అనకాపల్లి: పేదలకు ఉచిత వైద్యం అందించే ఆధునిక దేవాలయాలు అయిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎందుకు మూసేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఇవాళ వైయస్ జగన్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్ జగన్ ఏమన్నారంటే.. ఇదిగో నర్సీపట్నం మెడికల్ కాలేజీ.. వెనుకలా కనిపిస్తున్నది ఇదే నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ. దాదాపు 52 ఎకరాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలకు మంచి చేస్తూ అనకాపల్లి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ నిర్మాణం ఇక్కడ కనిపిస్తోంది. మెడికల్ కాలేజీలు..ఆధునిక దేవాలయాలు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి 17 మెడికల్ కాలేజీలు ..ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజీని తెచ్చాం. ఏ పేదవాడికైనా కూడా వైద్యం అన్నది, సూపర్ స్పెషాలిటీ సేవలు, మల్టీ స్పెషాలిటీ సేవలు ఉచితంగా అందుబాటులో ఉండే కార్యక్రమం ఈ ఆధునిక దేవాలయాల వల్ల సాధ్యమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మేలు జరిగించే కార్యక్రమం ఇది. ఆ 7, 8 నియోజకవర్గాలకు ఒక్కో మెడికల్ కాలేజీ తీసుకురావడం వల్ల ఏ పేదవాడికైనా కూడా సూపర్ స్పెషాలిటీ సేవలు ఉచితంగా అందుబాటులోకి వస్తాయి. ఆ నియోజకవర్గాల్లో ప్రైవేట్ ఆసుపత్రులు ఆ పేదవాడిని దగా చేయకుండా ఈ మెడికల్ కాలేజీలు ఉంటాయి. ఎందుకంటే పక్కనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మల్టీ స్పెషాలిటీ సేవలు ఉచితంగా అందుబాటులో ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రులకు ఎవరూ వెళ్లరు. కాబట్టి పేదవాడు దగా కావడం అన్నది పూర్తిగా ఫుల్ స్టాఫ్ పడుతుంది. ప్రతి జిల్లా కేంద్రాల్లోనూ కొత్తగా 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నడుపుతుంటే పేదవాడికి మేలు జరుగుతుంది. ఒక వైపున పేదవాడికి మంచి జరిగిస్తూ ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం ఇది. ప్రైవేట్ ఆసుపత్రులు దగా చేసే పరిస్థితి వస్తుంది. మరి ఇలాంటి ఆసుపత్రులను ఎందుకు మూసివేస్తున్నారని నేను అడుగుతున్నాను. అమరావతిలో రూ.2 లక్షల కోట్లు ఖర్చు?: – అదే అమరావతిలో నిర్మాణాల మౌలిక సదుపాయాల కోసం లక్ష కోట్లు ఖర్చు. కానీ ఖర్చు చేసింది రూ.5 వేల కోట్లు. – మరో 50 వేల ఎకరాలు కావాలంట. అంటే మరో లక్ష కోట్లు. అలా అమరావతిలో ఏకంగా రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తారట. – మెడికల్ కాలేజీల కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేయడట!. ఇదీ నర్సీపట్నం మెడికల్ కాలేజీ జీఓ: – ఇక్కడి ఎమ్మెల్యే స్పీకర్‌గా ఉన్నారు. చంద్రబాబు కన్నా అబద్దాలు చెబుతున్నాడు. – అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ఎంత వరకు ధర్మం? దీనికి జీఓ లేదా? జీఓ నెం:204. ఆగస్టు 8, 2022న జారీ అయింది. చూడండి. అంటూ ఆ జీఓ ప్రతి చూపారు. – దీనికి ఏం సమాధానం చెబుతావు? మరి క్షమాపణ చెబుతావా? స్పీకర్ పదవికి నీవు అర్హుడివేనా? మెడికల్ కాలేజీలకు ఫండింగ్ ఉంది: – గత ఏడాది చంద్రబాబుగారు సీఎం అయిన తర్వాత, సెప్టెంబరు 3న ఒక మెమో జారీ చేశారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలు ఆపాలని అందులో ఆదేశించారు. – అయ్యా స్పీకర్‌గారూ, చంద్రబాబుగారూ.. వీటికి