హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర, పాదయాత్ర ఆధారంగా రూపొందించిన సినిమాను వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, కుటుంబ సభ్యులు సోమవారం చూశారు. సినిమా చూస్తున్నంతసేపు తీవ్ర భావోద్వేగానికి గురైన విజయమ్మ కంటతడి పెట్టడం కదిలించింది.
సినిమా అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని వదిలిపెట్టకుండా, ఆయన పిల్లలను అక్కున చేర్చుకున్న ప్రజలందరూ కూడా మహానేత చరిత్రతో వచ్చిన యాత్ర సినిమా చూస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
యాత్ర సినిమాను చాలా బాగా తీశారు. కోట్లాది హృదయాంతరాల్లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలను ’యాత్ర’ ద్వారా దర్శక, నిర్మాతలు తట్టిలేపారు. వైఎస్సార్ సజీవంగా మనముందు లేకపోయినా... యాత్ర చిత్రం ద్వారా ఆయనను మరోసారి మనముందుకు తీసుకువచ్చారని విజయమ్మ అన్నారు.
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇచ్చిన మాట కోసం వైఎస్సార్ కట్టుబడేవారని ఆమె తెలిపారు. ఈ చిత్రానికి పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తడమే కాకుండా మరోవైపు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు రాబడుతోంది. కాగా అంతకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ‍్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా యాత్ర టీమ్‌కు అభినందనలు తెలిపారు. చిత్ర దర్శకుడు, నిర్మాతలు దేవిరెడ్డి శశి, విజయ్ చిల్లా, శివ మేకా, వైఎస్సార్ పాత్రధారి హీరో మమ్ముట్టి, ఇతర చిత్ర బృందాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు.
సినిమాలో వైయస్ రాజశేఖరరెడ్డి పాత్రదారి హీరో మమ్ముటి నటనను ప్రత్యేకంగా ప్రశంసించారు. తన పాత్రను పోషించిన ఆశ్రితను ఆమె అభినందించారు. యాత్ర సినిమా ఈ నెల 8వ తేది ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఈ సినిమా తెలుగు ప్రజలు ఆసక్తిగా తిలకిస్తూ మహానేతను గుర్తు చేసుకుంటున్నారు.