మా నాన్న హత్యకేసు విచారణ పారదర్శకంగా జరిగేలా చూడండి

ఈసీని కలిసిన వైయ‌స్‌ వివేకా కుమార్తె సునీతారెడ్డి
 

  న్యూఢిల్లీ : తన తండ్రి వైయ‌స్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సిట్‌ విచారణను తప్పుదోవ పట్టించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారంటూ ఆయన కుమార్తె డాక్టర్‌ సునీతారెడ్డి శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తండ్రి  హత్యకేసును నిష్పక్షపాతంగా విచారించి, అసలు దోషులకు శిక్ష పడేలా చేయాలని ఆమె ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. కాగా తన తండ్రి హత్యపై జరుగుతున‍్న సిట్‌ విచారణ మీద రాజకీయ ఒత్తిళ్లు ఉన్నందున దర్యాప్తు సక్రమంగా జరిగేలా చర్చలు తీసుకోవాలంటూ సునీతా రెడ్డి నిన్న  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అయితే ఈ కేసు దర్యాప్తు విషయంలో తాము కలుగచేసుకునే అవకాశం లేదని, ఆ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించడం లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విరవణ కోరడం కానీ చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. దీంతో సునీతా రెడ్డి...కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు.  

అనంతరం సునీతా రెడ్డి మాట్లాడుతూ...‘మా నాన్న హత్యకేసు విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరాం. కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌ అధికారులు ఎప్పటికప‍్పుడు, డీజీపీ, సీఎం చంద్రబాబుకు వివరాలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రే తప్పుగా ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయంగా మా నాన్న హత్యను వాడుకోవాలని చూస్తున్నారు. దర్యాప్తులు ప్రభావితం చేసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారు. మా అన్న జగన్‌ మీద కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. సిట్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తుంది కాబట్టి విచారణ పాదర్శకంగా జరగటం లేదు. అదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం. కేంద్ర హోంశాఖను కలవాలని ఈసీ సూచించింది. ఆ మేరకు కేంద్ర హోంశాఖను కలిసి విచారణ నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరతాం.’ అని తెలిపారు.

 

Back to Top