చంద్రబాబు ప్రభుత్వం…. శాడిస్ట్‌ ప్రభుత్వంలా వ్యవహరిస్తోంది

మీడియా స‌మావేశంలో వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

కూటమి ప్రభుత్వంలో ఉన్నతాధికారులతో సహా ప్రభుత్వోద్యోగులపై వేధింపులు 

ప్రభుత్వ ఉద్యోగులకు స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం కల్పించింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం

ఉద్యోగులపై అధికారంలోకి రాకముందు చంద్రబాబు కపట ప్రేమ చూపారు

ఇప్పుడు వేధింపులకు పాల్పడుతున్నారు

ప్రజలకిచ్చిన హామీలు అమలుచేయకుండా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు

చంద్రబాబూ ఇకనైనా పద్దతి మార్చుకో – గడికోట శ్రీకాంత్‌ రెడ్డి హితవు

తాడేప‌ల్లి:  చంద్రబాబు ప్రభుత్వం…. శాడిస్ట్‌ ప్రభుత్వంలా వ్యవహరిస్తోంద‌ని వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి మండిప‌డ్డారు. ఏపీలో ప్రభుత్వోద్యోగులకు వేధింపులు, అవమానాలపై  శ్రీకాంత్‌ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రతి అంశంలోనూ కక్ష సాధింపు ధోరణి కనిపిస్తోందన్నారు, చంద్రబాబు సర్కార్‌ శాడిస్ట్‌ సర్కార్‌గా మారిందని ఆయన ధ్వ‌జ‌మెత్తారు. బుధ‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో శ్రీ‌కాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రెస్‌మీట్లో ముఖ్యమైన పాయింట్లు:

  • రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తున్నట్టు కనిపించడంలేదు. 
  • ప్రతి అంశంలోనూ కక్ష సాధింపు కనిపిస్తోంది. 
  • చంద్రబాబు ప్రభుత్వం శాడిస్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తోంది. 
  • తనకున్న మీడియా బలాన్ని వాడుకుని ఎదుటి పార్టీలను, ఆపార్టీల్లోని వ్యక్తుల వ్యక్తిత్వాలను హననం చేయడం, తాను చేస్తున్న ప్రచారాలకు బలం చేకూర్చేలా, అది ప్రజలు నిజమని నమ్మేలా ఉండేందుకు ఉన్నతాధికారుల సహా, ఉద్యోగుల్లో ఎలాంటి వారినైనా చంద్రబాబు బలి చేస్తున్నాడు. 
  • నెల్లూరు పర్యటన సందర్బంగా ఐ అండ్‌ పీఆర్‌ ఉద్యోగిపై చంద్రబాబు శివాలెత్తారు. 
  • శ్వేతపత్రం ఇస్తున్న సందర్భంలో కూడా చంద్రబాబు ఇలాగే నోటికొచ్చినట్టు మాట్లాడారు. 
  • ఒళ్లు దగ్గర పెట్టుకోండి అంటూ చిర్రుబుర్రులాడారు. 
  • ఇంకా తమాషాలు చేస్తున్నారంటూ.. తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.
  • అసలు ఉద్యోగులు అంటే.. చంద్రబాబుకు చాలా చిరాకు.
  •  గవర్నమెంటు ఉద్యోగులంటే మరీనూ. సరిగ్గా 2019కు ముందు ఉద్యోగులనుద్దేశించి ఆంధ్రజ్యోతి రాధాకష్ణ చంద్రబాబు మధ్య జరిగిన వీడియో సంభాషణ ఎన్ని తరాలైనా మరిచిపోం. 
  • ఈ ఎన్నికలకు ముందు ఉద్యోగుల మీద వాజ్యమైన ప్రేమ ఉన్నట్టుగా చంద్రబాబు నటించారు. వారిలో సగం తానే అన్నట్టుగా మాట్లాడారు. 
  • పాపం ఉద్యోగులు.. ఎప్పటి లానే.. నేరేడు చెట్టుకోతిమొసలి కథలో కోతి మొసలిని నమ్మినట్టుగా, బంగారు కడియంపులి కథలో పాపం బాటసారి పులిని నమ్మినట్టుగా నమ్మారు. 
  • మాకు మించి చంద్రబాబు ఏదో చేస్తాడనే నమ్మకంతో, విశ్వాసంతో చంద్రబాబు వైపు ఎక్కువ శాతంమంది ఉద్యోగులు మొగ్గుచూపారు. 
  • మా ప్రభుత్వ హయాంలో ఉద్యోగులను ప్రభుత్వంలో ఒక భాగంగా చూశాం. 
  • కోవిడ్‌ సంక్షోభం, తద్వారా ఆర్థిక వ్యవస్థలు అతాకుతలం కావడంతో ప్రపంచంలోని బాగా డబ్బున్న దేశాలు కూడా కుదేలైపోయాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఉద్యోగులను కంటికిరెప్పలా కాపాడుకున్నాం. 
  • అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఉంటే ఏం జరిగేదో.. తెలియంది కాదు.
  • ఉద్యోగులను ఆత్మీయంగా చూసుకున్నాం. కాబట్టే దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేయగలిగాం.
  •  30 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వడం దగ్గర నుంచి, ప్రతి పథకం అమల్లో కూడా ఉద్యోగుల చక్కగా సహకరించారు.
  • ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. మళ్లీ తన నిజ స్వరూపం చూపిస్తున్నారు. ఉద్యోగుల్ని వేధించి, వేధించి.. వెంటాడుతున్నాడు. 
  • చంద్రబాబు ఉద్యోగులపై హూంకరింపులు, చిరాకులు, పరాకులు, బెదిరింపులు.. వీటన్నింటి వెనుకా.. ఒక గేమ్‌ ఉంది. 
  • తనకు తానుగా కత్రిమ ఇమేజీని తెచ్చుకోవడానికి తన మీడియా సంస్థలతోకలిసి చంద్రబాబు ఆడుతున్న పబ్లిసిటీ డ్రామా ఇదంతా. ఈ గేమ్‌ వెనుక అసలు ఉద్దేశం అదే.  
  • తాను ఇచ్చిన వాగ్దానాల్ని చంద్రబాబు నెరవేర్చలేడు, మేనిఫెస్టోలో హామీలను ఎలాగూ గాలికి వదిలేస్తాడు, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టే అవకాశమే కనిపించడం లేదు. రాజకీయంగా కాపాడుకోవడానికి చేస్తున్న ప్రచార ఎత్తుగడలే ఇవన్నీ కూడా. 
  • దీంతోపాటు ఈమధ్య చంద్రబాబు తరచుగా ఇస్తున్న స్టేట్‌మెంట్‌ ఏంటంటే తనలో 95 నాటి సీఎంను చూస్తారంటున్నాడు. ఆరోజుల్లో చంద్రబాబు తన మా ఎన్టీఆర్‌ను వెన్నుపోటుపొడిచి కుర్చీలాక్కున్నాడు. ఆకస్మిక తనిఖీలు, అధికారులకు బెదిరింపులు, అందరిముందూ వారిని అవమాన పరచడం.. ఒక హైడ్రామా క్రియేట్‌ చేశారు. 
  • వాస్తవం ఏంటంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు కానీ.. అభివద్ధిపరంగా, సంక్షేమం పరంగా.. అన్ని రకాలుగానూ చంద్రబాబు అధికారంలో లేని కాలమే చాలా బాగుందని అనేక గణాంకాలు, అనేక రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. 

నాడు వైయస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో పూరిగుడిసెలు లేకుండా పక్కా ఇల్లు, రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరోవైపు అభివద్ది విషయంలో ఎంతో ముందుకు తీసుకెళ్ళారు. నాడు అనేక ప్రాజెక్ట్‌లు దాదాపు పూర్తిచేశారు.
 అదే వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో     మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుచేయడంతో పాటు పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించారు, చంద్రబాబు శ్రీసిటీకి వెళ్ళి నేనే పెట్టానంటున్నారు, కానీ అది వైఎస్‌ఆర్‌ గారి హయాంలోదని అందరికీ తెలుసు, చంద్రబాబు శ్రీసిటీలో శంకుస్ధాపన, ప్రారంభోత్సవాలు చేసింది వైయస్  జగన్‌ గారి హయాంలో పూర్తయినవే, పోర్టులు, షిప్పింగ్‌ హార్బర్‌లు, మెడికల్‌ కాలేజీలు, నాడు నేడు ఇలా అనేక మౌలిక వసతులు కల్పించి ముందుకు తీసుకెళ్ళారు, చంద్రబాబుకు భజన చేసే మీడియా సంస్ధలు మాత్రం పొగడ్తలతో ముంచెత్తుతోంది.  

