బావ, బావమరిది ఇద్ద‌రూ ఇద్ద‌రే

హిందూపురం సభలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

ఇండస్ట్రీయల్‌ హబ్ అన్నారు..ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా?

హిందూపురంకు వైయ‌స్ఆర్ మంచినీటిని తెచ్చారు

నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ అమ్మేసిన ఘనత  చంద్రబాబుది

పట్టుగూళ్లు రూ. 3 వందలకు కూడా అమ్ముకోలేని పరిస్థితి

చంద్రబాబు పాలనపై ఎక్కడా చర్చ జరగకూడదని కుట్రలు 

 పసుపు – కుంకుమ డ్రామాకు అసలు మోసపోవద్దు

 హిందూపురం: చ‌ంద్ర‌బాబు, ఆయ‌న బావ‌మ‌రిది బాల‌కృష్ణ ఇద్ద‌రూ ఇద్ద‌రే అని..హిందూపురంలో వీరు చేసిన అభివృద్ధి శూన్య‌మ‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విమ‌ర్శించారు. ఇండ‌స్ట్రీయ‌ల్ హ‌బ్ పేరిట ఈ ఇద్ద‌రూ క‌లిసి ఒక షో చేశార‌ని, ఇంత‌వ‌ర‌కు ఒక్క ప‌రిశ్ర‌మ కూడా రాలేద‌న్నారు. మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చ‌లువుతో ఆనాడు ఈ ప్రాంతానికి తాగ‌డానికి నీరు వ‌చ్చింద‌ని, అయితే జ‌నాభా పెర‌గ‌డంతో నీటి క‌ష్టాలు త‌ప్ప‌డం లేద‌ని, టీడీపీ పాల‌కులు తాగునీటిని ఇవ్వ‌లేక‌పోతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డే కొద్ది చంద్ర‌బాబు కుట్ర‌లు ఎక్కువ‌వుతున్నాయ‌ని, వీటిని న‌మ్మి మోస‌పోవ‌ద్ద‌ని సూచించారు. ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా అనంత‌పురం జిల్లా హిందూపురంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించారు. 

35 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఓట్లు పడ్డాయి. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నా..35 ఏళ్ల పాటు టీడీపీకి ఓట్లు వేసినా ఇక్కడి సమస్యలు తీర్చిన నాయకుడు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అని ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుతున్నాను. హిందూపురంలో తాగడానికి నీరు లేవని, వైయస్‌ఆర్‌ బతికి ఉన్నప్పుడు రూ. 650 కోట్లు ఖర్చు చేసి తాగునీటిని అందించడం కోసం నాన్నగారు చేసిన కృషి ఇవాల్టికి మర్చిపోరు. ఒక్కసారి ఆలోచన చేయండి. పది సంవత్సరాల క్రితం నాన్నగారు చేశారు కాబట్టే కాస్తయినా హిందూపురానికి నీరు ఉన్నాయి. కానీ ఐదేళ్ల పాలనలో జనాభా పెరిగిపోయి తాగడానికి ఇంకా నీళ్లు ఎక్కువైన పరిస్థితుల్లో ఈ తెలుగుదేశం పార్టీ గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి మరింత తాగునీరు తీసుకురావడానికి వేసిన పైపులైన్‌ పనులు కూడా ఐదేళ్లలో కనీసం పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం. మడకశిర ఉప కాల్వ ద్వారా హింద్రీనీవా జలాలను 99 చెరువులకు నీరు ఇవ్వడానికి పనులు ఆ దివంగత మహానేత వైయస్‌ఆర్‌ చేపట్టి అప్పట్లోనే 90 శాతం పూర్తి చేస్తే ఆ మిగిలిపోయిన 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేని అధ్వాన్నమైన పాలన కనిపించడం లేదా అని ఆలోచన చేయమని కోరుతున్నా.. 

