శ్రీకాకుళం: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 23న ఉరవకొండలో వైయస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించగా నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. నాలుగో విడత నిధులు సీఎం వైయస్ జగన్ కంప్యూటర్‌లో బటన్ నొక్కి సుమారు 79 లక్షల మంది పొదుపు మహిళల ఖాతాల్లో రూ.6,394.83 కోట్లు జమ చేశారు. అక్కచెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి ముఖ్యమంత్రి అండగా నిలిచారు. పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని 2014లో చంద్రబాబు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని, తీరా గద్దెనెక్కాక మేనిఫెస్టోను చెత్త బుట్టలో పడేశారు. 2016 అక్టోబర్ నుంచి అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా రద్దు చేశారు. చంద్రబాబు చర్యలతో అప్పట్లో పొదుపు సంఘాల రుణాలు తడిసి మోపెడయ్యి వడ్డీలు, చక్రవడ్డీలు కట్టుకునే పరిస్థితి వచ్చింది. అక్కచెల్లెమ్మలపై ఇంత బాధ్యతగా, మమకారం చూపుతున్న ప్రభుత్వం వైయస్ఆర్‌సీపీనే. ఇప్పటి వరకు అమ్మ ఒడి పథకం కింద రూ.26,067 కోట్లు ఖర్చు చేశారు. వైయస్ఆర్ చేయూత పథకం ద్వారా 31.27 లక్షల మంది మహిళలకు రూ.14,129 కోట్లు అందజేశారు. మరో 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. నిర్మాణం పూర్తయిన ఒక్కో ఇంటి విలువ రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంటుంది. 25.45 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరుస్తూ.. వారి పిల్లలకు విద్యా దీవెన కింద రూ.11,900 కోట్లు ఇచ్చారు. వసతి దీవెన కింద మరో రూ.4,275 కోట్లు అందించారు. కాపు నేస్తం కింద రూ.2,028 కోట్లు, ఈబీసీ నేస్తం కింద రూ.1257 కోట్లు అందించారు. తాజాగా వైయస్ఆర్ ఆసరా పథకం కింద డ్వాక్రా సంఘాలకు డబ్బులు జమ చేస్తూ ఊరూరా పండుగ చేసుకుంటున్నారు. బుధవారం శ్రీకాకుళం, నగర కార్పొరేషన్, పెద్ధపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన వైయస్ఆర్ ఆసరా పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు ధర్మాన ప్రసాదరావు, వైయస్ఆర్‌సీపీ యువ నేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పాల్గొని డ్వాక్రా సంఘాలకు డబ్బులు పంపిణీ చేశారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ..ఎన్నికల సమీపిస్తున్నందున....ఇప్పుడు ఎంతోమంది మాయమాటలు చెప్పేవారొస్తారు. ఎక్కడో ఏదో అయిపోతోందంటూ కొన్ని పత్రికల్లోను, టీవీ ల్లోనూ ఊదరగొడుతూ మిమ్మల్ని మభ్యపెడతారని హెచ్చరించారు. అవన్నీ ఒక వర్గానికి కొమ్ముకాసేవే...అవన్నీ నమ్మకుండా...మీ గ్రామాల్లో మీ కళ్ళముందర మీకు కనిపిస్తున్న మంచిని చూడండి. మీ గ్రామాల్లో ఉన్న బడులు, ఆసుపత్రులు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ ఎవరి హాయాంలో వచ్చాయో గమనించాలని మంత్రి ధర్మాన విజ్ఞప్తి చేశారు.