తాడేపల్లి: తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్నవైయస్ఆర్సీపీ కార్యాలయం కూల్చివేతపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయన శనివారం ఉదయం కూల్చివేత స్థలాన్ని సందర్శించారు. సీతానగరం భవన ప్రాంతాన్ని వైయస్ఆర్సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు తదితరులు పరిశీలించారు. అనంతరం మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ..నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని 2 గంటల్లో నేలమట్టం చేశారు. ఇది వైయస్ఆర్సీపీ ఆఫీసు నిర్మాణం కోసం నిర్మించాం. కేబినెట్ ఆమోదం పొందాకే స్థలాన్ని తీసుకున్నామని చెప్పారు. వైయస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం కూల్చివేసిన వ్యవహారం దేశంలోని ప్రజా స్వామ్య వాదులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఖండించాలని కోరారు. అధికారంలో ఉన్నాం కదా అని కూల్చివేతలు చేయడం సరికాదని, అధికారం ఎవరికి శాశ్వతం కాదని, కొద్ది రోజుల క్రితం వరకు వైసీపీనే అధికారంలో ఉందని గుర్తు చేసారు. నియమ, నిబంధనల ప్రకారం నిర్మాణం చేపట్టిన విషయాన్ని న్యాయస్థానానికి తాము వివరించామని, అయితే శని, ఆదివారాల్లో అప్పీలు చేసుకునే అవకాశం లేదని చూసుకుని పార్టీ కార్యాలయం కూల్చివేత చేపట్టారన్నారు. ప్రభుత్వ స్థలంలోనే టీడీపీ కార్యాలయం నిర్మాణం జరిగిందని, ఇప్పుడు వైసీపీ పార్టీ కార్యాలయం కూడా ప్రభుత్వ స్థలంలోనే నిర్మాణం చేస్తున్నామని ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చట్ట బద్ద పాలన చేస్తామని, కక్ష సాధింపులు ఉండని చెప్పారని, కానీ అధికారం చేపట్టి రోజుల వ్యవధిలోనే విధ్వంస పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గ పాలనను రాజకీయ పక్షాలు క్షమించకూడదని అంబటి తేల్చిచెప్పారు. ప్రభుత్వం తమ కట్టడాలను కూల్చి వేయాలంటే చట్టపరంగా ముందుకు రావాలని, న్యాయ స్థానాల్లో అనుమతి తీసుకోవాలని సూచించారు. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకాలపాలపై న్యాయస్థానంలో పోరాడుతామని, ఇప్పటికే ఈ వ్యవహారం కోర్టులో ఉందని అంబటి వెల్లడించారు. కోర్టులో నిన్న కూల్చమని చెప్పి, ఇవాళ ఉదయాన్నే కూల్చి వేసి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు.