రెడ్‌బుక్‌లో స్వామీజీలు, భక్తులు కూడా ఉన్నారా ?

మాజీ మంత్రి అంబటి రాంబాబు

గుంటూరు: ఏపీలో కూటమి నేతల రెడ్‌బుక్‌లో స్వామీజీలు, భక్తులు కూడా ఉన్నారా అనిమాజీ మంత్రి అంబటి రాంబాబు ప్ర‌శ్నించారు. టీటీడీ తీసుకున్న నిర్ణయాలు రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయని కామెంట్స్‌ చేశారు. అలాగే, కక్షలు, కార్పణ్యాలతో చంద్రబాబు, లోకేష్ కళ్ళు మూసుకుపోయాయని మండిపడ్డారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకున్న నిర్ణయాలు రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయి. అసలు బోర్డు ఏర్పాటు రాజకీయ ప్రేరేపితంగా జరిగింది. టీడీపీకి వెట్టిచాకిరి చేశాడు కాబట్టే బీఆర్‌ నాయుడును టీటీడీ చైర్మన్‌గా నియమించారు. టీడీపీ ఏది చెబితే అది తన టీవీలో వేసి గందరగోళం సృష్టించి సర్వశక్తులు ఉపయోగించి చంద్రబాబును ముఖ్యమంత్రి చేశారు. దానికి ప్రతిఫలంగా, దక్షిణగా చంద్రబాబు.. బీఆర్‌ నాయుడికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చాడు.

తాజాగా బోర్డు రెండు నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్టును రద్దు చేయడం దారుణం. శ్రీవాణి ట్రస్టులో అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.. విచారణ జరిపించారు. కానీ విచారణలో ఏమీ జరగలేదని తేలింది. వైఎస్‌ జగన్‌ హయాంలోనే శ్రీవాణి ట్రస్ట్ రూపకల్పన జరిగింది కాబట్టి కక్ష కట్టి ట్రస్ట్‌ను రద్దు చేశారు. శారదా పీఠం స్వరూపానంద స్వామిపై చంద్రబాబు నాయుడు, లోకేష్ కక్ష కట్టారు. స్వరూపానంద స్వామి ధర్మ ప్రచారం చేసే వ్యక్తి.

వైయ‌స్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొండపైన స్వరూపానందకు కేటాయించిన స్థలాన్ని ఇప్పుడు రద్దు చేశారు. స్వరూపానంద స్వామి పైన ప్రభుత్వానికి ఎందుకంత కక్ష?. మీ రెడ్బుక్‌లో స్వామీజీలు, భక్తులు కూడా ఉన్నారా?. సనాతన ధర్మాన్ని కాపాడే స్వామీజీపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్న చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. ఇప్పటికైనా చంద్రబాబు, లోకేష్ పునరాలోచించుకోవాలి అని కామెంట్స్‌ చేశారు. 

Back to Top