చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు లేదు

మేకపాటి రాజమోహన్‌రెడ్డి 

ప్రజల్ని మభ్యపెట్టడమే చంద్రబాబు పని

ఏ సర్వే చూసినా వైయస్‌ఆర్‌సీపీదే ప్రభంజనం

వచ్చే ఎన్నికల్లో ప్రజలు బాబుకు గుణపాఠం చెబుతారు

నేను పార్టీ మారుతా అని తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారు

వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావం కంటే ముందు నుంచే వైయస్‌ జగన్‌తో ఉన్నా..

న్యూఢిల్లీ: చంద్రబాబు రాజకీయ జీవితం అంతా కూడా మోసాలమయమని, ప్రజల్ని మభ్యపెట్టడమే ఆయన పని అని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు, తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మండిపడ్డారు. నాలుగేళ్లు కేంద్రంతో కలిసి పని చేసిన చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోయారని, మరో నెల రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని, విభజన చట్టంలోని హామీలు సాధించకపోతే చంద్రబాబుకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని హెచ్చరించారు. తాను పార్టీ మారాల్సిన అవసరం లేదని, మొదటి నుంచి వైయస్‌ జగన్‌ వెంటే నడుస్తున్నానని, తనపై వచ్చిన తప్పుడు కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్రత్యేక హోదా కోసం నిరసన తెలిపిన ఆయన మీడియాతో మాట్లాడారు.

 ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులకు కూడా రాజీనామా చేశామని పేర్కొన్నారు. హోదా కోసం ఐదేళ్లలో వైయస్‌ జగన్‌ నేతృత్వంలో అనేక పోరాటాలు, ధర్నాలు, బంద్‌లు నిర్వహించామన్నారు. అప్పుడు ఎగతాళి చేసిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదాపై కపట నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. నాలుగేళ్లు కేంద్రంతో కలిసి కాపురం చేసిన చంద్రబాబు ఇప్పుడు ధర్మా పోరాటం అంటూ మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో చెప్పిన హామీలన్నీ సాధించాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. లేదంటే ఆయనకు ఓటు అడిగే హక్కు లేదన్నారు.

వైయస్‌ జగన్‌ చెప్పిన నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని విమర్శించారు. ఏపీ ప్రజలు అందరూ కూడా చైతన్యవంతులయ్యారని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వల్ల పేద విద్యార్థులు ఇవాళ ఉన్నత చదువులు చదివారన్నారు. అందరికీ విషయపరిజ్ఞానం బాగా తెలుసు అన్నారు. చంద్రబాబు జీవితమంతా మోసాలమయమన్నారు. తెలివిగల మోసకారి అని మండిపడ్డారు. ఎత్తుగడలతో రాజకీయాలు చేస్తున్నారని, ఆయనకు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ఫిబ్రవరి ఆఖరికి ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉందన్నారు. మళ్లీ తనకు అవకాశం ఇవ్వకపోతే అభివృద్ధి ఆగిపోతుందని చంద్రబాబు ప్రజలను బెదిరిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీకి తీరని అన్యాయం చేశారన్నారు. విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత మోడీపై ఉందన్నారు. ఏ సర్వేలు చూపినా కాంగ్రెస్, బీజేపీలకు జీరో ఫలితాలే అన్నారు. టీడీపీ కూడా సింగిల్‌ డిజిట్‌కు పరిమితమవుతుందన్నారు. ఈ నెల రోజుల్లో చంద్రబాబు ఏ పోరాటం చేస్తారో చూస్తామన్నారు.
ఇటీవల ఓ టీవీలో తనపై దుష్ప్రచారం చేశారని మేకపాటి ఖండించారు. నైతిక విలువలు లేకుండా టీవీలు నడపడం దుర్మార్గమన్నారు. మొదటి నుంచి కూడా వైయస్‌ జగన్‌ వెంట నడిచానని, ఇప్పటికీ రెండుసార్లు ఎంపీ పదవికి రాజీనామా చేసి వైయస్‌ఆర్‌సీపీ తరఫున గెలిచానని చెప్పారు. పార్టీకి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. నైతిక విలువలు మీడియా కాపాడాలని సూచించారు.  ఇలాంటి చర్యలను ప్రజలు గర్హిస్తారని పేర్కొన్నారు.  
 

Back to Top