వైయ‌స్ఆర్ కుటుంబంలో విషాదం 

వైయ‌స్‌ వివేకానందరెడ్డి కన్నుమూత
 

  వైయ‌స్ఆర్ జిల్లా : దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. వైయ‌స్ఆర్‌ సోదరుడు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చినాన్న‌మాజీ మంత్రి వైయ‌స్‌ వివేకానందరెడ్డి(68) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో పులివెందులలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే వివేకానందరెడ్డి సౌమ్యుడిగా పేరు పొందారు. తనకు సహాయం చేయమని అడిగిన వారి కోసం ఎంతవరకైనా వెళ్లేవారు. రాజకీయాల్లో వైయ‌స్ఆర్‌కు కుడిభుజంగా వ్యవహరిస్తూ అజాత శత్రువుగా ఉన్నారు.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా వివేకానందరెడ్డి పనిచేశారు. వైయ‌స్‌ వివేకానందరెడ్డి 1950 ఆగస్టు 8న పులివెందులలో జన్మించారు. వైయ‌స్ఆర్‌కు వివేకానందరెడ్డి చిన్న తమ్ముడు. తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు. 1989,1994లలో పులివెందుల నుంచి వైయ‌స్‌ వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004 లలో కడప పార్లమెంట్‌ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. వ్యయసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. చాల సౌమ్యునిగా పేరున్న వైయ‌స్‌ వివేకానందరెడ్డి హఠాన్మరణం కడప జిల్లాతో పాటు, వైయ‌స్ఆర్‌ కుటుంబ అభిమానుల్లో విషాద ఛాయలు నింపింది. 

 

Back to Top