కొడికొండ చెక్‌పోస్టు వద్ద ఇండస్ట్రీయల్‌ హబ్‌ పేరిట బావ, బావమరిది ఇద్దరూ కలిసి ఒక షో చేశారు. వేల ఉద్యోగాలు వస్తాయంటూ అట్టహాసంగా శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అని అడుగుతున్నా.. చివరకు ఆ భూముల్లో లేఅవుట్‌ వేసి రియలెస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారంటే ఇంతకంటే సిగ్గుమాలిన పాలన ఎక్కడైనా ఉంటుందా.. ఇదే నియోజకవర్గంలో పరిగి వద్ద గతంలో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ అమ్మేసిన ఘనత దిక్కుమాలిన ముఖ్యమంత్రి చంద్రబాబుది. 200 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఇక్కడే ఉంది. కనీసం 32 మంది డాక్టర్లు పనిచేయాలి. కానీ ఆ ఆస్పత్రికి వెళ్లి చూస్తే కనీసం 10 మంది కూడా లేరు. సిగ్గుతో ఈ పాలకులు తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇదే ఆస్పత్రి కనీసం నాలుగు గైనకాలజిస్టులు ఉండాలి. నలుగురు ఉండాల్సిన చోట ఒక్కరే ఉన్నారంటే ఇంతకంటే దిక్కుమాలిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతున్నా.. హిందూపురానికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వచ్చేసిందంటూ శ్రీగంటపురం పాఠశాల వద్ద దాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు బోర్డులు వేశారు. పూజలు చేశారు. ఆ తరువాత ఆ కాలేజీ వచ్చిందా..? కనీసం పట్టించుకున్న పరిస్థితులు కూడా లేవు. ఉర్దూ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఉర్దూ కళాశాల కనిపించిందా..? ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుతున్నా.. హిందూపురం నియోజకవర్గంలో నీళ్ల పరిస్థితి, వ్యవస్థల పరిస్థితి గమనించండి. 

రైతుల పరిస్థితి మరో ఘోరంగా మారింది. చింతపండు మొదటి రకం రూ. 15 వేలు ఉంటే గానీ ఖర్చులు రావు.. అటువంటి చింతపండు రూ. 10 వేలకు కూడా అమ్ముకోలేని పరిస్థితి. చింతపండులో రెండో రకం రూ. 8 వేలు వస్తేకానీ గిట్టుబాటు ధర రాని రైతులకు కనీసం ఇవాళ రూ. 5 వేలు కూడా రాని పరిస్థితి. పట్టుగుళ్లకు కేజీ రూ. 650 ఉండేది. ఇవాళ అవే పట్టుగూళ్లు రూ. 3 వందలకు కూడా అమ్ముకోలేని పరిస్థితి. చివరకు కేజీ రూ. 50 చొప్పున ప్రభుత్వం ఇస్తామన్న బోనస్‌ కూడా ఇవాల్టికి రూ. 4 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుతున్నాను. ఏరకంగా ఇదే హిందూపురం నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అవసరం కోసం వాడుకొని ఎలా వదిలేస్తున్నారో ఆలోచన చేయండి. 

ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనలో మోసం.. మోసం.. మోసం.. తప్ప మరొకటి లేదు. రైతులను మోసం చేశారు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను మోసం చేశారు. చివరకు ఉద్యోగాల కోసం వెతుక్కుంటున్న పిల్లలను మోసం చేశారు. చివరకు చదువుకుంటున్న పిల్లలను సైతం మోసం చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వానికి పాలించమని ఓటేస్తారు. అటువంటి ప్రభుత్వంలో 57 నెలలు ప్రజలను కాల్చుకొని తిని చివరి మూడు నెలలు మాత్రం సినిమా చూపించ‌డం మోసం కాదా.. ఎన్నికలు వారంలో ఉన్నాయంటే ఈ రోజు మీకు చెక్కులు వేస్తాం.. ఈ రోజు మీకు అది, ఇది చేస్తామని టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఐదేళ్లు వీళ్లు ఏం గాడుదులు కాస్తున్నారని ప్రశ్నిస్తున్నాను. 

