టీడీపీకి శాంతియుత సమాధి కట్టాలి

వైయస్‌ఆర్‌సీపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలందరినీ అభ్యర్థించాలి

ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయమని అర్థమయ్యేలా చెప్పాలి

రాజన్న రాజ్యం తిరిగి రావాలంటే ఓటువేయాలని చెప్పండి

వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే అక్రమ కేసులు ఎత్తేస్తాం

అవినీతి లేని స్వచ్ఛమైన పాలన అందిస్తాం

టీడీపీకి బుద్దిచెపే సమయం వచ్చింది

ఎన్నికల వేళ సినిమాల పేరుతో బాబు చేస్తున్న డ్రామాలపై చర్చ జరగాలి

గత ఎన్నికల్లో బాబు ఇచ్చిన 600 హామీలపై చర్చ జరగాలి

 

కాకికాడ: తెలుగు దేశం పార్టీకి శాంతియుతంగా సమాధి కట్టాలని, ఆ పార్టీకి బుద్ధి చెప్పే సమయం వచ్చిందని గ్రామాల్లో చెప్పాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలను వంచించిన బాబుకు బుద్ధి చెప్పే రోజు వచ్చిందని అందరికి చెప్పాలన్నారు. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే రాజన్న రాజ్యం మళ్లీ రావాలన్నారు. ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయాలని అర్థమయ్యేలా ప్రజలకు చెప్పాలని సూచించారు. కాకినాడలో నిర్వహించిన సమర శంఖారావం సభలో వైయస్‌ జగన్‌ ఎన్నికల నగారా మోగించారు. ఈ సందర్భంగా బూత్‌ కమిటీ సభ్యులకు పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. అన్నొస్తున్నాడని అందరికి చెప్పాలని సూచించారు. వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే..

మన పార్టీని స్థాపించి రేపటికి తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఈ శుభ సమయంలో ఇక్కడి నుంచే మన ఎన్నికల శంఖారావం పూరించడం అదృష్టంగా భావిస్తున్నా. జిల్లా నలుమూలల నుంచి ప్రతి గ్రామం నుంచి మండుటెండను సైతం లెక్క చేయకుండా తరలివచ్చిన ప్రతి బూత్‌ కమిటీ సభ్యుడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితునికి, నా కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 

తొమ్మిది సంవత్సరాలు నాతోపాటు నడిచారు. తొమ్మిదేళ్లు నాకు అండగా నిలిచారు. తొమ్మిదేళ్లుగా మనం ప్రతిపక్షంలో ఉన్నాం. అధికారంలో ఉన్నవారు. ఎన్ని కష్టాలు పెట్టారో నాకు తెలుసు. ఎన్ని బాధలు పెట్టారో నాకు తెలుసు. మీరు ఎంతగా నష్టపోయారో నాకు బాగా తెలుసు. ఇక్కడకు వచ్చిన మీరు గానీ, 13 జిల్లాలోని కుటుంబ సభ్యులు గత తొమ్మిదేళ్లుగా ఎన్ని కేసులు భరించారో. ఎన్ని అవమానాలు సహించారో. ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నారో నాకు తెలుసు. ఆస్తులు పోగొట్టుకున్న సంఘటనలు, మరికొందరు కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న పరిస్థితి నాకు తెలుసు. మీ ప్రతి కష్టాన్ని, నష్టాన్ని చూశాను. మీకు తగిలిన ప్రతి గాయం నా గుండెకు కూడా తగిలింది. కచ్చితంగా మీ బాగోగులు చూసుకుంటానని మాటిస్తున్నాను. మిమ్మల్ని అన్ని రకాలుగా పైకి తెచ్చుకుంటాను. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పైకి తెచ్చుకుంటానని మరోసారి మాటిస్తున్నాను. అంతే కాకుండా దేవుడు ఆశీర్వదించి ప్రజల చల్లని దీవెనలతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మీపై పెట్టిన అక్రమ కేసులు అన్ని ఉపసంహరిస్తా. దేవుడు ఆశీర్వదించి ప్రజల దీవెనలు, మీ ఆశీస్సులతో మన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మన పాలనలో ప్రతి సంక్షేమం ప్రతి పేదవాడికి అందాలి. చంద్రబాబు పార్టీ మాదిరిగా మన పార్టీ ఉండదు. మన ప్రభుత్వం భిన్నంగా ఉంటుంది. కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చేయం, పార్టీలు కూడా చూడమని గర్వంగా చెబుతున్నా. అవినీతి లేని స్వచ్ఛమైన పాలన మన ప్రభుత్వంలో జరగాలి. పాలనకు దిక్సూచి మీరే. మీ భుజస్కందాలపై ఆ బాధ్యత పెడతాను. 

ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేసింది. ఈ సమయంలో మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, రైతులను, గ్రామాలను, మన కుటుంబాలను, రాష్ట్రంలోని వందల సామాజిక వర్గాలను ప్రతి ఒక్కరిని వంచించి, హింసించి, దోచుకున్న ఈ తెలుగుదేశం పార్టీ పాలనను శాంతియుతంగా సమాధి కట్టేందుకు ఐదు సంవత్సరాల తరువాత భారత రాజ్యాంగం మనకు ఇచ్చిన అవకాశం ఈ నోటిఫికేషన్‌. మార్పుకు ఓటు వేయండి అని ప్రతి గ్రామంలో చెప్పండి. విలువలు, విశ్వసనీయతకు ఓటు వేయాలని చెప్పండి. పోగొట్టుకున్న సంక్షేమ పథకాలు తిరిగి రావాలంటే, రాజన్న రాజ్యం కావాలంటే ఓటు వేయాలని చెప్పాలి. అభివృద్ధి వైపు పరిగెత్తాలంటే ఓటు వేయాలని గ్రామాల్లో చెప్పాలి. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రజలందరినీ అభ్యర్థించాలి. ఐదేళ్లలో మనం నష్టపోయామా.. లాభపడ్డామా..? ఒక్కసారి ప్రజలందరూ వారి గుండెల మీద చేయి వేసుకొని ఆలోచన చేయమని గుర్తు చేయాలి. చంద్రబాబు పాలన గురించి చెప్పాలి. రాష్ట్రాన్ని విడగొట్టేందుకు సహకరించింది చంద్రబాబు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక నాలుగేళ్లు కేంద్రంతో ఉండి ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన పార్టీ టీడీపీ. ఇటువంటి పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని గ్రామాల్లో చెప్పాలి. రైతుల రుణమాఫీ చేస్తామని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తామని, డ్వాక్రా రుణాలు మాఫీ అని చెప్పి, ప్రజలను వంచించిన తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని ప్రతి గ్రామంలో చెప్పాలి. 

