ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం ప‌నిచేస్తోంది

ఢిల్లీలోని ధ‌ర్నాలో నేష‌న‌ల్ మీడియాతో వైయ‌స్ఆర్ సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌

టీడీపీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అరాచ‌క‌, ఆట‌విక పాల‌న‌

య‌థేచ్ఛ‌గా హ‌త్య‌లు, అత్యాచారాలు, దాడులు, ఆస్తుల విధ్వంసాలు

రెడ్‌బుక్‌ పేరిట రాష్ట్రంలో లోకేష్ హోర్డింగ్‌లు, గ్రామ‌స్థాయి వ‌ర‌కు రెడ్‌బుక్ రాజ్యాంగ‌మే

వైయ‌స్ఆర్ సీపీని అణ‌గ‌దొక్క‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వ ప్రోత్సాహంతో హ‌త్య‌లు, దాడులు

లోకేష్ ఆదేశాల‌తో బాధితుల‌పైనే కేసులు పెడుతున్న పోలీసులు

ఇంతకంటే దారుణం ఇంకా ఎక్కడైనా ఉంటుందా?

చివ‌ర‌కు ఎంపీలు కూడా వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో తిర‌గ‌లేని భ‌యాన‌క ప‌రిస్థితి

45 రోజుల్లోనే 30కి పైగా హ‌త్య‌లు, 300 మందిపై హత్యాయత్నాలు, వెయ్యికి పైగా ఆస్తుల విధ్వంసాలు

రాష్ట్రంలో జ‌రిగిన దాడుల‌పై ఫొటో గ్యాల‌రీ, వీడియోలు ప్ర‌ద‌ర్శిస్తున్నాం

నేష‌న‌ల్ మీడియా ప్ర‌తినిధులు ద‌య‌చేసి ఈ ఘ‌ట‌న‌లు స‌బ‌బేనా అని ఆలోచించండి

న్యూఢిల్లీ: టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఆంధ్ర‌రాష్ట్రంలో ఇప్పుడు భారత రాజ్యాంగం కాకుండా, రెడ్‌బుక్‌ రాజ్యాంగం పనిచేస్తోందని, వైయ‌స్ఆర్ సీపీని అణ‌గ‌దొక్క‌డ‌మే ల‌క్ష్యంగా యథేచ్ఛగా హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసాలు, అత్యాచారాల‌ను ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తోంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మండిప‌డ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వ నేతృత్వంలో గ‌త 45రోజులుగా కొన‌సాగుతున్న ఆట‌విక పాల‌న‌కు, ఆరాచ‌కాల‌కు నిర‌స‌న‌గా ఢిల్లీలో జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌ వైయ‌స్ఆర్ సీపీ నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. ఈ కార్య‌క్ర‌మానికి పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హాజ‌రై రాష్ట్రంలో వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, సానుభూతి ప‌రుల‌పై జ‌రిగిన దాడులు, ద‌మ‌న‌కాండ‌ల‌కు సంబంధించిన ఫొటో గ్యాలరీని ప్రారంభించిన అనంత‌రం నేష‌న‌ల్ మీడియాతో మాట్లాడారు. 

నేషనల్‌ మీడియాతో వైయస్‌ జగన్‌.. 
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించడంతో పాటు, చట్టం ముందు అందరూ సమానులే అన్న స్ఫూర్తికి కూడా విఘాతం కలుగుతున్న నేపథ్యంలో ఇక్కడ మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత, గత 45 రోజులుగా అరాచక, ఆటవిక పాలన కొనసాగుతోంది. అంతులేని దారుణాలు జరుగుతున్నాయి. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. యథేచ్ఛగా హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసం. వైయస్ఆర్ సీపీని అణగదొక్కడమే ప్రభుత్వ లక్ష్యం అయింది. అందుకే హత్యలు, దాడులు, అకృత్యాలను ప్ర‌భుత్వం ద‌గ్గ‌రుండి ప్రోత్సహిస్తోంది.

కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన ఈ 45 రోజుల్లోనే 30 మందికి పైగా హత్యలు జరిగాయి. 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయి. 560 చోట్లకు పైగా ప్రైవేటు ఆస్తులు, 490 చోట్లకు పైగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. యథేచ్ఛగా 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి. ప్రైవేటు ఆస్తులను కూడా యథేచ్ఛగా ధ్వంసం చేశారు. చివరకు రైతులు పండించే తోటలు కూడా విధ్వంసం చేస్తున్నారు.

