దేశ రాజకీయాల్లోనే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఓ సంచలనం

రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నాలుగేళ్ల పండుగ‌

పాద‌యాత్ర బృందానికి ఘ‌న స‌త్కారం

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం
 
 వైయ‌స్ జగన్ పాదయాత్ర దేశ రాజకీయాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం:  మంత్రి ఆదిమూలపు సురేష్‌
 
  డీబీటీలో సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉంది:  పార్టీ సీనియర్ నేత డాక్టర్ ఉమ్మారెడ్డి 

తాడేప‌ల్లి: దేశ రాజకీయాల్లోనే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఓ సంచలనమ‌ని  రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ పేర్కొన్నారు. ప్ర‌జా సంకల్ప పాదయాత్ర ప్రారంభమై నాలుగేళ్ళు పూర్తైన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ సీపీ శ్రేణులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి చిత్ర‌ప‌టానికి  పాలాభిషేకాలు, ఆ చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ఎక్కడికక్కడ పాదయాత్రలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన వేడుక‌ల్లో ఎంపీ మోపిదేవి, మంత్రి ఆదిమూల‌పు సురేష్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, సీనియ‌ర్ నాయ‌కులు ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

తొలుత దివంగత మహానేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం శాస్త్రోక్తంగా సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. జగన్ మోహన్ రెడ్డిగారి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభమై నాలుగేళ్ళు పూర్తయిన సందర్భంగా భారీ కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచుకున్నారు. చివరగా పాదయాత్ర బృందాన్ని శాలువాలతో సత్కరించారు.

    ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖా మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ..సీఎం వైయ‌స్‌ జగన్‌ గారి ప్రజాసంకల్ప పాదయాత్ర దేశ రాజకీయ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టమని వ్యాఖ్యానించారు. పాదయాత్రలో పేదలు, బడుగు, బలహీన వర్గాల కష్టాలు స్వయంగా చూసిన జగన్ గారు,  కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పన చేశారన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ గారి ఆలోచనను ఉక్కు సంకల్పంగా ఆయన చెప్పారు. ఏదైనా అనుకున్నా... ఎవరికైనా మాట ఇచ్చినా... దాని కోసం ఎంత దూరమైనా వెళ్ళగల దమ్ము, ధైర్యం గల నేత జగన్‌ గారు అని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు 600కు పైగా ఎన్నికల హామీలిచ్చి వాటిలో  ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను వంచించారని మంత్రి సురేష్‌ విమర్శించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ గారు అందుకు పూర్తి భిన్నంగా, మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంగా భావించి వాటిలో 97శాతం హామీలను ఇప్పటికే అమలు చేశారని చెప్పారు. తద్వారా రాష్ట్ర రాజకీయ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారని చెప్పారు. వైఎస్సార్‌ గారి ఆశయ సాధనలో భాగంగా మంచి మనసుతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి జగన్‌ గారి భావజాల సాఫల్యానికి ప్రతి ఒక్కరూ పునరంకితం అవుతూ... ఆయన అడుగులో అడుగేస్తూ... మరో 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

    మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు  మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. దేశంలో సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఉక్కు మనిషిలా గుర్తింపు పొందితే... రాష్ట్రంలో ఉక్కు మనిషి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు అని అభివర్ణించారు. దేశ రాజకీయాల్లోనే జగన్ గారు ఒక సంచలమని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆయన నాలుగేళ్ళక్రితం ప్రారంభించిన ప్రజా సంకల్ప పాదయాత్ర రాష్ట్రంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. అన్ని సమస్యలకు చక్కని పరిష్కారమార్గం చూపుతూ.. దేశ రాజకీయాల్లోనే అరుదైన నేతగా ఆయన గుర్తింపు పొందినట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఆదర్శంగా తీసుకునేలా, గతంలో గాడి తప్పిన పాలనను ప్రక్షాళన చేస్తూ... ప్రజల జీవనశైలి, ఆర్ధిక స్థితిగతుల్లో సమూల మార్పులు తెస్తూ ఆయన ముందుకు సాగుతున్నారని తెలిపారు. సంక్షేమ రథ సారధిగా... జాతీయ స్థాయిలో రోల్‌ మోడల్‌గా జగన్‌ గారు ఎప్పటికీ నిలిచిపోతారని మోపిదేవి అన్నారు.

    పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పరిపాలనను గ్రామ స్థాయికి... సంక్షేమాన్ని గడప స్థాయికి... రైతు ప్రయోజనాలను గట్టు స్థాయికీ చేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌ గారికే దక్కుతుందన్నారు. ఇదంతా కూడా ప్రజా సంకల్ప పాదయాత్ర స్పూర్తి అని ఆయన తెలిపారు. దేశంలోనే కులం, మతం, పార్టీలు, ప్రాంతాలు అన్న పట్టింపులు లేకుండా పరిపాలన చేస్తున్న ఏకైక సీఎం జగన్‌ అని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు ప్రజలను దోచుకు తిన్నాయని ఆయన ఆరోపించారు. ఇప్పుడు జగన్‌ గారు ఏర్పాటు చేసిన సచివాలయాలు ప్రజల చెంతకే సంక్షేమ ఫలాలను చేరుస్తున్నాయని తెలిపారు. నగదు పంపిణీపై విమర్శలు గుప్పించే వారికి అందులో సంక్షేమం తప్ప అభివృద్ధి కనిపించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. సంక్షేమంలో నుంచే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సునిశితంగా పరిశీలించే వారికి మాత్రమే ఒక కంటికి సంక్షేమం, మరో కంటికి అభివృద్ధి కనిపిస్తుందని ఆయన వివరించారు. వచ్చే వెయ్యేళ్ళలో ఎవరూ మర్చిపోలేని రీతిలో జగన్‌ గారి పాలన కొనసాగుతుందని ఉమ్మారెడ్డి చెప్పారు.

    శాసనమండలి సభ్యులు, వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ.. నాలుగేళ్ళ క్రితం ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు పడిన అడుగులు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండె చప్పుళ్ళై, నేటి జగన్ గారి ప్రజారంజకమైన పరిపాలనకు,  ప్రగతికి సోపానాలయ్యాయని  వ్యాఖ్యానించారు. వైఎస్‌ జగన్‌ అంటే... ఒక నమ్మకం... ఒక ధైర్యం... ఓ భరోసా... విలువలు–విశ్వసనీయతతో కూడిన మాట తప్పని మడమ తిప్పని నైజం... అని అన్నారు. 

    నందిగామ ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ, జగన్‌ గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంతో పాటు విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన సంస్కరణలు, మహిళా సాధికారత దిశగా పక్కా ప్రణాళికలు.. ఇవన్నీ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు అడుగులు పడ్డాయన్నారు. అందుకు ప్రజా సంకల్ప పాదయాత్రలోనే జగన్‌ గారు తొలి అడుగు వేశారని తెలిపారు. క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజల అభీష్టం మేరకు ప్రజల గుమ్మం వద్దకే పరిపాలన తెచ్చిన ప్రజల ముఖ్యమంత్రి జగన్‌ అని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో నవరత్నాల కార్యక్రమం ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ అంకంరెడ్డి నారాయణమూర్తి, వడ్డీలు కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ సైదు గాయత్రీ సంతోషి, కుమ్మరిశాలివాహన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మండేపూడి పురుషోత్తం, కృష్ణా జిల్లా జడ్పీ వైస్‌ ఛైర్‌పర్సన్‌ గరికపాటి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top