ఏదైనా పొరపాటు జరిగితే అనర్హత వేటు వేయాలి

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

స్పీకర్‌ తమ్మినేనికి వైయస్‌ జగన్‌ అభినందనలు

విలువలకు ఎలా పాతర వేశారో ఇదే సభలో చూశాం

ఇలాంటి దుస్థితి కొనసాగిస్తే మంచి అనేది ఎక్కడుంటుంది?

23 మందిని లాక్కున్న వారికి 23 సీట్లే వచ్చాయి

మా పార్టీలో చేరాలంటే రాజీనామా చేసి రావాలి

 

అమరావతి: మా పార్టీలో చేరాలంటే రాజీనామా చేసి రావాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే అనర్హత వేటు వేయాలని ఆయన స్పీకర్‌ను కోరారు. స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఈ మేరకు సీఎం మాట్లాడుతూ..స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ను అభినందిస్తున్నాను. సౌమ్యుడిగా మంచిపేరు తెచ్చుకున్నారు. అసెంబ్లీకి ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించిన ఘనత తమ్మినేనినిది.
మంచి స్పీకర్‌ అనగానే సోమ్‌నాథ్‌ ఛటర్జీ పేరు గుర్తుకొస్తుంది. ఇదే చట్టసభలో విలువలు లేని రాజకీయాలు చూశాం. ఇదే అసెంబ్లీలో విలువలు లేకుండా ప్రవర్తించిన తీరు చూశాం.  ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనీయని దిగజారిన వ్యవస్థను ఇదే చట్టసభలో చూశాం. నేను కూడా అలాగే చేస్తే ఇక మంచి ఎక్కడ ఉంటుంది. 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా చర్యలు లేవు. ఐదుగురికి మంత్రి పదవులు  కూడా ఇచ్చారు. విలువలకు ఎలా పాతర వేశారో ఇదే సభలో చూశాం. చివరకు స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటే ఆ నిబంధనను కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మార్చారు. ఈ సభను చట్టానికి, రాజ్యాంగానికి సంబంధం లేని విధంగా మార్చారు. ఫిరాయింపులపై చర్యలు తీసుకొని స్పీకర్‌ను ఇదే సభలో చూశాం. అలాంటి ప్రభుత్వంపై ప్రజలే అనర్హత వేటు వేశారు. దేవుడు స్క్రిప్ట్‌ రాస్తే ఎంత గొప్పగా ఉంటుందో ఈ  ఎన్నికలే నిదర్శనం. 23 మంది ఎమ్మెల్యేలను లాక్కున్న వారికి 23 సీట్లే వచ్చాయి. ముగ్గురు ఎంపీలను తీసుకున్న వారికి ముగ్గురు ఎంపీలే మిగిలారు. 

అన్యాయం చేస్తే శిక్ష ఎలా ఉంటుందో అన్నదానికి నిదర్శనంగా మనం  ఇవాళ ఏకం అయ్యాం. టెండర్లలో అవినీతిని తొలగించి, అవినీతిరహిత రాష్ట్రంగా మార్చేందుకు మా ప్రభుత్వం మొదటి నుంచి పని చేస్తోంది. అందులో భాగంగానే స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను ఎన్నిక చేశాం. ఎలా ఉండాలో చెప్పడానికి ఈ సభ కంకణం కట్టుకుంది. బీసీలంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాస్‌లు కాదు..బ్యాక్‌ బోన్‌గా మార్చుతామని మా పార్టీ ఏలూరు సభలో చెప్పింది. అందులో భాగంగా మంత్రిమండలిలో ఏడుగురికి మంత్రిపదవులు ఇచ్చాం. ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా నియమించాం. మా కమిట్‌మెంట్‌ను నిరూపించుకుంటున్నాం. పార్లమెంట్‌ సాంప్రదాయాల విషయంలో దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరుతున్నాను. చంద్రబాబుకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.టీడీపీ నుంచి ఐదుగురిని లాక్కుంటామంటున్నారు. అలా చేస్తే చంద్రబాబుకు, నాకు తేడా ఉండదు. అలా తీసుకోవాల్సి వస్తే ఆ పదవికి రాజీనామా చేసిన తరువాతే తీసుకుంటాను. లేదంటే పార్టీ ఫిరాయించిన వారిపై వెంటనే అనర్హత వేటు వేయాలని కోరుకుంటూ మరొకమారు స్పీకర్‌కు అభినందనలు తెలుపుతున్నాను.
 

Back to Top