న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం, త్రిసభ్య కమిటీ ఎజెండాలో హోదా అంశాన్ని చేర్చడం శుభ పరిణామం అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. కేంద్ర హోం శాఖ త్రిసభ్య కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఎంపీ బాలశౌరి స్పందిస్తూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఢిల్లీ వచ్చినప్పుడల్లా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా దగ్గర ప్రత్యేక హోదా విషయాన్ని, విభజన హామీల అంశాలను ప్రస్తావిస్తూనే ఉన్నారన్నారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు తన స్వార్థం కోసం ప్యాకేజీని ఒప్పుకుని, హోదా రాకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు.
పార్లమెంటులో ప్రతి సమావేశంలో ప్రత్యేక హోదా గురించి ప్రస్తావిస్తున్నామని, ఇదే పట్టుదలతో వైయస్ఆర్ సీపీ ఎంపీలందరం ముఖ్యమంత్రి సలహాలు, సూచనలకు అనుగుణంగా పనిచేసి హోదా సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని, హోదా సాధన కోసం సీఎం వైయస్ జగన్ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారన్నారు. సీఎం కృషి వల్లనే త్రిసభ్య కమిటీ సమావేశంలో హోదా అంశాన్ని కూడా చేర్చారని చెప్పారు. హోదా ముగిసిన అధ్యాయమని మాట్లాడిన చంద్రబాబు, టీడీపీ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
హోదా అనేది ముగిసిన అధ్యాయమని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. దాన్ని నీరుగార్చి, ప్యాకేజీ కోసం హోదా రాకుండా చేసింది చంద్రబాబేనని గుర్తుచేశారు. ఇకనైనా వారు తమ వైఖరి మార్చుకోవాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి ముందుకు రావాలని సూచించారు. సీఎం వైయస్ జగన్ కృషి, పట్టుదల వల్ల, ఆయన ప్రధానిని ఒప్పించడం వల్లనే త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుందన్నారు. ప్రత్యేక హోదాను కూడా ఎజెండాగా చేర్చారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా సాధించడం కోసం చాలా గట్టి ప్రయత్నం చేస్తామని చెప్పారు.