అవగాహన లేకుండా తెలంగాణ నేతల వాదన

రాష్ట్రానికి కేటాయించిన నీటినే వాడుకుంటున్నాం

అన్ని ప్రాంతాల అభివృద్ధికి పాటుపడిన నాయకుడు వైయస్‌ఆర్‌

పునాది రాళ్లకే పరిమితమైన పోలవరం, ప్రాణహిత చేవెళ్లకు అంకురార్పణ చేశారు

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసమే భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం 

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ధ్వజం

వైయస్‌ఆర్‌ జిల్లా: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఏ కార్యక్రమం అయినా తెలంగాణలోని చేవెళ్ల నుంచే మొదలుపెట్టారని, విశాల దృష్టితో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య అన్నారు. వైయస్‌ఆర్‌ది సంకుచిత మనస్తత్వం కాదని, తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్రలో వెనుకబడిన ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రాజెక్టులను రూపొందించారని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టులను రూపకల్పన చేసిన మహానాయకుడి గురించి అవగాహన లేకుండా మాట్లాడటం తగదని తెలంగాణ నాయకులకు సూచించారు. 

వైయస్‌ఆర్‌ జిల్లా కడపలో ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. 

దశాబ్దాల పాటు పునాది రాళ్లకే పరిమితమైన పోలవరం, ఇప్పుడు కాళేశ్వరంగా పిలవబడుతున్న ప్రాణహిత–చేవెళ్ల వంటి ప్రాజెక్టులకు వైయస్‌ఆర్‌ చేతుల మీదగానే అంకురార్పణ జరిగింది. అలాంటి వ్యక్తిని తెలంగాణ ద్రోహి అంటారా..? చరిత్ర తెలుసా మీకు..? అన్ని ప్రాంతాల మధ్య ఉండే అసమానతలు తొలగిపోవాలని ప్రయత్నం చేసింది వైయస్‌ఆర్‌. ఎవరైనా కాదనగలరా..? 

ఏదైనా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నీటి వసతి కల్పిస్తేనే రైతాంగం అభివృద్ధి చెందుతుంది.. రైతాంగం అభివృద్ధి చెందితేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటుందనే దృక్పథంతో అసమానతలు తొలగించడంలో భాగంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. సాక్షాత్తు కేసీఆర్‌ రాయలసీమకు అన్యాయం జరిగిందని గతంలో అన్నారు. బచావత్‌ అవార్డు ప్రకారం కృష్ణా జలాల్లోని 811 టీఎంసీల్లో 268.86 తెలంగాణకు ఇచ్చారు. ఆంధ్రప్రాంతానికి 374.44 టీఎంసీలు, రాయలసీమకు 122.70 టీఎంసీలు ఇచ్చారు. సామాజిక న్యాయం, వెనుకబాటుతనం, వర్షపాతం ఆధారంగా ఈ కేటాయింపులు జరగలేదు. 

న్యాయబద్ధంగా రాయలసీమలో వర్షపాతం తక్కువ, వెనుకబాటు తనం ఎక్కువ. సామాజిక న్యాయం చేయాలంటే ఎక్కువగా నీళ్లు ఇవ్వాలి. అటువంటిది బచావత్‌ అవార్డులో తక్కువగా ఇచ్చారు. దాన్ని సరిచేయడానికే వైయస్‌ఆర్‌ జలయజ్ఞం చేపట్టారు. ఆంధ్రలో 22, తెలంగాణలో 26, రాయలసీమలో 11 ప్రాజెక్టులు చేపట్టారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు చేపడితే కరెంట్‌ ఎక్కడ నుంచి తీసుకొస్తారని కొందరు ఎగతాళి చేశారు. కానీ, రెండు రాష్ట్రాల్లో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఆధారంగా మారింది. కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు అని చెప్పబడుతుందే.. దానికి అంకురార్పణ చేసిందెవరూ..? తెలంగాణ నాయకులు సమాధానం చెప్పాలి. 

పోతిరెడ్డిపాడుపై రాద్ధాంతం చేస్తున్నారు. రాష్ట్రానికి కేటాయించిన నీటినే వాడుతున్నాం. తెలుగు జాతి కోసం ఆనాడు కర్నూలు, కృష్ణా, పెన్నా ప్రాజెక్టులను రాయలసీమ ప్రజలు పోగొట్టుకున్నారు. పోతిరెడ్డిపాడు నిర్మాణం 1979లో మొదలుపెట్టారు.. 1986లో గేట్లు బిగించారు. 1993లో దాన్ని సామర్థ్యాన్ని 18,500 క్యూసెక్కులకు పెంచారు. 2008లో 44వేల క్యూసెక్కులకు వైయస్‌ఆర్‌ పెంచారు. అఖిలపక్షంలో ఆమోదం తెలిపిన తరువాతే తీసుకున్న నిర్ణయం ఇది. రాష్ట్రానికి కేటాయించిన దాంట్లో సప్లిమెంటేషన్‌ కిందనే కట్టుకుంటున్నాం.. ఇది ఏ విధంగా తప్పో సమాధానం చెప్పాలి..?

రాయలసీమ, నెల్లూరుకు తాగునీరు, సాగునీరు అందించాలంటే లిఫ్ట్‌ తప్పనిసరి అవుతుంది. దీన్ని అపెక్స్‌ కౌన్సిల్‌లో చెప్పడం జరిగింది. అందులో భాగంగానే సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని మొదలుపెట్టారు. దీని వల్ల తెలంగాణకు జరిగే నష్టం ఏమిటీ..? తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచుకున్నారు. రాజోలు డైవర్షన్‌ స్కీమ్‌కు సంబంధించి మనకు ఉండే 4 టీఎంసీ కేటాయింపులు ఉన్నాయి. దాన్ని వాడుకునే ప్రయత్నం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులేంటీ..? హుజూరాబాద్‌ ఉప ఎన్నికను దృష్టిపెట్టుకొని తెలంగాణ నాయకులు చేసే అలజడి తప్ప.. ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టడం వల్ల పాజిటివ్‌ రిజల్ట్‌ ఉండదు. ఈటల రాజేందర్‌ను ఓడగొట్టేందుకు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు’ అని ఎమ్మెల్సీ రామచంద్రయ్య అన్నారు. 
 

Back to Top