చంద్రబాబు ప్రభుత్వంలో ఇవాళ ఉన్నతాధికారుల నుంచి దిగువ స్థాయి ఉద్యోగుల వరకూ గౌరవం లేకుండా పోయింది. ఐపీఎస్‌ అధికారులను, ఐఏఎస్‌ అధికారులను, జిల్లా స్థాయి అధికారులును, రిజిస్ట్రేషన్‌ శాఖ సిబ్బందిని, రెవిన్యూ అధికారులను, విద్యా శాఖ అధికారులను.. చివరకు గతంలో కలెక్టర్లుగా పని చేసిన వారిని.. ఇలా ఒక శాఖ కాదు, అన్ని శాఖల్లోనూ కూడా ఈ వేధింపులు కొనసాగుతున్నాయి. 
ప్రభుత్వాలు వస్తుంటాయి.. మారుతుంటాయి. కాని తమ సర్వీసుకాలంలో ఆయా ఉద్యోగులు శాశ్వతంగా ఉంటారు. ఏ ప్రభుత్వమైనా.. వారి విధానాలు, కార్యక్రమాలను బట్టి.. ఉద్యోగులు పని చేసుకుంటూ పోతారు. కేవలం ఒక ప్రభుత్వంలో పని చేశారు కాబట్టి, ఆ ప్రభుత్వం మారిన వెంటనే కొత్త ప్రభుత్వం కక్ష సాధిస్తే.. రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది. 
2014–19లో మీ సీఎంఓ కార్యాలయంలో పని చేసిన ప్రద్యుమ్నకు మా ప్రభుత్వంలో కూడా మంచి పోస్టింగ్‌ ఇచ్చాం. అలాగే సాయిప్రసాద్‌కు కూడా మంచి పోస్ట్‌ ఇచ్చాం. చివరకు మీ హయాంలో డీజీపీ ఉన్న ఠాకూర్‌కు కూడా మంచి పోస్టింగ్‌ ఇచ్చాం తప్ప, ఎక్కడా వారిపై పక్షపాతంతో వ్యవహరించ లేదే!
ఏ అధికారినీ తప్పుగా చూడలేదు. వారి సేవలను ప్రజా ప్రయోజనాలకు వినియోగించుకున్నాం. దేశంలోని ఎక్కడా లేని సంక్షేమాన్ని అందించాం. 
కాని ఇవాళ  అధికారులపై ముద్ర వేసి, వారిమీద కక్షకట్టి పక్కన పెట్టడమే, లేక సస్పెండ్‌ చేయడమో లేక ఇబ్బంది పెట్టడమో చేస్తున్నారు. ఏదైనా ఉంటే.. చట్ట ప్రకారం చేసుకోండి. ఇబ్బంది లేదు. కాని, ఎలాంటి ఆధారాలు లేకుండా, మీ పత్రికల్లో రాయించుకుని, వాటి ఆధారంగా అవే నిజాలుగా చూపించి మీరు చర్యలు తీసుకుంటున్నారు. ఇది కరెక్టు కాదు. మీ తీసుకొచ్చిన కొత్త సంప్రదాయాలు కచ్చితంగా మీకు ఎదురు తిరుగుతాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. 
ఇటీవల ఉద్దేశపూర్వకంగా ఈ మధ్య రోజూ పత్రికలలో చూస్తున్నాం, గనుల రెడ్డి, మైన్ల రెడ్డి, ఇసుక రెడ్డి ఇలా రాస్తునారు, ఒక ప్రాంత వాసులును, ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్‌ చేసి రాయడం సబబా
ప్రజలను డైవర్ట్‌ చేయడానికి ఫైల్స్‌ బాగోతం మొదలుపెట్టారు. అందుకే వీటిని డైవర్షన్‌ పాలిటిక్స్‌.. చంద్రబాబు ఫైల్స్‌ అంటున్నాం. చిత్తుకాగితాలు కాలిపోయినా ఫైల్స్‌ తగలబెట్టారంటున్నారు
మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ ఆఫీస్‌లో ఫైల్స్‌ తగలబడితే.. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఆ ప్రమాదం జరిగిందని చంద్రబాబు నెల్లూరు పర్యటనలో చెప్పకనే చెప్పారు. ఇంటలిజెన్స్‌ వాళ్లు, అదే విషయం చెప్పినా సరే, తాను వినలేదని వెంటనే డీజీపీని, సీఐడీ చీఫ్‌ను హుటాహుటిన హెలికాప్టర్‌లో మదనపల్లె పంపానని, చంద్రబాబు అసలు విషయం కక్కేశారు. 