2014లో ఎన్నికల ప్రణాళిక అని చెప్పి పుస్తకాన్ని చూపించారు. ఆ పుస్తకంలో ప్రతి పేజీ ఒక కులానికి కేటాయించి మోసం చేయడంలో పీహెచ్‌డీ చేసి దగా చేసిన పరిస్థితి. చివరకు 2014 మేనిఫెస్టో టీడీపీ వెబ్‌సైట్‌లో కూడా మాయం చేశారు. ఎంతటి దారుణంగా వీళ్లు మోసం చేశారో ఆలోచన చేయండి. ఈ మోసాలు, దగా ఇవన్నీ చూస్తున్నారు. గత 20 రోజులుగా రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో చూస్తున్నారు. చంద్రబాబు, ఆయనకు అమ్ముడుపోయిన ఎల్లో మీడియా. ఈ రోజు యుద్ధం చంద్రబాబుతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీవీ9తో యుద్ధం జరుగుతుంది. అమ్ముడుపోయిన అనేక టీవీ ఛానళ్లతో యుద్ధం చేస్తున్నాం. ఇవాళ జరుగుతున్న యుద్ధం ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతుందని ఆలోచన చేయాలి. గత 20 రోజులుగా చంద్రబాబు పాలనపై ఎక్కడా చర్చ జరగకూడదని కుట్రలు చేస్తున్నారు. బాబు పాలనపై చర్చ జరిగి ప్రజలు ఆలోచించడం మొదలు పెడితే టీడీపీకి డిపాజిట్లు కూడా రావని తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా ప్రతి రోజు ఒక పుకారు లేపి దానిపై చర్చ జరుపుతారు. చంద్రబాబు పాలనలో వైఫల్యాల నుంచి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ మోసాలు, కుట్రలు, అబద్ధాలు తీవ్ర స్థాయికి చేరుతాయి. చివరి కుట్రగా చంద్రబాబు ఎన్నికల సమయంలో గ్రామాలకు, మీ వార్డులకు మూటల మూటల డబ్బు పంపిస్తాడు. ప్రతి చేతిలో రూ. 3 వేలు పెట్టి మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తాడు. 

మీ ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను, ప్రతి అవ్వను, ప్రతి తాతను కలవండి. అక్కా చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. వారం రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న రూ. 15 వేలు ఇస్తాడని చెప్పండి. అక్కా వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వారం రోజులు ఓపిక పట్టు అక్కా.. మన పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్‌ చదవాలన్నా.. సంవత్సరానికి ఫీజులు చూస్తే లక్ష రూపాయలకు పైనే పలుకుతున్నాయి. మన పిల్లలను ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్‌ చదివించాలంటే ఆస్తులు అమ్ముకుంటే కానీ చదివించలేని పరిస్థితుల్లో ఉన్నామని ప్రతి అక్కకు చెప్పండి. ఏకంగా రూ. 18 వేల కోట్ల బకాయిలు పడ్డారు. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. వారం రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను డాక్టర్లు, ఇంజనీర్‌ వంటి పెద్ద పెద్ద చదువులు అన్న చదివిస్తాడని చెప్పండి. 

పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దని చెప్పండి. ఐదు సంవత్సరాలు చంద్రబాబుకు సమయం ఇచ్చాం. పొదుపు సంఘాల రుణాల్లో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని ప్రతి అక్కను అడగండి. రుణాలు మాఫీ కాకపోగా గతంలో సున్నావడ్డీకే వచ్చే రుణాలు పూర్తిగా ఎగరగొట్టాడని చెప్పండి. అక్కా చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. చంద్రబాబు చేసే పసుపు – కుంకుమ డ్రామాకు అసలు మోసపోవద్దు అక్కా.. వారం రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. పొదుపు సంఘాల రుణాలన్నీ అన్న నాలుగు దఫాలుగా చేతికే ఇస్తాడని చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు జగనన్నతోనే సాధ్యమని చెప్పండి. 

పేదరికంలో అవస్థలు పడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. వారం రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్నముఖ్యమంత్రి అయిన తరువాత వైయస్‌ఆర్‌ చేయూత అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి అక్క చేతిలో రూ. 75 వేలు నాలుగు దఫాలుగా మీ చేతుల్లోనే పెడతాడని చెప్పండి. 