చంద్రబాబు కుమారుడైనా నారా లోకేష్‌ ఒక మంత్రిగా ఉండి.. రెడ్‌బుక్‌ పేరిట రాష్ట్రంలో హోర్డింగ్‌లు పెట్టాడు. ఎవరెవరి మీద దాడుల చేయాలి. ఎవరిని ఎలా వేధించాలో అన్ని వివరాలు అందులో రాసినట్టు లోకేష్‌ స్వయంగా ప్రకటించారు. అంతే కాకుండా.. రాష్ట్ర పోలీసులకు కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశాడు. తమ పార్టీ వాళ్లు దాడులు, ఆస్తుల విధ్వంసం చేసినా.. ఏ చర్యా తీసుకోవద్దని నిర్దేశించాడు. ఆ రెడ్‌బుక్‌ను రాష్ట్రంలో అంతటా హోర్డింగ్‌ల ద్వారా ప్రదర్శించడమే కాకుండా, దాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాడు. ఆ విధంగా రాష్ట్రంలో ఇప్పుడు అంబేడ్క‌ర్ ర‌చించిన భారత రాజ్యాంగం కాకుండా, లోకేష్ రెడ్‌బుక్‌ రాజ్యాంగం పనిచేస్తోంది.

గతంలో వైయ‌స్ఆర్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు, ఇలాంటివేమీ చేయలేదు. హత్యలు చేయలేదు. దాడులు చేయలేదు. ఆస్తుల విధ్వంసం చేయలేదు. ఇళ్లలోకి చొరబడి ఎవ‌రినీ వేధించలేదు. వారిపై దాడి చేయలేదు. ఎక్కడా పౌరుల హక్కులకు భంగం కలిగించలేదు.

కానీ, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, విధ్వంసాన్ని ప్రశ్నించకపోతే, వాటన్నింటినీ వెంటనే ఆపలేకపోతే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేం. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసం, చీనీ తోటల ధ్వంసం.. వీటన్నింటిపై ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేశాము. వీడియోలు కూడా ప్రదర్శిస్తున్నాం. దయచేసి, ఒక్కసారి ఈ ఫొటోలు, వీడియోలు చూడండి. రాష్ట్రంలో దారుణస్థితిని అర్థం చేసుకోండి. మా పార్టీ ప్రజా ప్రతినిధులు.. చివరకు ఒక ఎంపీ కూడా తన నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి. మా పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డిపై పట్టపగలే రాళ్లదాడి జరిగింది. ఆయన వాహనాలు ధ్వంసం చేశారు. 

ఇన్ని జరుగుతున్నా, పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. ఆ విధంగా రాజ్యాంగ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారు. అంత కంటే దారుణం ఏమిటంటే.. మా రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్న వారి నుంచి కాపాడకపోగా.. వారిపై కేసులు నమోదు చేయకపోగా.. తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారు. ఇంత కంటే దారుణం ఇంకా ఎక్కడైనా ఉంటుందా?

దయచేసి, నేష‌న‌ల్ మీడియా ప్ర‌తినిధులంతా ధ‌ర్నా వేదిక వ‌ద్ద ఏర్పాటు చేసిన ఫొటోలు, వీడియోలు చూడండి. ఇలాంటి ఘటనలో ప్రజాస్వామ్య వ్యవస్థలో కొనసాగడం సబబేనా? అన్నది ఆలోచించండి. ఇక్కడ మా నిరసన కార్యక్రమానికి మీరు అండగా నిలవమని కోరుతున్నాను. లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేము. అందుకే మరోసారి నేషనల్‌ మీడియాను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇక్కడి ఫొటోలు, వీడియోలు చూడండి. ఇలాంటివి ప్రజాస్వామ్య వ్యవస్థలో కొనసాగడం సబబేనా? అన్నది ఆలోచించండి.

ఎవరో గుర్తు తెలియని వ్యక్తి, మీ ఇంట్లోకి చొరబడి, మీపై దాడి చేస్తే ఎలా ఉంటుంది? దాన్ని మీరెలా ఎదుర్కొంటారు? దానిపై మీరెలా స్పందిస్తారు?. కాబట్టి, దయచేసి ఇక్కడి గ్యాలరీలో ఫొటోలు, వీడియోలు చూడండి. రాష్ట్రంలో దారుణ పరిస్థితి గురించి తెలుసుకోండి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో, అండగా నిలవండి`` అని వైయ‌స్ జ‌గ‌న్ నేష‌న‌ల్ మీడియా ప్ర‌తినిధుల‌ను కోరారు.  

Back to Top