చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లు లేరా?

వైయస్‌ షర్మిళ

పుకార్లు పుట్టించడం టీడీపీకి కొత్తమే కాదు

వైయస్‌ జగన్‌ ఎంత సౌమ్యుడో పాదయాత్రలో అందరూ చూశారు

టీడీపీ నేతలు ఎందుకు పుకార్లను ఖండించడం లేదు

హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో తన పట్ల, కుటుంబ సభ్యుల పట్ల పుకార్లు పుట్టిస్తున్నది టీడీపీ నేతలే అని వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ సోదరి వైయస్‌ షర్మిళ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లు లేరా అని ఆమె ప్రశ్నించారు. తనపై వస్తున్న పుకార్లపై సోమవారం షర్మిళ హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తన భర్త అనిల్‌కుమార్, వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మలతో సీపీని కలిసిన షర్మిళ అనంతరం మీడియాతో మాట్లాడారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్‌ మీడియాలో పుకార్లు పుట్టించడం భావ్యం కాదన్నారు.

ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు పనే అన్నారు. గతంలో కూడా దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫ్యాక్షనిస్టు అని, వైయస్‌ జగన్‌ కోపిష్టిఅని చంద్రబాబు ప్రచారం చేశారని అవన్నీ తప్పు అని వైయస్‌ జగన్‌ పాదయాత్రలో స్పష్టమైందన్నారు. రాజకీయంగా ఎదుర్కొలేక చంద్రబాబు ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని మండిపడ్డారు. మహిళల పట్ల చులకనాభావంతో రాస్తున్న రాతలను సమాజం సమర్ధించదన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను అరికట్టాలని సీపీని కోరినట్లు చెప్పారు. నా గౌరవం కాపాడుకునేందుకు మీడియా మందుకు వచ్చానని చెప్పారు. తనకు ఎలాంటి సంబంధాలు లేవని తన పిల్లలపై ప్రమాణం చేసి చెప్పారు. ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్న వారు కూడా తమ పిల్లలపై ప్రమాణం చేసి చెబుతారా అని నిలదీశారు.

 

వైయస్‌ షర్మిలా ప్రెస్ మీట్ పూర్తి వివ‌రాలు ఇలా..
 అధికార తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సోదరి వైయస్‌ షర్మిల మండిపడ్డారు. ఒక మహిళ అనే గౌరవం  లేకుండా తెలుగుదేశం పార్టీ నాపై దుష్ప్రచారం చేస్తుందన్నారు.2014 ఎన్నికలకు ముందు దుష్ప్రచారం ఆన్‌లైన్‌లో ఒక క్యాంపెయిన్‌లా ఒక వర్గం నడిపిందన్నారు. మళ్లీ ఎన్నికల నేపథ్యంలో  విషప్రచారానికి వేగం పెంచారని ధ్వ‌జ‌మెత్తారు. ఒక మహిళ పట్ల  ఇంత చులకన భావంతో రాస్తున్న రాతలు, విష ప్రచారం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు.

మహిళలకు రక్షణ, గౌరవం, హక్కులు..మానవహక్కులనేవి కాగితాలకు, చర్చలకు మాత్రమే పరిమితం కాకూడదన్నారు. మహిళల పట్ల జరుగుతున్న విష ప్రచారాన్ని  ప్రజాస్వామవాదులు, నైతికత కలిగిన రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఖండించాలన్నారు. నాపై విషపు రాతలు పట్ల మీడియా ముందుకు వచ్చి వాదనను వినిపించే  దుస్థితికి రావడం సమాజంలో మహిళలందరికి అవమానకరమన్నారు. మాట్లాకపోతే కొంతమంది నిజం అనుకునే ప్రమాదం ఉందన్నారు. భర్తకు భార్యగా, తల్లిగా, చెల్లిగా నా నైతికతను నిరూపించుకోవలసిన అవసరం లేదని  భగవంతునికి నా నైతికత తెలుసు అని అన్నారు. నా గౌరవాన్ని కాపాడుకోవలసి ఉందన్నారు.

ఏ వ్యక్తితో సంబంధం ఉందో అని విష ప్రచారం చేస్తున్నారో  ఆ వ్యక్తిని ఎప్పుడు  చూడలేదు. ఒకసారి కూడా మాట్లాడలేదు..ఇది నిజ‌మ‌న్నారు. నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను అని పేర్కొన్నారు. రుజువులు, ఆధారాలు చూపించగలరా అని ప్రశ్నించారు. పుకార్లు పుట్టించి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. ఇంతటి దిగజారుడ  ప్రచారాల వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి పుకార్లు పుట్టించడం కొత్తేమీకాదని, మా తండ్రి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఫ్యాక్షనిస్టు అంటూ పుకార్లు పుట్టించింది తెలుగుదేశం పార్టీయే అని, నాన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషో  రాష్ట్ర ప్రజలు చూశారన్నారు.

అన్న వైయస్‌ జగన్‌  గర్విష్టి ,కోపిష్టి అని పుకార్లు పుట్టించింది కూడా తెలుగుదేశం పార్టీయే అని,  ఆయన ఎంత సౌమ్యుడో ప్రజా సంకల్పయాత్ర ద్వారా ప్రజలకు తెలిసిందన్నారు. మహిళపై అసభ్య ప్రచారం చేస్తే చంద్రబాబు  ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడే ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మీ కుటుంబంలో, పార్టీలో ఉన్న మహిళలకే ఆత్మగౌరవం ఉంటుందా అని చంద్రబాబును నిల‌దీశారు. దుష్ప్రచారాలు చేయించడం మాకు తెలియవని, మాకు విలువలు ఉన్నాయని మా అన్నకు నైతికత ఉందన్నారు. మా నాన్న ఎలా పోరాటం చేయాలో నేర్పార‌న్నారు. చంద్రబాబువి ఎప్పుడు మోసపూరిత ఆలోచనలే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నాయకులు అధికారంలో ఉనంత వర‌కు సమాజం బాగుపడదన్నారు.. నీచమైన రాజకీయాలు చేస్తూ పోతే శిక్ష తప్పదని. దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. దోషులను కఠినంగా శిక్షించాలని సీపీని కోరిన‌ట్లు ష‌ర్మిళ వివ‌రించారు. 
 

Back to Top