ఫండింగ్ లేదన్నారు. వినండి. – నాబార్డు నుంచి, కేంద్రం నుంచి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిధులు కూడా వస్తున్నప్పుడు, ఏటా రూ.1000 కోట్ల చొప్పున, 5 ఏళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేరా? చంద్రబాబుగారిని అడుగుతున్నాను. ఇదీ మా కార్యాచరణ: – అయ్యా చంద్రబాబుగారూ, మీరు చేసే పనులకు నిరసనగా రేపటి నుంచి నవంబరు 22 వరకు గ్రామ, వార్డు స్థాయిలో రచ్చబండ. వార్డుల్లో, గ్రామాల్లో వీటన్నింటిని వివరిస్తాం. చంద్రబాబు సూపర్‌సిక్స్ పేరుతో చేసిన మోసాన్ని కూడా రచ్చబండలో వివరిస్తాం. – ప్రతి గ్రామం నుంచి 500 సంతకాలు. ప్రతి నియోజకవర్గం నుంచి 50 వేలకు తక్కువ కాకుండా సంతకాలు సేకరించి, రాష్ట్రం మొత్తంమీద కోటి సంతకాలు సేకరిస్తాం. – అక్టోబరు 28న నియోజకవర్గ కేంద్రాలు, నవంబరు 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తాం. – ఆ తర్వాత నవంబరు 23న నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, ఆ మర్నాడు నవంబరు 24న జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు ఆ సంతకాల పత్రాలు లారీల్లో వస్తాయి. – ఆ తర్వాత గవర్నర్‌గారి అపాయింట్‌మెంట్ తీసుకుని, వాటన్నింటినీ సమర్పిస్తాం. మాతో కలిసి వచ్చే వారందరినీ కలుపుకుపోతాం. – చంద్రబాబు ఇప్పటికైనా తన నిర్ణయం మార్చుకోవాలి. బుద్ధి తెచ్చుకోవాలి. చంద్రబాబు దారుణ పాలన: – ఇవాళ చంద్రబాబు పాలన దారుణ పాలన చూస్తే.. ఈరోజు కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో 170 మందికి హెపటైటిస్–ఏ వస్తే, వారిని చూసుకునే వారు లేరు. వారికి జాండిస్ సోకినట్లు సెప్టెంబరు 10న గుర్తించినా జాగ్రత్త తీసుకోలేదు. – ఇద్దరు విద్యార్థినిలు చనిపోయారు. – నాడు–నేడు మనబడిలో కురుపాం స్కూల్‌లో ఆర్‌వో ప్లాంట్ పెట్టాం. కానీ ఈ ప్రభుత్వం దాని క్యాండిల్స్ కూడా మార్చడం లేదు. దీంతో అవి నిరుపయోగమయ్యాయి. – 611 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురైనా మంచి వైద్యం అందించ లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్. ప్రైవేటీకరణ చర్యలు: – దారిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కలిశారు. నాడు ఎన్నికల ముందు విశాఖ ఉక్కు కంపెనీని కాపాడతానని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చాక ఏం చేయలేదు. – 32 విభాగాలు ప్రైవేటుపరం చేశారు. వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసేశారు. – కార్మికులకు ఉచిత విద్యుత్ తీసేశారు. అడిగితే షోకాజ్ నోటీస్‌లు ఇస్తున్నారు. – చోడవరం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు కూడా కలిశారు. – 2014–19 మధ్య ఆ కంపెనీని ప్రభుత్వం నాశనం చేస్తే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.89 కోట్లు ఇచ్చి ఆదుకున్నాం. – ఈరోజు ప్రభుత్వం మరో రూ.35 కోట్లు బకాయి పెట్టింది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. – బల్క్ డ్రగ్స్ కంపెనీ. పక్కనే నక్కపల్లిలో 400 ఎకరాల భూమి ఉన్నా, రాజయ్యపేటలో భూముల కోసం నోటిఫికేషన్ ఇస్తే, మత్స్యకారులు ఆందోళన చేస్తున్నా.. చంద్రబాబు పట్టించుకోవడం లేదు. – మరి వారికి ఎవరు ఊరటనిస్తారు? విశాఖలో చిరు వ్యాపారుల పొట్ట కొట్టారు: – మొన్ననే విశాఖలో 4500 చిన్న షాప్‌లు తీసేశారు. దాని వల్ల 32 వేల మంది ఎలా బ్రతుకుతారు? – అంత దుర్మార్గం చేయడం ఎంత వరకు సబబు? అన్ని రంగాలు నాశనం: – ఈరోజు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు నిర్వీర్యం. విద్యార్థులు, రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. అంటూ ఆయా పథకాల ప్రస్తావన. – ఆర్బీకేలు నిర్వీర్యం. ఈ–క్రాప్ తెరమరుగు. – సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్ మోసాలు. అన్ని పథకాలు రద్దు. దీంతో పేదలు, రైతులు, మహిళలు, పిల్లలు, విద్యార్థుల బ్రతుకులు రోడ్డున పడ్డాయి. చివరగా.. – అయ్యా చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి, జ్ఞానం ఉంటే మార్పు తెచ్చుకో. ప్రజలకు తోడుగా ఉండు. లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. ప్రైవేట్‌పరం చేస్తే పేదవాడికి ఎలా మంచి జరుగుతుంది? మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్‌పరం చేస్తే పేదవాడికి ఎలా మంచి జరుగుతుంది. ఇక ఉండేదంతా ప్రైవేట్‌వాళ్లే. వాళ్లే ఈ మెడికల్ కాలేజీలు నడుపుతారు. ఇక పేదవాడికి ఏరకంగా భరోసా ఉంటుంది. ఉచిత వైద్యం అన్నది పేదవాడికి ఎలా అందుబాటులోకి వస్తుంది. పేదవాడు దగాపడకుండా ప్రైవేట్‌పరం కాకుండా ఎలా చేయగలుగుతారని ప్రశ్నిస్తున్నాను. కోవిడ్ సంక్షోభంలోనూ రూ.500 కోట్లతో కాలేజీ నిర్మాణం ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్‌కు ఫుల్ స్టాఫ్ పెడుతూ రాష్ట్రవ్యాప్తంగా మంచి జరిగించే కార్యక్రమంలో భాగంగా మేం కొత్తగా 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చాం. ఈ రోజు ఇక్కడ ఉన్న కాలేజీ 52 ఎకరాల్లో ఉంది. ఈ కాలేజీకి సంబంధించి 2022 డిసెంబర్30వ తారీఖున శంకుస్థాపన చేసి, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా ఆ కష్టాలను అధిగమించి రూ.500 కోట్ల ఖర్చుతో ఆ రోజు పనులు ప్రారంభించాం. ఈ కాలేజీ నిర్మాణం పూర్తి అయ్యి ఉంటే ఈ మాదిరిగా మెడికల్ కాలేజీ ఉండేది( నర్సీపట్నం మెడికల్ కాలేజీ నమూనా) అంటూ ఫొటో ప్రదర్శించారు. డిసెంబర్30, 2022లో ఇదే కాలేజీకి శంకుస్థాపన చేశాం. 600 బెడ్లతో ఆసుపత్రి నిర్మించే కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ కాలేజీలో పేదలందరికీ ఉచితంగా వైద్యం అందిస్తూ ఏడాదికి 150 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చేవి. ఈ కాలేజీ ఈ ప్రాంతం మొత్తానికి ఒక దిక్సూచిగా ఉండేది. ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన వారు, పక్కన ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాలకు ఈ కాలేజీ మెడికల్ హబ్‌గా మారుతుంది. ఉత్తరాంధ్రలో 4 మెడికల్ కాలేజీలకు శ్రీకారం ఈ రోజు ఎవరికీ ఏ ఇబ్బంది వచ్చినా కూడా విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోంది. ఇదొక్కటే ఈ ప్రాంతానికి దిక్సూచిగా ఉంది. రోజు వందలాది మంది వైద్యం కోసం కేజీహెచ్‌కు వెళ్తున్నారు. అక్కడ సరైన వైద్యం అందక అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు చేస్తున్న అన్యాయాలు ఎలా ఉన్నాయంటే..