దగా చేయడంలో లోకేష్‌కు చంద్రబాబు పోలికే

మంగళగిరి ప్రచార సభలో వైయస్‌ షర్మిల

కోట్ల మంది ప్రజల గుండెల్లో మహానేత ఇప్పటికీ బతికే ఉన్నారు

సీఎంగా ఉన్న ఐదేళ్లలో వైయస్‌ఆర్‌ ఏ ఒక్క ఛార్జీ పెంచలేదు

రుణమాఫీ పేరుతో రైతులను బాబు ఘోరంగా మోసం చేశారు

బాబు పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పూర్తిగా అటకెక్కింది

దగా చేయడంలో పప్పుకు అన్ని తండ్రి పోలికలే

ఏ అర్హత, అనుభవం ఉందని లోకేష్‌కు మూడు మంత్రి పదవులిచ్చారు

చంద్రబాబుది రోజుకో మాట..పూటకో వేషం 

హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేశారు

గుంటూరు: దగా చేయడంలో లోకేష్‌కు చంద్రబాబు పోలికలు వచ్చాయని వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోదరి వైయస్‌ షర్మిల విమర్శించారు. మాకు ఏ పార్టీతో పొత్తు లేదని,  సింహం సింగిల్‌గా వస్తుందని  చెప్పారు. హరికృష్ణ భౌతికకాయం పక్కనే టీఆర్‌ఎస్‌తో బాబు పొత్తుకు ప్రయత్నించారని, నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేశారని గుర్తు చేశారు. మంగళగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ షర్మిల ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ..
 

