తండ్రీకొడుకులకు తలకాయ నిండా విషమే..

రాష్ట్ర ప్రజలను బతకనివ్వదలుచుకున్నారా..? లేదా..?

పచ్చ ముఠా దుష్ప్రచారానికి కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్‌ స్పష్టమైన సమాధానం

కోవిడ్‌ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చిన ఏకైక సీఎం వైయస్‌ జగన్‌

వ్యాక్సిన్‌ కేటాయింపులను కేంద్ర టాస్క్‌ఫోర్స్‌ మానిటరింగ్‌ చేస్తోంది

కోవిడ్‌పై చంద్రబాబు విషప్రచారం దేహద్రోహం, రాజద్రోహమే..

చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారంపై ఎక్కడికక్కడ కేసులు పెట్టండి

ప్రజలకు, పార్టీ శ్రేణులకు వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు

తాడేపల్లి: గత పది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంపై పచ్చ ముఠా చేస్తున్న దుష్ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఫైల్‌ చేసిన అఫిడవిట్‌ స్పష్టమైన సమాధానం అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు ముఠా, పచ్చ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబీఎన్, ఈటీవీలు గత పది రోజులుగా పనిగట్టుకొని ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగానే జరుగుతోందన్నారు. ఏ రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్లు పంపాలనే దానిపై స్పష్టమైన నియంత్రణ ఉందన్నారు. వ్యాక్సిన్‌ కేటాయింపులను కేంద్ర టాస్క్‌ఫోర్స్‌ మానిటరింగ్‌ చేస్తోందన్నారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను రక్షించుకోవడానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నారన్నారు. ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా వదులుకోకుండా లేఖలు రాస్తూ.. ఏపీకి ఎక్కువ కేటాయించండి అని రిక్వస్ట్‌ చేస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి లక్షల మందికి ఉచితంగా వైద్యం అందిస్తున్నారని గుర్తుచేశారు. 45 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రాధాన్యతగా పెట్టుకుందన్నారు. కుటుంబంలో పెద్దవాళ్లకు ఇమ్యునిటీ పవర్‌ తక్కువ ఉంటుంది కాబట్టి వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కానీ, చంద్రబాబు, ఆయనకు బాకా ఊదే ఎల్లో మీడియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయని సజ్జల ధ్వజమెత్తారు. 

చంద్రబాబులో మొత్తం ఉన్మాదం, కుట్ర రాజకీయం దాగి ఉందని, ఆయన్ను  అనడానికి ఎలాంటి మాటలు కూడా లేవన్నారు. తండ్రీకొడుకుల తల నిండా విషం తప్ప ఏమీ లేదన్నారు. చంద్రబాబు పెంపకంలో తయారైన పార్టీ కూడా అలాగే తయారైందని, మురికిగుండలో శ్వాస పీల్చగల క్రిములు ఏమైనా ఉంటే ఆ తెగకు చెందినవారు చంద్రబాబు అని ఘాటుగా విమర్శించారు. ఈ మాట అనడానికి బాధగా ఉన్నా.. అనక తప్పడం లేదన్నారు. 

సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే.. 

కోవిడ్‌ నేపథ్యంలో మెడిసిన్, వైద్యం, ఆక్సిజన్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఎలా జరుగుతుందనే అంశాలపై సుమోటోగా టేకప్‌ చేసిన కేసులో సుప్రీం కోర్టు ముందు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ ఫైల్‌ చేసింది. గత వారం పది రోజులుగా పనిగట్టుకొని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబు, పచ్చముఠాకు కేంద్ర అఫిడవిట్‌ సమాధానం. చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అందుకే వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు భారీగా తరలివస్తున్నారు. 

వ్యాక్సిన్‌ కేటాయింపులు, కొనుగోళ్లపై మంత్రులు, ఆరోగ్య శాఖ అధికారులు ప్రతి రోజూ క్లియర్‌గా చెబుతున్నారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి కంపెనీలకు, కేంద్రానికి లేఖలు రాస్తున్నామని చెప్పాం. కేంద్రం చెబితేనే కంపెనీలు కోటా ప్రకారం ఇస్తామంటున్నాయని చెప్పాం. ఇంత జరుగుతున్నా.. పనిగట్టుకొని చంద్రబాబు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నారు. సుప్రీం కోర్టు ముందు కేంద్రం ఫైల్‌ చేసిన అఫిడవిట్‌ కుండబద్దలు కొట్టినట్టు స్పష్టంగా ఎవరి నియంత్రణలో వ్యాక్సిన్లు ఉన్నాయనేది స్పష్టంగా తేలింది. 

అవేలబులిటీ, రాష్ట్రాల జనాభా, సెంట్రల్‌ డ్రగ్‌ ల్యాబరేటరీ క్లియర్‌ చేసిన దాన్ని బట్టి వ్యాక్సిన్‌ పంచుతూ.. కావాల్సిన ఉత్పత్తిని మ్యానిఫ్యాక్చరర్లకు చెబుతున్నాం. స్టేట్స్‌కు చెబుతున్నాం. అంత వరకు వాళ్లు పే చేసి కొనుగోలు చేసుకోవచ్చు అని క్లియర్‌గా ఉంది. కేంద్ర టాస్క్‌ఫోర్స్‌ ద్వారా ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్‌ ఎవరికి ఎంత ఇవ్వాలో కేటాయింపులను అన్నీంటినీ పర్యవేక్షిస్తున్నాం అని కేంద్రం చెబుతుంది.  ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్‌ ఈ మూడు ఏ స్టేట్‌ సొంతంగా చేసుకోవడానికి అవకాశం లేదు. సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ డిసైడ్‌ చేస్తుంది. ఆ మేరకే రాష్ట్రాలకు వాటి మీద హక్కు వస్తుంది. 

ఇంత స్పష్టంగా దీంట్లో ఉంటే గత పది రోజులుగా తెలుగుదేశం పార్టీ, దాని అధ్యక్షుడు చంద్రబాబు, ఒక ముఠా ఏం చేస్తున్నారంటే.. రాష్ట్ర ప్రజలను బతకనివ్వదలుచుకున్నారా..? ఉదయం లేచింది మొదలు వ్యాక్సిన్లు ఎందుకు తీసుకురావడం లేదని, డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టడం లేదు.. అని బ్యానర్‌ హెడ్డింగ్‌లు పెట్టి జనాలను మరింత రెచ్చగొడుతున్నారు. తద్వారా కోవిడ్‌ వ్యాప్తిని మరింత పెంచుతున్నారు. వీరికి ఏ శిక్ష వేయాలనేది ప్రధాన ప్రశ్నగా మారింది. 

విపత్కర పరిస్థితులో వీలైతే అందరూ కలిసి ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులకు, ప్రభుత్వానికి మద్దతుగా నిలబడి సలహాలివ్వాలి. అలాకాకుండా లేచింది మొదలు.. జూమ్‌లో అసత్య ఆరోపణలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ప్రతి సంక్షోభాన్ని ఎలా అవకాశంగా మల్చుకున్నాడో.. అలాగే ప్రతి ఒక్కరూ చేస్తారని అనుకుంటున్నాడు. నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్మే రామోజీ రావు బంధువైన భారత్‌ బయోటెక్‌ ఆయనకు చెప్పి వ్యాక్సిన్లు ఇప్పించివచ్చు కదా..? అని అడిగాం. 

వ్యాక్సినేషన్, ఆక్సిజన్, రెమిడెసివిర్‌ లాంటి మెడిసిన్‌ పెంచడం, తీసుకురావడం, డిస్ట్రిబ్యూషన్‌పై అధికార యంత్రాంగం అంతా పనిచేస్తోంది. ఆక్సిజన్‌ ప్లాంట్ల పెట్టడం,.. ఇంతగా ఒక పక్క ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కోవిడ్‌ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చింది. రూ.350 కోట్లు ఖర్చు చేసి లక్షకు పైగా బాధితులకు ఉచిత వైద్యం అందించారు. 

చంద్రబాబు రూలింగ్‌లో ఉన్న ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రులకు రూ.600 కోట్లు బకాయిలు పెట్టేసి వెళ్లారు. వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో భరోసా కల్పిస్తున్న సమయంలో.. చంద్రబాబు, టీడీపీ నేతలు విష ప్రచారంతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. తన కుటుంబంలో తల్లిని, తండ్రిని ఎలా చూసుకుంటామో.. తనకంటే పెద్ద వాళ్లను ఎలా చూడాలో సీఎం వైయస్‌ జగన్‌కు తెలుసు.. అందుకే 45 ఏళ్లపైబడిన వారికి వ్యాక్సినేషన్‌లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

కోవిడ్‌ డోసులు ఉంటే రోజుకు 6 లక్షల చొప్పు.. నెల రోజుల్లో వ్యాక్సినేసన్‌ ప్రక్రియ పూర్తిచేస్తాం. చంద్రబాబు, లోకేష్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నారా..? వ్యాక్సిన్‌ వస్తే మొదట మీ తండ్రికి, తల్లికి ఇస్తావా..? లేక నువ్వే వేసుకుంటావా..? లోకేష్‌ సమాధానం చెప్పాలి. 45 ఏళ్లు మించకుండా లోకేష్‌ వ్యాక్సిన్‌ వేసుకోవడం తప్పే.. హైదరాబాద్‌లో వేసుకున్నారా..? ఏపీలో వేసుకున్నారా..? బయట నుంచి తెప్పించుకున్నారా..? సమాధానం చెప్పాలి.

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని అంశాన్ని తీసుకువచ్చి చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి ముఖ్యమంత్రిపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వారిని ఏం చేయాలని విజ్ఞులు, మేధావులు, సివిల్‌ సొసైటీని అడుగుతున్నాను. వ్యాక్సిన్‌ సెంటర్ల దగ్గర జనం రద్దీకి కారణం చంద్రబాబు క్రియేట్‌ చేసిన దుష్ప్రచారమేనని భావిస్తున్నాం. ఇది ప్రజలను రెచ్చగొట్టడం, దేశ ద్రోహం కింద వస్తుంది. కోవిడ్‌ వ్యాప్తి చెందడంలో చంద్రబాబు పాత్ర కూడా ఉంది కాబట్టి.. ప్రజల మాస్‌ మర్డర్స్‌ వైపు కారణం అవుతున్నాడు. చంద్రబాబు ముఠాను కట్టడిని చేయాలంటే ఈ కారణాలన్నీ చూపిస్తూ ఎక్కడికక్కడ కేసులు పెట్టి.. నిలదీయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీ తరఫున చంద్రబాబు, ఎల్లో మీడియాపై కూడా కేసులు ఫైల్‌ చేస్తాం.’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 
 

Back to Top