డీవీసీ ట్రస్ట్‌ పేరుతో సంగం డెయిరీ ఆస్తుల దోపిడీ..

రైతులకు చెందాల్సిన లాభాలను ట్రస్టుకు మళ్లిస్తున్న ధూళిపాళ్ల నరేంద్ర

సహకార సంస్థను సొంత వ్యాపార సంస్థగా మార్చి నిలువుదోపిడీ

డెయిరీ పేరుతో మోసాలు చేశాడు కాబట్టే ధూళిపాళ్ల అరెస్టు

నరేంద్ర కుట్రకు సంగం డెయిరీలో రైతులంతా మోసపోయారు

రైతుల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు

చంద్రబాబు వల్లే సహకార రంగంలోని డెయిరీలు నిర్వీర్యం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య

తాడేపల్లి: సంగం డెయిరీని ధూళిపాళ్ల నరేంద్ర తన సొంత వ్యాపార సంస్థగా మార్చుకొని రైతులను నిలువు దోపిడీ చేశాడని, రైతులకు చెందాల్సిన లాభాలను ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్టు పేరుతో కాజేశాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ధ్వజమెత్తారు. సహకార సంఘంలోని డెయిరీలను నిర్వీర్యం చేసిన నీచ చరిత్ర చంద్రబాబుదని, చిత్తూరు డెయిరీని మూసేసి హెరిటేజ్‌ సంస్థ పెట్టి.. రైతులకు చెందాల్సిన లాభాలను కాజేసి చంద్రబాబు వేల కోట్లు దోచుకున్నాడని మండిపడ్డారు. గురువును మించిన శిష్యుడిలా సంగం డెయిరీని ధూళిపాళ్ల నరేంద్ర కాజేశాడని ధ్వజమెత్తారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంగం డెయిరీలో జరిగిన అవినీతి అచ్చెన్నాయుడికి తెలియదా..? అని ప్రశ్నించారు. రైతుల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని, 2014లో రూ.87,612 కోట్ల రుణమాఫీ చేస్తామని నమ్మించి రైతులను వంచించారని ధ్వజమెత్తారు. బషీర్‌బాగ్‌లో రైతులను గు్రరాలతో తొక్కించిన ఘటన ఎవరూ మర్చిపోలేదన్నారు. 

వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి రాగానే.. వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం ద్వారా అన్నదాతను సీఎం వైయస్‌ జగన్‌ ఆదుకుంటున్నారన్నారు. 2019–20లో సుమారు రూ.13 వేల కోట్లు ఖర్చు చేశారని, ఈనెల 13వ తేదీన మరోసారి రైతుభరోసా సాయం రూ.4500 రైతుల ఖాతాల్లో జమ చేయనున్నామన్నారు. అంతేకాకుండా రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఉచిత బోర్లు, గిట్టుబాటు ధర ఇలా రైతుకు ఏ సమస్య రాకుండా చూస్తున్నారన్నారు. 

సంగం డెయిరీని అమూల్‌ సంస్థకు కట్టబెట్టారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే రోశయ్య మండిపడ్డారు. సంగం డెయిరీలో విపరీతమైన అవకతవకలు జరిగాయి కాబట్టే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేశారన్నారు. 1977లో పెద్ద మనుషులు స్థాపించిన సంస్థను.. కోఆపరేటివ్‌ యాక్ట్‌ను తుంగలో తొక్కి ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీని లాక్కొని తన సొంత వ్యాపార సంస్థగా మార్చుకున్నాడన్నారు. డెయిరీలోని లాభాలను సొసైటీ రైతులకు చెల్లించకుండా కాజేస్తున్నాడన్నారు. గురువును మించిన శిష్యుడిలా.. చంద్రబాబు బాటలో నడుస్తూ సంగం డెయిరీని ధూళిపాళ్ల నరేంద్ర కాజేశాడని ధ్వజమెత్తారు. 

సంగం డెయిరీ రైతులకు చెందిన సంస్థ అని ఎమ్మెల్యే రోశయ్య అన్నారు. డెయిరీలోని లాభాలను రైతులకు అందించకుండా.. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్‌కు మళ్లిస్తున్నారని మండిపడ్డారు. డెయిరీతో ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తే.. దాని మీద ది చైర్మన్‌ సంగం డెయిరీ అని ఉండాల్సింది పోయి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ మేనేజింగ్‌ ట్రస్టీ అని, జీవితకాలం ధూళిపాళ్ల నరేంద్ర మేనేజింగ్‌ ట్రస్టీ ఉండేలా అగ్రిమెంట్‌లో రాసుకున్నారని ధ్వజమెత్తారు. 

డెయిరీ అనేది మీ సొంత ఆస్తా..? జీవితం కాలం మీరు మేనేజింగ్‌ ట్రస్టీ, తరువాత మీ కుటుంబ సభ్యులకా..? రైతులను అడిగి తీసుకున్నావా..? అని ధూళిపాళ్ల నరేంద్ర చౌదరిని ప్రశ్నించారు. ఒకపక్క సొసైటీ లాభాలను ట్రస్టుకు డొనేట్‌ చేస్తూనే.. మరోపక్క డెయిరీ లాభాలను కూడా 3 – 5 శాతం ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్టుకు ఇచ్చేలా 2019లో తీర్మానం చేసుకున్నాడన్నారు. డెయిరీలోని లాభాలు రైతులకు అవసరం లేదా..? అని నిలదీశారు. ధూళిపాళ్ల నరేంద్ర చేసిన కుట్రలకు సంగం డెయిరీకి పాలుపోసే రైతులంతా నిలువునా దోపిడీకి గురయ్యారన్నారు. 
 

Back to Top