  • అన్నం పెట్టే రైతన్న అప్పుల పాలు కాకూడదని, విత్తనాల ధరలు తగ్గించి, మద్దతు ధరలు పెంచి, ఉచిత కరెంటు ఇచ్చి, ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ ఇచ్చి, రైతుకు వచ్చిన ప్రతి కష్టంలోనూ  నేను మీకు అండగా ఉంటానని భరోసా నింపిన నాయకుడు వైయస్‌ఆర్, వ్యవసాయాన్ని పండుగ చేసిన మహానుభావుడు వైయస్‌ఆర్‌. మహిళలు అంతా తన తోబుట్టువులని, ప్రతి అక్క, ప్రతి చెల్లి లక్షాధికారులు కావాలని ప్రోత్సహించారు. పేద విద్యార్థులు చదువుకుంటేనే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయని ఇంజనీరింగ్, డాక్టర్‌ వంటి ఏ చదువులైనా చదువుకోమని భరోసా ఇచ్చారు. మన రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు గొప్పగా చదువుకొని ఈ రోజు లక్షణంగా ఉద్యోగం చేసుకుంటున్నారు. 
  • పేదవాడు కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్లి ఉచితంగా వైద్యం చేయించుకోవాలనే ఆలోచన మునుపు ఎప్పుడూ ఏ నాయకుడికి రాలేదు. ఆరోగ్యశ్రీ లక్షల మందికి ప్రాణం పోసింది. కుయ్‌.. కుయ్‌ అని ఫోన్‌ చేస్తే 20 నిమిషాల్లో 108 లక్షల మందికి పునర్జన్మనిచ్చింది. ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని శ్రమించాడు. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలని ఆశపడ్డాడు. ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఒక్క చార్జీ, ఒక్క పన్ను పెంచకుండా అభివృద్ధి, సంక్షేమాలను అద్భుతంగా అమలు చేసిన రికార్డు ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌. నీది ఏ కులం, ఏ మతం అని అడగలేదు. ఆఖరికి నీది ఏపార్టీ అని కూడా అడగలేదు. మన, తన భేదం లేకుండా ప్రతి వర్గానికి మేలు చేసిన వ్యక్తి వైయస్‌ఆర్‌. అందుకే మహానేత చనిపోయి పదేళ్లు కావొస్తున్నా.. ఈ రోజు వరకు కోట్ల మంది గుండెల్లో ఇంకా బతికే ఉన్నారు. 
  • ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ఎలా ఉంది. గత ఎన్నికలప్పుడు రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. రుణమాఫీపై మొదటి సంతకం పెడతానన్నాడు. ఆ మొదటి వాగ్దానానికి దిక్కులేకుండా పోయింది. రైతన్నను ఘోరంగా మోసం చేశాడు. డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. ఐదేళ్లు అయిపోయింది ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు. చేయకపోగా.. ఇప్పుడు భిక్షం ఇచ్చినట్లు పసుపు – కుంకుమ అని పేరు పెట్టి పెద్ద బిల్డప్‌ ఇస్తూ మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంగిలి చెయ్యి విదిలిస్తే సరిపోతుందనుకుంటున్నాడా..? డ్వాక్రా రుణమాఫీ చేయకుండా మహిళలందరినీ ఘోరంగా వంచించాడు. ఇది మహిళలంతా గుర్తుంచుకోవాలి. చంద్రబాబు మాట మీద నిలబడే వ్యక్తి కాదు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు. ఎంత వరకు ఫీజురియంబర్స్‌మెంట్‌లో పూర్తిగా ఫీజు ఇస్తున్నాడు. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్‌ ఆస్పత్రులను లిస్టు నుంచి తీసేసి పేదవాడు మళ్లీ ప్రభుత్వ ఆస్పత్రికే వెళ్లాలని శాసిస్తున్నాడు. చంద్రబాబుకు, ఆయన కుటుంబానికి జబ్బు చేస్తే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తాడా..? 
