ఆటో, క్యాబ్‌ డ్రైవర్లను ఆదుకుంది దేశంలో ఏపీ ఒక్కటే..

‘వైయస్‌ఆర్‌ వాహన మిత్ర’ నగదు జమ కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌

కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం

2.48 లక్షల మంది లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ

2.48 లక్షల మందిలో దాదాపు 84 శాతం పేదవర్గాలవారే

వాహన బీమాతో పాటు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్, రిపేర్లకు రూ.10 వేలు ఇస్తున్నాం

అర్హులెవరైనా మిగిలిపోతే దరఖాస్తు చేసుకునేందుకు మరో నెల అవకాశం

సంక్షేమ పథకాల అమలుపై కూడా టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది

ట్రాఫిక్‌ రూల్‌ పాటించండి.. మద్యం సేవించి వాహనం నడపొద్దు

తాడేపల్లి: ‘‘ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ డ్రైవర్ల గురించి ఆలోచన చేసి.. వారికి మంచి చేయాలని తాపత్రయపడిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు. ఆటో, క్యాబ్‌ డ్రైవర్లను ఆదుకుంది దేశంలో ఏపీ ఒక్కటేనని ప్రతి అన్నకు, అక్కకు తమ్ముడిగా, ప్రతి తమ్ముడికి, చెల్లికి అన్నగా గర్వంగా తెలియజేస్తున్నా’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వరుసగా మూడో ఏడాది ‘వైయస్‌ఆర్‌ వాహన మిత్ర’ పథకం అమలుకు సీఎం వైయస్‌ జగన్‌ నేడు శ్రీకారం చుట్టారు. 2,48,468 మంది లబ్ధిదారులకు రూ.10 వేలు చొప్పున అందిస్తున్నామని, ఇందుకు రూ.248.47 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా పారదర్శకంగా పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. 

వరుసగా మూడో ఏడాది వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం ప్రారంభోత్సవంలో సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

‘ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లుగా ప్రతి రోజూ సేవలు అందిస్తూ రోజు లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చుతున్న అన్నదమ్ముళ్లు, అక్కచెల్లెమ్మలు అందరికీ కూడా కృతజ్ఞతలు. 3648 కిలోమీటర్ల నా పాదయాత్రలో ఏలూరు సభలో 2018 మే 14న జరిగిన సభలో ఒక మాటిచ్చాను. ఆ రోజున గత ప్రభుత్వంలో పెనాల్టీలు ఎక్కువయ్యాయి.. రోజుకు రూ.50 పెనాల్టీ వేస్తున్నారు. ఇన్సూరెన్స్‌ కట్టాలంటే సుమారు రూ.7500 అవుతుంది. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ రావాలంటే రిపేర్లు చేయించాలి. అన్నీ కలిపి దాదాపు 10 వేలు ఖర్చు అవుతుంది. అంత మొత్తం కట్టాలంటే అప్పు తేవడం తప్ప వేరే గత్యంతరం లేదని ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు నాతో చెప్పారు. ఆ రోజున ఏలూరు సభలో మాటిచ్చిన తరువాత వరుసగా మూడో ఏడాది వైయస్‌ఆర్‌ వాహన మిత్ర సాయాన్ని లబ్ధిదారుల అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేయడం జరుగుతుంది. 

ఈ ఏడాది 2,48,468 మంది అన్నదమ్ముళ్లు, అక్కచెల్లెమ్మలకు రూ.248.47 కోట్లు సాయంగా ఈ రోజు వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. దీంతో ఇప్పటి వరకు మనందరి ప్రభుత్వం కేవలం ఒక్క వాహన మిత్ర పథకం కింద రూ.759 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలోకి జమ చేయడం జరిగింది. దాదాపు ఒక్కొక్కరికి రూ.30 వేలు సాయం అందినట్టు అవుతుంది. వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం కింద గత సంవత్సరం లబ్ధిపొందిన వారిలో అర్హులందరితో పాటు గతేడాది కాలంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌లు కొనుగోలు చేసిన లేదా యాజమాన్య హక్కులు బదలాయింపు పొందిన మరో 42,932 మంది అన్నదమ్ముళ్లకు, అక్కచెల్లెమ్మలకు వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం ద్వారా రూ.10 వేలు జమ చేయడం జరుగుతుంది. 

వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం ఎంత మేలు చేస్తుందని గమనిస్తే.. 2,48,468 మందిలో దాదాపు 84 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేదలే ఉన్నారు. బతుకులు మన కళ్లెదుటనే మార్చే అవకాశం ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ డ్రైవర్ల గురించి ఆలోచన చేసి.. మంచి చేయాలనే ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు. ఒక్క మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే అమలవుతున్నాయని సగర్వంగా ప్రతి అన్నకు తమ్ముడిగా, ప్రతి తమ్ముడికి అన్నగా, ప్రతి అక్కకు తమ్ముడిగా, ప్రతి చెల్లెమ్మకు అన్నగా గర్వంగా తెలియజేస్తున్నాను. 

ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్‌ అన్నలకు, అక్కచెల్లెమ్మల చేతుల్లో రూ.10 వేలు పెడుతున్నాం. ఇది వాళ్లకు మాత్రమే మేలు చేస్తున్నామని అనుకోకూడదు. ఈ వాహనంలో ప్రయాణించే వారి భద్రతకు కూడా ఈ సొమ్ము భరోసాగా ఉంటుంది. ఎందుకంటే ఈ వాహనాలకు బీమాతో పాటు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్, రిపేర్లు తదితర అవసరాలకు ఈ సొమ్ము ఇస్తున్నాం. దీని వల్ల ఇన్సూరెన్స్‌ చేయించుకుంటారు. బండ్లు రిపేర్లు చేయించుకంటారు. దీని వల్ల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కూడా పొందుతారు. ఆటో డ్రైవర్‌ అన్నదమ్ముళ్లు, అక్కచెల్లెమ్మలే కాకుండా ఆటోలో ప్రయాణించే వారికి కూడా ఎంతో మంచి జరుగుతుంది. ఇలా అన్ని అనుమతులు ఉండేలా చలాన్లు కట్టే పరిస్థితి రాకుండా ఉండాలని వీరికి ఈ సొమ్మును అందిస్తున్నాం. నిజంగా ఈ డబ్బును ఒకేసారి కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న అన్నదమ్ముళ్లు, అక్కచెల్లెమ్మలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 

పండ్లు పండే చెట్టుమీదనే రాళ్లు పడతాయనే ఒక సామెత ఉంది. అలా మంచి చేసే మనషుల మీదనే విమర్శలు కూడా అడ్డగోలుగా చేసే పరిస్థితి కూడా మన రాష్ట్రంలో కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు పన్నులు, చలానా రూపంలో ఎంత తీవ్రంగా ఒడ్డించేవారంటే.. ఆటోలు నడుపుకునే డ్రైవర్ల నుంచి చలానా, కంపౌండెడ్‌ ఫీజ్‌ అపాన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ గమనిస్తే.. 2015–16లో ట్యాక్స్‌లు, పెనాల్టీలు రెండూ కలిపితే రూ.7.39 కోట్లు, 2016–17లో రూ.9.68 కోట్లు, 2017–18లోరూ. 10.19 కోట్లు, 2018–19లో రూ.7.09 కోట్లు వసూలు చేశారు. 

మన ప్రభుత్వం వచ్చిన తరువాత 2019–20లో కంపౌండింగ్‌ ఫీజు అండ్‌ ట్యాక్స్‌ కలెక్టెడ్‌ ఫ్రమ్‌ ఆటో రిక్షాస్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎంత అంటే  కేవలం రూ.68.44 లక్షలు మాత్రమే. 2020–21లో రూ.35 లక్షలు మాత్రమే. ఎక్కడా దౌర్జన్యం, జులూం లేదు. మానవత్వంతో ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్క, చెల్లెమ్మకు తోడుగా ఉండే కార్యక్రమం మన ప్రభుత్వం చేస్తుంటే.. దీన్ని జీర్ణించుకోలేక ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ నేతలు.. మన ప్రభుత్వం 95 శాతం హామీలు అమలు చేస్తే.. మనం చేసిన అన్యాయాలు అంటూ దుష్ప్రచారానికి తెరలేపారు. అందులో ఒకటిది. వాళ్లు వసూళ్లకు పాల్పడి.. మన ప్రభుత్వంపై ఏం మాత్రం ఇంగింతం లేకుండా బురదజల్లుతున్నారు. కానీ, జరుగుతున్న వాస్తవాలు ప్రజలందరికీ తెలుసు. 

2.48 లక్షల మందికి సాయం అందిస్తున్నాం. ఎక్కడా ఎలాంటి అవినీతి, వివక్షకు తావులేకుండా చాలా పారదర్శకంగా అమలు చేస్తున్నా. గ్రామ సచివాలయాల్లో జాబితా డిస్‌ప్లే చేయడం జరిగింది. పొరపాటున అర్హత ఉండి లబ్ధి చేకూరకపోతే ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇది మీ అన్న ప్రభుత్వం, ఇది మీ తమ్ముడి ప్రభుత్వమని గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా రాకుండా పోతే ఎలా ఇవ్వాలని ఆలోచన చేసే ప్రభుత్వం మనది. పొరపాటున మిగిలిపోయి ఉంటే మరో నెల పాటు సమయం గడువిస్తున్నాం.. అర్హులై ఉంటే దరఖాస్తు చేసుకుంటే వలంటీర్ల సహకారం తీసుకోండి. అర్హులైన వారందరికీ సాయం చేస్తానని తెలియజేస్తున్నా. ఏమైనా సందేహాలు ఉంటే 9154294326 నంబర్‌కు ఫోన్‌ చేసి కనుక్కోవచ్చు లేదా 1902 టోల్‌ఫ్రీకి కాల్‌ చేసి కనుక్కోవచ్చు, ఫిర్యాదు కూడా చేయొచ్చు. 

ఈ కార్యక్రమం బాగా జరిపించేందుకు జాయింట్‌ కమిషనర్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ అధికారులు కూడా అన్ని రకాలుగా తోడుగా ఉండేలా మార్పులు చేశాం. పోలీసులను కూడా సంక్షేమ పథకాల అమలులో భాగస్వామ్యం చేస్తున్నాం. చివరగా ఒక్క మాట. తప్పనిసరిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. ఆటో, ట్యాక్సీ, క్యాబ్‌లను కండీషన్‌లో పెట్టుకోమని రిక్వస్ట్‌ చేస్తున్నాను. ఏ ఒక్కరూ కూడా దయచేసి మద్యం సేవించి వాహనం నడపొద్దు అని మీ అన్నగా, తమ్ముడిగా కోరుతున్నాను. మీ కుటుంబాలు బాగుండాలని, మీ వాహనాల్లో ప్రయాణించేవారు కూడా బాగుండాలని, దేవుడి దయ, ప్రజలందరి దీవెనలతో మనందరి ప్రభుత్వం, మన రాష్ట్రం కూడా బాగుండాలి’ అని సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

Back to Top