విజయవాడ: రాష్ట్రంలో జరుగుతున్న దాడులను ఆపాలని కూటమి ప్రభుత్వాన్ని వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి హెచ్చరించారు. కేవలం ఆధిపత్యం చాటడం కోసం ఒక పథకం ప్రకారం నవాబ్‌పేట్ దాడి ఘటన జరిగిందని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దాడిలో గాయపడిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలిద్దరినీ మంగళవారం సాయంత్రం విజయవాడ ఆస్పత్రిలో వైయస్ జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దీని వల్ల ఏం సాధిస్తారు?: నవాబ్‌పేటలో అత్యంత దారుణంగా దాడి చేశారు. కేవలం ఆధిపత్యం చూపడం కోసం ఒక పథకం ప్రకారం కర్రలతో అతి దారుణంగా దాదాపు 20 మంది కలిసి కర్రలతో కొట్టారు. తీవ్ర గాయాలపాలైన వారు ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీని వల్ల మీరేం సాధిస్తారని చంద్రబాబుగారిని అడుగుతున్నాను. ఆ పరిస్థితులకు దారి తీస్తాయి: మీరు చేసే ఈ కిరాతకాలు, దారుణాల వల్ల ప్రజలేమైనా భయపడతారనుకుంటున్నారా? ఎవరూ భయపడరు. ఇంకా కోపంగా మారుతారు. అలా మారి, చంద్రబాబుగారిని, తెలుగుదేశం పార్టీ.. రెండింటినీ బంగాళాఖాతంలో కలిపే పరిస్థితులకు దారి తీస్తాయి. మామూలుగా కొత్త ప్రభుత్వం వస్తే, ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కాస్తో కూస్తో టైమ్ పడుతుంది. మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. చంద్రబాబుగారి మీద వ్యతిరేకత అన్నది చాలా వేగంగా పెరుగుతోంది. నిజంగా ముఖ్యమంత్రి అనే వ్యక్తి పరిపాలన మీద దృష్టి పెట్టాల్సింది పోయి, ఏం చేస్తున్నాడనేది తనను తాను ప్రశ్నించుకోవాలని కోరుతున్నాను. అందరినీ మోసం చేశారు: ఈరోజు వ్యవసాయం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ రైతులకు మేనిఫెస్టోలో చెప్పిన రూ.20 వేల పెట్టుబడి సాయం ఇవ్వకుండా ఎగ్గొట్టేశాడు. అలా రైతులను మోసం చేశాడు. పిల్లలు బడికి పోతున్నారు. ఎంత మంది పిల్లలు బడికి పోతున్నారనేది అందరికీ తెలిసిన విషయం తెలిసిందే. ప్రతి సచివాలయంలో ఉద్యోగులు ఉన్నారు. మండల విద్యాధికారులు ఉన్నారు. అయినా కూడా తల్లులను మోసం చేస్తూ, వారికి ఇస్తానన్నది ఎగ్గొట్టేశాడు. ప్రతి పిల్లాడిని చూపి నీకు 15 వేలు, నీకు 15 వేలు, నీకు 15 వేలు ఇస్తామని చెప్పి, ప్రతి పిల్లాడిని మోసం చేశాడు. ప్రతి అక్కచెల్లెమ్మనూ మోసం చేశాడు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి, ప్రతి అక్కచెల్లెమ్మకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి, వాళ్లనూ మోసం చేశాడు. ఈరోజు ఫీజు రీయింబర్స్‌మెంట్ తీసుకుంటున్న పిల్లలు.. జనవరి, ఫిబ్రవరి, మార్చి.. క్వార్టర్ ఫీజులు రాలేదు. ఏప్రిల్, మే, జూన్.. రెండో త్రైమాసిక ఫీజులు కూడా రాలేదు. పిల్లలు చదువుకోలని పరిస్థితి, వారు ఫీజులు కట్టలేని పరిస్థితి, కాలేజీల యాజమాన్యాలు ఫీజులు అడుగున్న పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. పిల్లలకు వసతి దీవెన ఎగ్గొట్టేశారు. అక్క చెల్లెమ్మలకు రావాల్సిన సున్నా వడ్డీ.. అది కూడా ఎగ్గొట్టేశాడు. ప్రజలంతా అడుగుతున్నారు: ఇవన్నీ కూడా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా, క్యాలెండర్ ప్రకటించి అమలు చేస్తూ వచ్చిన పరిస్థితి. అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యాదీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ, మత్స్యకార