అమరావతి: అమరావతిలో అంబేడ్కర్ స్మృతివనం నిర్మిస్తానని గతంలో డాంబికాలు పోయిన చంద్రబాబు.. ఎక్కడో మారుమూల శాఖమూరులో స్థలం కేటాయించినట్లు ప్రకటించి ఐదేళ్లు వదిలేయడంతో స్మృతివనం స్ఫూర్తి తుమ్మ చెట్ల తుప్పల్లో చిక్కుకుపోయింది. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మహోన్నతంగా ఆలోచించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహనీయుని విగ్రహం మారుమూల ప్రాంతంలో కాకుండా విజయవాడ నగరం నడిబొడ్డున నిర్మించి నిలువెత్తు స్ఫూర్తిని నింపారు. ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్’ ప్రాంగణాన్ని అడుగడుగునా అద్భుతాలతో దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దారు. 18.81 ఎకరాల ప్రాంగణంలో 206 అడుగుల ఎత్తయిన సామాజిక న్యాయ మహాశిల్పంతో పాటు ఇక్కడ ప్రతి నిర్మాణం ఓ అద్భుతమే. రూ.404.35 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మహా స్థూపం (కోర్ వాల్)ను తుపాను గాలులు, భూకంపాల తీవ్రతను తట్టుకునేలా డిజైన్ చేశారు. 81 అడుగుల పీఠం (పెడస్టల్)పై 125 అడుగుల ఎత్తు, 510 మెట్రిక్ టన్నుల బరువైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చుట్టూ గార్డెన్స్, నీటి కొలను మధ్యలో కాలచక్ర మహా మండపం డిజైన్‌తో నిర్మించిన అంబేడ్కర్ విగ్రహ పీఠం ఓ అద్భుతం. పీఠం లోపల మూడు అంతస్తుల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచంలోనే పెద్దదైన ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని విహార థియేటర్‌లో అంబేడ్కర్ జీవిత చరిత్ర, విజ్ఞానం, భౌగోళిక, సంస్కృతి, చరిత్ర వంటి అనేక అంశాలపై సినిమాలు ప్రదర్శిస్తారు. అంబేడ్కర్ మైనపు బొమ్మతో కూడిన స్టడీ రూమ్, విద్యార్థుల కోసం ఇంటరాక్షన్ క్లాస్ రూమ్, అంబేడ్కర్ జీవిత చరిత్రతో కూడిన లైబ్రరీ కూడా ఉన్నాయి. రెండో అంతస్తును ధ్యాన మందిరం (మెడిటేషన్), సందర్శకులు అంబేడ్కర్ జీవిత చరిత్రపై అధ్యయనం చేసేలా తీర్చిదిద్దారు. అంబేడ్కర్ జీవిత చరిత్రతో కూడిన 36 కుడ్య చిత్రాలతో రూపొందించిన కొలనేడ్ మరో పెద్ద ఆకర్షణ.