గుంటూరు: రాష్ట్రంలో ఈరోజు ఎలాంటి దారుణమైన పరిస్థితి ఉందనడానికి, శాంతి భద్రతలు ఏ స్థాయికి దిగజారిందని చెప్పడానికి, ఓ దళిత చెల్లి పరిస్థితి చూస్తే అర్ధమవుతుందని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గతంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మలకు ఏ ఆపద వచ్చినా కాపాడేందుకు దిశ యాప్ ఉండేది. ఏ అక్కచెల్లెమ్మ ఆపదలో ఉన్నా, ఎస్‌ఓఎస్ బటన్ నొక్కినా, లేదా ఫోన్ 5సార్లు ఊపితే చాలు, 5 నిమిషాల్లో పోలీసులు వచ్చే వాళ్లు. అదే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే, చేసినవాడు మనవాడైతే చాలు.. వాడు ఏం చేసినా ఫరవాలేదు. కవరప్ చేయడానికి, దొంగ కేసులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉందన్న సంకేతం ప్రభుత్వం ఇస్తోంది. దారుణ లైంగిక వేధింపులకు గురై, గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతూ, ప్రాణం కోల్పోయిన సహానా కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం, అక్కడే మీడియాతో మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. అత్యంత దారుణం ఈ ఘటన: ఇక్కడ దయనీయ ఘటన జరిగింది. ఇక్కడ జరిగింది మనకు తేటతెల్లంగా కనిపిస్తున్నా, ప్రభుత్వం ఏ మాదిరిగా స్పందిస్తోంది అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇక్కడ ఏం జరుగుతోంది అన్నది చూస్తే, నా చెల్లెలు తాను చేస్తున్న ఉద్యోగం ప్రదేశం నుంచి, ఈ నవీన్ అనే వ్యక్తి.. చంద్రబాబుతో దిగిన ఫోటోలు ఉన్నాయి. స్థానిక ఎంపీతో సన్నిహితంగా కూడా ఉన్నాడు. ఆయన నా చెల్లెలు పని చేస్తున్న ప్రదేశానికి వచ్చి, ఆ పాపను కారులో ఎక్కించుకుని పోయి, తాను, తనతో పాటు ఇంకొందరు కలిసి, నా చెల్లెలిని వేధించడమే కాకుండా, శారీరకంగా హింసించారు. శరీరమంతా కందిపోయిన గుర్తులు కనిపిస్తున్నాయి. ప్రైవేటు పార్ట్‌లు కూడా విచ్ఛిన్నం చేశారు. ఇక్కడికి తీసుకొచ్చి పడేసి, కుటుంబ సభ్యులు రాగానే జారుకున్నారు. ఫిజికల్‌గానే కాకుండా, లైంగికంగా కూడా వేధించి, ఆస్పత్రిలో పడేసి, ఆమె కుటుంబ సభ్యులు రాగానే జారుకోవడం జరిగింది. నేను అడుగుతున్నాను. ఎప్పుడైనా ఇలాంటి ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? మేము తోడుగా ఉన్నామని చెప్పాలి. అది ధర్మం. తప్పు చేసింది ఎవరైనా సరే, చట్టానికి అతీతం కాదు. కచ్చితంగా శిక్ష పడుతుందన్న భరోసా, బాధితులకు ఇవ్వాలి. అయినా ఈ విషయాలు ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హేయంగా ప్రభుత్వ వైఖరి: ఎందుకు ఇదే వ్యక్తి, ఆస్పత్రిలో ఈ పేషెంట్‌ను వేర్వేరు ఆస్పత్రులకు తిప్పి, బ్రెయిన్‌డెడ్ అయిన పరిస్థితిలో, చివరకు గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమెపై స్పష్టంగా గాయాలు