పేదవాడికి భవిష్యత్ లేకుండా చేస్తున్నాడు.1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో కేవలం 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో కేవలం అప్పట్లో బ్రిటిష్‌వాళ్లు కట్టిన కేజీహెచ్ ఆసుపత్రి ఒక్కటే ఉండేది. ఆ తరువాత నాన్నగారు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో శ్రీకాకుళంలో రిమ్స్‌ను తీసుకువచ్చారు. ఉత్తరాంధ్రలో మొత్తంగా రెండు కా లేజీలు మాత్రమే ఉండేది. ఈ రోజు ఇదే ఉత్తరాంధ్రలో ఒక్క వైయస్‌ఆర్‌సీపీ హయాంలో, వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా మరో నాలుగు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. విజయనగరం, పాడేరు, పార్వతీపురం, నర్సీపట్నం ఏరియాల్లో నాలుగు కాలేజీలను నిర్మించే కార్యక్రమం చేపట్టాం. ఇందులో విజయనగరం, పాడేరు కాలేజీల్లో క్లాస్‌లు కూడా ప్రారంభమయ్యాయి. విజయనగరం, పాడేరులో క్లాస్‌లు కూడా ప్రారంభం ఇదే ఉత్తరాంధ్రలోని విజయనగరం కాలేజీని 2023లో ప్రారంభించాం. పాడేరులో 2024 ఎన్నికల నాటికి క్లాస్‌లు ప్రారంభమయ్యాయి. పార్వతీపురంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ ఫొటోలు, భవనాలు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. నర్సీపట్నంలో ఇక్కడే నిర్మాణంలో ఉన్న కాలేజీ కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు పలాసలో పూర్తిగా నిర్మాణం అయిపోయిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కనిపిస్తోంది. కిడ్నీ రిసేర్చ్ సెంటర్ కింద ఇవాళ కళ్లెదుటే కనిపిస్తోంది. అయ్యా చంద్రబాబు..ఇదే ఉత్తరాంధ్ర ప్రాంతంలో నాలుగు మెడికల్ కాలేజీలకు సంబంధించిన పరిస్థితి ఇది. ఇవి కాక మరో ఐదు 5 ఆసుపత్రులు ఐటీడీఏ పరిధిలో నిర్మాణంలో ఉన్నాయి. పార్వతీపురం సీతంపేట, రంపచోడవరం బుట్టాయగూడెం, దోర్నాలలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మాణంలో ఉన్నాయి. మేం మంచి చేస్తే..చంద్రబాబు కుట్రలు ఉత్తరాంధ్రకు మంచి చేసే కార్యక్రమాలు జరుగుతుంటే..ఇక్కడ చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. 17 మెడికల్ కాలేజీల్లో ఏడు మెడికల్ కాలేజీలు మేం ఉండగానే పూర్తి అయ్యాయి. ఇందులో 5 మెడికల్ కాలేజీలు మేం ఉండగానే క్లాస్‌లు ప్రారంభమయ్యాయి. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీల్లో 2023–2024లో క్లాస్‌లు ప్రారంభమై..ఇప్పటికే మూడు బ్యాచ్‌లు పూర్తి చేసుకున్నారు. ఈ ఐదు కాలేజీల్లో 800 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మరో రెండు కాలేజీలు పులివెందుల, పాడెరు కాలేజీలు చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి పాడేరులో 50 శాతం సీట్లతో క్లాస్‌లు ప్రారంభమయ్యాయి. మరో 50 సీట్లకు కేంద్రం అనుమతి ఇస్తే..చంద్రబాబు మాత్రం మాకు మెడికల్ సీట్లు వద్దు అంటూ వెనక్కి పంపించారు. ఏడాదికి రూ.1000 కోట్లు ఖర్చు చేయలేరా బాబూ? మిగిలింది మరో 10 కాలేజీలకు మరో రూ.8 వేల కోట్లు మాత్రమే. ఇందులో దాదాపుగా రూ.3 వేల కోట్లు ఖర్చు చేసి ఈ స్థాయిలోకి కాలేజీలను తీసుకువచ్చాం. ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేరా చంద్రబాబు అని అడుగుతున్నాను. ఏడాదికి రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే కొన్ని కోట్ల మంది పేదవాళ్లకు ఆధునిక దేవాలయాల కింద ఉచితంగా వైద్యం అందుతుంది. రాష్ట్రంలో 2019 నాటికి 2360 మెడికల్ సీట్లు అయితే మరో 2550 సీట్లు అదనంగా గవర్నమెంట్ రంగం నుంచి ఈ 17 మెడికల్ కాలేజీల వల్ల యాడ్ అవుతాయి. అంటే రాష్ట్రంలో మొత్తం 4910 సీట్లు మెడిసిన్ చదివే పిల్లలకు అందుబాటులోకి వస్తాయి.