంగా చెప్పుకుంటున్నాను. అంతేకాకుండా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాల్లో అగ్రస్థానం ఇవ్వడంతో పాటు కాపు, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులిచ్చారు. రాజ్యసభ సీట్లు బీసీవర్గాల్లో ఆర్. కృష్ణయ్య, బీద మస్తానరావు, మోపిదేవి వెంకటరమణకు ఇచ్చారు. మహిళలకు పదవులివ్వడంలో కూడా వైయస్ జగన్ ప్రభుత్వం ఒక మెట్టు పైస్థాయిలోనే ఉంది. రాష్ట్ర హోం మంత్రి పదవిలో దళిత మహిళను కూర్చొబెట్టారు. నిన్న విడుదలైన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల్లో కూడా ఒక బీసీ మహిళకు, మరో ఎస్టీ వ్యక్తికి అవకాశమిచ్చారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో సామాజిక న్యాయం సాధించాలనే విషయంపై టీడీపీ ఏనాడైనా దృష్టిపెట్టిందా..? ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, కాపుల గురించి ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సామాజిక న్యాయం పాటించి అమలు చేయడంలో దేశంలోని నాయకులందరి కంటే ముందున్నారు. అమరావతిలో నిజమైన రైతులకే న్యాయం దక్కుతుంది.. లోకేశ్ లేనిపోని ఆరోపణలతో మా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాల్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన అబద్ధాల గళంతో ఏం సాధిస్తారు..? అంటూ ప్రశ్నిస్తున్నాను. అమరావతిలో నిజమైన రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా.. వాళ్లకు ప్రభుత్వ భరోసా దక్కుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పచ్చకండువాలు ధరించి రైతుల ముసుగులో ఏవేవో కబుర్లు చెబితే.. వాటిని మా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోదు. నిజమైన రైతులెవరైతే ఉన్నారో.. వారికి ప్రభుత్వం ప్రామిస్ చేసిన ప్రతీ వనరులనూ అందిస్తుందని స్పష్టంచేస్తున్నాను. ఆమె విజ్ఞతకే.. తాడికొండ ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీదేవి కూడా నిన్న లోకేశ్ పక్కన నిలబడి అమరావతి గురించి మాట్లాడారు. వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ పార్టీకి రాజీనామా చేయకుండా మరో పార్టీ వేదికలెక్కి రైతులకు అండగా పనిచేస్తానని చెప్పుకోవడంలో అర్ధమేంటి..? రైతులకు అండగా వైయస్‌ఆర్‌సీపీ తరఫున మేమూ ఉన్నాం కదా.? హైదరాబాద్‌లోనో.. మరెక్కడ్నో ఉంటూ ఆమె ఇప్పుడొచ్చి అమరావతి రైతులు గుర్తుకొచ్చారంటూ.. వారిమీద ప్రేమ ఉన్నట్లు మాట్లాడటం ఎంతవరకు సబబు..? వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం మీద మాట్లాడే మాటల్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాం. వాలంటీర్లకు యజమాని ప్రభుత్వమే.. వాలంటీర్ల వ్యవస్థపై పవన్‌కళ్యాణ్ మాట్లాడే మాటల్లో అర్ధంలేదు. వాలంటీర్లకు యజమాని ప్రభుత్వమే అనడంలో సందేహమేమీ లేదు. ఎందుకంటే, వారిని నోటిఫికేషన్ ద్వారా అర్హతలు నిర్ణయించి ఎంపిక జేసి, వాలంటీర్ గా విధుల్లోకి తీసుకుని, వారి సేవలకు గౌరవ వేతనాన్ని ఇస్తుంది ప్రభుత్వమే కదా..? మరి, అలాంటి వ్యవస్థను ఏదో ప్రయివేటు సంస్థగా చిత్రీకరించే పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా.. ఆయనే ఎమోషనల్‌గా మాట్లాడి ప్రజల్ని తప్పుదోవబట్టించేవిధంగా గందరగోళ వాతావరణం సృష్టించడం సరైంది కాదు. కనుక, ఇప్పటికైనా ఆయన రాజకీయపంథాను సరిచేసుకోవాలని సలహానిస్తున్నాను.