4 జెడ్పీటీసీలు ఏకగ్రీవమే

వైయ‌స్ఆర్ సీపీ అభ్యర్థులే ఎన్నిక 

ఎంపీటీసీల్లోనూ 46 చోట్ల అధికార పార్టీవే.. మూడు చోట్ల టీడీపీకి 

30 సర్పంచి.. 380 వార్డు పదవులు ఏకగ్రీవం 

పోటీ ఉన్నచోట 14న పంచాయతీ.. 16న పరిషత్‌ ఎన్నికలు   

  అమరావతి: ఏకగ్రీవంగా గెలిచిన విజేతలు ప్రమాణ స్వీకారానికి ముందే చనిపోవడంతో మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న మూడు జెడ్పీటీసీ స్థానాలు ఈసారి కూడా ఏకగ్రీవాలే అయ్యాయి. మూడింటికి మూడు చోట్లా మరోసారి వైయ‌స్ఆర్ సీపీ  అభ్యర్ధులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైయ‌స్ఆర్ జిల్లా లింగాల, గుంటూరు జిల్లా కారంపూడి, కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల జెడ్పీటీసీ స్థానాల్లో గతంలో ఏకగ్రీవంగా గెలిచిన వారు మరణించడంతో ఈ నెల 16న ఉప ఎన్నిక నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారంతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా అన్ని చోట్లా అధికార పార్టీ అభ్యర్ధులే బరిలో నిలవడంతో ఆయా స్థానాలు ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్‌ అధికారులు ప్రకటించారు. 

కలకడ.. వైయ‌స్ఆర్ సీపీదే
ఇక వీటికి తోడు మొన్నటి ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియకు, పోలింగ్‌కు మధ్య పోటీలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు మరణించడంతో వాయిదా పడ్డ 11 జెడ్పీటీసీ స్థానాలకు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఎన్నికలు నిర్వహిస్తోంది. వీటిల్లో ఒక జెడ్పీటీసీ స్థానాన్ని అధికార వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. చనిపోయిన అభ్యర్ధికి సంబంధించిన రాజకీయ పార్టీ నుంచి అదనంగా నామినేషన్‌ దాఖలుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అవకాశం ఇచ్చింది. చిత్తూరు జిల్లా కలకడ జెడ్పీటీసీ స్థానంలో మరణించిన టీడీపీ అభ్యర్థికి బదులుగా ఆ పార్టీ నుంచి ఎవరూ పోటీలో నిలవలేదు. అక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి ఒక్కరే పోటీలో ఉండడంతో ఆ జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. మిగిలిన 10 జెడ్పీటీసీ స్థానాల్లో మొత్తం 40 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. 

సర్పంచి, వార్డు పదవులకు 14న పోలింగ్‌
రాష్ట్రవ్యాప్తంగా 500 గ్రామ పంచాయతీల పరిధిలో 69 సర్పంచి, 533 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనుండగా మంగళవారం సాయంత్రానికి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. 30 సర్పంచి స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. మరో 4 చోట్ల ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 35 చోట్ల 109 మంది పోటీలో ఉండగా అక్కడ  ఈ నెల 14వ తేదీ పోలింగ్‌ జరగనుంది. 533 వార్డు సభ్యుల పదవుల్లో 380 చోట్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. మరో 85 చోట్ల ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 68 వార్డుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 192 మంది పోటీలో ఉన్నారు. 

50 ఎంపీటీసీలు ఏకగ్రీవం..
ఎన్నికలు ఆగిపోవడం, గెలిచిన వారు మృతి చెందడం లాంటి కారణాలతో 176 ఎంపీటీసీ స్థానాల్లో తాజాగా ఎన్నికలు నిర్వహిస్తుండగా నామినేషన్లు ఉపసంహరణ ప్రక్రియ ముగిసే సమయానికి 50 చోట్ల ఏకగ్రీవాలయ్యాయి. ఇందులో 46 చోట్ల అధికార వైయ‌స్ఆర్ సీపీ  ఏకగ్రీవంగా గెలుచుకోగా మూడు చోట్ల టీడీపీ, ఒక చోట ఇండిపెండెంట్‌ అభ్యర్ధి ఏకగ్రీవంగా గెలుపొందారు. మరో మూడు ఎంపీటీసీ స్థానాల్లో ఒక్కరు కూడా నామినేషన్‌ దాఖలు చేయలేదు. మిగిలిన 123 చోట్ల ఎన్నికలు జరగనుండగా 328 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగేచోట ఈ నెల 16వ తేదీన పోలింగ్‌ జరగనుంది.  

తాజా ఫోటోలు

Back to Top