అక్షరాల రైతుల రుణాలు 87,612 కోట్లు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉంటే అవన్నీ మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు, ఆ సంఖ్యను 24 వేల కోట్లకు కుదించాడు. కుదించినది కూడా వడ్డీలకు కూడా సరిపోని విధంగా ఆ సొమ్ములో నాలుగో విడత, ఐదో విడతలో బాకీ పడ్డాడు. కుదించిన 24 వేల కోట్లలో కూడా ఇంకా 10 వేల కోట్లు పెండింగ్‌లో పెట్టాడు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన రోజున అంటే నిన్న మోసపూరితంగా మళ్లీ రైతులను మోసం చేయడానికి జీఓ ఇచ్చాడు. ఇలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పడానికి సమయం వచ్చిందని గ్రామాలకు వెళ్లి చెప్పాలి. 

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.40 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వడు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఉద్యోగం, ఉపాధి రెండింటిలో ఏదో ఒకటి ఇస్తాను లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఇవాల్టికి 60 నెలలు అంటే దాదాపుగా రూ.1.20 లక్షలు ప్రతి ఇంటికి బాకీ పడ్డాడు. ఈ పెద్ద మనిషి ఎన్నికలు వచ్చే సరికి చివరి మూడు నెలల్లో మోసం చేయడానికి 1.70 కోట్ల ఇళ్లులు ఉంటే వాటిని 3 లక్షలకు తగ్గించాడు. ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు 3 లక్షల మందికి రూ. వెయ్యి ఇస్తానని సిగ్గులేకుండా మోసం చేస్తున్న వ్యక్తికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని ప్రతి గ్రామంలో వివరించాలి. 

ఇదే వేదికపై నుంచి మీ జగన్‌ రాష్ట్ర ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఒక సారి ఆలోచన చేయాలని అడుగుతున్నాడు మీ జగన్‌. ఐదేళ్లుగా మనం ఎలా ఉన్నామని ప్రతి కుటుంబం వారు కూర్చొని ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఏం చెప్పింది.. అధికారంలోకి వచ్చిన తరువాత ఎలా మోసం చేసిందని ఆలోచన చేయాలి. ప్రతి కుటుంబంలో ఈ చర్చ జరగాలి. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ఏదంటే అది చెప్పడం. తరువాత మోసం చేయడం ధర్మమేనా అని ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. ఈ అంశంపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. మీ గ్రామంలో, మీ పట్టణాల్లో గడిచిన ఐదేళ్లలో టీడీపీ నాయకులు ఎలాంటి వాతావరణం సృష్టించారన్న అంశంపై చర్చ జరగాలి. జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా పెట్టి ఏ రకంగా దుర్మార్గాలు చేశారో చర్చ జరగాలి. ఎన్నికలు వచ్చే సరికే ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రలోభాలు పెడుతున్న వీరు చేస్తున్న డ్రామాల మీద చర్చ జరగాలి. ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో ఈ విషయాలపై చర్చ జరగాలి. 

2014 ఎన్నికల సమయంలో మేనిఫెస్టో పేరుతో పుస్తకాన్ని ప్రతి గ్రామంలో చూపించాడు. ఆ పుస్తకంలో ప్రతి కులానికి ఒక పేపర్‌ కేటాయించి. ప్రతి పేజీలో ఏయే కులాలను ఎలా మోసం చేయగలుగుతామని పీహెచ్‌డీ చేసిన వైనంపై చర్చ జరగాలి. మేనిఫెస్టోలో 650 హామీలపై పరిస్థితి ఏంటని చర్చ జరగాలి. రాష్ట్రంలో ఇవాళ మట్టి, ఇసుక, మద్యం, బొగ్గు, కాంట్రాక్టర్‌లను ఎవరినీ వదలడం లేదు. గుడి భూములు, దళితుల భూములు వదలడం లేదు. పైన చంద్రబాబు ఆదేశాలతో విచ్చల విడిగా అవినీతి జరుగుతుంది. కింది స్థాయిలో రేషన్‌ కార్డు, పెన్షన్, ఇంటి మంజూరు, చివరకు మరుగుదొడ్ల మంజూరు కూడా వదలకుండా దోచేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. వీటన్నింటిపై చర్చ జరగాలి. ఇంతగా లంచం గుంజుకుంటున్న ఈ ప్రభుత్వం మీద ఏ ఒక్కరైనా ఓటు వేయొచ్చా అనే అంశంపై చర్చ జరగాలి. చివరకు మీ గ్రామాల్లోని మీ భూములు, మీ ఆస్తులు, దేవుడి భూములు, దేవుడి మాన్యాలు ఇవన్నీ కొట్టేసే ఈ రాక్షస పాలన మనకు కావాలా అనే అంశంపై ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో చర్చ జరగాలి. 

 

తాజా వీడియోలు

Back to Top