బద్వేలులో వైయ‌స్ఆర్‌ సీపీ అభ్యర్థి నామినేషన్‌

హాజరైన ప్రభుత్వ సలహాదారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

 బద్వేలు  : వైయ‌స్ఆర్ జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా డాక్టర్‌ సుధ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. స్థానిక నెల్లూరు రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు వాహనాల్లో చేరుకుని అక్కడి నుంచి తహసీల్దారు కార్యాలయంలోని నియోజకవర్గ ఎన్నికల అధికారి కేతన్‌గార్గ్‌కు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆమె వెంట ఉన్నారు.

నామినేషన్‌ పత్రాలను సమర్పించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మాట్లాడుతూ రెండున్నరేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఉప ఎన్నికలో భారీ మెజార్టీ సాధించేందుకు కృషిచేస్తామని తెలిపారు. అభ్యర్థి డాక్టర్‌ సుధ మాట్లాడుతూ జిల్లాలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గాల్లో ఒకటైన బద్వేలు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీతో పాటు ఏడు మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top