  • పోలవరం ప్రాజెక్టు కమీషన్ల కోసం రూ. 15 వేల కోట్లు ఉంటే రూ. 60 వేల కోట్లకు పెంచాడు. మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తానన్న చంద్రబాబు. మాట మీద నిలబడే నైజం చంద్రబాబుకు ఉంటే ఈ రోజు పోలవరం పూర్తయ్యేది. 
  • అమరావతిలో రాజధాని పేరుతో వేల ఎకరాలను తన బినామీల పేర్లతో రాయించుకున్నాడు. మహిళలు, రైతన్నలు ఈ రోజుకి బాధపడుతున్నారు. భూములు లాక్కున్నారు. ఇష్టం లేకపోయినా బలవంతంగా లాక్కున్నారని, ఉన్నభూమి తీసుకొని ఇంకో చోట ఇస్తామని వాళ్లను పట్టించుకునే నాధుడే లేడని ఎంత బాధపడ్డారో.. వాళ్ల ఉసురు చంద్రబాబుకు తగలదా..?
  • కేంద్ర ప్రభుత్వం రూ. 2500 కోట్లు ఇచ్చిందంట. ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ కూడా కట్టలేదు. ఇంత చేతగాని ముఖ్యమంత్రి మనకు అవసరమా..? బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది. చంద్రబాబు కొడుకు లోకేష్‌కు మాత్రమే వచ్చింది. ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశాడు. ఈ పప్పుగారికి కనీసం జయంతికి, వర్థంతికి కూడా తేడా తెలియదు. అ, ఆ లు కూడా రావు కానీ అగ్రతాంబూలం నాకే అన్నాడంట వెనకటికి ఒకడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని మూడు శాఖలు కేటాయించారు. చంద్రబాబును అడుగుతున్నా.. ఇది పుత్రవాత్సల్యం కాదా.. చంద్రబాబు కొడుకు మూడు ఉద్యోగాలు, మామూలు ప్రజలకు ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు లేవు. పైగా సిగ్గులేకుండా టీడీపీ నేతలు అంటారు.. లోకేష్‌కు చాలా అవార్డులు వచ్చాయంట. పప్పుగారికి అవార్డులు ఇచ్చారంట. ప్రజలకు ఏం మేలు చేస్తే వచ్చాయి ఈ అవార్డులు. దేనికి పనికి వస్తాయి అవార్డులు నాలుక గీచుకోవడానికా..? 
  • తెలంగాణలో కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ ఐటీ శాఖామంత్రి అయ్యాడని, లోకేష్‌ కూడా అదే కావాలని ఇప్పించుకున్నాడు. పోనీ ఆయనలాగా ఒక్క పెద్ద కంపెనీ అయినా తెచ్చాడా అంటే ఒక్కటీ కూడా లేదు. చివరకు మైక్రోసాఫ్ట్‌ వస్తుందని గొప్పలు చెప్పుకున్న 12 గంటలలోపు మాకు ఆ ఉద్దేశం లేదని ఆ సంస్థ ప్రకటించింది. అంత సమర్థుడు పప్పుగారు. మంచి చేయకపోతే చేయకపోయాడు.. కనీసం చేతగాదని ఊరుకున్న బాగుండేది. 
  • ప్రభుత్వం దగ్గర మాత్రమే ఉండే సమాచారం.. ప్రజల ఆధార్, బ్యాంక్, ఓటర్‌ వివరాలు దొంగలించి తనకు కావాల్సిన ప్రైవేట్‌ కంపెనీలకు ఇచ్చేశాడు. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనేది ఒక సామెత. దగా చేయడంలో అన్ని తండ్రి పోలికలే పప్పుగారికి. ఈయన చేసిన దిక్కుమాలిన పనికి ఏ కుటుంబంలో ఎంత మంది ఆడపిల్లలు ఉన్నారు. ఏ బ్యాంక్‌ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉందనే అతి సున్నితమైన వివరాలు బజారులో పడింది. 
