బుచ్చిరాములు మృతి పట్ల వైయస్‌ జగన్‌ సంతాపం..

నల్గొండ:సాక్షి మీడియా గ్రూప్‌ ఎడిటర్‌ మురళీ తండ్రి  వర్ధెల్లి బుచ్చిరాములు మృతిపట్ల వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. బుచ్చిరాములు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీపీఎం సీనియర్‌ నాయకుడు, ఆ పార్టీ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వర్ధెల్లి బుచ్చిరాములు (83) సోమవారం రాత్రి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు నెలరోజుల కిందట నల్లగొండలోని నవ్య మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్సకోసం చేర్పించారు.

గత ఏడాది డిసెంబర్‌ 23న ఆయన బ్రెయిన్‌ స్ట్రోక్‌తో కోమాలోకి వెళ్లారు. అదే నెల 18న ఆయన భార్య వర్ధెల్లి లక్ష్మమ్మ మృతి చెందారు. ఆమె మృతి చెందిన ఆరురోజులకే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో ఆయనకు హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో పది రోజులపాటు చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి నల్లగొండలోని నవ్య ఆస్పత్రికి తరలించారు. నెల రోజులుగా ఆయన ఐసీయూలోనే ఉన్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. బుచ్చిరాములుకు కుమారుడు, సాక్షి దినపత్రిక సంపాదకులు వర్ధెల్లి మురళి, కుమార్తె పద్మలీల ఉన్నారు. 

Back to Top