డయేరియా మరణాలు కూట‌మి పాలన దౌర్భాగ్యానికి సంకేతం 

 వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు మండిపాటు

విజయనగరం జిల్లా:  కూటమి ప్రభుత్వ పాలనపై జిల్లా పరిషత్ చైర్మన్, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్ర‌బాబుకు సూటిగా ప్రశ్నలు సంధిస్తూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ పాలనలో సంక్షేమం, అభివృద్ధి సమతుల్యంగా సాగిందని, కానీ ప్రస్తుతం యూరియా కొరత, వైద్య వ్యవస్థ వైఫల్యం, డయేరియా మరణాలు పెరగడం పాలన దౌర్భాగ్యానికి సంకేతమని ఆయన అన్నారు. ప్రజలకు పబ్లిసిటీ షూటింగులు కాకుండా వాస్తవ సేవలు కావాలని వ్యాఖ్యానించారు. గుర్ల, కురుపాం ప్రాంతాల్లో డయేరియా కారణంగా జరిగిన మరణాలు, ఆసుపత్రుల్లో పిల్లల అనారోగ్య ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హయాంలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇచ్చి “నాడు–నేడు” కార్యక్రమం ద్వారా పాఠశాలలు, ఆసుపత్రులు అభివృద్ధి చేశామని గుర్తుచేశారు.

ఉత్తరాంధ్ర ప్రాంత భాష, యాసపై అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు, యూరియా సరఫరా, పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. చీపురుపల్లిలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, విద్య, వైద్యం, సాగునీటి రంగాలపై ప్రత్యేక సమీక్షలు నిర్వహించాలని సీఎం చంద్ర‌బాబును కోరారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.
 

Back to Top