మహిళల గురించి మాట్లాడే హక్కు పవన్‌కు లేదు

మ‌హిళ‌ల‌ను వాడుకుని వదిలేసే నీచ సంస్కృతి పవన్‌ది

ముగ్గుర్ని పెళ్లి చేసుకొని, మ‌ళ్లీ నాల్గో పెళ్లికి రెడీ అవుతున్నాడ‌ట 

అలాంటి వ్య‌క్తి మహిళల భద్రత గురించి మాట్లాడడం హాస్యాస్పదం

సీఎం వైయస్‌ జగన్‌ మహిళా పక్షపాతి.. 

మూడేళ్లలో మహిళల ఆర్థిక, సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం కృషి

వైయస్ఆర్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ శ్రీ‌మ‌తి పోతుల సునీత‌

తాడేపల్లి: దుశ్శాసనుడు, కీచకుడు మహిళల గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో..  మహిళల రక్షణ గురించి పవన్‌కల్యాణ్‌ మాట్లాడితే అలాగే ఉంటుంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ శ్రీ‌మ‌తి పోతుల సునీత ధ్వ‌జ‌మెత్తారు. నిజానికి పవన్ క‌ల్యాణ్ దగ్గరే మహిళలకు రక్షణ లేదన్నారు. మ‌హిళ‌ల గురించి మాట్లాడే నైతిక హ‌క్కు ప‌వ‌న్‌కు లేద‌న్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాల‌యంలో శ్రీ‌మ‌తి పోతుల సునీత విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఏం మాట్లాడారంటే..

పవన్‌కు ఆ నైతిక హక్కు లేదు..
మహిళల రక్షణ గురించి మాట్లాడుతున్న పవన్‌, తన వ్యక్తిగత జీవితంలో వారికి ఎంత గౌరవం ఇచ్చారనేది అందరూ చూడాలి. ఆయనకు కుటుంబం అన్నా, వివాహ బంధం అన్నా, ఆయనకు ఏ మాత్రం నమ్మకం, బాధ్యత లేదు. పవన్‌ ఒక హీరో. సినిమాలో డైలాగ్‌లు చెబుతారు. ఆయన నిజ జీవితంలో కూడా సినిమాల్లో మాదిరిగా హీరోయిన్లతో పాటలు పాడి, డైలాగ్‌లు చెప్పినట్లు వ్యవహరించారు. పవన్‌కల్యాణ్ ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. దీన్ని బట్టి మహిళలను ఎలా గౌరవిస్తున్నాడనేది అర్థం అవుతుంది. ఒకరు లోకల్, మరొకరు నేషనల్, ఇంకొకరు ఇంటర్నేషనల్‌. ఇప్పుడు ఇంకొకరితో పెళ్లికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

వివాహ బంధం అనేది పవిత్రమైనది. జీవితాంతం భార్యాభర్తలు కలిసి ఉండేది. కష్టాలు వచ్చినా, కన్నీరొచ్చినా వారిద్దరూ కలిసి ఉండేది. దానికి పవన్ కల్యాణ్‌ ఏ విధమైన నిర్వచనం ఇచ్చారనేది తెలుస్తుంది. అలా మహిళలను వాడుకుని వదిలేసిన నీచ సంస్కృతి పవన్‌ది. ఆయన మహిళల రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఆయనకు ఆ మాటలు మాట్లాడే నైతిక హక్కు లేదు.
    
హోం మంత్రి మాటల వక్రీకరణ..
రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను దృష్టిలో ఉంచుకుని హోం మంత్రి ఆరోజు అలా అన్నారు. తల్లిదండ్రులు, టీచర్లు.. పిల్లలకు బ్యాడ్‌ టచ్‌ గురించి అవగాహన కల్పించాలని హోం మంత్రి మాట్లాడితే, ప్రతి సందర్భంలో పవన్‌కల్యాణ్‌ దాన్ని తప్పు పడుతున్నాడు. గత ప్రభుత్వ హయాంలో పవన్ కల్యాణ్, చంద్రబాబు ప్రభుత్వంతో కలిసి పనిచేశాడు. అప్పుడు కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ జరిగింది. ఎమ్మార్వో వనజాక్షికి అవమానం.. అలా ఎన్నో జరిగినా ఏనాడూ పవన్ నోరెత్తలేదు. ప్రశ్నించలేదు. ఆయన ఎందుకు మాట్లాడలేదు?

సీఎం చిత్తశుద్ధి..
పొరుగు రాష్ట్రంలో ఒక యువతి దారుణహత్యకు గురైతే, ఆమె పేరుతో ఇక్కడ మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ యాప్‌ రూపొందించారు. ప్రత్యేకంగా దిశ చట్టానికి రూపకల్పన చేశారు. దిశ యాప్‌ను దాదాపు 1.50 కోట్ల మంది మహిళలు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ యాప్‌ వారికి ఇవాళ ఎంతో రక్షణ కల్పిస్తోంది.

మహిళల రక్షణ, వారి మంచి, మేలు గురించి పవన్ మాట్లాడుతుంటే అందరికీ చాలా ఆశ్చర్యం కలుగుతోంది. రాష్ట్రంలో మహిళల రక్షణ, సంక్షేమం కోసం ముఖ్య‌మంత్రి ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాలలో అభివృద్ది చెందాలని, వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా రాణించేలా ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. పలు పథకాల్లో నేరుగా లబ్ధిని పిల్లల తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు వారిని మోసం చేస్తే, వైయస్‌ జగన్‌ గత మూడేళ్లుగా వారిని ఆదుకుంటూ, వారి రుణాలు నేరుగా చెల్లించడంతో పాటు, వారికి సున్నా వడ్డీ పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. ఇంకా వైయస్సార్‌ ఆసరా, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, చేయూత వంటి పథకాలతో పాటు, బాలికల కోసం కూడా స్వేచ్ఛ పథకం అమలు చేస్తున్నారు.

మహిళలే పవన్‌కు బుద్ది చెబుతారు..
వైయస్సార్‌సీపీ 151 సీట్లు గెల్చుకుని అధికార దర్పంతో వ్యవహరిస్తోందని పవన్‌ ఆరోపిస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం పూర్తి సేవాభావంతో పని చేస్తోంది. పవన్ ఇలాగే మాట్లాడుతూ పోతే, భవిష్యత్తులో మహిళలే ఆయనకు తగిన బుద్ధి చెబుతారు.

మహిళలంతా సీఎం వెంటే..
సీఎం వైయస్‌ జగన్‌ అన్ని రంగాలలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సచివాలయాల్లో 55 శాతం మహిళా ఉద్యోగులే ఉన్నారు. అన్ని నామినేటెడ్‌ పోస్టుల్లో కూడా వారికి 50 శాతం ఇస్తున్నారు. అందుకే 2024 ఎన్నికల్లో కూడా మహిళలంతా వైయస్‌ జగన్‌ వెంటే ఉంటారు. వైయస్‌ జగన్ ఈ మూడేళ్లలో మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా ఎంతో కృషి చేశారు. ఆయన మహిళా పక్షపాతి. వారు అభివృద్ధి చెందితేనే ఆ ఇల్లు, ఊరు, చివరకు రాష్ట్రం కూడా బాగుంటుందని నమ్మారు. ఆ దిశలోనే ఆయన చిత్తశుద్ధితో పని చేస్తున్నారు.

తాజా వీడియోలు

Back to Top