గ్రామాల్లోని ప్రతి రైతు దగ్గరకు వెళ్లి చెప్పండి. చంద్రబాబును నమ్మి ఓట్లు వేశాం. రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని ప్రతి రైతన్నకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలతో మోసపోవద్దు అన్నా.. ఆవరం రోజులు ఓపికపట్టు అన్న.. ఆ తరువాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ప్రతి రైతన్నకు మే మాసం వచ్చే సరికి పంట పెట్టుబడికి రూ. 12,500లు అందిస్తాడని, అక్షరాల పెట్టుబడుల కోసం రూ. 50 వేలు ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం అందిస్తాడని ప్రతి రైతుకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు..  గిట్టుబాటు ధరలకు కూడా గ్యారెంటీ ఇస్తాడని చెప్పండి. 

అవ్వాతాతల దగ్గరకు వెళ్లండి. రెండు నెలల కిందట పెన్షన్‌ ఎంత వచ్చేదని అడగండి.. పెన్షన్‌ వచ్చేది కాదని, లేకపోతే రూ. వెయ్యి మాత్రమే వచ్చేదని వేలెత్తి చూపిస్తుంది. ఎన్నికలు రాకపోయి ఉంటే జగనన్న రూ. 2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే ఈ చంద్రబాబు రూ. 2 వేలు ఇచ్చేవాడా అని ప్రతి అవ్వను అడగండి. ఆ అవ్వకు, ప్రతి తాతకు చెప్పండి అవ్వా చంద్రబాబు మోసాలను బలికావొద్దు.. వారం రోజులు ఓపిక పట్టు అవ్వా.. తరువాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు.. ప్రతి అవ్వాతాతలకు పెన్షన్‌ రూ. 3 వేల వరకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి. 

ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఇల్లు లేదు. చంద్రబాబు ఊరికి కనీసం 10 ఇళ్లులు కూడా కట్టించలేదు. వారం రోజులు ఓపిక పట్టు అన్నా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అక్షరాల 25 లక్షల ఇళ్లులు కట్టిస్తాడని చెప్పండి. రాజన్న రాజ్యంలో ఇళ్లులు కట్టడం చూశాం. మళ్లీ జగనన్నతోనే అది సాధ్యమని ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి.

నవరత్నాల్లోని ప్రతి అంశం ప్రతి కుటుంబంలోకి తీసుకొనిపోండి. నవరత్నాలతో ప్రతి పేదవాడు, ప్రతి రైతన్న ముఖాల్లో చిరునవ్వు వస్తుంది. నవరత్నాలతో ప్రతి రైతన్న ముఖంలో ఆనందం చూడవచ్చని గట్టిగానమ్ముతున్నా.. నవరత్నాలను ప్రతి గడప దగ్గరకు తీసుకువస్తాను. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి మార్పురావాలి. రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని పలానా చేస్తానని చెబితే.. మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు వేయించుకొని గెలిచిన తరువాత ఇచ్చిన హామీ అమలు చేయకపోతే పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి తీసుకురావాలి.  చెడిపోయిన వ్యవస్థలోకి మార్పు తీసుకురావాలని మీ అందరి చల్లని ఆశీస్సులు కావాలి. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్బాల్‌ అన్న నిలబెడుతున్నాను. ఐజీ మంచి పోలీసు అధికారిగా పనిచేశాడు. మీ అందరి ఆశీస్సులు ఇక్బాల్‌ అన్నపై ఉంచాలని కోరుతున్నా. అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా మాధవ్‌ను నిలబెడుతున్నాను. మంచివాడు, యువకుడు, ఉత్సాహవంతుడు మంచిచేస్తాడని నమ్మకం ఉంది. మొట్టమొదటి సారి రెండు పార్లమెంట్‌ స్థానాలు బీసీలకు ఇచ్చాం. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు వీరిద్దరిపై ఉంచాలని పేరు పేరునా ప్రార్థిస్తున్నాను. చివరగా మన పార్టీ గుర్తు ఫ్యాన్‌ అని ఎవరూ మర్చిపోవద్దు. 
 

Back to Top