కనిపిస్తున్నా.. ప్రభుత్వం నుంచి వచ్చి, తప్పు జరిగిందని అడగడం లేదు. అన్ని రకాలుగా ఆదుకుంటూ, పరిహారం ఇచ్చి తోడుగా నిలబడలేకపోతున్నారు. టీడీపీకి చెందిన వ్యక్తి ఈ పని చేస్తే, నిస్సిగ్గుగా ఆ వ్యక్తిని కాపాడుకుంటూ వచ్చే కార్యక్రమం చేయడానికి, ప్రభుత్వం అడుగులు వేయడంకన్నా హేయమైన పని ఏదైనా ఉంటుందా?. అన్నీ చెబుతున్నా, ఎవరూ పట్టించుకోలేదు. నేను ఇక్కడికి వస్తున్నానని తెలిసిన తర్వాత, టీడీపీకి చెందిన ఆలపాటి రాజా వచ్చాడట. అంతేతప్ప తెనాలి ఎమ్మెల్యే కానీ, మరే నాయకుడు కానీ రాలేదు. హోం మంత్రి అసలే స్పందించలేదు. చేసినవాడు తమ మనిషి కాబట్టి, నిస్సిగ్గుగా కాపాడే ప్రయత్నం జరుగుతోంది. ఇది చేసిన వ్యక్తి.. నవీన్ ఫోటో చూడండి. సాక్షాత్తూ చంద్రబాబునాయుడు కండువా కప్పుతున్నాడు. స్థానిక ఎంపీతో కలిసి తిరిగాడు. ఆయనకు అత్యంత సన్నిహితుడు.. అంటూ ఫోటోలు చూపుతూ, ఇలాంటి వ్యక్తిని వెనకేసుకు వస్తూ, జరిగిన తప్పును కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తోంది. ఏ తప్పు జరగలేదని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తోంది ఈ ప్రభుత్వం. ఏయే ఘటనలు?. ఎవరు బాధ్యులు?: రాష్ట్రంలో ఇలాంటివి ప్రతి చోటా జరుగుతున్నాయి. బద్వేలులో 16 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఆమెపై అత్యాచారం చేసిన తర్వాత పెట్రోల్ పోసి కాల్చారు. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బాలికలపై అతి దారుణంగా వారి కూల్‌డ్రింక్స్‌లో మందు కలిపి, వారిపై అత్యాచారం చేసిన ఘటన. అది చేసిన వారెవరు అంటే, టీడీపీకి చెందిన ప్రబుద్ధులు. శ్రీకాకుళం జిల్లా పలాసలో.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఈ నాయకులు. వారి పిల్లలు. బరి తెగించి, మేం ఏం చేసినా, మమ్మల్ని ఎవరూ తాకలేరన్న ధీమాతో, ఇద్దరు ఆడపిల్లలను బర్త్‌డే పార్టీ అని చెప్పి, తీసుకుపోయి, కూల్‌డ్రింక్‌లో మందు కలిపి అత్యాచారం చేసిన ఘటన. మరి దాన్ని ఒప్పుకుని క్షమాపణ చెప్పాల్సిన ప్రభుత్వం ఏం చేస్తోంది. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యే ఇన్‌వాల్వ్ అయి, పంచాయతీ చేసి, దీన్ని బ్రషప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు. ఆయన భార్య కార్పొరేటర్. ఆ టీడీపీ నాయకుడు ఒక 16 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి, ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుపోయి అత్యాచారం చేసి వదిలేస్తే, అక్కడ చెత్త ఏరుకునే వారు ఆ బాలిక ప్రాణాలు కాపాడారు. లోకేష్, అచ్చెన్నాయుడితో ఆ పెద్దమనిషి ఫోటో. డిప్యూటీ సీఎం కనీసం ఆ పాప ఇంటికైనా వెళ్లాడా? పరామర్శించాడా? హిందూపురంలో దసరా పండగ రోజున అత్తాకోడలిపై గ్యాంగ్‌రేప్ జరిగింది. నిందితులను అరెస్టు చేయలేదు. మూడు రోజుల పాటు వారిని అరెస్టు చేయాలన్న కనీస ఆలోచన కూడా రాలేదు. అక్కడి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఆయన బాధితులను కనీసం పరామర్శించలేదు. వారిని కలవలేదు. ఆయన స్వయంగా సీఎంకు బావమరిది. అనకాపల్లిలో రాంబల్లి మండలం, కుప్పగొండుపాలెంలో 9వ తరగతి చదువుతున్న బాలికను టీడీపీ నాయకుడు సురేష్.. ప్రేమోన్మాది నరికి చంపాడు. గతంలో ఆ సురేష్ వేధిస్తే, ఫిర్యాదు చేస్తే అరెస్టు చేసి జైలుకూ పంపారు. బెయిల్‌పై బయటకు వచ్చి, మళ్లీ వేధించాడు. నాలుగున్నర నెలల్లోనే..: రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో బిజీగా ఉన్న పోలీసులు, పట్టించుకోక పోవడంతో, సురేష్, ఆ పాపను దారుణంగా చంపాడు. నేను అడుగుతున్నాను. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నర నెలల్లోనే.. ఏకంగా 77 మంది మహిళలు, పిల్లల మీద ఈ మాదిరిగా దారుణమైన అత్యాచారాలు. ఏడుగురు హత్యకు గురి కాగా, 5గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే, ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ వారు ఏ తప్పు చేసినా, మీరు చేయండి. మేము వెనకుసుకొస్తాం. మీకేమీ జగరనివ్వం. అని చెప్పి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పి, చంద్రబాబుగారు దగ్గరుండి చంద్రబాబుగారు ప్రోత్సహిస్తున్న పరిస్థితి. ఈ మాదిరిగా జరుగుతూ, జరుగుతూ, శాంతి భద్రతలు ఏ స్థాయికి దిగజారుతున్నాయో, ఒకసారి గమనించండి. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం–దిశ: వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఒక దిశ యాప్ తీసుకొచ్చి 1.56 కోట్ల మంది అక్కచెల్లెమ్మల ఫోన్లలో ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించాం. ఆపదలో ఉన్న ఏ అక్కచెల్లెమ్మ అయినా, ఎస్‌ఓఎస్ బటన్ నొక్కితే, లేదా 5సార్లు ఫోన్ ఊపితే చాలు, వెంటనే ఆ అక్కచెల్లెమ్మకు పోలీసుల నుంచి ఫోన్ వచ్చేది. ఒకవేళ ఆ అక్కచెల్లెమ్మ ఫోన్ ఎత్తకపోతే, 5, 10 నిమిషాల్లో పోలీసులు వచ్చేవారు. ఆ అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడే వారు. ఆ విధంగా దాదాపు 31,607 మంది బాలికలు, మహిళలను దిశ యాప్ ద్వారా కాపాడడం జరిగింది. గతంలో ఏనాడూ లేని విధంగా, 18 దిశ పోలీస్ స్టేషన్లు, ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టుల, 12 మహిళా కోర్టులు, ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, 900 బైక్‌లు, 163 బొలేరో వాహనాలు.. పోలీసులకు దీనికోసమే కేటాయించడం జరిగింది. దీని కోసం 18 దిశ క్రైమ్ మేనేజ్‌మెంట్ వాహనాలను కూడా క్రైమ్‌ను ఛేదించడం కోసం ఏర్పాటు చేశాం. దిశ యాప్ అంత చక్కగా పని చేస్తున్న పరిస్థితుల్లో.. ఏకంగా అత్యుత్తమ పోలీసింగ్‌లో జాతీయ స్థాయిలో దిశ యాప్‌కు 19 అవార్డులు వచ్చాయి. అంటే 19 జాతీయ అవార్డులు దిశయాప్‌కు కేంద్రం ఇవ్వడం జరిగింది. బుద్ధి తక్కువ పప్పు. అనిత ఏం చేశారు?: అంతగొప్పగా ఉన్న దిశ యాప్‌ను తెలుగుదేశం పార్టీ ఏం చేసింది. నారా లోకేష్. ఈ మనిషికి బుద్ధి తక్కువ. జ్ఞానం తక్కువ. ఈ మనిషిని పప్పు అని కూడా అంటారు. బుద్ధి ఉన్న వాడెవడైనా దిశ చట్టాన్ని, యాప్‌ను కాల్చేస్తారా? మంచి చేసే దీన్ని ఎవడైనా కాల్చేస్తాడా? చెప్పండి. బుద్ధి లేని ఈ మనిషికి, పప్పు లాంటి ఈ మనిషికి పక్కనున్న వ్యక్తి ఎవరు అంటే, హోం మంత్రి. ఇద్దరూ కలిసి, దిశ చట్టం, దిశ యాప్ కాల్చేస్తున్న ఫోటో ఇది.. అంటూ దాన్ని చూపారు. ఇంతటి దారుణంగా వీళ్ల ప్రవర్తన. ఇంత దారుణంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి. అక్కచెల్లెమ్మలకు పచ్చి దగా: ఒకవైపు అక్కచెల్లెమ్మలకు ఏమీ చేయకుండా చంద్రబాబు మహిళా సమాజాన్ని నీరు గార్చాడు. వారికి ఇస్తానన్నది ఏదీ ఇవ్వలేదు. బడులు తెరిచే టైమ్‌కు అమ్మ ఒడి ఇస్తానన్నాడు. ప్రతి పిల్లాడికి నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని చెప్పాడు. పిల్లలను బడికి పంపితే చాలు రూ.15 వేల చొప్పున ఇస్తానన్నాడు. అధికారంలోకి వచ్చాడు తల్లులు, పిల్లలకు పంగనామాలు పెట్టాడు. సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ అన్నాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే 18 ఏళ్లు ఏ చెల్లి అయినా కూడా కనబడితే నీకు రూ.18 వేలు అని చెప్పి మోసం చేశాడు. ఆ ఇంట్లో పెద్దమ్మలు, 50 ఏళ్లు దాటిన వారు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని చెప్పి, వారినీ మోసం చేశాడు. అన్ని రకాలుగా అక్కచెల్లెమ్మలకు చెప్పిన అన్ని మాటలు తప్పాడు. పొదుపు సంఘాలకు కట్టాల్సిన సున్నా వడ్డీ కూడా.. మా ప్రభుత్వంలో ప్రతి ఏప్రిల్‌లో కట్టే వాళ్లం. అది కూడా పూర్తిగా ఎగ్గొట్టేసి ఇవ్వకుండా, మోసం చేశాడు. అక్కచెల్లెమ్మలు ఈ రాష్ట్రంలో బ్రతికే పరిస్థితి లేకుండా చేశాడు. క్షమాపణ చెప్పాలి. రూ.10 లక్షలు ఇవ్వాలి: నేను ఒకటే కోరుతున్నాను. జరగుతున్న ఘటనలకు క్షమాపణ చెప్పండి. ప్రతి బాధితుడి వద్దకు మంత్రులను పంపించి, రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తూ, మళ్లీ ఇలాంటివి జరగనివ్వము అని చెప్పి లెంపలు వేసుకోవాలి. లేకపోతే చంద్రబాబు చరిత్రహీనుడు అవుతాడు. ఒక్కొక్కరికి మా సాయం రూ.10 లక్షలు: జరిగిన ఈ ఆరేడు ఘటనల్లో, చంద్రబాబు స్పందించినా లేకపోయినా, మా పార్టీ నుంచి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నాం. చంద్రబాబు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి. స్పందించాలి. మీరేం బాధ పడకండి. వచ్చేది