ఒక మహిళా ఐఏఎస్‌ అధికారి మీద ఒక టీడీపీ నాయకుడు ఒక ట్వీటు పెడితే.. దాన్ని బేస్‌ చేసుకుని కూడా ఒక ఐఏఎస్‌ అధికారిని బదిలీచేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిది. ఇది సరైన విధానం కాదు, గతంలో సీఎంవోలో పనిచేసిన అధికారులకు పోస్టింగ్స్‌ ఇవ్వకుండా వేధిస్తున్నారు
రెండు రోజుల క్రితం ఏపీ ఫైబర్‌నెట్‌లో తప్పులు అంటూ ఒక ఐఆర్‌ఎస్‌ ఉద్యోగి మీద చంద్రబాబు తన ప్రతాపాన్ని  చూపారు. వాస్తవంగా ఫైబర్‌నెట్‌లో ఎవరు, ఏం చేశారు? అన్నది అందరీకి తెలుసు. రాష్ట్రంలో ఫైబర్‌నెట్‌ వ్యవహారంలో చంద్రబాబు, ఆయన సన్నిహితుడు వేమూరి హరికష్ణ అవినీతి చేశారు. దాని మీద కేసులు కూడా నడుస్తున్నాయి. దాన్ని కప్పిపుచ్చడానికి అక్కడేదో జరిగిపోయిందని ఇప్పుడు ఆ అధికారిని వేధించడం మొదలుపెట్టారు. కేవలం కడపలో పుట్టడమే ఆ అధికారి చేసిన తప్పు.
 ఫైబర్‌నెట్‌ కార్యక్రమం ప్రారంభమైన 2016–17 లో దాని ఆదాయం రూ.90 లక్షలు. చంద్రబాబు గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రెవిన్యూ కేవలం రూ.55 కోట్లు, ఆతర్వాత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం రాగానే 2019–20 నాటికి రెవిన్యూ రూ.126 కోట్లకు చేరింది. ఆతర్వాత నాలుగేళ్లలో కూడా ఫైబర్‌ నెట్‌ ఆదాయం స్థిరంగా నాలుగేళ్లపాటు రూ.200 కోట్లకు పైనే ఉంది. మరి ఎవరిది తప్పు? 
గడచిన ఐదేళ్లలో కాగ్‌ కూడా ఫైబర్‌ నెట్‌ ఆర్థిక వ్యవహారాలపై ఆడిట్‌ చేసింది. కాగ్‌ ఎక్కడా తప్పు బట్టలేదు. కానీ, ఈనాడు పత్రిక రాస్తుంది. చంద్రబాబు కేసులు పెడతారు. కారణం ఆ అధికారిది కడప కాబట్టి. 
ఇక చంద్రబాబు వైఖరి చూసిన తర్వాత తెలుగు తమ్ముళ్లు, తెలుగుదేశం గూండాలు, రౌడీలు ఊళ్లలో టీచర్ల దగ్గర నుంచి, ఫీల్డ్‌ అసిస్టెంట్లు దగ్గర నుంచి, యానిమేటర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, రెవిన్యూ సిబ్బంది.. చివరకు పోలీసు సిబ్బందిపైన కూడా దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు జరుగుతూనే ఉన్నాయి.  టీడీపీ బిళ్ల పెట్టుకుంటే.. టీ ఇవ్వాలి, కాఫీ ఇవ్వాలి.. టీడీపీ రౌడీలు ఎక్కడ పెట్టమంటే.. అక్కడ సంతకం పెట్టాలి.. అదీ ఉద్యోగుల పరిస్థితి.
 ఇకనైనా చంద్రబాబు పద్దతులు మార్చుకోవాల.ఇ ప్రజాస్వామ్య స్పూర్తితో ప్రజలకు మంచి చేయడంపై దష్టిపెట్టండి, ప్రజలకు, అధికారులకు విలువనిచ్చి ముందుకుసాగాలని చంద్రబాబు నాయుడు గారికి సూచిస్తున్నానని శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు.

Back to Top