చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి

అందుకోసం వెంటనే బీసీ జనగణన చేపట్టాలి

జ్యుడీషియరీలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలి

ఆదర్శ గ్రామాలకు వెంటనే నిధులు మంజూరు చేయాలి

వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఏపీలో బీసీలకు స్వర్ణయుగం

వైయ‌స్ఆర్ సీపీ ఎంపీలు పిల్లి సుభాష్‌ చంద్ర‌బోస్, మోపిదేవి వెంక‌టర‌మ‌ణ‌

న్యూఢిల్లీ: చ‌ట్ట‌స‌భ‌లు, న్యాయ వ్యవస్థల్లో ఓబీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌లు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి వెంట‌నే బీసీ జ‌న‌గ‌ణ‌న చేప‌ట్టాల‌ని కోరారు. ప్ర‌ధాన‌మంత్రిని మోడీని క‌లిసి ప‌లు అంశాల‌పై విన‌తిప‌త్రం అంద‌జేసిన అనంత‌రం ఏపీ భ‌వ‌న్‌లో వైయ‌స్ఆర్ సీపీ ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు మీడియాతో మాట్లాడారు. చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, అదే విధంగా జ్యూడీషియరీలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశామ‌న్నారు. అంత కంటే ముందే బీసీ జనగణన చేయాలని కూడా కోరామ‌ని చెప్పారు. బీసీ జ‌న‌గ‌ణ‌న‌ జరగకపోతే రాజ్యాంగ సవరణకు అవకాశం ఉండదు కాబట్టి.. జనాభా లెక్కలు తేలకుండా, రిజర్వేషన్లు కల్పించాలంటే సాధ్యం కాదు కాబట్టి, బీసీ జనగణన జరపాలని విజ్ఞప్తి చేశామ‌ని వివ‌రించారు. 

ఇంకా ఏం మాట్లాడారంటే.. 
జ్యుడీషియరీలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరాం. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు కేవలం ఐదుగురు ఎస్సీలు మాత్రమే జడ్జీలుగా నియమితులయ్యారు. ఇంకా 14 హైకోర్టులలో ఈ 75 ఏళ్లలో ఒక ఎస్సీ జడ్జీ లేరు. ఇవన్నీ పార్లమెంటులో ప్రస్తావించడం జరిగింది. మెజిస్ట్రేట్‌ కోర్టు నుంచి ఆ రిజర్వేషన్లు అమలు చేయాలని విజ్ఞప్తి చేశాం.

ఆ రహదారుల నిర్మాణం
అమలాపురం నియోజకవర్గంలో కాకినాడ–అమలాపురం రోడ్‌. కత్తిపూడి దగ్గర మొదలు పెట్టి ద్రాక్షారామం, కోటిపల్లి మీదుగా అమలాపురం వరకు రహదారి నిర్మించాలని, అందుకోసం గోదావరిపై వంతెన నిర్మించాలని కోరాం. ఇంకా జొన్నాడ నుంచి రామచంద్రాపురం, మండపేట మీదుగా కాకినాడ వరకు రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ప్రధానిగారిని కోరాం.

ఆదర్శ గ్రామాలకు నిధులు
ఇక ఆదర్శ గ్రామాలు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఏటా ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని వాటిలో కనీస సదుపాయాలు కల్పించే విధంగా ప్రధాని ఆ కార్యక్రమం మొదలుపెట్టినా, అమలు కావడం లేదు. గ్రామాలు ఎంపిక చేస్తున్నా, నిధులు మాత్రం మంజూరు చేయడం లేదు. ఈ విషయాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లాం. అమలాపురం నియోజకవర్గంలోని దంగేర్‌ అనే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసి, పలు అభివృద్ధి పనుల కోసం రూ.7.79 కోట్ల నిధులు ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశాం. 

బీసీ జనాభాపై స్పష్టత లేదు
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా, ఇప్పటికీ బీసీలు ఎక్కడెక్కడ ఎంత మంది ఉన్నారు? వారి జీవన స్థితిగతులు ఏమిటన్నది స్పష్టంగా లేదు. నిజానికి దేశ వ్యాప్తంగా చూసినా దాదాపు సగం బీసీలు ఉన్నారు. కానీ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వారికి చెప్పుకోదగిన గుర్తింపు లేదు. కాబట్టి వారికి న్యాయం జరగాలంటే, తొలుత బీసీ జనగణన చేసి, రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రధానిని కోరాం.

ఏపీలో బీసీలకు స్వర్ణయుగం
వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చాక బీసీలకు స్వర్ణయుగం కొనసాగుతోంది. అందుకు ఎన్నో ఉదాహరణలు. బీసీలు ఎంత మంది ఉన్నారనేది వివరాలు లేకపోయినా, వారికి తగిన గుర్తింపు ఇస్తున్నారు. నామినేటెడ్‌ పదవుల్లో బీసీలకు తగిన ప్రాతినిథ్యం కల్పించారు. ఆ విధంగా వారికి రాజకీయ ప్రాధాన్యం ఇచ్చి, గౌరవప్రదమైన గుర్తింపు ఇచ్చారు.

బీసీలకు 4.74 కోట్ల ప్రయోజనాలు
అంతే కాకుండా అనేక పథకాల ద్వారా కూడా బీసీలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నారు. డీబీటీ, నాన్‌ డీబీటీ విధానంలో వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు బీసీలకు దాదాపు 4.74 కోట్ల ప్రయోజనాలు అందగా, ఆ విలువ రూ.86,144 కోట్లు. ఆ విధంగా సీఎం వైయస్‌ జగన్‌ బీసీల అభ్యున్నతి కోసం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అదే తరహాలో జాతీయ స్థాయిలో కూడా బీసీ కోసం వాటన్నింటినీ అమలు చేసేలా కేంద్రం తగిన నిర్ణయం తీసుకోవాలని వైయస్సార్‌సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top