మన ప్రభుత్వమే. మేము వచ్చిన తర్వాత, వీరందరినీ ఏరి ఏరి జైల్లో పెడతాం. మొదట తప్పు జరిగింది అని ఒప్పుకోవాలి. అన్యాయమైన ఘటన జరిగింది. ఒక అభాగ్యురాలికి అన్యాయం జరిగింది. కానీ, ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. అసలు ప్రభుత్వ బాధ్యత ఏమిటి? ఇలాంటి అభాగ్యులకు తోడుగా నిలబడాలి. అన్యాయమై పోయిన వారికి న్యాయం చేయాలి. వారికి భరోసా ఇవ్వాలి. వీరికి తోడుగా ఉండేందుకు ప్రభుత్వ పెద్దలు ఎందుకు రాలేదు. మేము ఆ పని చేస్తే, మమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నారు? మమ్మల్ని ఎందుకు తప్పు పడుతున్నారు? ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదు? ఆదుకోవడం లేదు?. మాపై నిందలు సబబేనా?: పోలీసులు న్యాయంగా దర్యాప్తు చేస్తే, అన్ని వాస్తవాలు బయటకొస్తాయి. ఈ తల్లి 14 ఏళ్లుగా అంగన్‌వాడీ టీచర్. నేను దళితులకు తోడుగా ఉంటాను. దళితులంతా మా వారే. అది నేను ధైర్యంగా ఉంటాము. పేదలకు ప్రభుత్వం తోడుగా ఉన్నామని చెప్పాలి. కానీ, ఈ ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. ఆ పని చేయకపోగా, వారు మా పార్టీ వారని నిందించడం సరైనదేనా? ఆ తల్లికి మేము తోడుగా నిలబడితే.. మాపై నిందలు వేయడం సబబా?. అని శ్రీ వైయస్ జగన్ నిలదీశారు. ప్రభుత్వం ప్రజలకు తోడుగా ఉండి భరోసా ఇవ్వాలి బద్వేలులో వైయస్ జగన్ స్పష్టీకరణ కడప జిల్లా బద్వేలులో ప్రేమోన్మోది చేతిలో దారుణహత్యకు గురైన దస్తగిరమ్మ కుటంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన వైయస్ జగన్. ఈ సందర్బంగా వైయస్ జగన్ ఏమన్నారంటే..: బద్వేలు ఘటన శనివారంనాడు జరిగితే ప్రభుత్వంలో ఎవ్వరూ స్పందించ లేదు. కనీసం పట్టించుకోలేదు. ఇవాళ జగన్ ఇక్కడకు వస్తున్నాడని తెలిసిన తర్వాత మాత్రమే కాసేపటి కిందటే వీళ్లకు సహాయం అందింది. రాష్ట్రంలో దారుణమైన అఘాయిత్యాలు, అన్యాయాలు జరుగుతున్నాయి. మహిళలకు, ఆడపిల్లలకు రక్షణ లేని అధ్వాన్న పరిస్థితుల్లో చంద్రబాబు పాలన ఉంది. చంద్రబాబుకు ఒక్కటే చెబుతున్నాను. ఘటన జరిగిన వెంటనే ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. తమ పార్టీ వారు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే మాట పక్కనపెట్టి ప్రజలకు తోడుగా ఉంటూ వారికి భరోసా ఇచ్చే కార్యక్రమాలు చేయమని చంద్రబాబుకు చెబుతున్నాను. బద్వేలు జడ్పీ స్కూల్‌లో టాపర్‌గా నిలబడిన పాప పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి ఘటనలపై ఇప్పటికైనా మేల్కొనాలని, రాక్షస పాలనకు అంతం పలకాలని చంద్రబాబును హెచ్చరిస్తున్నాను. ఇదే మాదిరిగా చంద్రబాబు పాలన కొనసాగిస్తే ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు రావడం ఖాయమని వైయస్ జగన్ అన్నారు.