  • మోడీ – బాబు జోడీ కలిసి మన రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన ప్రత్యేక హోదాను పక్కనబెట్టారు. దానికి కారణం ఈ చంద్రబాబు కాదా..? గత ఎన్నికలకు ముందేమో హోదా అన్నాడు. ఎన్నికలు అయిపోయిన తరువాత ప్యాకేజీ అన్నాడు. ఇప్పుడు మళ్లీ హోదా అంటున్నాడు. మళ్లీ ఎన్నికలు అయిపోయిన తరువాత ఏమంటాడో.. తెలియదు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు అన్నాడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు అంట. చంద్రబాబుది రోజుకో మాట.. పూటకో వేషం. చంద్రబాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుతో పారిపోతుంది. చంద్రబాబును సూటిగా అడుగుతున్నా.. చేతనైతే నిజం చెప్పాలి. జగనన్న ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నా చేశారు. మన రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశారు. ప్రతి జిల్లాలో యువభేరి పెట్టి విద్యార్థులను చైతన్యపరిచాడు. రాస్తారోకోలు, బంద్‌లు, నిరసనలు ఈ ఐదేళ్లలో అనేక కార్యక్రమాలు చేశాడు. చివరకు వైయస్‌ఆర్‌ సీపీకి చెందిన ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. తరువాత నిరసనగా రాజీనామాలు కూడా చేశారు. చంద్రబాబును సూటిగా అడుగుతున్నా.. చేతనైతే నిజం చెప్పండి.. ప్రత్యేక హోదా కోసం జగనన్న ఇంతగా పోరాడకపోతే చంద్రబాబు నోట ప్రత్యేక హోదా కావాలి అనే మాట వచ్చి ఉండేదా.. హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అనే చంద్రబాబును యూటర్న్‌ తీసుకునేలా చేసింది జగనన్న కాదా.. 
  • చంద్రబాబుకు నిజం చెప్పడం చేతకాదు.. చంద్రబాబు నెత్తిమీద ఒక శాపం ఉందని నాన్న ఒక మాట అనేవారు. చంద్రబాబు ఎప్పుడు నిజం చెబుతారో ఆ రోజు చంద్రబాబు తల వెయ్యి ముక్కలు అవుతుందట. అందకనే నిజం చెప్పడు. గత ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలు ఇచ్చాడు. ఆ హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. వాటికి సమాధి కట్టి వెబ్‌సైట్‌లో మేనిఫెస్టో పెట్టుకునే ధైర్యం లేక దాన్ని కూడా తీసేశారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చాయని కొత్త అబద్ధాలు, మళ్లీ మోసపు హామీలు నమ్ముతారా.. ఒకసారి ఎవరినైనా మోసం చేయవచ్చు. అన్నిసార్లు అందరినీ మోసం చేయడం అసాధ్యం. నిన్ను నమ్మం బాబు అని చెప్పండి. 
  • ఓటుకు కోట్ల కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు. ఆ కేసుకు సంబంధించి ఆధారాలుగా వీడియో టేపులు, బ్రీఫ్డ్‌ మీ అంటూ ఆడియో టేపులు కూడా ఉన్నాయి. అడ్డంగా దొరికిపోయాడు కనుక హైదరాబాద్‌లో ఉంటే కేసులు పెడతారని భయపడి పారిపోయి వచ్చాడు. నిజానికి హైదరాబాద్‌ పదేళ్ల వరకు ఉమ్మడి రాజధాని అయినా బంగారు పల్లెంలో పెట్టి వారికి ఇచ్చేసి కేసుల కోసం పారిపోయి వచ్చాడు. ఆ రోజు నుంచి మూడు నెలల కిందటి వరకు కేసీఆర్‌తో పొత్తుపెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. మూడు నెలల కిందట హరికృష్ణ మృతదేహం పక్కనే ఉందనే ఇంగింతం లేకుండా పొత్తు మాట్లాడంట. ఇన్నేళ్లు పొత్తుకోసం ప్రయత్నించిన చంద్రబాబు.. ఇప్పుడు వైయస్‌ఆర్‌ సీపీపై ఆరోపణలు చేస్తున్నాడు. అలాగే ఇన్నాళ్లు బీజేపీతో సంసారం చేసింది చంద్రబాబు. హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అని ప్యాకేజీ అయితే కమీషన్లు వస్తాయని హోదాను తాకట్టుపెట్టాడు. ఇన్నాళ్లూ బీజేపీతో సంసారం చేసింది చంద్రబాబు అయితే ఇప్పుడు మాకు పొత్తు ఉందని బురదజల్లుతున్నాడు. స్పష్టంగా చెబుతున్నాం.. మాకు బీజేపీతో పొత్తు లేదు, కాంగ్రెస్‌తో పొత్తులేదు, కేసీఆర్‌తో పొత్తులేదు, ఎవరితోనూ పొత్తులేదు. సింహం సింగిల్‌గానే వస్తుంది. వైయస్‌ఆర్‌ సీపీ సింగిల్‌గా వచ్చినా