భరోసా అయితేనేమి.. ఇవన్నీ కూడా మాకెందుకు ఇవ్వలేదని ప్రజలంతా అడుగుతున్నారు. ప్రశ్నించకూడదని..: వారి గురించి పట్టించుకోకుండా, వారికి చేయాల్సిన మంచి పట్టించుకోకుండా, స్కూళ్లను నిర్వీర్యం చేస్తూ.. చదువులను నిర్వీర్యం చేస్తూ.. ఆస్పత్రులను నిర్వీర్యం చేస్తూ.. చివరకు ఏ ఒక్కరూ మిమ్మల్ని ప్రశ్నించకూడదని, రోడ్డెక్కకూడదని.. ఈ విధంగా భయాందోళనలకు గురి చేయాలనే ఉద్దేశంతో గ్రామస్థాయి నుంచి మొదలెట్టి, ప్రతి ఒక్కరికి కూడా మీ కక్షలు, కార్పణ్యాలు తీర్చుకొండి అని చెప్పి గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ.. గ్రామస్థాయి నుంచి ఈ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇది తప్పుడు సాంప్రదాయం: ఆలోచన చేయమని కోరుతున్నా. మళ్లీ మళ్లీ చెబుతున్నా చంద్రబాబునాయుడుగారికి.. మీరు చేస్తున్నది తప్పుడు సంప్రదాయం. ఇది కనుక కొనసాగింది అంటే.. రేపు పొద్దున ఏం జరుగుతుంది అంటే.. ఈరోజు మీ ప్రభుత్వం ఉంది. చాలా వేగంగా మీ ప్రభుత్వం తుడిచి పెట్టుకుపోతుంది. ఆ తరవాత మా ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మా కార్యకర్తలు.. మేము వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వారికి బుద్ధి చెప్పే విధంగా చంద్రబాబునాయుడుగారు ఈరోజు బీజం వేస్తున్నారు. భవిష్యత్తులో ఆపలేం: చంద్రబాబుగారికి చెబుతున్నా. ఈ తప్పుడు సాంప్రదాయాలు ఇంతటితో ఆపండి. ఈ తప్పుడు సాంప్రదాయాలు పెద్దవై వృక్షాలు అయ్యాయి అంటే, ఆపడం ఎవరి తరం కాకుండా పోతుంది. ఇప్పటికే లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది. ఏం జరుగుతుందో మీకే తెలియని దారుణ పరిస్థితుల్లోకి లా అండ్ ఆర్డర్ వెళ్తోంది. ఒక్క వైయస్సార్‌సీపీ కార్యకర్తలే కాదు. మా పార్టీని అభిమానించే వారే కాదు. చివరకు మహిళల మీద కూడా అఘాయిత్యాలు పెరిగాయి. చిన్న పిల్లల మీద కూడా అఘాయిత్యాలు పెరిగాయి. ఇష్టం వచ్చినట్లుగా రౌడీయిజమ్ పెరిగిపోయింది. ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి తోచినట్లుగా వారు వ్యవహరిస్తున్నారు. యావత్ దేశం దృష్టికి..: ఇప్పటికే చెబుతున్నాను. మరోసారి హెచ్చరిస్తున్నాను. ఈమధ్య కాలంలో, నంద్యాలలో ఏకంగా చంపేసిన ఘటన చూశాం. శుక్రవారం నేను అక్కడికి పోతున్నాను. ఆ ఘటనను రాష్ట్రం, దేశం దృష్టికి తీసుకుపోతాను. రాష్ట్రపతి పాలన విధించాలి: కచ్చితంగా హైకోర్టు తలుపులు తడుతాం. అవసరమైతే సుప్రీంకోర్టు తలుపులు కూడా తడుతాం. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయమైన ఘటనలు, ఇక్కడి పరిస్థితిని అన్ని రాజకీయ పార్టీలకు వివరించాం. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అన్యాయాలు, అఘాయిత్యాలను చూసి, ఎందుకు రాష్ట్రపతి పాలన విధించకూడదు అని హైకోర్టు, సుప్రీంకోర్టును అడిగే కార్యక్రమం చేస్తాం. గవర్నర్‌గారికీ విజ్ఞప్తి: ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గవర్నర్‌గారికి విన్నవిస్తున్నాం. మీరు సుప్రీంకోర్టు జస్టిస్‌గా పని చేశారు. మీరు రాష్ట్రంలో ఉండగా, మీ కళ్ల ముందే రాష్ట్రంలో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి చూసి చూడనట్లు పోకుండా, మీరు కూడా జోక్యం చేసుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్‌గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం.