జన్మంతా జనం బాగు కోసమే పరితపించిన నిస్వార్థ సేవకుడు. తెలుగు నేలపై సంక్షేమ పునాదులు నిర్మించి ప్రజల గుండెల్లో అభిమాన కోటలు కట్టుకున్న కారణజన్ముడు. భావితరాల భవిష్యత్తు కోసం పూలదారులు పరిచిన దార్శనికుడు. ప్రజల సంతోషంలో తన ఆనందాన్ని వెతుక్కున్న నాయకుడు. తన ఐదేళ్ల పాలనలోనే అద్భుతాలు చేసి.. జనహృదయ నేతగా నిలిచారు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి. వైయస్ రాజశేఖరరెడ్డి (వైయస్ఆర్).. ఈపేరు తెలుగు నేలపై ఆకుపచ్చని జ్ఞాపకం. ప్రజాసేవకు అసలు సిసలు నిర్వచనం. కోట్లాది గుండెల్లో కొలువైన అరుదైన రూపం. ఇంకో వందేళ్లయినా సరే సాటి మనిషికి సాయమందితే గుర్తుకొచ్చేది వైయస్‌ఆరే. ప్రజా సంక్షేమం మాట వినపడితే గుర్తుకొచ్చేది రాజన్నే. పేద గుండెకు అన్ని విధాల బతుకు భరోసా దొరికితే, పేద బిడ్డ పెద్ద చదువుల కల నిజమైతే గుర్తుకొచ్చేది మన రాజశేఖరుడే. ప్రజా సంక్షేమమే శ్వాసగా, అభివృద్ధే ధ్యాసగా పాలన సాగించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. అక్షరాలా అనుకున్నట్టే జీవించారు.. జీవించిన కాలం 60 ఏళ్లే. రాజకీయ జీవితం 32 ఏళ్లు. అందులో ముఖ్యమంత్రిగా పనిచేసింది ఐదేళ్ల కాలం. ‘ఎంతకాలం జీవించామన్నది కాదు. ఎలా జీవించామన్నది ముఖ్యం’ అన్నది దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తాత్విక చింతన. అక్షరాలా అనుకున్నట్టే జీవించారు. పది కాలాల పాటు జనం గుండెల్లో నిలిచిపోయేలా ఎదిగారు. అధికారమంటే ‘ప్రజాసేవ’ మాత్రమేనని నిర్వచించిన కాలమది. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే రాజకీయ పరమావధిగా భావించి వారి అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు వైయస్ రాజశేఖరరెడ్డి. రైతులంటే ప్రాణం. ఆడపడుచులకు స్వంత అన్నయ్య వైయస్‌ఆర్. ప్రజలతో కలిసి, ప్రజలతో నడిచి ప్రజల మధ్యనే నిలిచి గెలిచిన ఎదిగిన వైయస్‌ఆర్ అడుగుజాడ.. ఎప్పటికీ ఓ వెలుగుజాడ. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా వైయస్ఆర్ పాదయాత్ర ప్రతిపక్ష నేతగా ఆయన ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు 2003 ఏప్రిల్ 9 నుంచి ప్రజాప్రస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్ర చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచింది. మండు వేసవిలో 1,467 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రకు ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కష్టాల్లో మునిగి.. కన్నీళ్లలో తడిసి, నిరాశలో కుంగిపోయిన సామాన్యులకు వైయస్‌ఆర్ ఓ పెద్ద దిక్కయి నిలిచాడు. జనసంక్షేమం తన కర్తవ్యంగా.. 2004లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైయస్‌ఆర్ రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై తొలి సంతకం చేశారు. అధికారపగ్గాలు అందుకున్న మరుక్షణం నుంచే జనసంక్షేమం తన కర్తవ్యంగా పనిచేసుకుపోయారు. వైయస్‌ఆర్ సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంలో పనుల్లో ఎంత వేగం ఉందో.. ఆ పనుల ఫలితాలను ప్రజలకు అందివ్వడంలోనూ అంతే వేగం కనిపించింది. ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నది రాజశేఖరుడు ఒక శాసనంగా చేసుకున్నాడు. దండగలా మిగిలిన వ్యవసాయం పండగైంది.. రైతును రాజు చేయాలని, దండగలా మిగిలిన వ్యవసాయాన్ని పండగ చేసి చూపించేందుకు జలయజ్ఞం కార్యక్రమంతో ప్రాజెక్టుల నిర్మాణానికి పునాదులు వేశారు. ఆయన హయాంలోనే ఎన్నెన్నో ప్రాజెక్టులు మొదలయ్యాయి. ఎన్నో పూర్తయ్యాయి.. మరెన్నింటి విషయంలోనో ఎక్కువ భాగం పనులు పూర్తయ్యాయి. 13 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందే అద్భుతం జరిగింది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం నిర్మాణం మహానేత హయాంలోనే ప్రారంభమైంది. తెలుగు నేలను సస్యశ్యామలం చేయాలన్నది వైయస్ఆర్ లక్ష్యం.. ఆ లక్ష్యసాధన దిశగానే ఎన్నో అడుగులుపడ్డాయి. అన్ని వర్గాలకు ఆప్తుడు.. విద్య, వైద్యం ప్రతి మనిషికీ అవసరం. వీటి విషయంలో ఏ పేద కుటుంబం అప్పులపాలు కాకూడదనేది వైయస్‌ఆర్ ఆలోచన. అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో కనిపించని ఆరోగ్యశ్రీ వంటి పథకాన్ని తేవడానికి సాహసించారు. వైద్యం అందక ఆగిపోతున్న గుండెకు భరోసాగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందించారు. 108తో ఎంతోమందికి పునర్జీవం పోశారు. అలాగే ఫీజురీయింబర్స్‌మెంట్ ద్వారా పేదింటి బిడ్డల పెద్ద చదువులకు గ్యారంటీ అయ్యారు. ''మీరెంత చదువుతారో చదవండి.. డాక్టర్ చదువుతారా.. ఇంజినీరింగ్ చేస్తారా.. మీ ఇష్టం.. మిమ్మల్ని చదివించే బాధ్యత నాది'' అని విద్యార్థుల భవిష్యత్తును కూడా తన భుజానికి ఎత్తుకున్నారు. మహిళా సాధికారత కోసం.. పావలా వడ్డీ పథకం కోట్లాది మహిళల మొహాల్లో చిరునవ్వుపూయించింది. మహిళా సాధికారత కోసం నాడు వైయస్‌ఆర్‌లా తపించిన రాజకీయ నాయకుడు లేడు. గూడు లేని నిరుపేదలకు పక్కా ఇల్లు కట్టించి ఆ కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచారు. అవ్వాతాతలకు పింఛన్లు అందించి వారికి పెద్దకొడుకుగా నిలిచారు. గిరిజనులకు పోడు భూములు అందించి అండగా నిలిచారు. గ్రామీణ ప్రాంతాలు రూపురేఖలు మార్చే పథకాలు, రైతన్నలకు వెన్నెముకగా నిలిచిన పథకాలు, పట్టణ ప్రాంతాల్లో పేదింటి జనం బాగోగుల కోసం పథకాలు.. అన్నీ వైయస్‌ఆర్ హయాంలో తలపెట్టిన అద్భుతాలు. పనికి ఆహార పథకం ఆంధ్రప్రదేశ్‌లోనే శ్రీకారం చుట్టుకుంది. ఉపాధి పథకంగా గొప్ప భరోసాగా నిలిచింది. ఆ పలకరింపుతోనే అందరి బంధువయ్యారు.. వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగిన ప్రభుత్వ పాలన మరో స్వర్ణ యుగమేనని చెప్పుకోవాలి. మనుషుల్లో తేడాలు చూడని అచ్చమైన, స్వచ్ఛమైన నాయకుడు డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి. అధికార పగ్గాలు చేతికందితే.. ప్రజలకెంత మేలు జరుగుతుందో తెలియడానికి వైయస్‌ఆర్ పాలనాకాలం ఓ సాక్ష్యం. చరిత్ర పుటల్లోకెక్కిన సువర్ణాధ్యాయం. నమస్తే బాబూ, నమస్తే పాపా, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ అంటూ ప్రతి గుండెను తాకే ఆ పలకరింపు తెలుగు ప్రజల చెవుల్లో నిత్యం మార్మోగుతూనే ఉంటుంది.. ఆ చిరునవ్వుల రూపం కళ్ల ఎదుట ఎప్పుడూ కదలాడుతూనే ఉంటుంది..