బంపర్‌ మెజార్టీతో గెలుస్తుందని దేశంలో అన్ని సర్వేలు చెబుతున్నాయి. చంద్రబాబులా మాకు పొత్తులు అవసరం లేదు. చంద్రబాబు పిల్లను ఇచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. ఎన్టీఆర్‌ పార్టీని కబ్జా చేసిన వ్యక్తి, ఉచిత విద్యుత్‌ను హేళన చేసిన వాడు, వ్యవసాయం దండగ అనే వ్యక్తి, రైతులు బషీర్‌బాగ్‌లో ఆందోళన చేస్తే కనికరం లేకుండా వాళ్లను పిట్టల్లా కాల్చేశాడు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. 
  • చేపలకు ఎరవేసినట్లుగా పథకాలు ప్రకటిస్తున్నాడు.. మళ్లీ చంద్రబాబును నమ్మి మోసపోతారా.. కుక్కపిల్లలకు బిస్కెట్లు, చిన్న పిల్లలకు చాక్లెట్లు ఇచ్చినట్లు కాదు. చంద్రబాబుకు నిజంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దమ్మే ఉంటే అడగండి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. ఈ ఐదేళ్లలో వాళ్ల పిల్లల కోసం ఫీజు కట్టిన తల్లిదండ్రులు లెక్కలు వేసి చంద్రబాబు దగ్గర నుంచి వసూలు చేయండి. ప్రతి కాలేజీ విద్యార్థికి ఐప్యాడ్‌ ఇస్తానన్నాడు. ఎన్నికలలోపు ప్రతి విద్యార్థి ఐప్యాడ్‌ ఇవ్వమని అడగండి. డ్వాక్రా మహిళలు మొత్తం రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేశాడు. మీకు ఎంత అప్పు ఉంటే అంత బాకీ.. ఎన్నికలలోపు బాకీ తీర్చమని అడగండి. ఆడపిల్ల పుడితే రూ. 25 వేలు డిపాజిట్‌ చేస్తానని చెప్పాడు. ఈ ఐదేళ్లలో ఆడపిల్లలను కన్న ప్రతి తల్లిదండ్రులకు చంద్రబాబు రూ. 25 వేలు బాకీ ఉన్నట్లు అది తీర్చమని మీ హక్కుగా అడగండి. మహిళలందరికీ స్మార్ట్‌ ఫోన్లు ఇస్తానన్నాడు. ఎన్నికలలోపు అది కూడా ఇవ్వమని అడగండి. ఇంటికో ఉద్యోగం అన్నాడు.. లేదా రూ. 2 వేలు ఇస్తానన్నాడు. ఆ లెక్కన ప్రతి ఇంటికి రూ. 1.20 లక్షలు ప్రతి ఇంటికి బాకీ పడ్డాడు. ఆ బాకీ తీర్చమని అడగండి. ప్రతి పేద కుటుంబానికి మూడు సెంట్ల భూమి, పక్కా ఇల్లు అన్నాడు. వేల ఎకరాలను అమరావతిలో, విశాఖలో మింగేశాడు. ఆ భూమంతా మీదే రాసివ్వమని అడగండి. 
  • రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతలు, మరమగ్గాలకు పూర్తి రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చాడు. మీకున్న రుణమంతా చంద్రబాబు బాకీ ఉన్నట్లు.. బాకీ తీర్చమని అడగండి అది మీ హక్కు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఎన్నికల్లో వచ్చాయని చంద్రబాబు మీ ఓటును డబ్బుతో కొనాలని చూస్తున్నాడు. చంద్రబాబు ఎంత డబ్బు ఇచ్చినా మీ బాకీ తీరదు. చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీని వసూలు చేయండి. మీ హక్కుగా అడిగి ఇప్పించుకోండి. ప్రజల కోసం ఐదేళ్లు ఏమీ చేయలేదు. ఇప్పుడు మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఈ ఐదేళ్లు బాధ్యత దొంగ బాబుకు గుర్తుకు రాలేదు. పొరపాటున మీ భవిష్యత్తును బాబు చేతిలో పెడితే నాశనం చేసేస్తాడు. నారారూప రాక్షసులు వీళ్లు జాగ్రత్త. 
  • వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొమ్మిదేళ్లు విలువలతో కూడిన రాజకీయాలు మాత్రమే చేశారు. వైయస్‌ జగన్‌ను మీరు దగ్గరగా చూశారు. ప్రజలకు వచ్చిన ప్రతి కష్టంపై పోరాటం చేశారు. 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. కోట్ల మంది ప్రజలను కలుసుకున్నారు. వారి కష్టాలు విన్నారు. తెలుసుకున్నారు. అర్థం చేసుకున్నారు. కనుకనే నాన్నలాగా, కులం, మతం, వర్గం తేడా లేకుండా అన్ని వర్గాలకు మేలు చేయాలని ఆశపడుతున్నారు. ఒక్క అవకాశం ఇవ్వకూడదా.. వైయస్‌ఆర్‌ చనిపోతే 700 గుండెలు ఆగిపోయాయి. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా జరగనిది. ఎందుకుంటే వైయస్‌ఆర్‌ కనీవిని ఎరుగని ఎన్నో పథకాలను అద్భుతంగా అమలు చేశాడు కాబట్టే. మళ్లీ రాజన్న రాజ్యం కావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. మళ్లీ చెప్పింది చేసేవాడు కావాలంటే జగనన్న రావాలి. మాట తప్పనివాడు, మడమ తిప్పనివాడు కావాలంటే జగనన్న రావాలి. వెన్నుపోటు బాబు పోవాలంటే జగనన్న రావాలి. అవినీతి పోవాలంటే జగనన్న రావాలి. కొడుక్కు మాత్రమే జాబు ఇచ్చిన వాడు పోవాలంటే జగనన్న రావాలి. వ్యవసాయం మళ్లీ పండుగ కావాలంటే జగనన్న రావాలి. రాబోయే రాజన్న రాజ్యంలో మహిళలకు, రైతులకు, విద్యార్థులకు, వృద్ధులకు ప్రతి ఒక్కరికి మేలు చేస్తామని వాగ్దానం చేస్తున్నాం. 
  • చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి కుటుంబానికి రూ.లక్షన్నర ఇచ్చిన పెద్ద మనసున్న మనిషి వైయస్‌ఆర్‌. 2009 ఎన్నికలకు ముందు చేనేతలకు రుణమాఫీ కూడా చేస్తానన్నారు. మన దురదృష్టవశాత్తు ఆయన వెళ్లిపోయారు. ఆయన ఉండి ఉంటే రుణమాఫీ జరిగేది. గత ఎన్నికల్లో చేనేతలకు రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేశారు. రూ. వెయ్యి కోట్లతో ప్రతి సంవత్సరం ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. అది ఎక్కడా కనిపించలేదు. మేము చెబుతున్నాం.. రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మరమగ్గాల కోసం అప్పు చేసిన ప్రతి చేనేతకు రూ. 3 లక్షల రుణమాఫీ చేస్తాం. మగ్గం ఉన్న ప్రతి ఇంటికి రూ. 2 వేల పెన్షన్‌ ఇస్తామని వాగ్దానం చేస్తున్నాం. చేనేతలకు 45 ఏళ్లకే ఇంటికి ఇద్దరికి చొప్పున రూ. 2 వేల పెన్షన్‌ కూడా ఇస్తాం. ఒక్క చేనేతలనే కాదు.. ప్రజలందరినీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు జగనన్న. 
  • బాబు వస్తే జాబు వస్తుందన్నారు. కానీ, బాబు వస్తే కరువు వచ్చింది. అందుకే మాతో పాటు చెప్పండి.. బాయ్‌బాయ్‌ బాబూ అని చెప్పండి. ఇదే ప్రజా తీర్పు కావాలి. బాయ్‌ బాయ్‌ పప్పు కూడా.. వైయస్‌ఆర్‌ సీపీ తరుఫున ఎంపీ అభ్యర్థిగా వేణుగోపాల్‌రెడ్డి అన్న నిలబడుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్న నిలబడుతున్నారు. నాన్న చనిపోయి పదేళ్లు కావొస్తుంది. పదేళ్లలో ప్రతి ఒక్క రోజు అండగా నిలబడిన వ్యక్తి ఆర్కే అన్న. జగనన్నతో పాటు ఓదార్పు యాత్రలో ప్రతి రోజూ ఉన్నారు. మరో ప్రజాప్రస్థానం 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే అన్న నాకు తోడుగా ఉన్నారు. గత ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిపించారు. నిస్వార్థంగా సేవ చేశాడు. ఆఖరికి తన సొంత ఆస్తులు కూడా అమ్ముకొని లక్షల మందికి రూ. 4కే భోజనం పెడుతున్నాడు. రూ. 10కే కూరగాయల సంచిఇస్తున్నాడు. మంచికి, చెడుకు మధ్య జరుగుతున్న పోరాటంలో ప్రజలంతా మంచివైపు ఉండాలని, గొప్ప మెజార్టీతో ఆర్కే అన్నను గెలిపించాలని కోరుతున్నా. 
Back to Top